
హైదరాబాద్: రాంగోపాల్‌పేట్ డివిజన్ నల్లగుట్టలో ఆదివారం జరిగిన తొట్టెల ఊరేగింపులో ఒకేసారి 108 మంది పోతరాజులు చేసిన విన్యాసాలు చూపరులను అలరించాయి. స్థానికనేత కేశబోయిన మనోహర్ యాదవ్ తన తాత బలరాం యాదవ్ జ్ఞాపకార్థం పీజీరోడ్ జవహార్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం నుంచి నల్లగుట్టలోని కనకదుర్గమ్మ ఆలయం వరకు ఫలహార బండి, తొట్టెల ఊరేగింపును నిర్వహించారు. పీజీరోడ్ జవహార్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం నుంచి నల్లగుట్టలోని కనకదుర్గమ్మ ఆలయం వరకు కొనసాగిన ఈ ఊరేగింపునకు భక్తులు భారీగా హాజరయ్యారు.
ఈ ఊరేగింపులో పోతరాజులు తమ వీరంగాలు, డప్పులు దరువులు, నృత్యాలతో అలరించారు. వీరితో పాటుగా 20 బృందాలకు చెందిన 625 మంది కళాకారులు పాల్గొన్నారు. మల్లన్న డప్పులు, కోలాటాలు, విచిత్ర వేషాలు, రాధా కృష్ణుల వేషధారణ, పులివేషాలతో వీరంతా చూపరులను అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ 108 మంది పోతరాజులతో ఎక్కడ ఫలహార బండి ఊరేగింపు జరగలేదని దేశంలో తొలిసారిగా తాము నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్శల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారికి సమర్పిస్తామని అటు తర్వాత రికార్డుల్లోకి ఎక్కుతాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment