చీకటిని ఓ చూపు చూశాడు!
ఐదేళ్ల వయసులో షాకీర్ కళ్ల ముందరి
రంగులన్నీ డిజాల్వ్ అయిపోయాయి!
చీకటి మాత్రమే ఒక రంగుగా మిగిలింది.
ఊహ తెలిసివచ్చి,
యవ్వనకాంతులీనే వేళ... చుట్టూ చీకటి!
సముద్రమంత చీకటి. ఆకాశమంత చీకటి.
షాకీ ర్‌కి వేరే మార్గం లేదు.
చీకటిని ఛేదించాలి, చీల్చి చెండాడాలి.
లేకుంటే జీవితమే డిజాల్వ్ అయిపోతుంది.
దేవుడిచ్చిన జీవితాన్నివృధా కానీయకూడదనుకున్నాడు.
దేవుడేదో ఇవ్వలేదని...
వ్యధ చెందకూడదనుకున్నాడు.
ఇప్పుడు షాకీర్ ఓ లైట్ హౌజ్!!
జీవన సాగరయానం చేస్తున్న ఎందరో యువతీయువకులకొక దీపస్తంభం!
ఈవారం ‘జనహితం’ చదవండి.
షాకీర్‌కి ఎన్ని కళ్లున్నాయో, అవి ఎంత నిశితంగా చూస్తున్నాయో తెలుస్తుంది.
వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, స్పోకెన్ ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పేరుతెచ్చుకున్న 33 ఏళ్ల షాకీర్ ఉంటున్నది హైదరాబాద్ లోని అమీర్‌పేట్‌లో! సొంత ఊరు తిరుపతి. తల్లిదండ్రులకి కలిగిన ఐదుగురు సంతానంలో మూడవ బిడ్డ షాకీర్! తండ్రిది మిలటరీలో ఉద్యోగం. తల్లికి పిల్లల ఆలనపాలనే సర్వస్వం. తల్లిదండ్రులది మేనరికం అవడం వల్లనో, మరే కారణమో తెలియదు గాని షాకీర్‌కు ఐదేళ్ల వయసులోనే గ్లకోమా వ్యాధి వల్ల లోకం చీకటిమయమైంది. ఎన్నో ఆసుపత్రులు తిప్పారు. ఎంతోమంది డాక్టర్లను కలిశారు. ఇక చూపు రాదని డాక్టర్లు తేల్చిచెప్పేశారు.
కుటుంబం మొత్తం షాకీర్ మీద ఆశలు వదులుకుంది. కాని వెక్కిరించిన విధిని ధిక్కరించాలనుకున్నాడు షాకీర్. చదువంటే అమితమైన ఇష్టం. ఐదో తరగతి వరకు అంధుల పాఠశాలలో చదివాడు. అటు పిమ్మట చూపున్న పిల్లలు చదివే స్కూల్‌కే వెళ్లేవాడు. పాఠాలు చూసి చదివే పరిస్థితి లేదు. స్నేహితులు పాఠాలు పెద్దగా చదివితే, రికార్డ్ చేసుకొని, వాటిని మళ్లీ మళ్లీ విని గుర్తుపెట్టుకొని పరీక్ష లకు హాజరయ్యేవాడు. అలా టెన్త్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. కంటిచూపు లేకపోతేనేం వినడానికి చెవులున్నాయి కదా! అనుకునేవాడు. అందరిలా అన్నీ చేయలేకపోయినా ఏదో చేయాలన్న కసి మాత్రం అతన్ని కుదురుగా కూర్చోనిచ్చేది కాదు.
ఇంటర్మీడియెట్‌లో సైన్స్ గ్రూప్‌లో చేరాలనుకుంటే, ‘చూపులేని వాడి వి ప్రాక్టికల్స్ ఎలా చేస్తావు’ అనడిగారు. దాంతో తప్పనిసరై ఆర్ట్స్ గ్రూప్ ఎంచుకున్నాడు. ఒక దారి మూసుకుపోతేనేం మరో దారి ఉంది కదా అని బయల్దేరేవాడు షాకీర్! అతని పట్టుదలకు తగిన ప్రోత్సాహాన్నివ్వడమే అతనికి ఇవ్వవలసిన ఆస్తిగా భావించారు కుటుంబ సభ్యులు. తల్లిదండ్రుల ఆసరాతో డిగ్రీ అయ్యాక ఎం.బి.ఏ పూర్తి చేశాడు. రాష్ట్రంలోనే మొదటిసారి ఓ అంధుడు ఎం.బి.ఏ పూర్తిచేసిన రికార్డ్‌ను షాకీర్ సొంతం చేసుకున్నాడు.
జీతం తీసుకోవడం కాదు... ఇవ్వాలి...
డిగ్రీ పూర్తయ్యాక షాకీర్‌కు విజయవాడలోని ఓ గవర్నమెంట్ కాలేజీలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. అకౌంట్స్ చూడాలంటే కళ్లు కనపడవు. తనకోసం బ్రెయిలీ లిపిలో అకౌంట్స్ చేయలేరు. అలా రోజంతా ఖాళీగా కూర్చొని జీతాలనాడు జీతం తీసుకోవాలంటే.. చాలా గిల్టీగా అనిపించేది. దీనికితోడు చుట్టూ ఉన్నవారి వెటకారంతో కూడిన సానుభూతి... ఇంతకుమించి మంచి జీవితం తనకు రాదా అని ప్రశ్నించుకున్నాడు. తన శక్తిని తాను గుర్తించి, ప్రయోగం చేయగలిగినవాడు ఎక్కడైనా సక్సెస్ అవుతాడు అని దృఢంగా నిర్ణయించుకున్నాడు.
కాలేజీలో లెక్చరర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తే ఇంటర్వ్యూలో ‘బోర్డు మీద రాస్తావా?’అని ప్రశ్నించారు. కంప్యూటర్ జాబ్‌కెళితే ‘ఆపరేట్ చేయగలవా!’ అన్నారు. తన పరిస్థితికి బాధపడుతూ కూర్చోవడం కాదు, తానే పదిమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలనుకున్నాడు. హైదరాబాద్‌కు పయనమయ్యాడు. ఉదయం లేచింది మొదలు ఇంటర్నెట్ ముందు కూర్చునేవాడు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు బ్రెయిలీ లిపిలో చదివేవాడు.
టాకింగ్ సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకున్నాక షాకీర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. ప్రయత్నించేవాడికి నడిసముద్రంలో కూడా ఊతం లభిస్తుందనడానికి షాకీర్ జీవితమే ఒక చక్కని ఉదాహరణ. పుస్తకాన్ని స్కాన్ చేసి, టాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు అటాచ్ చేస్తే చాలు.. అందులో ఉన్న అంశాలన్నీ చక్కగా వినవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ అతనికి ఎంతో ఉపకరించింది. ‘‘జీవితంలో లేని దాని గురించి బాధపడటం కన్నా, ఉన్నవాటితో ఏం చేయగలమో ఆలోచించగలిగితే ప్రతిదానికీ పరిష్కారం దొరుకుతుంది’’ అంటాడు షాకీర్!
సాఫ్ట్‌వేర్స్‌కి మోటివేటర్!!
జీవితం అంటే ఏంటి? ఏం చేస్తే, ఎంత సాధిస్తే గొప్పవాళ్లమవుతాం..? ఈ తరహాలో ఎప్పుడూ ఆలోచించలేదు షాకీర్! లెక్కలు వేస్తూ, మంచి టైమ్ అదే వస్తుందిలే అని కూర్చోలేదు. నెట్ పాఠాలు వింటూ ఇంగ్లీష్ మీద పట్టు సాధించాడు. ఇంట్లోనే స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాడు. మొదట ఒకరూ ఇద్దరూ వచ్చేవారు. మెల్లగా కాలేజీలకు వెళ్లి గెస్ట్ లెక్చర్ ఇచ్చేవాడు. అక్కడి నుంచి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారాడు. ఆ తర్వాత టాప్ లెవల్ మల్టీనేషనల్ కంపెనీలకు మోటివేటర్‌గా మారాడు.
ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అనడానికి షాకీర్ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు. జీవితంలో చీకటిని మాత్రమే చూసిన షాకీర్ ఎంతోమందిని వెలుగులోకి ఎలా తీసుకురావాలో తెలుసుకున్నాడు. ఎలా మాట్లాడాలి, ఎలా పని విభజన చేయాలి, టీమ్‌ను ఎలా లీడ్ చేయాలి, లీడర్‌గా ఎలా ఎదగాలి.. ఇలా ఎన్నో లక్ష్యాలకు మార్గాలు చూపాడు షాకీర్! ఇప్పుడు ఎన్నో కంపెనీలకు షాకీర్ మోటివేటర్! విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మారిన ప్రయాణం ఇలా అనుకోని మలుపు తిరిగింది. ఐటి, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా సంస్థల్లో ట్రైనింగ్ ప్రారంభించాడు. సొంతంగా ‘ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్’ ప్రారంభించాడు.
నిష్ణాతులైన మెమరీ ట్రైనర్స్‌ని కలిశాడు. ‘‘మనకు తెలియంది నేర్చుకుంటూ ఉండాలి. పదిమందికి నేర్పుతూ ఉండాలి’’ అంటాడు. ‘‘జ్ఞానం అందరికీ ఉంటుంది. కాని ఆ జ్ఞానాన్ని లక్ష్యానికి అనుగుణంగా మలుచుకోవాలి. నేను ఏర్పాటుచేసిన ఎంపవర్‌ని ఒక ఎంపైర్‌గా మార్చాలి. అంత ర్జాతీయ స్థాయిలో పర్సనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు కండక్ట్ చేయాలన్నవి నా లక్ష్యాలు. సమస్య ఉందని ఆగిపోకూడదు. సమస్యను సైతం సవాల్‌గా తీసుకునే ధైర్యాన్ని పెంచుకోవాలి. అందరూ ఎంప్లాయ్ కావాలనుకుంటే ఎంప్లాయర్ ఎవరు అవుతారు? ఈ విధంగా ఆలోచించగలిగితే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది’’ అంటాడు ఉద్వేగంగా షాకీర్!
షాకీర్ వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా క్లాస్‌లు తీసుకోవడమే కాదు పుస్తకాలూ రాస్తుంటాడు. తన కాళ్ల మీద తను నిలబడ్డాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పడమే కాదు అమ్మాయి ఇష్టాన్నీ కనుక్కున్నాడు. ఇప్పుడు షాకీర్‌కు పెళ్లయి నాలుగు నెలలు అవుతోంది. షాకీర్ ఇంటర్మీడియెట్ నుంచే ఖురాన్‌ని బ్రెయిలీ లిపిలో రాయడం మొదలుపెట్టాడు. రోజులో పది గంటల సమయాన్ని దీనికోసమే కేటాయించేవాడు. అలా ఖురాన్‌లోని 60 భాగాలు బ్రెయిలీ లిపిలో రాశాడు. దీంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదైంది. ఈ సందర్భంగా నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ని కలిసినప్పుడు ‘‘సముద్రంలో ఓడలకు దారి చూపే లైట్ హౌజ్ లాంటి వాడివి నువ్వు. నీలాంటి వాళ్లే ఈ దేశానికి అవసరం’’ అని అభినందించారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. అన్నీ ఉన్నా కష్టాల సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాం అని భావించే ఎంతో మందికి... షాకీర్ లాంటి వ్యక్తుల శ్రమ, తపనలే ఆదర్శం.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఆత్మవిశ్వాసం పెంచారు
మాది వైజాగ్! మా కాలేజీలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వర్క్‌షాప్ నిర్వహించారు. అందులో షాకీర్‌సార్ చెప్పిన విషయాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. చదువు పూర్తి కాగానే శిక్షణ కోసం షాకీర్ సార్ దగ్గర చేరాను. ఇప్పుడు నాలో ఏ పని అయినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ పెరిగింది. త్వరలో ఉద్యోగంలో చేరబోతున్నాను.
- భార్గవ్, షాకీర్ స్టూడెంట్
నా అదృష్టం
మాది చిత్తూరు. పదోతరగతి వరకు చదువుకున్నాను. మా పెద్దలు ఈ సంబంధం తీసుకువచ్చినప్పుడు కొంచెం తటపటాయించిన మాట నిజం. ఈయన ఆశయాలు విన్నాక నాకు అద్భుతం అనిపించింది. ఆ ఆశయాలకు సపోర్ట్‌గా నిలిచే అదృష్టాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడని భావించాను.
- షబానా, షాకీర్ భార్య
నిరంతర శ్రమ
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను ఇంటర్నెట్ ద్వారా చదువుతూ, వింటూ అందులోని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐదు వందలకు పైగా క్లాసులు తీసుకున్నాను. నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను.
- షాకీర్