అంధరివాడు | Braille for the blind is not only the script | Sakshi
Sakshi News home page

అంధరివాడు

Published Mon, Feb 23 2015 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

Braille for the blind is not only the script

బ్రెయిలీ లిపి అంధులకు మాత్రమే కాదు, అందరికీ అవసరమేనంటారు విశ్రాంత ఉద్యోగి గంగారామ్. అంధులతో పాటు, అనాధలను
 ఆదుకోవడానికి, యువతీ యువకులలో జీవితం పట్ల ఆశావహ దృక్పథం పెంపొందించడానికి ఆయన ఓ చారిటబుల్ ట్రస్టును,
 వికలాంగులకోసం  ‘ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ డిజేబిలిటీ’ అనే మరో స్వచ్ఛంద సంస్థనూ నెలకొల్పి, సేవలు అందిస్తున్నారు. విశేషం
 ఏమిటంటే ఇన్ని పనులు చేస్తున్న గంగారామ్ కూడా అంధుడే కావడం!
 
- నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి
 
బ్రెయిలీ ఫర్ ఆల్... ఇదీ గంగారామ్ నినాదం. చూపున్నవారికి కూడా ఆయన బ్రెయిలీ లిపి నేర్పిస్తున్నారు! ‘‘పిల్లలకు, పెద్దలకు ఇప్పుడు ఏకాగ్రత లేకపోవడం ప్రధాన సమస్య. అందుకే అంధులు మాత్రమే అలవరచుకునే స్పర్శ జ్ఞానాన్ని మిగతావారు కూడా సాధన చేయాలి. స్పర్శజ్ఞానం ఏకాగ్రతను కలిగిస్తుంది. వృద్ధులయ్యాక చాలామందిలో అరవై శాతం కంటిచూపు తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఒంటరి జీవితం గడిపేవారు బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాలను అవలీలగా చదువుకోవచ్చు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు. చీకట్లో కూర్చుని కూడా పుస్తకాలు చదువుకోవచ్చు. ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ బ్రెయిలీ లిపిలో పుస్తకాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. పుస్తకపఠనం పట్ల ఆసక్తి ఉన్న అంధులకు అవి అందుబాటులో లేవు. వీలైనన్ని పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి అనువదిస్తే ఎంతో విజ్ఞానం అంధులకు చేరువలోకి వస్తుంది’’ అంటూ, ఇలాంటివే ఎన్నో విలువైన సూచనలు ఇస్తారు గంగారామ్! అలాగని సలహాలతో సరిపెట్టడం లేదు ఆయన. తన స్నేహితులకు, ఇంటి వద్ద ఉండే పిల్లలకు, వృద్ధులకు, మిత్రులకు.. బ్రెయిలీ లిపిని నేర్పుతున్నారు. అందుకు కావల్సిన బ్రెయిలీ కిట్‌ను తానే సమకూర్చుతున్నారు. అంధుల సమస్యలను అర్థం చేసుకోండి అంటూ ‘మా కోసం ఓ నిమిషం’ అనే నినాదంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ప్రేరణ ఇచ్చిన మిత్రుడు

పదేళ్ల క్రితం గంగారామ్ మిత్రుడు (కంటిచూపు బాగున్న వ్యక్తి) ‘నాకూ బ్రెయిలీ లిపి’ నేర్పించవా అని ఆసక్తిగా అడిగాడట. ‘నీకెందుకయ్యా. చూపు బాగున్నవాడికి!’ అన్నారట గంగారామ్. ఆ తర్వాత అతను ఊరు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మిత్రుడు గంగారామ్‌కు ఫోన్ చేసి ‘ప్రమాదంలో రెండు కళ్లూ పోయాయి. బ్రెయిలీ లిపి అప్పుడే నేర్చుకుని ఉంటే ఇప్పుడు పనికొచ్చేది కదా!’ అన్నాడట. ఆ విషయాన్ని గంగారామ్ ప్రస్తావిస్తూ- ‘నాకు చాలా బాధ వేసింది. ఏదో తప్పిదం చేసినట్టు కూడా అనిపించింది. అప్పటి నుంచే ‘బ్రెయిలీ ఫర్ ఆల్’ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను. సాధ్యమైనంత మందికి ఈ లిపి నేర్పించాలని గట్టిగా అనుకున్నాను. అలా చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఇప్పటికి చాలామందే ఈ లిపిని నేర్చుకున్నారు. ఇంకా నేర్చుకుంటున్నారు. మలక్‌పేట సూపర్ బజార్‌లో బ్రెయిలీ పార్క్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది. అందులోనే ‘డిజేబుల్ టుడే’ అని అంధులకు బ్రెయిలీ లిపి నేర్పించే దిశగా కృషి చేయబోతున్నాను. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికీ బ్రెయిలీ లిపి నేర్పించాలనుకుంటున్నాను’’ అని తెలిపారు గంగారామ్!

కౌన్సెలింగ్ సెంటర్

గంగారామ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఉద్యోగ జీవితం, కుటుంబం, మిత్రుల సాంగత్యం.. ఇద్దరు కూతుళ్ల వివాహ వేడుకలు.. అంతా సవ్యంగా జరిగిపోతున్న తరుణంలో రెండవ కూతురు బాలవీక్షణ తన స్నేహితురాలు చనిపోయిందనే ఆవేదనతో తనూ ఆత్మహత్య చేసుకుంది. అంధులైన వారే ఎంతో ఆత్మస్థైర్యంతో జీవిస్తుంటే అన్నీ సక్రమంగా ఉన్నవారు మానసిక బలహీనులై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు! కూతురు అతనిలో రేపిన ఈ ఆలోచనతోనే ‘బాల మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్’ (హైదరాబాద్, మలక్‌పేట) ఏర్పాటు చేసి, దాని ద్వారా అన్ని వయసుల వారికి కౌన్సెలింగ్ ఇస్తూ, జీవితం పట్ల ఆశావహ దృక్పధాన్ని పెంపొందిస్తున్నారు గంగారామ్.
 
డాట్స్ విత్ డేట్స్

క్యాలెండర్ చూపున్నవారికే తప్ప చూపులేనివారికి అది తెలియజేసేదేమీ ఉండదు. ఈ అవస్థ అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి మూడేళ్ల క్రితం క్యాలెండర్‌లో బ్రెయిలీ డాట్స్‌ను ప్రవేశపెట్టి అంధులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు గంగారామ్. దానిని మరికాస్త అభివృద్ధి పరిచి ‘డాట్స్ విత్ డేట్స్’ పేరిట ఈ యేడాది క్యాలెండర్‌ను ముద్రించారు.

జీతం ద్వారా వచ్చే డబ్బులోనే కొంత భాగాన్ని వికలాంగ విద్యార్థుల సంక్షేమం కోసం వెచ్చిస్తూ వచ్చిన గంగారామ్ ఇప్పుడు పెన్షన్ ద్వారా లభించే మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వికలాంగులకు అందేలా కృషి చేస్తున్నారు. చూపున్నవారితో పోటీ పడి పనులు చేయడమే కాదు, ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడుతున్నారు!
 
మూడేళ్ల వయసులో...
 
నిజామాబాద్‌లో పుట్టిన గంగారామ్‌కి మూడేళ్ల వయసులో అమ్మవారు పోసి అంధత్వం ప్రాప్తించింది. అయితే అతని తెలివి తేటలకు ముచ్చటపడిన బంధువులు హైదరాబాద్‌లోని దారుషాహి అంధుల స్కూల్లో చేర్పించారు. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నారు. అక్కడే బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. తర్వాత బి.ఇడి, ఎంఫిల్ చేశారు. హిందీ భాషతో పాటు తెలుగు సాహిత్యంపై మక్కువతో ఎన్నో పుస్తకాలు చదివారు. ముందు అధ్యాపకుడిగా, ఆ తర్వాత బ్రెయిలీ ప్రెస్‌లో ‘స్టీరియో ఆపరేటర్ కమ్ ఫ్రూఫ్ రీడర్’గా, ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలో కౌన్సెలింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫీసర్‌గా, పదేళ్ల పాటు బ్రెయిలీ ప్రెస్ మేనేజర్‌గా.. ఇలా వివిధ శాఖలలో విధులు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement