janahitam
-
దాసీపై మాస్పతాస్త్రం
దురాచారం ఒక వ్యవస్థగా వేళ్లూనుకున్నప్పుడు దానిని పెకలించే మహాశక్తి ఏదైనా ఆవిర్భవించాలి.అలా ఆవిర్భవించి, ‘దేవదాసీ’ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేస్తున్న స్త్రీశక్తే... మాస్. కడుపులో ఉన్న ఆడబిడ్డను కడుపులో ఉండగానే చంపేయడం, పదేళ్లు కూడా దాటని పసిమొగ్గలపై అత్యాచారాలకు పాల్పడటం.. ఇవన్నీ ప్రతిరోజూ మనం వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. అయితే కడుపులో ఆడబిడ్డ ఉందని తెలిస్తే చాలు, ఆ బిడ్డను అప్పుడే అమ్మేసే సంస్కృతి గురించి విన్నప్పుడు మాత్రం మనం ఉన్నది ఎలాంటి సమాజంలో! అనే ప్రశ్న తలెత్తక మానదు. ఒకరిది పేదరికం, మరొకరిది తెలియనితనం, ఇంకొకరిది ఇదేంటని ప్రశ్నించలేని పిరికితనం.. ఇవన్నీ కలిసి వారిని దేవదాసీలుగా మార్చాయి. తమ పెద్దలు, ఊళ్లో వాళ్లు చెప్పిందే వేదవాక్కంటూ ఎన్నో ఏళ్లు దేవదాసీలుగా మగ్గిపోయారు. ఎన్నో అవమానాలు పడ్డారు. దేవుడికి అంకితం చేశామనే పేరుతో ‘మగాళ్ల‘కు అప్పగించేస్తుంటే పంటిబిగువున బాధను ఆపుకున్నారు. తమ బిడ్డలకు సమాజం నుండి ఛీత్కారాలు ఎదురవుతున్నా తమ రక్తాన్ని గంజిగా మార్చి దానినే వారికి పానకంలా తాగించారు. అలా ఎన్నో ఏళ్లు సాగాయి. తమలా మరికొందరు ఆ దారుల్లోకి వస్తూనే ఉన్నారు. అంతేకాదు, కడుపులో ఉన్న ఆడబిడ్డలు కడుపులోనే అమ్ముడయిపోతున్నారు. అప్పుడే వారికి అర్థమైంది.. ఇంకా ఇలానే భరిస్తూ పోతే తమ బిడ్డలను కూడా అదే నరకంలోకి తోస్తారని. అంతే.. కళ్లు తెరిచారు. తమ భావితరాలు ‘దాసీ’ బతుకుల్లో మగ్గిపోకూడదని పోరాటం ప్రారంభించారు. ఇంకా పోరాడు తూనే ఉన్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన దేవదాసీల్లో వచ్చిన ఈ మార్పు ఓ విప్లవంలా కొనసాగుతోంది. కర్ణాటక దేవదాసీ(ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్)యాక్ట్-1982 ద్వారా రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అయితే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48 వేల మంది దేవదాసీలున్నట్ల్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది బీదర్, బెల్గాం, రాయచూరు, బళ్లారి ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్క బెల్గ్గాంలోనే దాదాపు 5 వేల మంది దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా బెల్గ్గాం జిల్లాలో దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తూ అనంతరం తమ జీవన విధానాన్ని మార్చుకున్న కొంతమంది మహిళలతో ఏర్పాటైన సంస్థే ‘మాస్’(మహిళల అభివృద్ధి సంరక్షణా సంస్థ-ఎంఏఎస్ఎస్). సామాజిక దురాచారమైన దేవదాసీ చెరలో మగ్గుతున్న బెళ్గావి జిల్లాలోని కొందరు మహిళలు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ప్రమేయంతో ఆ చెర నుండి బయటపడ్డారు. వారిలో సీతవ్వ, సరసవ్వ, ఐరావతిలు కూడా ఉన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 1997లో ‘మాస్’ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో సభ్యత్వంతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం దాదాపు 4,500 మంది మాజీ దేవదాసీలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దేవదాసీ పద్ధతిని రూపుమాపేందుకు ‘మాస్’ సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ విషయంపై ‘మాస్’ సంస్థ కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్న సీతవ్వ, సంస్థ సభ్యురాలైన ఐరావతి ఏమంటారంటే...‘‘బెళ్గావిలోని గోకాక్ తాలూకాలో ఉన్న యల్లమ్మ గుడ్డలో జరిగే జాతరలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలను దేవదాసీలుగా మార్చేవారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ ఆడపిల్లలను దేవదాసీలుగా మారుస్తుంటారు. అయితే మా సంఘం ఏర్పాటైన నాటి నుండి అక్కడ ఎవరినీ దేవదాసీలుగా మార్చకుండా చూస్తున్నాం. ఇంతకు ముందు మేము దేవదాసీలుగా ఉన్న వాళ్లమే కాబట్టి ఎవరైనా తమ సంబంధీకుల్లో లేదా ఇతరుల ఆడబిడ్డలను దేవదాసీలుగా మారుస్తున్నారా అన్న విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంటుంది. దేవదాసీ వ్యవస్థపై నిషేధం విధించిన నాటినుండి అమ్మాయిలను దేవదాసీలుగా మార్చే ప్రక్రియ రాత్రివేళల్లో సాగుతోంది. అందుకే మా సంస్థ సభ్యులతో బృందంగా వెళ్లి రాత్రివేళల్లో నిఘా వేసేవాళ్లం. ఆ సందర్భంలో అమ్మాయి సంబంధీకులు మాపై దాడులకు కూడా పాల్పడ్డారు. అయినా సరే, మరే ఆడబిడ్డా మాలాగా మారకూడదనే దృఢ నిశ్చయంతో వారిని అడ్డుకునేవాళ్లం. అలా ఎంతోమంది ఆడబిడ్డలను ఆ చెరలో పడకుండా చూడగలిగాము’’ అంటూ తమ సంఘం చేసిన పనులను చెప్పారు ఐరావతి. చెరవీడినవారికి.... దేవదాసీ వ్యవస్థలో మగ్గి ప్రస్తుతం ఆ చెరనుండి బయటపడ్డ వారు వారి పిల్లలకు ఓ పుట్టినిల్లులా భరోసా ఇస్తోంది ‘మాస్’. మాజీ దేవదాసీలు, వారి పిల్లలకు రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేమున్నామంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తోంది. తమపై జరిగే అన్యాయాలను నిరోధించేందుకు గాను మాస్ సంస్థలో న్యాయ సలహా కేంద్రం కూడా ఏర్పాటైంది. న్యాయవ్యవస్థ నుండి తమకు లభించే ప్రయోజనాలు, న్యాయస్థానాల నుండి సహాయాన్ని ఎలా పొందవచ్చు అనే అంశాలపై కూడా సలహాలు, సూచనలు అందిస్తోంది. వీటితో పాటు మాస్ సంస్థలోని సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బాల్యవివాహాలను అరికట్టడంతో పాటు వివిధ సామాజిక దురాచారాలపై వీధినాటికలను ప్రదర్శిస్తూ గ్రామాల్లోని మహిళల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు చేయాల్సిన కృషి వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉంటారు. మాజీ దేవదాసీల పిల్లలకు మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేస్తోంది మాస్. ఈ క్రమంలో మాస్ సంస్థ సభ్యులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే ఎలాంటి అవరోధాలనూ లెక్కచేయక ముందుకు సాగుతున్నారు. - షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు; ఫొటోలు: టి.కె. ధనుంజయ స్వయం ఉపాధి కూడా... ‘దేవదాసీ విధానం నుండి విముక్తి కల్పించిన తర్వాత మేం ఆలోచించింది మా ఉపాధి గురించి, మా బిడ్డల భవిష్యత్తు గురించి. అందుకే ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ముందుగా మేం స్వయం ఉపాధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నాం. బుట్టల అల్లిక, ఎంబ్రాయిడరీ, అగరుబత్తుల తయారీలో శిక్షణ పొంది మా సభ్యులకు కూడా శిక్షణ ఇప్పించాం. ప్రస్తుతం మా సంస్థలోని సభ్యులంతా స్వశక్తితో జీవనాన్ని సాగిస్తున్నారు. మా సంఘంలోని సభ్యుల పిల్లల ఉన్నత చదువుల కోసం రుణాలను కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది మాజీ దేవదాసీల పిల్లలు ‘దాసీ’ శృంఖలాలను తెంచుకుంటూ తమదైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. - సీతవ్వ, మాస్ సంస్థ కార్యనిర్వాహక అధికారి -
పరుగులు నిలబెట్టాయి
లత. పుణె. వయసు అరవై పైనే! సుధ... హైదరాబాద్. వయసు? వయసిక్కడ పాయింట్ కాదు. సుధ యాక్సిడెంట్ అయిన మనిషి. వెన్నుపూసలకు గాయాలు! కాలి చీలమండల్లో రాడ్లు! లత ఎవరో, సుధ ఎవరో. కామన్ పాయింట్ మాత్రం ‘పరుగులు’. మామూలు పరుగులు కావు. జీవితం పెట్టించిన పరుగులు. భర్త ప్రాణాలు దక్కించుకోడానికి లత... అరైవె ఏళ్ల మహిళలిచ్చిన స్ఫూర్తితో సుధ... ‘మారథాన్’ బరుల్లోకి దిగారు. విజేతలుగా నిలబడ్డారు. ‘ఐదునెలల దాకా మంచం దిగకూడదు. నడవడానికి ఏడాది పైనే పడుతుంది. ఆ తర్వాత కూడా బరువులు ఎత్తకూడదు. పరుగెత్తకూడదు’ డాక్టర్లు చెప్పిన మాటలు చెవిలో పడగానే మరోసారి రెండంతస్తుల మేడ మీద నుంచి కిందకి పడిపోయినట్లు అనిపించింది సుధకు. మామూలు మనిషి అవ్వడం గగనం అంటున్న డాక్టర్ మాటల్ని లెక్కచేయకుండా ఆమె సాధించిన విజయాల్ని చూస్తుంటే మనిషికి మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదనిపిస్తుంది. గత పదిహేనేళ్ల సుధ జీవితంలోకి చూస్తే ప్రమాదాలకు భయపడాల్సిన పని లేదనిపిస్తుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే... ‘‘మా స్నేహితురాలు కొనుక్కున్న ఫ్లాట్ చూడ్డానికి నేను, నా భర్త చంద్రశేఖర్ వెంగళరావునగర్ వెళ్లాం. నిర్మాణం ఇంకా పూర్తవ్వలేదు. రెండోఅంతస్తు దాకా ఎక్కి, వెనక్కి తిరిగి చూస్తూ కింది మెట్టు మీదకు అడుగేశాను. మెట్లకు రెయిలింగ్ లేకపోవడం వల్ల కిందకు పడిపోయాను. రెండురోజులదాకా స్పృహ లేదు. తెలివి వచ్చాక డాక్టర్లు చెప్పిన మాటలు వింటే మళ్లీ నిద్ర పట్టలేదు. కానీ ధైర్యం కూడగట్టుకున్నాను. ఐదు నెలలు గడిచాక మెల్లగా నడవడం మొదలుపెట్టాను. వెన్ను చివర (ఎల్2, ఎల్2, ఎల్3, ఎల్5 డిస్క్‌లు) వీపుమీద చెయ్యిపెట్టి తడుముతుంటే బయటికి వచ్చినట్టు తగిలాయి. కాలు చీలమండ దగ్గర రాడ్స్ వేశారు. జాగ్రత్తగా ఉండాలన్నారు డాక్టర్లు. మరోపక్క అధికంగా బరువు పెరిగా. గాయాల సంగతి పక్కన పెట్టి బరువు తగ్గించుకోవాలనుకుని వాకింగ్ మొదలుపెట్టాను. క్రమంగా బరువు తగ్గాను. అయినా వాకింగ్ మానలేదు. అదే నా కొత్తజీవితానికి పునాది వేసింది. స్వచ్ఛంద సేవకు వెళ్లి... నాకు ప్రమాదం జరిగిన తర్వాత మేం దక్షిణాఫ్రికా వెళ్లి తొమ్మిదేళ్లు ఉండి వచ్చాం. అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2009లో హైదరాబాద్ వచ్చేశాక, వాకింగ్పై దృష్టి పెట్టాను. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ సలహాతో హైదరాబాద్ రన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మారథాన్ పోటీలు చూడ్డానికి వెళ్లా. ఆ మారథాన్‌లో యాభై అరవై ఏళ్ల వయసున్న మహిళల్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇంతలో ఎయిర్టెల్వారు మారథాన్ నిర్వహిస్తున్నారని తెలిసి అందులో పాల్గొన్నాను. ఆఫ్ మారథాన్ అంటే ఇరవై ఒకటిన్నర కిలోమీటర్లు రెండున్నర గంటల్లో పరిగెట్టాను. మధ్యలో నాలుగైదుసార్లు వెన్ను నొప్పి వచ్చింది. కాలు కూడా నొప్పి పెట్టింది. రెండు నిమిషాలు పరుగు ఆపి నడకలోకి వచ్చి మళ్లీ మొదలెట్టి మెడల్ సంపాదించాను. ఇది జరిగింది 2011లో. ఆ తర్వాత మరో మారథాన్‌లో కూడా పాల్గొన్నాను. మారథాన్ వల్ల నా ఒంట్లో గాయాలు ఎక్కువవుతాయని డాక్టర్లు చెబుతుంటే...నేను మాత్రం ఆ గాయాలకు అదే మందని నమ్మాను. పద్దెనిమెది మెడల్స్‌తో... మారథాన్కంటే ముందు హైదరాబాద్ రన్నర్ క్లబ్లో సభ్యురాలిగా చేరాను. దాంతో దేశంలో ఎక్కడెక్కడ మారథాన్లు జరుగుతున్నాయో సభ్యుల ద్వారా తెలిసేది. అప్పుడప్పుడు వారితో కలిసి ఎక్కడ మారథాన్ ఉంటే అక్కడికి వెళ్లేదాన్ని. ఆ తర్వాత దేశంలో ఎక్కడెక్కడ మారథాన్ పోటీలు జరుగుతున్నాయో తెలుసుకుని ఒంటరిగా వెళ్లడం కూడా మొదలుపెట్టాను. పునె, భువనేశ్వర్, సతార, పాండిచ్చేరి, హిమాలయ, చెన్నై, గోవా, తంజావూర్, కోయంబత్తూర్...ఇలా అన్ని ప్రాంతాల్లో నిర్వహించిన మారథాన్‌లో పాల్గొని 18 మెడల్స్ మెడలో వేయించుకున్నాను. ఇల్లు... వాకిలి గత ఏడాది పన్నెండు మారథాన్లలో పాల్గొన్నాను. నా భర్త, నా పిల్లలు నా గెలుపుని బాగా ఎంజాయ్ చేస్తారు. మా పెద్దమ్మాయి స్నిగ్ద కరాటే బ్లాక్ బెల్టర్. చిన్నమ్మాయి సమీర మూడోతరగతి చదువుతోంది. మారథాన్ నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం నా కొత్త లక్ష్యం సైక్లింగ్. అందులో కూడా ఊహించని విజయాలు చూడాలన్నది నా కోరిక. ఒక పక్క గాయాలు నన్ను వేధిస్తున్నా...వాటిని అధిగమించడానికి వైద్యుల సలహాలకంటే ఈ పరుగుపందాలే ఎక్కువ ఉపశమనం ఇస్తున్నాయి. ఈ పదిహేనేళ్లలో జీవితం నాకు నేర్పింది పడడం, లేవడం ఒక్కటే కాదు. గాయాన్ని లెక్కచేయకపోవడం. అది మనసుకైనా, శరీరానికైనా. మరో ముఖ్యమైన విషయం మహిళ జీవితంలో తనకంటూ కొంత చోటు ఏర్పాటుచేసుకోవాలి. అందులో తల్లితండ్రులు, పిల్లలు, భర్త, సమాజం... అంటూ ఏమీ ఉండకూడదు. అందులో జీవిత లక్ష్యాలు, ఇష్టాలు, అవసరాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. రోజులో ఒక పది నిమిషాలు అలా ఉండగలిగినా ఆమెలోని శక్తి పూర్తిస్థాయిలో బయటికొస్తుంది’’ అని ముగించారు సుధ. కష్టాల్లోనూ కుంగిపోక ధైర్యంగా ముందడుగు వేసిన ఆమె అడుగుల వేగం ఇంకా పెరగాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి; ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ ఒకసారి ఏమైందంటే... హిమాలయాలకు వెళ్లినపుడు అనుకోకుండా ఒక కొండదగ్గర దారి తప్పాను. వారిని వెతికే ప్రయత్నంలో కాలు జారి లోయలో పడిపోయాను. నా ఫోన్ సిగ్నల్ సరిగా లేదక్కడ. ఎంత అరిచినా ఎవరూ రావడం లేదు. నా గ్రూప్వారంతా నాకోసం వెతుకుతున్నారు. ఇంతలో సిగ్నల్ దొరికింది. నా తోటివారికి ఫోన్‌చేశాను. వాళ్లొచ్చి నన్ను పైకి తీసుకొచ్చారు. ఆ దెబ్బతో మారథాన్‌కి బ్రేక్ పడుతుందనుకున్నారంతా. నేను మాత్రం థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాను. మారథానక్ ఆపలేదు సరికదా, ఈ మధ్యనే సైక్లింగ్ కూడా చేయాలనిపించి ప్రాక్టీస్ మొదలెట్టాను. రోజూ ఉదయం ఎనిమిది కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నాను. *************** కూలినాలి చేసుకునే ఆమెకు మారథాన్ అంటే ఏమిటో కూడా తెలియదు. భర్త ఆరోగ్య పరీక్షలకు కావలసిన ఖర్చులే కళ్లముందున్నాయి. పరుగెత్తగలనన్న ధైర్యమే పోటీలో పాల్గొనేలా చేసింది. అడుగులు వడివడిగా పడేలా చూసింది. భర్తపై ఉన్న అనురాగమే అరవై ఏళ్ల ఆమెను మారథాన్‌లో గెలిపించింది. ఆమే పుణేకు చెందిన లతా కారే. ఓ పరుగు ఆమె జీవితాన్ని మార్చింది. కట్టుకున్న భర్త కోసం మారథాన్‌లో తీసిన పరుగు, ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె సాహసం మహిళలకు ఆదర్శంగా నిలబెట్టేలా చేసింది. భర్త మీద ఉన్న అనురాగం, ఆరు పదులు దాటిన వయసులో పరుగెత్తేలా చేసింది. మారథాన్ అంటేనే తెలియని ‘లతా కారే’ పుణే జిల్లా బారామతిలో జరిగిన మూడు కిలోమీటర్ల మారథాన్‌లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్తకు వైద్యపరీక్షలు చేయించేందుకు 5000 రూపాయల కోసం పరుగెత్తిన ఆమెను ఆదుకునేందుకు అనేక ఆపన్నహస్తాలు ముందుకువ చ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో స్థానిక పాత్రికేయులు ఆమె పేరుపై బ్యాంకు అకౌంట్ ప్రారంభించారు. వారం తిరగకుండానే మూడు లక్షల రూపాయలకు పైగా ఆమె ఖాతాలో జమయ్యింది. ఇంకా జమ అవుతూనే ఉంది. బుల్డానా నుంచి దాంపత్య జీవనం ప్రారంభం... వాషీంజిల్లాకి చెందిన లతాకు భగవాన్‌తో వివాహం జరిగింది. ప్రభుత్వం అందించే ఉపాధి హామీ పథకం పనులతో సహా ఏ పని లభిస్తే ఆ పనిచేస్తూ వీరు జీవితం గడపసాగారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిల్లలకు చదువు చెప్పించాలనుకున్నారు. కాని వచ్చే కూలి డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ... ఎలాగైతేనేం... పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఆ తర్వాత పనులు దొరకడం కష్టమైంది. బారామతికి... బారామతిలో పని లభిస్తుందని తెలిసి, నాలుగేళ్ల కిందటే పొట్ట చేత పట్టుకుని అక్కడికి మకాం మార్చారు. కుటుంబమంతా కూలి చేస్తున్నప్పటికీ వీరి సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోయేదికాదు. ఇంతలో లతాభర్త భగవాన్‌కు గుండెపోటు వచ్చింది. వైద్యులు ఆమె భర్తకు ఎంఆర్ఐ తదితర పరీక్షలు చేయాలని, ఇందుకోసం మూడు వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆమెకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆదర్శంగా నిలబడింది... పుట్టెడు కష్టంలో ఉన్న లతాకు... శరద్‌పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సిటిజన్ల కోసం 2013 డిసెంబరు 16న ‘శరద్ మారథాన్’ పేరుతో, బారామతిలో 3 కిలోమీటర్ల పరుగుపందెం ఏర్పాటుచేశారని, తాము కూడా ఆ పోటీలో పాల్గొంటున్నామని ఇరుగుపొరుగు వారు చెప్పారు. దీంతో పరుగుపందెంలో పాల్గొంటే 5000 రూపాయలు గెలవచ్చన్న ఆశ కలిగింది. ప్రేమ, పట్టుదలలే గెలిపించాయి... కూలినాలి చేసుకునే ఆమెకు, మారథాన్ అంటే ఏమిటో కూడా తెలియకపోయినా, పరుగెత్తగలనన్న ధైర్యమే పోటీలో పాల్గొనేలా చేసింది. కాని కుటుంబసభ్యులు ‘ఈ వయసులో పరుగెత్తడం ఏమిటి’ అని వారించారు. మారథాన్ మరో రెండురోజుల్లో ఉందనగా ఆమెకు జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ వెళ్లవద్దని ఆమెపై ఒత్తిడి పెంచడంతో, సరే అంది. ఆ రాత్రికి ఊరుకుని, మరుసటి రోజు ఉదయం, జ్వరానికి మాత్రలు తెచ్చుకుంటానని చెప్పి, సరాసరి మారథాన్ జరిగే స్థలానికి వె ళ్లింది. మారథాన్‌లో అందరూ ఒక్కసారిగా పరుగు ప్రారంభించారు. లతా కూడా పరుగు తీయడం ప్రారంభించింది. కాళ్లకు చెప్పులు లేకుండా తొమ్మిది గజాల చీరతో మారథాన్ రేసులో పరుగెత్తుతున్న ఆమెను అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. ఇవేవీ పట్టించుకోకుండా తన భర్త వైద్యపరీక్షలను తలుచుకుంటూ నెత్తిపై కొంగుకప్పుకుని ఎలాగైనా ఈ రేసులో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లసాగింది. అంతలోనే ‘మారథాన్ విజేత లతా కారే’ అనే ప్రకటన వెలువడింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. భర్త వైద్య పరీక్షల కోసం మారథాన్‌లో పాల్గొని, విజేతగా నిలవడంతో మీడియాతోపాటు ప్రజలు కూడా ఆమెను అభినందనలతో ముంచెత్తారు. నిర్వాహకులు ఐదు వేల రూపాయల నగదును బహుమతిగా ఆమెకు అందించారు. - గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంైబె మారిన జీవన శైలి... మారథాన్ రేసు లతాకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. స్థానికంగా ఉన్న ప్రదీప్ గురవ్ (దివ్య మరాఠి), జితేంద్ర జాదవ్ (ఐబిఎన్ లోకమత్) అనే ఇద్దరు పాత్రికేయులతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారామతి శాఖ అధికారి కులకర్ణి సహకారంతో ఆమె పేరుపై అకౌంట్ ప్రారంభించారు. దీంతో అనేక ఆపన్న హస్తాలు ముందుకు వచ్చాయి. వారం తిరగకుండానే సుమారు మూడువందల మందికిపైగా సుమారు రూ. మూడు లక్షల వరకు జమ చేశారు. తనకు, తన కుటుంబానికి సహకారం అందించి ఆదుకున్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. -
మాట మందుగుండు పాట మహిళాదండు
వీధి మొహం చూడకుండా... ఎన్నాళ్లు బతుకులీడుస్తారు?! ఎంత మందుగుండు సామగ్రి ఉందీ మాటలో! దబదబా ఇల్లూవాకిలి ఊడ్చేసి గబగబా వంటావార్పూ చేసేసి చకచకా పిల్లల్ని బళ్లోకి తోలేసి ఉన్న కోకనే శుభ్రంగా చుట్టేసుకుని ‘ఏమయ్యో! క్యాంపుకెళ్లొస్తా’ అని పరుగులు పెట్టించేంత మందుగుండు! నర్సమ్మ మాట, పాట కూడా ఇలాగే... దట్టించిన శతఘు్నల్లా ఉంటాయి. ‘‘ప్రపంచం మారాలీ అంటే, మహిళను బయటి ప్రపంచాన్ని చూడనివ్వాలి’’ అంటున్న నర్సమ్మ... మొదట ఎలాంటి జీవితాన్ని చూశారు? గరళాన్ని వదిలి, ఎలా తన గళాన్ని సవరించుకున్నారు? చదవండి... ఈవారం ‘జనహితం’లో. పాతికేళ్ల క్రితం... నర్సమ్మ పాడే పాటలు వింటుంటే... పల్లెలలో పేదరికంతో కాపురం చేస్తున్న మహిళలు గుర్తుకొచ్చేవారు. ఎందుకంటే ఆ పాటలలో పల్లె పడుచుల జీవన విధానం నిండి ఉండేది. నర్సమ్మ ఇప్పుడు కూడా పాడుతోంది. కాని వాటిలో మునుపటి భావాలు లేవు. ఆమె గొంతులో ఒక చైతన్యం ఉంది. ఒక ఆశయం ఉంది. ప్రతి మహిళ చదువుకోవాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని తన గళంలో పలుకుతోంది. నర్సమ్మది మెదక్ జిల్లా పుల్కల్ మండలం బసపూర్ గ్రామం. ఆటపాటలతో గడపవలసిన వయసులోనే అత్తింటిలో అడుగుపెట్టింది. అక్కడ వేధింపులు తట్టుకోలేక పుట్టిల్లు చేరింది. నర్సమ్మది నిరుపేద కుటుంబం. పని చేసినరోజు పొట్ట నిండుతుంది. లేదంటే పస్తులుండాల్సిందే. అటువంటి నేపథ్యంలో నుంచి, ఏం జరిగిందో ఏమో కాని ఆమె కల్లు కాంపౌండ్ పంచన చేరింది. అక్కడే పని చేస్తూ, కడుపునిండా కల్లు తాగుతూ, ఆశలు చిగర్చని మోడులా మిగిలింది నర్సమ్మ. అంతటి వెనుకబాటుగా ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా ఉన్న ఆమె, ఈరోజు తోటి మహిళలకు అండగా నిలుస్తోంది. వారి జీవితాల్లో వెలుగురేఖలు నింపడానికి తన వంతు కృషి చేస్తోంది. నర్సమ్మ తల్లిదండ్రులు కూలిపని చేసి జీవించేవారు. ఆమెకు ముగ్గురు అన్నలు, ఒక చెల్లి. వీరంతా రోజు కూలీలే. కల్లు కాంపౌండ్ దగ్గర, టీ కొట్టు దగ్గర పనిచేసుకుంటూ బతికే నర్సమ్మ కల్లుకి బానిసైపోయింది. వద్దని తల్లి ఎంత చెప్పినా, ఆమె మాటను కూడా లెక్కచేసేది కాదు. పెళ్లికి ముందు నర్సమ్మ గేదెల్ని తోలుకెళ్లి, గడ్డి మేపేది. నెత్తికి ఒక వస్త్రం చుట్టుకుని, చేతిలో కర్రను భుజాన వేసుకుని ఆమె పాటలు పాడుతుంటే వ్యవసాయ కూలీలు ఎంతో ఆసక్తిగా వినేవారు. నర్సమ్మ స్వరం మాత్రమే కాదు, అప్పటికప్పుడు కల్పించుకుని పాడే సాహిత్యం కూడా అందరికీ బాగా నచ్చేది. అప్పటికి నర్సమ్మకున్న ఏకైక ఆస్తి ఆమె పాటలే. పెళ్లి తర్వాత ఛిద్రమైపోయిన సంసారం, కల్లు కాంపౌండ్‌తో జతకట్టడంతో... అందరూ నర్సమ్మ జీవితం నాశనమైపోయిందనుకున్నారు. ఇక తల్లిదండ్రుల బాధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సమయంలో మహిళలల్లో చైతన్యం తేవడానికి ఆ ఊళ్లోకి మహిళా సమతా సొసైటీవారొచ్చారు. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని నర్సమ్మతోపాటు ఆ గ్రామంలోని మహిళలంతా వ్యతిరేకించారు. ‘మాకు చదువెందుకు? మేం చదువుకుని ఏం చేయాలి? ఏదన్నా పనుంటే ఇప్పించండి. అంతేగాని చదువు, చైతన్యం ఇవేమీ మాకొద్దు’ అని తిప్పికొట్టారు. అయినా పట్టువిడవకుండా సమతా సొసైటీ వారు అక్కడి మహిళలందరికీ నచ్చజెప్పారు. అలా ఆరుగురు సభ్యులతో సమతాసొసైటీని ఏర్పాటుచేశారు. నర్సమ్మ పాటలు, ఉన్నదున్నట్లు ధైర్యంగా మాట్లాడే తీరుచూసి ఆ సొసైటీకి నర్సమ్మనే లీడర్ని చేశారు. అంతే! అక్కడి నుంచి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. అక్షరాస్యత శిబిరాలు... విద్య, ఆరోగ్యం, పంచాయితీ, వ్యవసాయం, సామాజిక సమస్యలు...అంటూ ఐదు అంశాలపై పోరాడే సమతా సొసైటీలో చదువు నేర్చుకున్న నర్సమ్మ ఆ గ్రామానికి సంస్థ తరఫున నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. దాంతో ఆమె రూపురేఖలు, హావభావాలు, ఆలోచనలు అన్నీ మారిపోయాయి. విమానమెక్కిన వేళ... గ్రామ, మండల, జిల్లా స్థాయి దాటి రాష్ర్టస్థాయి మహిళా సొసైటీ మీటింగ్‌లకు హాజరవ్వడం మొదలయ్యాక నర్సమ్మలో ఉద్యమలక్షణాలు బయటపడ్డాయి. ‘వీధి మొహం చూడకుండా ఎన్నాళ్లిలా బతుకులీడుస్తారు’ అని తన పాటల ద్వారా పల్లె మహిళల్ని నిలదీయడం మొదలుపెట్టింది. పేద బతుకులకు తెలిసినంత గొప్పగా ఇంకెవరికీ జీవితం బరువు తెలియదు. అందుకే పంచాయితీలు తీర్చే బాధ్యతను ఎంచుకుంది. కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ మహిళలకు కౌన్సెలింగ్ చేసింది. తన జీవితాన్ని సాక్ష్యంగా చూపి మరీ వారిని ఓదార్చింది. నర్సమ్మ పాటలకు, పాఠాలకు మహిళలెక్కువగా ఆకర్షితులవుతున్న విషయం గమనించిన ‘మహిళా సమతా’ నిర్వహకులు... నర్సమ్మను ఢిల్లీ పర్యటనకు కూడా పంపారు. ‘‘మీది మోటారును (విమానాన్ని) చూడడం అదే మొదటిసారి. దానిపై ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్‌కి వెళ్లినపుడు నాకు చాలా ఆనందం వేసింది. దానిలో కూర్చున్నంతసేపు చిన్నప్పుడు బర్రెలు మేపుతున్నప్పుడు ఆకాశంలో చిన్నగా కనిపించిన మోటార్లే గుర్తుకొచ్చాయి. ఈ సొసైటీ పుణ్యమాని అది ఎక్కే అవకాశం వచ్చింది. ఆ మీటింగ్‌లో మన రాష్ర్టంలో మహిళలకు సంబంధించిన సామాజికాంశాలపై పావుగంటసేపు మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. నేను అప్పటి ఉపరాష్ర్టపతి కృష్ణకాంత్ భార్య సుమన్ కృష్ణకాంత్ పక్కనే కూర్చోవడం నాకు సంతోషం కలిగించింది’’ అంటూ ఎంతో సంబరపడుతూ చెప్పారు నర్సమ్మ. మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. కాని వాటి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని, బతుకుల్ని బాగుచేసుకునే పేదమహిళలే చాలా అరుదు. నర్సమ్మలో ఉన్న పట్టుదల అందరిలోనూ కనిపించదు. నెలకు రెండు జిల్లాలు చొప్పున 14 జిల్లాల్లో నర్సమ్మ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అక్కడ మాటలకంటే ఎక్కువగా ఆమె పాటలే వినిపిస్తాయి. అక్కడి పరిస్థితుల్ని, వాతావరణాన్ని, మహిళల ఆలోచన తీరుని బట్టి, క్షణాల్లో పదాలు కట్టి, పాటలు పాడి, తోటిమహిళల్ని తన చైతన్య రథంలోకి ఎక్కించుకుంటున్న నర్సమ్మకు హ్యాట్సాఫ్ చెబుదాం. - భువనేశ్వరి, ఫొటోలు: పి.గురివిరెడ్డి సమత వారు నన్ను మెచ్చుకుంటున్న ప్రతిసారీ, ఇరవైఏళ్ల కిందటి నా గతం గుర్తుకొస్తుంటుంది. కల్లు తప్ప నాకు వేరే లోకం ఉండేది కాదు. మహిళా సమతా సొసైటీలో చేరాక తోటిసభ్యులు. నా చేత కల్లు మాన్పించి, ఉపాధి, ఇల్లు, చదువు, మీటింగ్‌లు... అంటూ నన్ను ఒక జీవితంలోకి తోసేశారు. అప్పటికి నాకు తెలిసింది... పాటలు పాడటాన్నే ఆయుధంగా మలిచి మహిళా సమతకు పేరు తేవాలని. మహిళా చైతన్యం, మహిళలపై వేధింపులు, కష్టాలు...అన్ని అంశాలకు సంబంధించి జానపద గీతాలను సేకరించేదాన్ని. చాలావరకూ నేను సొంతంగా పాటలు రాసుకునేదాన్ని. ఎక్కడ సమతా మీటింగ్‌లు పెట్టినా నా గళం వినిపించేదాన్ని. - నర్సమ్మ -
ఒక చేత వెన్నముద్ద ఒక చేత యుద్ధవిద్య
నిరుడు ఇదే సమయానికి - ఈ కొయ్యబారిన చలిరోజుల్లో... యావద్దేశం సలసల మరిగిపోతున్న రక్తంతో ‘నిర్భయ’ కోసం నినదిస్తూ ఉంది. ఆమె బతకాలని క్షణం విరామం లేకుండా ప్రార్థిస్తూనే ఉంది! ఇప్పుడు నిర్భయ లేదు. నిర్భయ చట్టం ఉంది. చట్టం ఉంది. కానీ నిశ్చింత లేదు! రోజూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక ఘటన! పార్లమెంటు చట్టం చేస్తుంది కానీ... పాఠశాల వరకూ తోడు రాలేదు. పోలీస్స్టేషన్లు ఉంటాయి కానీ... ఆఫీస్‌లో పక్కనే వచ్చి కూర్చోవు. ఎలా మరి? చదువు కోసం, కొలువుల కోసం ఆడపిల్లలు బయటికి వెళ్లిరావడం ఎలా? ఏ కవచాలు వారిని కాపాడతాయి? కవచాలు అక్కర్లేదు... కరములు చాలు అంటోంది బాలల హక్కుల సంఘం. అనడం మాత్రమే కాదు... స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతోంది. అంతకన్నా ముందు... ధైర్యమే మీ తొలి ఆయుధం అని నూరిపోస్తోంది. కనీసం వెయ్యి విద్యాలయాలలో బాలికలకు, యువతులకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచాలని కంకణం కట్టుకున్న ఈ హక్కుల సంఘం బృహత్తర ప్రయత్నమే ఈవారం ‘జనహితం’. ఆడపిల్ల బయటకు వెళితే తిరిగి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు భయంభయంగా ఎదురుచూసే రోజులివి. వారి భయం ‘ఆమె’ను మరింత బలహీనురాలిగా మారుస్తుంది. అదే ఆత్మరక్షణ విద్య నేర్పితే ‘ఆమె’ ధైర్యంగా ఎదుగుతుంది. ఇంటిల్లిపాదీ నిబ్బరంగా ఉంటారు. ఈ ఆలోచన తో రాష్ట్ర బాలల హక్కుల సంఘం ‘అమ్మాయిలకు ఆత్మరక్షణ’ పద్ధతులను నేర్పిస్తోంది. ఇందుకు గాను ఐఎమ్ఎఫ్ కరాటే మాస్టర్ నరేందర్‌తో కలిసి 1000 స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లోని అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ‘ప్రతి అమ్మాయి బాల్యం నుండే తనను తాను రక్షించుకోవడం ఎలా అన్నది తల్లి చిన్ననాటినుంచే నేర్పించాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం, ఆత్మరక్షణ విద్యలను సాధన చేయించాలి. ఎవరైనా తమపై దాడి జరపగలరన్న అనుమానం వచ్చిన వెంటనే అలెర్ట్ అవగలిగే అవగాహన వారిలో పెంచాలి. తమ దగ్గర ఉండే సాధారణమైన సాధనాలతోనే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి..’ అంటూ ఈ సూచనలు చేస్తున్నారు నిర్వాహకులు. ఆత్మరక్షణ పద్ధతుల్లో చెప్పే ప్రధాన అంశాలు మార్షల్ ఆర్ట్స్ అనేది చిట్టచివరి అధ్యాయం. ముందు కనీస జాగ్రత్తలు అమ్మాయిలు తీసుకోవడం అవసరం. పెద్దలూ వారికి ఇవి సూచించాలి... ఇంట్లో నుంచి అమ్మాయి బయటకెళ్లేటప్పుడు వెంట మొబైల్ తీసుకెళ్లాలి. అందులో ఇంటి నెంబర్లు, పోలీసుస్టేషన్ నెంబర్లు ఉంచుకోవాలి, అమ్మాయిలు చాలావరకు రోడ్లపై మొబైల్లో స్నేహితులతో చాటింగ్ చేస్తూ, కబుర్లు చెబుతూ వెళుతుంటారు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా దాడికి గురిచేసే అవకాశం ఉండవచ్చు. అందుకని రోడ్లమీద ఫోన్ కబుర్లకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు నలుగురితో కలిసి ఉండాలి. వెంట విజిల్ తీసుకువెళ్లడం, కీ చెయిన్‌కు ఒక చిన్న కత్తిలాంటివి తగిలించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగంతకులు తమ నోరు మూస్తే వారి చేతి పైన పిన్‌తో గాని, కీతో గాని గుచ్చడం... వంటివి చే సి దాడి నుంచి తప్పించుకోవచ్చు. కొందరు బస్సులలో, రద్దీగా ఉండే ప్రాంతాలలో శరీర భాగాలను తగులుతుంటారు. అలాంటప్పుడు తమ వెంట ఉండే వస్తువులతో ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కవచ్చో తెలుసుకోవచ్చు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. కరాటే నేర్చుకున్న అమ్మాయిలు కూడా కొంత అమాయకంగా ఆలోచిస్తుంటారు. తమపై దాడి చేసిన వారిని గట్టిగా కొడితే చచ్చిపోతారేమో అని భయపడుతుంటారు లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వెనుకంజ వేస్తుంటారు. రోడ్డు మీద ఎవరైనా తమపై దాడికి దిగినప్పుడు వారిని తరమవచ్చు అని ‘నిర్భయ చట్టం’ చెబుతోంది. ఆడపిల్లలు చిన్నప్పటినుంచే ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ పట్ల అవగాహన పెంచుకోవాలి. టీచర్లు, దగ్గరి బంధువులు మెచ్చుకోలు కోసం భుజాలు తట్టడం, నొక్కడం చేస్తుంటారు. వీటిలో ఆ ‘టచ్’ పట్ల ఆలోచన చేసే జ్ఞానం అలవర్చుకోవాలి. ‘తేడా’గా అనిపిస్తే ప్రిన్సిపాల్‌కు చెప్పడం లేదా నలుగురిలో నిలదీయడం, ఇంట్లో వారికి చెప్పడం చేయాలి. లేదంటే వారు మరింత చనువు తీసుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లల శారీరక అవయవాల గురించి చెబుతూ వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటప్పుడు ఆడపిల్లలు సిగ్గుపడుతూ గుంభనంగా ఉండిపోకూడదు. ఇలాంటివి ప్రోత్సహిస్తే సదరు వ్యక్తి మరింత అడ్వాన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారి గురించి నలుగురికీ తెలియజేయడం అవసరం. ఆగంతకులు ఎవరైనా వెనక నుంచి పట్టుకుంటే ముఖంపై కొట్టాలి, ముక్కుపై గుద్దాలి, విడిపించుకునే క్రమంలో ఎలా ఉండాలో కనీస అవగాహన పెంపొందించాలి. నెగిటివ్, పాజిటివ్ అంశాలకు తేడా తెలుసుకోవాలి. నిలదీసే ధైర్యం పెంచుకోవాలి. చదువుతోపాటు చిన్ననాటి నుంచి అబ్బాయిలకూ సంస్కారం నేర్పాలి. ఈ ముందు జాగ్రత్తలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలకు ఎంతవరకు అవసరమో తెలియజేస్తూ వారిలో అవగాహన కల్పిస్తుంది ఈ కార్యక్రమం. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివమల్లాల భయం పోయింది కరాటే నేర్చుకోకముందు ఓ సారి బస్‌లో నా మెడలో చైన్‌ను లాగారెవరో! ఆ సమయంలో అరవడానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. కొన్ని రోజుల వరకు ఆ భయం పోలేదు. ఆ సంఘటన తర్వాత కరాటే నేర్చుకున్నాను. కిందటేడాది కాలేజీ నుంచి వస్తుంటే దారిలో ఆగంతుకులు దాడి చేయబోయారు. వారిని ధైర్యంగా ఎదుర్కోగలిగాను. - పి.శాలిని, కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత -
ప్రజలకోసం ఫస్టొచ్చారు!
ముందుండాలని ఫస్ట్ వస్తారు ఎవరైనా. వెనకుండడం కోసం ఫస్ట్ తెచ్చుకున్నారు వేణుగోపాల్! టెన్త్‌లో స్కూల్ ఫస్ట్... డిగ్రీలో కాలేజ్ ఫస్ట్... ఎమ్మెస్సీలో యూనివర్శిటీ ఫస్ట్... గ్రూప్ 1లో స్టేట్ ఫస్ట్... ఈ ఫస్ట్‌లన్నీ - ప్రజల కోసం, ప్రజల వెనుక వుండడం కోసం కాలే కడుపుతో, నిద్ర లేని కళ్లతో సాధించారాయన! ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాణిజ్య పన్నుల అధికారిగా ఎంపికైనా... గ్రూప్ 1 మళ్లీ రాసి రెవిన్యూ సర్వీసును ఎంచుకున్నది కూడా... ఆ ప్రజల కోసమే! పగిలిన పలక ముక్కపై అక్షరాలు దిద్దుకుని... స్నేహితుల పుస్తకాలు అరువు తెచ్చుకుని... ఆశల్ని చంపుకుని, ఆశయాల్ని నింపుకుని... ప్రజాసేవకుడినై తీరాలని ప్రతిన పూనిన వేణుగోపాల్‌ను అంతగా ప్రేరేపించిన పరిస్థితులేమిటి? చదవండి... ఈవారం ‘జనహితం’లో... ఆదర్శాలు అందరికీ ఉంటాయి.. కానీ ఆచరణలో ఎన్ని అమలు చేయగలం?.. చిన్ననాడు అన్నీ స్ఫూర్తికలిగిస్తాయి... అందులో ఎన్ని జీవితంలో ఆచరణలోకి వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఓసారి వేణుగోపాల్ రెడ్డి జీవితంలోకి తొంగి చూడాల్సిందే... తన జీవితంలో పేదరికం ఉంది. అడుగడుగునా కష్టాలు వెన్నాడుతున్నాయి. ఆఖరికి బడిలో.. చదువుల ఒడిలో అన్నీ సమస్యలే.. అయినా అమ్మానాన్నల ఆశీస్సులే పెట్టుబడిగా.. అన్నదమ్ముల ఆలంబనే ఆశీర్వాదాలుగా బతుకు చిత్రంలో ఒదిగి.. సర్కారీ బడిలోనే కష్టపడి చదివి... అధికారి అయ్యారు. కడప జిల్లా బద్వేలు మండలం జాఫర్‌సాహెబ్ పల్లి అనే ఓ చిన్ని గ్రామానికి చెందిన ఆయనే గ్రూప్-1 సర్వీసులో 2006 బ్యాచ్ స్టేట్ టాపర్‌గా నిలిచి, ప్రస్తుతం రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్న మట్లి వేణుగోపాల రెడ్డి. నిండా నలభై గడపలు కూడా లేని ఒక కుగ్రామంలో, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలోని ఆరుగురు అన్నదమ్ముల్లో నాలుగో సంతానం ఈయన. సర్కారీబడులు తప్ప చదువుకోవడానికి మరో మార్గం లేని ఆ గ్రామంలో పట్టుదలే ముందుకు నడిపిందంటూ తన జీవిత విశేషాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘అడిగితే ఇంకొంత కష్టం చేసి అన్నీ కొనిస్తాడు నాయన. కానీ అది ఆయనకు ఎంత భారమో నాకు తెలుసు. పలక విరిగిపోతే, రెండు ముక్కలను ఇద్దరు అన్నదమ్ములం తీసుకునేవాళ్ళం. పుస్తకాలు కొనడానికి కూడా ఆలోచించవలసిన రోజులు అవి. స్నేహితుల వద్ద పుస్తకాలు తీసుకుని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకునేవాడిని. ఇలా పడిన కష్టం ఫలించింది. పదోతరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచాను. ఇంటర్లో కాలేజీలో రెండవస్థానంతో సరిపుచ్చుకున్నా, డిగ్రీలో మాత్రం మళ్లీ కాలేజీ టాపర్నే అయ్యా. ఎమ్మెస్సీలో కూడా యూనివర్సిటీ ఫస్టు నేనే.. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడదంతా ఓ అనుభూతిలా మిగిలింది.’ అంటున్నారాయన. నిబద్ధతతో జీవితాన్ని చిన్ననాటి నుంచి కొనసాగిస్తూ వస్తే ‘సాధ్యం’ ముంగిట ‘అసాధ్యం’ చిన్నదై పోతుందని చెబుతున్న వేణుగోపాలరెడ్డి తన జీవిత పుస్తకాన్ని నేటి యువతకు మార్గదర్శకం అయ్యేందుకు సాక్షికి ఓసారి తెరిచి చూపించారు. మొదటిసారి 2005లో గ్రూప్-1లో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ఎంపికయ్యారు. కానీ అది తన లక్ష్యాలకు తగ్గట్టుగా లేదని ప్రజాసేవకు దగ్గరలో ఉండే బాధ్యతలు నిర్వర్తించాలని మరోసారి ప్రయత్నించి 2006లో స్టేట్ టాపర్‌గా నిలిచి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఎందుకనుకున్నానంటే... నేను అప్పర్ ప్రైమరీ చదువులో ఉండగా మా కుటుంబానికి ఓ ధృవపత్రం అవసరమైంది. దానికోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నాలాగే ఎందరో రకరకాల సర్టిఫికెట్ల కోసం బారులు తీరారు. ఎవరి బాధలు వారివి. అక్కడ జనం పడిగాపులు చూసి నేను ఇలాంటి ఆఫీసులో సేవకుడు కావాలని బలంగా అనుకున్నాను. అదే స్ఫూర్తి రెవెన్యూ సర్వీసెస్ కోసం నన్ను ముందుకు నడిపించింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యం... ‘మాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉండేది. వర్షాధార వ్యవసాయం. నాన్న చిన్నకృష్ణారెడ్డి అయిదో తరగతి వరకు చదివారు. అమ్మ చెన్నమ్మ చదువుకోలేదు. ఆరుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు చదువులబాట పడితే, మరో ముగ్గురు వ్యవసాయానికి అంకితమయ్యారు. గ్రామంలో నా పెద్దన్న రాజగోపాల్‌రెడ్డి ఎం.ఏ పట్టా పుచ్చుకున్న మొదటి వ్యక్తి. మరో అన్నయ్య సూర్యనారాయణరెడ్డి బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ చదివారు. నేను తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, గణితశాస్త్రం చదివాను. చదివిన అన్నలు, మా చదువుల కోసం వ్యవసాయానికి అంకితం అయిన సోదరులు అందించిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను’ అంటున్న వేణుగోపాల్, ఇద్దరు సోదరులు చదువు మీద కాక, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ సోదరులకు తమ వాటాగా వచ్చిన భూమిని ఇచ్చేశారు. ‘నాయన నుంచి వచ్చిన ఆస్తి వాటాను చదువుకోని నా అన్నదమ్ములకే విడిచేశాను. నాకు మంచి ఉద్యోగం ఉంది. అన్నలిద్దరూ కూడా చదువుకుని మంచిగానే బతుకు తున్నారు. అందుకే చదువుకున్న వాళ్లు ముగ్గురం మా ఆస్తులు చదువుకోని సోదరులకు ఇచ్చేశాం’ అని చెప్పుకొచ్చిన వేణుగోపాల్ తన జీవన ప్రస్థానంలో అర్ధాంగి సహకారం మరువలేనిదన్నారు. క్రికెట్ చూడటం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉందంటున్న వేణుగోపాల్‌కి శ్రీశ్రీ, గురజాడ కన్యాశుల్కం, చలం సాహిత్యం అభిమాన గ్రంథాలట! దిశా నిర్దేశం అవసరం... ‘ఈనాటి యువత చదువులో దిశానిర్దేశం లేకుండా ఉన్నారు. కళాశాల విద్యలోకి ప్రవేశించాక... నిర్ణీత లక్ష్యాలు ఎంచుకోవాలి. ఆ దిశగా ఎంచుకునే కోర్సులు ఉండాలి. ఏదో చదివాంలే... పట్టభద్రులు అయ్యాంలే.. అనుకుంటే మంచి భవిష్యత్తు పొందలేరు’ అంటారు. ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యం లేని విద్యకు విలువ లేదంటున్న వేణుగోపాల్ మాటలకు విలువ ఇస్తే, యువత తామనుకున్న మార్గంలో నడవడానికి ఎన్ని కష్టాలెదురైనా వెనుకడుగు వేయరేమో! - దేవళ్ల సూర్యనారాయణ మూర్తి, సాక్షి, రాజమండ్రి -
కర్తవ్యం... ప్రాణప్రదం!
పోతున్న ప్రాణాలను కాపాడడానికి ప్రాణాలకంటే కూడా ముందుగా పరుగులు తియ్యాలి. ముంబైలోని మాతుంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతాపాటిల్కు ఇలాంటి పరుగు పందేలు మామూలే! కర్తవ్యాన్ని ప్రాణప్రదంగా భావించే సుజాత తాజాగా కాపాడిన ప్రాణం వినోద్ కాంబ్లీది. ఎంత వేగంగా వెళ్లినా, ట్రాఫిక్‌లో కనీసం ఇరవై నిముషాల సమయమైనా పట్టే దారిని కేవలం పదకొండు నిమిషాల్లో దాటేసి కాంబ్లీ ప్రాణాలను కాపాడడంతో సుజాత వార్తల్లోకి వచ్చారు. విధి నిర్వహణకు మానవత్వాన్ని జోడించి, పోయే ప్రాణాలను నిలుపుతున్న సుజాత ప్రొఫైల్... ఈవారం ‘జనహితం’. ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్దత్తశెడ్గే నుంచి ఫోన్ రాగానే ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు పోలీస్ ఇన్స్పెక్టర్ సుజాతాపాటిల్. ఛాతీ పట్టుకుని బాధపడుతున్న క్రికెటర్ వినోద్కాంబ్లీని కారులో వెనక సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్‌ని కానిస్టేబుల్‌కి అప్పగించి కారును రోడ్డెక్కించారు. ఒకచేత్తో వాకీటాకీలో ట్రాఫిక్ని పక్కకు జరగమని చెబుతూ, మరో చేత్తో లీలావతి హాస్పిటల్‌కి ఫోన్ చేసి డాక్టర్స్‌ని అలర్ట్ చేశారు. మామూలుగా అయితే ముంబైలోని ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి లీలావతి ఆసుపత్రికి వెళ్లడానికి ఇరవై నిమిషాల పైనే పడుతుంది. సుజాతాపాటిల్ ట్రాఫిక్ సిగ్నల్స్‌కి సమాచారం అందిస్తూ అతి తక్కువ సమయంలో ఆసుపత్రికి వెళ్లడం, అప్పటికే డాక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేసి, పేషెంట్‌ని రిసీవ్ చేసుకుని వైద్యం అందించడంతో కాంబ్లీ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో సమాచారం అందించిన కానిస్టేబుల్ కుమార్దత్త సుజాతాపాటిల్లో ఉన్న స్పీడుని చూసి ఆశ్చర్యపోతూ...‘యు ఆర్ గ్రేట్ మేడమ్’ అన్న మాటలకు సుజాతాపాటిల్ చిన్నగా నవ్వి ఊరుకున్నారు. ఇలాంటి ఛాలెంజింగ్ సంఘటనలు ఆ కానిస్టేబుల్‌కి కొత్తేమోగాని, సుజాతపాటిల్కి మాత్రం కాదు. అర్ధరాత్రుళ్లు అపాయంలో ఉన్నవారిని కాపాడటం ఆమెకు కొత్తకాదు. ఇంతవరకు కాపాడిన ప్రాణాలు సామాన్యులవి కావడంతో ఆ విషయాలు బయటకి రాలేదు. ఇప్పుడు కాంబ్లీ కావడంతో అందరూ ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. ‘శభాష్...’ అన్నారు. ఈ సందర్భంగా సుజాతాపాటిల్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలివి... అన్ని రంగాల్లోను మగవాళ్లతో సమానంగా పోటీపడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. కాని కళ్ల ముందు కాంబ్లీ పరిస్థితి చూసి ముచ్చెమటలు పట్టిన కానిస్టేబుల్ ఒక పురుషుడు. అతనిచ్చిన సమాచారాన్ని తోటి పోలీసులకు చేరవేసి ఊరుకోలేదు... ఒక్క క్షణాన్ని కూడా వృథా చేయకుండా సమయస్ఫూర్తితో పదకొండు నిమిషాల్లో సెలబ్రిటీ పాణాల్ని కాపాడిన వైనాన్ని ఆ కానిస్టేబుల్ ఒక్కడే కాదు... ప్రపంచమంతా ప్రశంసించింది. కారణం... సుజాతాపాటిల్ మహిళ కావడమే. భయం, ఆందోళన అనేవి మొదట ఆడవారినే ఆవహిస్తాయనే అపోహలో నుంచి వచ్చిన ప్రశంస అది. ‘‘ఈ రంగంలో ఉంటూ భయమనే పదాన్ని తలచుకోకూడదు. నాకు ఇలాంటి ఫోన్లు రావడం మామూలే. కాకపోతే ఈసారి నేను ఆసుపత్రికి తీసుకెళ్లింది ఓ పెద్ద సెలబ్రెటీని కావడం వల్ల విషయం అందరికీ తెలిసింది. గుండెపోటు కేసు అనగానే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. నాకు ఫోన్ రాగానే కొంచెం కంగారుపడ్డాను. ఎంతసేపటి నుంచి కాంబ్లీ ఇబ్బందిపడుతున్నారో... సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలమో లేదోనని కంగారు. మరో పక్క లీలావతిలో నాకు తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేసి బయట స్ట్రెచర్ రెడీ చేయించమన్నాను. ఆసుపత్రికి వెళ్లి, ఎమర్జెన్సీలోకి తీసుకెళ్లిన అరగంట తర్వాత డాక్టర్లు ‘డోంట్‌వర్రీ’ అన్నారు. అప్పుడు ఊపిరిపీల్చుకున్నాను. అక్కడితో నా డ్యూటీ ముగిసింది. ఇంతలో మా స్టాఫ్ అంతా వచ్చేశారు’’ అని చెబుతుంటే సుజాతాపాటిల్ ముఖంలో ఆనందంతో పాటు వృత్తి పట్ల ఉన్న నిబద్ధత కూడా స్పష్టంగా కనిపించింది. ఆ హడావుడిలో కూడా... కిందటేడు విక్రోలిలో అర్ధరాత్రి జరిగిన సంఘటనలో కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని కాపాడి డిపార్ట్మెంట్వారితో స్పెషల్ సెల్యూట్ చేయించుకున్నారు సుజాతాపాటిల్. ‘‘డ్యూటీలో ఉన్న ఒక ట్రాఫిక్ పోలీస్‌కి యాక్సిడెంట్ అయిందని నాకు ఫోన్ వచ్చింది. హడావుడిగా జీప్‌లో బయలుదేరాను. సమయం రాత్రి 1:30 అవుతోంది. మాటుంగా ప్రాంతం నుంచి ఠాణే వైపు వెళుతుంటే విక్రోలి దగ్గర రోడ్డు పక్కన మురికి కాలువలో బైక్ పడి ఉండడాన్ని చూశాను. వెంటనే జీప్ ఆపాను. దగ్గరికి వెళ్లి చూస్తే మురికి కాలువలో ఇద్దరు యువకులు పడి ఉన్నారు. నా వెనక బైక్‌పై వస్తున్న కానిస్టేబుల్స్‌ని ఆపి వారి సాయంతో ఆ ఇద్దరు యువకుల్ని బయటికి తీసి జీప్ ఎక్కించాను. ఒకరి చేయి పట్టుకుని చూస్తే నాడి దొరకలేదు. ఒకతను మాత్రం మూలుగుతున్నాడు. ఒకపక్క మా కానిస్టేబుల్ పరిస్థితి ఎలాగుందోనని ఆందోళన, మరోపక్క వీరిద్దరిలో ఒక్కరినైనా ప్రాణాలతో కాపాడగలనా లేదా? అనే ఆలోచన. దగ్గర్లోని ఆసుపత్రికి చేరుకుని ఇద్దరినీ డాక్టర్లకి అప్పగించాను. అప్పటికే ఒక వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. వారిని అక్కడ చేర్పించి మా కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లాను. అతనికి కూడా కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. మొత్తానికి ఆ రోజు రాత్రి చాలా టెన్షన్‌గా గడిచింది. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు నా తోటివారి ముందే నాకే ఫోన్ చేస్తారు. కారణం... ఏమీ లేదు... నేను భయపడను, ఎదుటివారిని భయపడనివ్వను. నేను డ్యూటీలో చేరినప్పటి నుంచి ఇలాంటి టెన్షన్ కేసుల్ని చాలా హ్యాండిల్ చేశాను’’ - ఎంతో సులువుగా చెప్పేశారు సుజాతాపాటిల్. ఇంట్లో కూడా... మహారాష్ర్టలోని కొల్హాపూర్‌లో పాండురంగ్ జరాత్, రుక్మిణి దంపతులకు జన్మించిన సుజాతాపాటిల్ చిన్నతనంలో పేదరికాన్ని, సమాజాన్ని చాలా దగ్గరగా చూశారు. తండ్రి సైకిల్ షాపు నడుపుతూ భార్యాబిడ్డల్ని పోషించడాన్ని ఇప్పటికీ ఎంతో అపురూపంగా గుర్తుచేసుకుంటారామె. ప్రస్తుతం మాతుంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుజాతాపాటిల్ భర్త అబాసాహెబ్ పాటిల్ ఆర్టీఓ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కొడుకు ఆర్సిస్పాటిల్ ఫ్రీస్ట్టైల్ ఫుట్‌బాల్‌లో గిన్నిస్ రికార్డ్ సంపాదించాడు. ‘‘ఇంటికెళ్లగానే పిల్లల చదువులు, వారి అవసరాలపైకి మనసు మళ్లిపోతుంది. అలాగే పోలీస్ డ్రెస్ వేసుకుని ఇంటి బయట కాలుపెట్టగానే వృత్తికి మించి ఏదీ ముఖ్యం కాదనిపిస్తుంది. చాలా ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చా ను. ఆ ఇష్టాన్ని కొనసాగించినంత కాలం నేను చాలా హ్యాపీగా ఉంటాను. లేనిరోజున చిన్న కేసు కూడా భారంగా అనిపిస్తుంది’’ అని చెప్పారు సుజాతాపాటిల్. అయితే ముంబైలో ఆజాద్ మైదానంలో జరిగిన అల్లర్ల సందర్భంగా సుజాతాపాటిల్ రాసిన ఓ కవిత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కవిత విషయంపై ఆమె వివాదాల్లోకెక్కారు కూడా. చుట్టూ సమాజంలో ఏం జరిగినా వినీవినట్టుగా, చూసీచూడనట్టుగా ఉండే తత్త్వం కాదు ఆమెది. స్పందించడానికి పోలీసే కానక్కర్లేదు... పౌరుడైతే చాలనే ఆమె పిలుపుతో మనం కూడా గొంతు కలుపుదాం. వీలైతే మనం కూడా స్పందించడానికి ప్రయత్నిద్దాం. - గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
ఆపద్బ్రహ్మ
బ్రహ్మ సృష్టిస్తాడు. అపరబ్రహ్మలు ప్రతిసృష్టి చేస్తారు. ఈ ఇద్దరూ కాకుండా... వేరొక బ్రహ్మ ఉన్నారు. ఆపద్బ్రహ్మ! ఆపద్బ్రహ్మా?! ఆయనేం సృష్టిస్తారు? సృష్టించరు. మరి? కనిపెడతారు! ఎవరిని? రాబోయే గుండెపోట్లను! పేలబోయే ఆర్డీఎక్స్‌లను! కనిపెట్టడం అంటే కాపాడడమే కదా. కాపాడడం అంటే సృష్టించడమే కదా. అలా ఆయన ఆపద్బ్రహ్మ. ఆ... బ్రహ్మ సక్సెస్ స్టోరీనే... ఈవారం ‘జనహితం’ ‘గుండెజబ్బుని... ముందుగానే కనుక్కునే మిషన్ వస్తే ఎంత బాగుంటుంది?’ ‘ పూటకోచోట పేలే బాంబుల జాడని ముందే పసిగట్టి సమాచారమిచ్చే యంత్రాలొస్తే ఉగ్రవాదుల చర్యలకు బలయ్యే అవకాశముండదు కదా’ అని అందరూ ఆశపడతారు. ఈ రెండు కలల్ని నెరవేర్చడానికి మహబూబ్‌నగర్ వాసి చేస్తున్న కృషికి గుర్తింపు వచ్చింది. దేశవిదేశాలలో అనేక అవకాశాలున్నప్పటికీ సమాజానికి ఏదో చేయాలన్న తపన వలిపే రామ్గోపాల్రావుది. ముంబై ఐఐటి ప్రొఫెసర్, నానో ఎలక్ట్రానిక్స్ సెంటర్ ప్రముఖ పరిశోధకుడైన రామ్‌గోపాల్ ‘నానోస్కేల్ ఎలక్ట్రానిక్స్’ పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తూ తెలుగువాడి సత్తా చాటుతున్నారు. నానో పరిశోధనలో ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఆయన తాజాగా ‘ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డు-2013’ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరిశోధనలతోపాటు ఇతర విషయాల గురించి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రాబోయే కాలంలో నానో టెక్నాలజీ ఎంతో కీలకంగా మారనుంది. అందుకే నానో సెన్సర్ పరిశోధనకు నా వంతు కృషి చేస్తున్నాను. ఇందులో భాగంగానే గుండెపోటు, ఆర్‌డిఎక్స్‌ను పసిగట్టే నానో సెన్సర్లను రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నానో స్కేల్‌ను మన మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మారుతున్న కాలంతో పాటు మన దేశ ప్రజల జీవనశైలిలో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో శారీరక శ్రమ అంటే వ్యవసాయ పనులు తదితరాలు అధికంగా చేసేవారు. దీంతో అహారంలో తీసుకున్న కొవ్వు కూడా కరిగిపోయేది. మారిన కాలాన్ని పరిశీలిస్తే... శారీరక శ్రమ అంతగా లేని పనులు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పనుల చేసే విధానంలో మార్పులు వచ్చినప్పటికీ, తీసుకునే ఆహారంలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణించే హృద్రోగుల సంఖ్యను పరిశీలిస్తే మన దేశంలోనే అధికంగా ఉంది. అందువల్ల... గుండెపోటును ముందుగా తెలుసుకునేందుకు సెన్సర్లు కనిపెట్టాలని భావించాం. ఇవి మార్కెట్లోకి వస్తే, హృద్రోగులకు చాలా తక్కువ ఖర్చుతో పరీక్షలతో పాటు, గుండెపోటు గురించి ముందుగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌ప్లోజర్ డిటెక్టర్లు... దేశంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆర్డిక్స్ను పసిగట్టేందుకు ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌ప్లోజర్ డిటెక్టర్లను అంటే ‘ఈ నోస్’లను కనిపెట్టాలని భావించాం. దీనిని నానోటెక్నాలజీలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం వీటిని రూపొందించడం చివరి దశలో ఉన్నప్పటికీ పూర్తయిందని చెప్పవచ్చు. మరోవైపు ఈ నోస్ సెన్సర్లు అమర్చడంతో ఆర్‌డిఎక్స్‌తోపాటు అనేకరకాల పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు ఆస్కారం ఏర్పడనుంది. ముఖ్యంగా బస్సులు, తాజ్‌మహల్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీటిని అమర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒక బస్సులో ఇలాంటి ఈ నోస్ సెన్సర్లను సుమారు పది పన్నెండు అమర్చినట్టయితే ఏ సీట్లో పేలుడు పదార్థాలున్నా డ్రైవర్‌కు తెలిసిపోతుంది. వీటిని ఒక్కసారి అమర్చిన అనంతరం కనీసం సంవత్సరం పాటు ఎలాంటి మెయిన్టెనెన్స్ లేకుండా ఉండేలా చూసుకుంటున్నాం. అందుకు ఆ బస్సు నడిచే సమయంలో వచ్చే వైబ్రేషన్ (కుదుపుల)తో ఎనర్జీ సమకూరేలా ఈ సెన్సర్లను రూపొందిస్తున్నాం. తెలుగు మీడియంలోనే... ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మధ్యతరగతి కుటుంబం మాది. ఇంటర్ వరకు కొల్లాపూర్‌లో, తర్వాత వరంగల్‌లోని కిట్స్‌లో బి.టెక్ పూర్తి చేశాను. తెలుగు మీడియంలో చదివిన నాకు ఇంటర్లో ఫిజిక్స్, కెమెస్ట్రీ, మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉండేది. నాన్న అడ్వకేట్‌గా పనిచేసేవారు. ఎమ్‌టెక్ చేసేందుకు ముంబై ఐఐటిలో చేరడంతోనే నా జీవితం మలుపు తిరిగింది. ఇక్కడే విధులు నిర్వహించే ప్రొఫేసర్ జె.వాసి నా జీవితంలో మార్పుకు ఒక కారణం. మళ్లీ ముంబైకి... ఎమ్‌టెక్ అనంత రం ఐఐటిని వీడి అనేక ప్రాంతాలు తిరిగాను, విదేశాలకు కూడా వెళ్లాను. జర్మనీలో పిహెచ్డి చేశాను. అయితే నా మనసులో మాత్రం సమాజం కోసం ఏదో చేయాలన్న తపన ఉండేది. అందుకే అనేక అవకాశాలున్నప్పటికీ అన్ని వదులుకుని మళ్లీ ఐఐటిలో 1998లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. ప్రస్తుతం ఈ బాధ్యతలతో పాటు నానో సెంటర్‌కు ప్రముఖ పరిశోధకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. పెద్ద ఉద్యోగాలే ముఖ్యం కాదు... ప్రస్తుతం ఐఐటిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా అనేకమంది ఉన్నారు. వారందరికీ నేనిచ్చే సలహా మాత్రం ఒకటే... డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా పదిమందికి ఉపయోగపడే పని చేయాలన్న తపనతో చేసిన పనులు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. సంపాదనతో పాటు సమాజం కోసం కూడా ఏమైనా చేస్తేనే జీవితంలో ఆనందం ఉంటుంది’’ అని ముగించారు రామ్‌గోపాల్‌రావు. విదేశాల్లో బోలెడు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ మన దేశ ప్రజలకు ఏదో మేలు చేసేందుకు నానోసెన్సర్లను రూపొందించే పనిలో ఉన్న ఈ ఇంజనీర్‌కి ఆల్ ది బెస్ట్ చెబుదాం. - గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై అవార్డు విలువ అరకోటి ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇచ్చే ‘ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డు’ను 2014 ఫిబ్రవరి 8 వ తేదీన బెంగళూరులో జరిగే ఓ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామ్‌గోపాల్‌కు అందించనున్నారు. అవార్డు కింద రూ. 55 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. ఏటా ప్రకటించే ఈ అవార్డుకు దేశవిదేశాల్లో ఉంటున్న ఏడుగురు జ్యూరీ సభ్యులు ఈ ఏడాది రామ్‌గోపాల్ పేరును ఎంపిక చేశారు. ఆ ఏడుగురిలో ‘యూనివర్సిటీ ఆ్‌ఫ్ కాలిఫోర్నియా’ చాన్స్‌లర్ డాక్టర్ ప్రదీప్ కోస్లా కూడా ఉన్నారు. రామగోపాల్ కృషితో దేశంలోని 92 ఇన్స్టిట్యూట్లలో నానో ఎలక్ట్రానిక్స్‌పై రిసెర్చ్ జరుగుతోంది. -
ఆదివాసీలకు అభయ్ హస్తాలు
సమస్యను పరిష్కరించడం ఒక పద్దతి. సమస్యకు మూలం కనుక్కుని, మళ్లీ అది తలెత్తకుండా చికిత్స చేయడం ఇంకో పద్ధతి. డాక్టర్ అభయ్ దంపతులు రెండో పద్ధతిని ఎంచుకుని... మారుమూల గ్రామాల్లోకి వెళ్లిపోయారు! ఫారిన్లో మెడిసిన్ చేసి వచ్చినా, పట్టణాల్లోనే ఉండిపోకుండా ఆదివాసీల ముంగిళ్లకెళ్లి, గత ముప్పై ఏళ్లుగా వైద్య, సామాజిక సేవలు అందిస్తున్నారు. యువ వైద్యులకు స్ఫూర్తిగా వీరు సాధించిన విజయాలే ఈవారం ‘జనహితం’. అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ’ నుంచి ఎంపిహెచ్ (మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్) పట్టాపుచ్చుకున్నారు అభయ్ బంగ్, రాణి బంగ్ దంపతులు. పొరుగుదేశాల్లో పేరు ప్రతిష్టలతో పాటు బోలెడంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ అన్నింటినీ వదులుకుని ఆదివాసి, గ్రామీణ ప్రజలసేవలతో తరించాలనుకున్నారు. అందుకోసం గడ్చిరోలిని ఎంచుకున్నారు. దేశంలోని వెనకబడ్డ ప్రాంతాల్లో అది ఒకటి. అంతేకాదు, మహారాష్ర్టలో అతిపేద జిల్లా. అక్షరం, ఆరోగ్యం అనే పదాలు తెలియని ఆదివాసీ ప్రాంతం అది. సేవా వారసత్వం... అభయ్బంగ్ తండ్రి ఠాకూర్ దాస్బంగ్ మహాత్మాగాంధీ అనుచరుల్లో ఒకరు. పైచదువులకోసం ఇంగ్లండ్ వెళ్లాల్సిన ఠాకూర్‌దాస్ గాంధీజీ ఆజ్ఞమేరకు గ్రామీణప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు చేశారు. ఆ కారణంగా అభయ్బంగ్ వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమం పరిసరాల్లో పెరగడంతో బాల్యం నుంచి గాంధీజి పారంభించిన ‘నయా తాలీం’(నూతన శిక్షణ పద్ధతి)లో విద్యాభ్యాసం చేశారు. దాంతో చిన్నవయసులోనే పేదలకు సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగపూర్ మెడికల్ కాలేజీలో చదువుతుండగా రాణితో పరిచయం ఏర్పడింది. తమ ఆలోచనల తీరు, ఆశయాలు ఒకటే అవడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. అమెరికాలో చదువుతున్నప్పుడు గడ్చిరోలిలోని గ్రామాల వివరాలు సేకరించి వారు చేయదలుచుకున్న సేవాకార్యక్రమాలకు స్కెచ్ వేసుకున్నారు. 1980లో గడ్చిరోలికి వచ్చారు. ఓ ఐదేళ్లపాటు పరిశోధనలు చేసి... 1985లో సెర్చ్సంస్థని నెలకొల్పారు. ముందుగా గ్రామీణులు తరచు ఎదుర్కొనే జబ్బుల వివరాలు తీసుకుని వాటికి వైద్యం మొదలుపెట్టారు. ఆ జబ్బుల వెనకున్న జీవనవిధానాల్లో మార్పు తేవడానికి కావాల్సిన పథకాలను రచించి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటి నిర్మూలనకు పూనుకున్నారు. శిశుమరణాలపై... ఈ దంపతులు మొదటగా గడ్చిరోలిలోని గ్రామీణప్రాంతాల్లోని శిశుమరణాలపై పరిశోధన జరిపారు. వెయ్యిమంది పిల్లలు పుడితే 120 మందికంటే ఎక్కువ బతకడంలేదు. మరో చిత్రమైన విషయం...నూటికి 83 శాతం మందికి ప్రసవాలు ఇంటిదగ్గరే. దాంతో గడ్చిరోలిలోని ఒక కుగ్రామంలో అభయ్ బంగ్, రాణి బంగ్ల ఇల్లు కొన్నాళ్లకి ఆసుపత్రిలా మారిపోయింది. సెర్చ్ సెంటర్లో కొందరు గ్రామీణ మహిళలకు ఇంటి దగ్గర ప్రసవానికి పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేసరికి శిశుమరణాల సంఖ్యని తగ్గించగలిగారు గైనకాలజిస్టు రాణి. మరోపక్క అభయ్ బంగ్ ఫిజిషియన్‌గా సేవలు అందిస్తూనే...పేదల గుడిసెల మధ్యన ఏరులై పారుతున్న మద్యంపై దృష్టి పెట్టారు. దీంతోపాటు అనేక వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు వైద్యం చేస్తున్నారు. అన్నింటికీ అసలు కారణం నిరక్షరాస్యతేనంటూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి వీధిపిల్లలను దగ్గరుండి మరీ పాఠశాలల్లో చేర్పించారు. అంతేకాదు, శిశుమరణాల వివరాలు ప్రభుత్వం దృష్టికి రాకపోడాన్ని నేరంగా పరిగణించాలంటూ ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా పోరాడారు. విద్య, వైద్యం కొరవడిన చోట జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో దగ్గరగా చూసిన ఈ దంపతులు శిశుమరణాలకు న్యూమోనియాలాంటి వ్యాధులు కారణమని తెలుసుకున్నారు. దానిని నిర్థారించేందుకు ‘బ్రెత్ కౌంటర్’ (శ్వాసను కౌంట్చేసే యంత్రం)ను కనుగొన్నారు. అలాగే వీరు చేపట్టిన పలు వైద్య చికిత్సా పద్ధతుల ద్వారా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పద్ధతిని దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించాలని భావిస్తోంది. మద్యరహిత ప్రాంతంగా గడ్చిరోలి గడ్చిరోలి మురికివాడల్లో మద్యం బారిన పడ్డ కుటుంబాలకు కౌన్సెలింగ్, అవసరమైతే వైద్యం చేసి ఆ మత్తు వదిలించడంలో విజయం సాధించారు అభయ్, రాణి. ఈ దంపతులు మద్యంపై పదేళ్లపాటు చేసిన పోరాటం ఫలితంగా గడ్చిరోలి మద్యపాన రహిత జిల్లాగా నిలిచింది. విదేశాల్లో విలాసంగా జీవించాల్సిన బంగ్ దంపతులు తమ విద్యను, వైద్యాన్ని దేశంలోని పేదప్రాంతానికి అంకితం చేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన ‘మహారాష్ట్ర భూషణ్’ పురస్కారం సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ అవార్డులు, రివార్డులు వారిని వరించాయి. - గుండారి శ్రీనివాస్, ముంబై మేం వచ్చిన కొత్తలో ఇక్కడి మహిళలెవరూ మాతో కలిసేవారు కాదు. మా వైద్యానికి వారు అలవాటు పడడానికి సమయం పట్టినా... అతి తక్కువ సమయంలోనే వారిలో చాలా విషయాలపై అవగాహన తెప్పించగలిగాము. ఫలితంగా గర్భస్థ శిశువుల మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. పౌష్టికాహారం మొదలు...ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలవరకూ... ఇలా ప్రతి ఇంటికీ మా సేవలు వెళ్లడానికి రెండు దశాబ్దాల సమయం పట్టింది. -
బుక్కైతే లక్కే!
సి.ఐ.ప్రకాశ్ కన్నుగప్పి ఎవరూ తప్పించుకోలేరు. అది కాదు విశేషం. ప్రకాశ్ కంట్లో పడ్డాక ఎవరూ తప్పించుకోవాలని చూడరు! ఎనీ టైమ్, ఎనీ సెంటర్... యూత్ హస్క్ కొడుతుంటే అతడి బైక్ వచ్చి ఆగుతుంది. అందర్నీ ఒక్క చూపు చూస్తాడు... దగ్గరికి రమ్మంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ‘నేనేరా పోలీస్’ అంటాడా? అనడు! ‘కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటాడా? అనడు! మరేం చేస్తాడు? న్యూసెన్స్ కేస్ బుక్ చేస్తాడా? చేస్తాడు. కానీ న్యూసెన్స్ కేస్ కాదు... ‘న్యూ’సెన్స్ క్లాసుకు బుక్ చేస్తాడు! ఒకసారి ఆ క్లాస్‌కి బుక్కయ్యారా... ఆర్మీలో పోస్టుతోనే ఎవరైనా తిరిగి బయటికి రావడం! అవును. ప్రకాశ్ లాంటి పోలీస్ ఉంటే... ఊర్లో పోలీస్ ఫోర్సు ఉన్నట్లే. ఈ స్టోరీ చదవండి. బుక్కైతే లక్కే అని మీకూ అనిపిస్తుంది. అర్ధరాత్రిపూట పీకలదాకా మద్యం తాగి రోడ్డుపై అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుర్రాళ్లు పోలీసుల కంటపడితే ఏం చేస్తారు? సాధారణంగా చేసేది ఏమిటంటే... అలాంటి వారిని తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో పడేసి వార్నింగ్‌లు, కౌన్సెలింగ్‌లు... ఇలా వారి డ్యూటీ వారు చేస్తారు. అయితే సీఐ ప్రకాశ్ అలా చేసి ఊరుకోలేదు. దారితప్పుతున్న యువత భవితవ్యం గురించి ఆలోచించారు. అలాంటి వారి కోసం ఓ వెలుగు బాట వేయాలనుకున్నారు. లాఠీ పట్టుకున్న చేత్తోనే గురువుగా బెత్తం పట్టుకున్నారు. దగ్గరుండి మరీ వారికి పాఠాలు చెప్పించారు. గ్రౌండ్‌కి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. అలా 142 మంది యుతకు రక్షణశాఖలో ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తే... వారిలో 72మందికి రక్షణశాఖలో వివిధ రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయి. దాంతో ప్రకాశ్ తన పై అధికారులతోనే కాదు ప్రపంచ పోలీసు విభాగం నుంచి ప్రశంసలందుకున్నారు. కిందటివారం అమెరికాలో ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆ్‌ఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్’ ఆధ్వర్యంలో ‘కమ్యునిటీ పోలీస్’ అవార్డు అందుకున్న కరీంనగర్ జిల్లా గోదావరిఖని సీఐ ఆర్. ప్రకాశ్ చేస్తున్న సేవాకార్యక్రమాలే ఈవారం ‘జనహితం’ ‘‘మూడేళ్లక్రితం ఒకరోజు రాత్రి పెట్రోలింగ్ చేస్తుంటే... సింగరేణి దగ్గర ఒక స్టేడియం కింద ఓ ఎనిమిదిమంది కుర్రాళ్లు మద్యం సేవిస్తూ నా కంటపడ్డారు. అందరినీ జీపెక్కించుకుని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారిస్తే వారిలో ఆరుగురు ఇంజినీరింగ్, ఒకరు ఫార్మసీ పూర్తిచేసినవారు. మరొకరు సింగరేణిలో ఉద్యోగి. నాకు వారిని చూసి కోప్పడాలో, జాలిపడాలో అర్థంకాలేదు. ఇలాంటి వారిని ఎలా దారిలో పెట్టాలో అని ఆలోచిస్తుండగా ఒక స్నేహితుడిచ్చిన సలహా మేరకు రక్షణ విభాగంలో ఉద్యోగాలకు వారికి శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందనిపించింది’’ అని గుర్తుచేసుకున్నారు ప్రకాశ్. రక్షణ విభాగంలో శిక్షణ తీసుకోడానికి మొదటి అర్హత పదోతరగతి పాస్ అవ్వడం, రెండోది పద్ధెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ల వయసులోపు వారై ఉండాలి. మొదట ఓ ఎనిమిదిమంది కుర్రాళ్లకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చారు ప్రకాశ్. వారిలో ఇద్దరికి ఆర్మీలో పోస్టింగ్‌లు వచ్చాయి. మూడు జిల్లాల్లో... తన శిక్షణలో ఆర్మీలో ఉద్యోగాలు పొందిన యువకుల గురించి చెబుతూ... ‘రక్షణ విభాగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న యువతకు ఆహ్వానం’ అంటూ ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పత్రికాప్రకటనలు ఇచ్చారు. నాలుగు జిల్లాల నుంచి వచ్చిన యువతలో అర్హతని బట్టి 142 మంది యువతను ఎంపిక చేశారు. వారిలో 12మంది అమ్మాయిలు కూడా ఉన్నారు.‘‘ నా మొదటి బ్యాచ్‌లో ఆర్మీ ఉద్యోగాలు సంపాదించిన ఇద్దరు కుర్రాళ్లను చూపించడంతో రెండోబ్యాచ్లో చేరడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. ఇంచుమించు వీరంతా ఖాళీగా తిరుగుతూ నా దృష్టిలో పడ్డవారే. వీరిలో చాలామంది పేదవారున్నారు. వీళ్లందరికీ ఉచితంగా ఆశ్రయం కల్పించడానికి ఏర్పాట్లు చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నేను సాయం కోసం ఎవరినీ డబ్బు రూపంలో అడగలేదు. అన్నీ వస్తురూపంలోనే సేకరించాను. సింగరేణి కాలరీస్ కంపెనీవాళ్లు ఈ యువతకి ఉచితంగా ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారం, మిగతా అవసరాలకోసం దాతల్ని ఆశ్రయించాను. నా పై అధికారులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు...ఎవరు సాయం చేస్తామని ముందుకొచ్చినా బియ్యం, ఉప్పు, పప్పులు.. అంటూ భోజనం తయారీకి కావాల్సిన సరుకుల జాబితానే ఇచ్చేవాడ్ని. వాళ్లు సరుకుల్నే నేరుగా పంపేవారు’’ అని చెప్పారు ప్రకాశ్. పోలీసులపై ఉన్న అపోహల వల్ల ప్రకాశ్ దాతల వివరాలను పారదర్శకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఉపాధ్యాయుల సహకారం... ‘‘మొదటి బ్యాచ్‌లో ఆర్మీకి ఎంపికైన విద్యార్థులకు పాఠాలు చెప్పిన హైస్కూల్ హెడ్మాస్టార్ రామ్‌గోపాల్‌తో పాటు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా వచ్చి మరీ మా విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం, సైన్స్, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పారు. ఇక గ్రౌండ్ పాఠాల విషయానికొస్తే పొద్దునే ఐదుగంటలకల్లా నిద్రలేపి ఎగ్, పాలు, అరటిపండు ఇచ్చి 5 కిలోమీటర్లు రన్నింగ్‌కి తీసుకెళ్లేవాడ్ని. తర్వాత లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ వంటివి నేర్పేవాళ్లం. ఏడాదిపాటు సాగిన ఈ శిక్షణకాలంలో నాకు ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. అయినాసరే శిక్షణతీసుకున్న యువతకు మంచి ఉద్యోగాలొచ్చే తీపి క్షణాలకోసం ఏడాదికాలం ఓపిగ్గా ఎదురుచూశాను. ’’ అని చెబుతున్నప్పుడు ప్రకాశ్‌లో పోలీసుకి బదులు ఉపాధ్యాయుడు కనిపించాడు. 72మందికి ఉద్యోగాలు... ‘‘శిక్షణ పూర్తయ్యాక అందరితో రక్షణవిభాగంలోని అన్ని శాఖల్లో ఉద్యోగాలకోసం దరఖాస్తు చేయించాం. ఆర్మీలోని సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యురిటీ ఫోర్స్, పోలీస్ విభాగంలో సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లలో మొత్తం 72మందికి ఉద్యోగాలొచ్చాయి. ఈ విజయం వెనక నాకు నాపై అధికారులు డి.ఎస్.పి డి. ఉదయ్‌కుమార్‌గారు, ఎస్పి వి. రవీందర్గారి సహకారం చాలా ఉంది’’ అని ముగించారు ప్రకాశ్. ఒకచేతితో లాఠీ పట్టుకుని పోలీసు ఉద్యోగం చేసుకునే ప్రకాశ్ మరో చేత్తో యువతకు పాఠాలు చెప్పి రక్షణశాఖకు బహుమతిగా ఇద్దామనుకోవడం వెనక ఆయన మంచిమనసుతో పాటు జీవితం విలువతెలిసిన ఒక ఉపాధ్యాయుడి పెంపకం కూడా ఉంది. ప్రకాశ్ తండ్రి బక్కన్న ఓ స్కూల్ టీచర్. ప్రకాశ్‌ని పోలీస్‌గానే కాదు సమాజానికి తన వంతుసాయం చేసే సేవకునిగా కూడా చూడాలనుకున్నారాయన. ఆయన కోరికతో పాటు ప్రకాశ్ లక్ష్యం కూడా నెరవేరినందుకు మనం కూడా సంతోషిద్దాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘నాపై అధికారుల ప్రోత్సాహంతోనే ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్’ (ఐఎసిపి) వారికి నా ప్రాజెక్ట్ వివరాలు పంపాను. వారు నా సేవల్ని గుర్తించి ‘కమ్యూనిటీ పోలీస్’ అవార్డు ఇచ్చారు. గత వారంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన 120 ఐఎసిపి సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కడినే వెళ్లాను. మూడురోజులపాటు జరిగిన ఆ సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా 162 దేశాల నుంచి 1600మంది పోలీసులు వచ్చారు. ఈ అవార్డుకోసం 400మంది నామినేషన్లు వచ్చాయి. మూడురోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రజల రక్షణకోసం పోలీసులు ఎదుర్కోవాల్సిన సవాళ్ల గురించి విస్తృతమైన చర్చలు జరిగాయి’’. - ఆర్. ప్రకాశ్, సీఐ, గోదావరిఖని -
కారుణ్య బంధం
ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే! ప్రతి ఒక్కరికీ ఒక మంచి రోజు ఉంటుందని సామెత. రీనా లాంటి వాళ్లు ఉంటే.. ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే... ఎవ్రీ డే! ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ మంచిరోజే... మనుషులకైనా, శునకాలకైనా! రీనా... వీధికుక్కల్ని చేరదీస్తుంటారు. అక్కడితో అయిపోలేదు. పెంపుడు కుక్కల కోసం... డే కేర్ సెంటర్ నడుపుతున్నారు. ‘వి కేర్ యానిమల్’ అనే సంస్థని కూడా పెట్టారు. కుక్కలపై రీనా ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే... ‘తనను పెళ్లిచేసుకునే అబ్బాయికి కుక్కలంటే ప్రేమ ఉండాలి’ అని కండిషన్ పెట్టే వరకు!! ఈ కండిషన్ వెనుక, కారుణ్యం వెనుక ఉన్న కథే... ఈవారం ‘జనహితం’. పెంపుడు జంతువులను ప్రేమతోసాకి, ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారు సెలబ్రెటీలనుంచి సామాన్యుల వరకూ చాలామందే ఉన్నారు. అయితే వీధికుక్కల్ని చేరదీసి వాటి హక్కులకోసం పోరాడేవారు మాత్రం చాలా అరుదు. రీనా ఆ కోవలోకే వస్తారు. ‘‘నేను తొమ్మిదోతరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు స్కూలుకి వెళుతుంటే రోడ్డు పక్కనే పడుకొన్న కుక్కమీదకు ఓ కారు దూసుకొచ్చింది. కారు కుక్క దగ్గరగా రాగానే...స్టాప్...స్టాప్ అంటూ గట్టిగా అరిచాను. అయినా కారు డ్రైవర్ వినిపించుకోకుండా కారుని కుక్కపై నుంచి పోనిచ్చేశాడు. అయితే అప్పటికే నేను కారు నెంబరు నోట్ చేసుకున్నాను... స్కూలు బ్యాగు పక్కన పెట్టి చనిపోయిన కుక్కని నేను, నా స్నేహితులు కలిసి పక్కకు లాగాము. వెంటనే బిఎస్ఎన్ఎల్ కస్టమర్‌కేర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. వాళ్లు పీపుల్ ఫర్ ఏనిమల్(పిఎఫ్ఎ) నెంబర్ ఇచ్చారు. పిఎఫ్ఎకి ఫోన్ చేస్తే వాళ్లొచ్చి చనిపోయిన కుక్కను తీసుకెళ్లి పోస్టుమార్టం చేసి ఖననం చేశారు. నేనిచ్చిన కారు నంబరు తీసుకుని కేసు ఫైల్ చేశారు. కారు నడుపుతున్నవ్యక్తి గవర్నమెంటు అధికారి కారు డ్రైవరు. ఈ కేసు వల్ల ఆర్నెల్లు తిరక్కుండానే అతని ఉద్యోగం పోయింది. అప్పటికిగాని నాకు కోపం తగ్గలేదు’’ అంటూ రీనా ఏడేళ్లకిత్రం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటున్నప్పుడు మూగజీవులకు ఆమె మనసులో ఉన్న స్థానం ఎంతటిదో అర్థమవుతుంది. తన జీవితం కుక్కల క్షేమం కోసమే అంటోన్న రీనా చెప్పిన వివరాలివి.. శునక సంరక్షణకోసం పనిచేసే స్వచ్ఛందసంస్థలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా...రోజు రోజుకీ పెరిగిపోతున్న కుక్కల సంఖ్యకు తగ్గట్టు ఆ సేవల్ని పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోడుప్పల్ దగ్గర శ్రీలక్ష్మినగర్ కాలనీలో ఉండే రీనా తను డిగ్రీ చదువుతున్న సమయంలో ‘వి కేర్ ఏనిమల్’ అనే సంస్థని స్థాపించి ఇంటిదగ్గరే కుక్కలకోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక పక్క చదువు మరో పక్క కుక్కల పెంపకం...తనకు చేతనైనంత మేరకు రెండింటికీ న్యాయం చేసింది. ‘‘నాన్న లింగారావు ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ విమల గృహిణి. చెల్లి, తమ్ముడు...అందరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టమన్నమాట. ఎంత ఎక్కువంటే...స్కూలు నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఓ పదికుక్కలు వెంటే వచ్చేవి. ఇంటర్ అయ్యేవరకూ వీధి కుక్కలకు హానీ చేయకూడదంటూ కనిపించినవారికల్లా చెబుతుండేదాన్ని. డిగ్రీలో చేరాక కుక్కల కోసం సమయం కేటాయించే అవకాశం ఏర్పడింది. దాంతో షెల్టర్ ఏర్పాటు చేశాను. చాలామంది దూరప్రాంతాలకు వెళ్లాల్సివచ్చినపుడు తమ పెంపుడు కుక్కల్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి కుక్కలకు డేకేర్లాంటి సదుపాయం కూడా ఏర్పాటు చేశాను. గాయాలపాలైన వీధికుక్కల్ని తీసుకొచ్చి చికిత్స చేయించి వాటికి పిల్లలు పుట్టకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించి షెల్టర్‌లో పెట్టుకుని పెంచేదాన్ని’’ అని చెప్పారు రీనా. వీధి కుక్కలకు వైద్యం, పెంపుడు కుక్కలకు డేకేర్ సదుపాయం ఏర్పాటు చేసి ఉన్నంతలో కుక్కలకు సేవ చేసుకుంటున్న రీనాకు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. కుక్కల్లో పిల్లల తల్లులు ఆహారం లేక చాలా ఇబ్బంది పడతాయని అలాంటివి ఎక్కడైనా కనిపిస్తే తన దగ్గర వదిలేయమని ఒక ప్రకటన ఇచ్చింది. అప్పుడు మొదలైంది అసలు కథ. పాలు తాగించి...పక్కనే ఉండి ‘‘నేనిచ్చిన ప్రకటన చూసి జిహెచ్ఎమ్సివాళ్లు ఓ నలభైకుక్కల్ని తీసుకొచ్చి నాకప్పగించారు. వాటివెంట నెలల పిల్లలతో పాటు రోజుల వయసున్న బుజ్జి బుజ్జి కూనలు కూడా ఉన్నాయి. తల్లికుక్కలకు కడుపునిండా అన్నం పెట్టి పిల్లలమధ్య వదిలేస్తే ఒక్క కుక్క కూడా పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. విషయం ఏంటంటే... ఆ పిల్లలేవీ ఆ కుక్కలకు పుట్టినవి కావు. దాంతో పాలులేక పిల్లలు అరవడం మొదలెట్టాయి. వెంటనే మెడికల్షాపుకెళ్లి పాలడబ్బాలు కొనుక్కొచ్చి వాటికి పాలుతాగించాను. ఓ పదిరోజులు కాలేజి ఎగ్గొట్టి ఆ పిల్లలమధ్యే గడిపాను. తల్లికుక్కల్ని బ్లూక్రాస్‌కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి బయట వదిలేశాను. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక బయటికి పంపించాను. అలా ‘వి కేర్ ఏనిమల్’ని ఛాలెంజ్‌కి తీసుకుని నడిపించాను. అయితే భవిష్యత్తులో కుక్కల సంరక్షణకోసం పటిష్టమైన సంస్థని ఏర్పాటు చేయడానికి కావాల్సిన శిక్షణ, జ్ఞానం అవసరమని గుర్తించి ‘పీపుల్ ఫర్ ఏనిమల్’ ఆధ్వర్యంలో కొంత శిక్షణ తీసుకున్నాను’’ అని చెప్పే రీనా ఆలోచన సేవ నుంచి పోరాటందాకా విస్తరించింది. కుక్కలకు కూడా హక్కులున్నాయంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కుక్కల హత్య... రీనా ఉండే ప్రాంతంలో ఒకరోజు వీధి కుక్క ఓ చిన్నపాపను కరిచింది. ఆ పాప సర్పంచ్ మనవరాలు కావడంతో అతను వెంటనే ఆ ప్రాంతంలోని కుక్కల్ని చంపించేశాడు. ఆ సంఘటన రీనా దృష్టికి వచ్చింది. ‘‘నాకు విషయం తెలియగానే చెప్పలేనంత ఆవేశం వచ్చింది. పైగా ఆ కుక్కల్ని చంపిన విధానం ఎంత ఘోరం... అంటే ఆ కుక్కలన్నింటికీ మనుషుల్ని పెట్టి పాయిజన్ ఇప్పించి మరీ చంపించేశారు. ఈ సంఘటనలో ఎనభై కుక్కలు చనిపోయాయి. నేను నేరుగా ఆ నాయకుడి దగ్గరికి వెళ్లి ఏ అధికారంతో ఈ పని చేశారని అడిగాను. ‘నాకు పైనుంచి ఆదేశాలున్నాయి’ అన్నారు. కుక్కని చంపే హక్కు ఎవరికీ లేదని అతనిపై కేసు వేశాను. అయితే ఆ తర్వాత నాకు అర్థమైందేమిటంటే... కుక్కల్ని చంపడం నేరమన్న విషయం చాలామందికి తెలియదని’’ రీనా చెబుతున్నప్పుడు తనకళ్లలో చెమ్మ కనిపించింది. ‘‘వీధిలో కుక్కలు లేకపోతే రాత్రిపూట ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. రాత్రివేళ కుక్క అరిచే అరుపు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే కుక్క మనల్ని కరిస్తే దాన్ని చంపేటంత కోపం వస్తుంది. ఎందుకంత కోపం... దానికి ఓ రెండు టీకాలు వేయిస్తే పోయేదానికి చంపడందేనికి’’ అని ప్రశ్నిస్తున్న రీనా ఆవేదనలో అర్థం ఉంది. మన ఇంటిముందు పడుకున్న ఓ వీధికుక్క అరుపు దాని ఆకలిని కాదు... తన కావలిని చూపిస్తుందని అర్థమైనవారికి రీనా బాధ కూడా అర్థమవుతుంది. ‘‘నన్ను పెళ్లిచేసుకునే అబ్బాయికి కుక్కలంటే ప్రేమ ఉండాలి’’ అని కండిషన్ పెడుతున్న ఈ శునకప్రేమికురాలి కోరిక నెరవాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: పి. మోహన్ వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్... భవిష్యత్తులో రీనా చేయాలనుకుంటున్న కార్యక్రమాలు చాలా పెద్దవి. సొంతంగా భూమి కొనుక్కుని వీధి కుక్కలకోసం పెద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానికోసం ‘పీపుల్స్ ఫర్ ఏనిమల్’ వారి దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు. ‘వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్’లో చేరాక మూగజీవులకు సంబంధించి రీనా చాలా విషయాలు నేర్చుకున్నారు. జెన్‌పాక్ కంపెనీలో పనిచేస్తున్న రీనా ఇంట్లో ప్రస్తుతం ఓ పది వీధి కుక్కలు ఉంటున్నాయి. వాటిని చూసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వీధికుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తున్నారు రీనా. -
ప్రేమకు సేవాభిషేకం
అధరాలు, కొన్ని మధురాలు. ఇవే కదా ప్రేమలేఖల్లో ఉంటాయి! అంతే తప్ప... ‘మనవల్ల పదిమంది సంతోషంగా ఉంటే అంతకు మించిన ఆస్తి లేదు’ అని ఏ ప్రేమలేఖలోనైనా ఉంటుందా? ప్రేమికులకసలు ప్రపంచం అనేది పడుతుందా? అందులోని బతుకు సమస్యలు, మెతుకు సమస్యలు పడతాయా? పట్టవు నిజమే కానీ, బాలథెరీసా దంపతుల ప్రేమకథలో, వారి ప్రేమలేఖల్లో, ఆఖరికి వారి పెళ్లిపుస్తకంలో కూడా సామాజిక సేవే ‘సినాప్సిస్’! సేవ అంటే అదేదో ఛారిటీ అని కాదు, బాధ్యతను కూడా గుర్తుచేసేది. సేవ అంటే ఏ ఒక్క వర్గానికో చెందినది కాదు, అన్నిటికీ అతీతమైనది! కెనడా అబ్బాయి ఆండ్రీ... థెరీసాతో పాటు ఆమె ఊరిని, ఊరి సమస్యల్ని, ఊరి వెనుకబాటుతనాన్నీ ప్రేమించాడు. వరంగల్ అమ్మాయి థెరీసా... ఆండ్రీతో పాటు అతడిలో ఉన్న సేవాభావాన్ని, సామాజిక స్పృహనీ, ఔదార్యాన్ని ఇష్టపడింది. ఇద్దరూ కలిసి ఇప్పుడు... రాష్ట్రంలో నీళ్లు, బళ్లు లేని ఊళ్లకు... వికలాంగులకు, వితంతువులకు, మహిళలకు, చిన్నారులకు... అభాగ్యులకు, అసహాయులకు తమ ప్రేమను పంచుతూ వెళ్తున్నారు... ఆ విశేషాలే ఈ వారం ‘జనహితం’. విదేశాలకు ఎందుకు వెళతారు? పెద్ద చదువులు చదువుకోవడానికి. బాగా డబ్బు సంపాదించడానికి... ఇంకా అంటే గొప్ప పేరు తెచ్చుకోవడానికి. వెళ్లింది ఆడపిల్లయితే... మన దేశంలోనైనా, విదేశంలోనైనా అత్తారిల్లు చక్కదిద్దుకోడానికే సరిపోతుంది. తనవాళ్ల కోసం ఆలోచించడానికి తీరిక, అవకాశం రెండూ ఉండవు. కాని సింగారెడ్డి బాలథెరీసా మాత్రం విదేశీ అబ్బాయితో తాళి కట్టించుకున్నా... తన దేశం, తన రాష్ట్రం, తన ఊరు... అంటూ పుట్టిల్లు బాగు కోరింది. క్షేమం కోరుకోవడం వరకూ ప్రతి ఆడపిల్లా చేస్తుంది... కాని చేతల్లో చూపించడం వరకూ వస్తే... ఎవరైనా బాలథెరీసా తర్వాతే అని గర్వంగా చెప్పుకునేలా ‘బాల వికాస్’ పేరుతో సేవాకార్యక్రమాల్ని నిర్వహి స్తున్నారు. వరంగల్ జిల్లాలోని తన సొంతూరు రెడ్డిపాలెం నుంచి మొదలైన బాలథెరీసా పల్లె అభివృద్ధి ఉద్యమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఈ క్రమంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా కీసరమండలం రాంపల్లి దాయర గ్రామంలో బాలవికాస్ శాఖ నిర్మాణం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన బాలథెరీసా, ఆండ్రీలు తమ మనోభావా లను ‘సాక్షి’తో పంచుకున్నారు. నలభై ఏళ్లక్రితం బాలథెరీసా కెనడా వెళ్లి అక్కడి అబ్బాయిని పెళ్లిచేసుకుని స్థిరపడిపోయారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రెడ్డిపాలెం చాలా చిన్నగ్రామం. తండ్రి సింగారెడ్డి చిన్నపురెడ్డికి బిడ్డల్ని పై చదువులు చదివించడం తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. బాలథెరీసా రెండో అమ్మాయి. పదో తరగతి వరకూ ఊళ్లోనే చదువుకుని పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చి హిందీ పండిట్ కోర్సు చేసింది. స్కాలర్‌షిప్‌తో అమెరికాలో వెళ్లే అవకాశం రావడంతో తల్లిదండ్రుల్ని ఒప్పించి విమానం ఎక్కింది. రెడ్డిపాలెం అమ్మాయి అమెరికా వెళ్లిందని తెలియగానే చుట్టుపక్కల ఊళ్లలోని ఆడపిల్లలకు కూడా చదువు మీద శ్రద్ధ పెరిగింది. నిజమే...మనం మాట్లాడుతున్నది నలభైఏళ్ల కిందట విషయం. చిన్నపురెడ్డి తన పంటకు వాడే విత్తనాలే కాదు...సమాజానికి అందించే బిడ్డలు కూడా నాణ్యంగా ఉండాలని ఆశించాడు. ఆయన కోరుకున్నట్టే బాలథెరీసా అమెరికాలో చదువు ముగించుకుని ‘సైకలాజికల్ హ్యూమన్ రిలేషన్షిప్’ అనే అంశంపై ఫిలిప్పీన్స్‌లో ఓ ఏడాదిపాటు శిక్షణ తీసుకుంది. అక్కడికి 35 దేశాల నుంచి వచ్చిన వందమందిలో బాలథెరీసా ఒకరు. మరొకరు కెనడా నుంచి వచ్చిన ఆండ్రీ జింగ్రాస్. వీరిలో ఉన్న సేవాభావం స్నేహితులుగా మార్చింది. బాలథెరిసా ఇండియాకి తిరుగుముఖం పట్టేనాటికి అది ప్రేమగా మారింది. తర్వాత బాలథెరీసా, ఆండ్రీ పెళ్లిచేసుకుని కెనడాలో స్థిరపడిపోయారు. కెనడాలోనే ఆలోచన... ‘‘నువ్వు ఇండియా నుంచి వచ్చేటప్పుడు చిల్లిగవ్వ కూడా తెచ్చుకోవద్దు. నేను కూడా నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. ఇద్దరం కష్టపడి బతుకుదాం. మరో పదిమందిని బతికిద్దాం. అలా అంగీకారమైతేనే... విమానమెక్కు.’’ ఆండ్రీ రాసిన చివరిలేఖ సారాంశం. ఆ మాటలు బాలథెరీసాకే కాదు రెడ్డిపాలెం ప్రజలందరికీ నచ్చాయి. కుర్రాడు గట్టివాడే కాదు... గొప్పవాడు కూడా అన్నారందరూ. కెనడాలో బాలథెరీసా, ఆండ్రీ పెళ్లి చాలా సింపుల్‌గా జరిగిపోయింది. ఆండ్రీకి ‘కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎజెన్సీ’లో ఉద్యోగం వచ్చింది. బాలథెరీసా కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసుకుంటూ తన దేశానికి ఏం చేయగలదో ఆలోచించింది. పేద దేశాల అభివృద్ధి కోసం తమవంతు సాయం చేసే కెనడా వారి సాయం తన దేశానికి అందాలని కోరుకుంది. ముందు రెడ్డిపాలెంతో మొదలుపెట్టింది. ఓ పదేళ్లపాటు... స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కొందరు కెనడియన్ల సాయంతో రెడ్డిపాలెంలో ముందుగా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రైవేటు స్కూలు నిర్మాణం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిసి అక్కడ కూడా మంచినీరు, విద్యకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసింది. ‘‘నాకేమో పెళ్లయిన కొత్త. అత్తిల్లు...అక్కడి సంప్రదాయాలు అలవాటు పడడానికే ఏడాది పట్టింది. అయినా మనసంతా మా ఊరిపైనే ఉండేది. రెడ్డిపాలెంలో మంచినీరు, విద్య సౌకర్యాలు ఏర్పాటు చేశాక... ప్రపంచాన్ని జయించినంత సంతోషం వేసింది. నా భర్త నా కళ్లలోని ఆనందాన్ని చూసి... ఆయన రాసిన చివరిలేఖని మరొకసారి గుర్తుచేశారు. మనవల్ల పదిమంది సంతోషంగా ఉండడానికి మించిన ఆస్తి ఏదీ లేదన్నారు. కెనడా ప్రభుత్వ సాయాన్ని కూడా దగ్గరుండి నాకు అందించారు. అలా పదేళ్లు గడిచాక వరంగల్ జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి ఒక సంస్థని ఏర్పాటు చేయాలనుకున్నాం. 1977లో ‘బాలవికాస్’ పేరుతో బాలథెరీసా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించాం’’ అంటూ స్వచ్ఛమైన వరంగల్ యాసలో వివరంగా చెప్పారు బాలథెరీసా. ఇంతలో ఆండ్రీ మాట కలుపుతూ...ఇండియా చాలా మంచి దేశం. నేను నా ఉద్యోగంలో భాగంగా ఢిల్లీ వస్తుండేవాడిని. మొదటిసారి నా భార్యతో రెడ్డిపాలెం వెళ్లినపుడు ఆ ఊరివాళ్లంతా నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఎన్నో మర్యాదలు చేశారు. ఐ లవ్ దెమ్’’ అంటూ తన అత్తింటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారాయన. నీరు... నారు సమగ్ర గ్రామాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్న బాలవికాస్ ఇంతింతై వటుడింతయై అన్నట్టు వరంగల్ జిల్లాలోని గ్రామాలతో పాటు రాష్ర్టంలో 4500 గ్రామాల్లో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది. దీనికోసం 6000 బోర్లు వేసి 500 మంచినీటి ట్యాంకుల నిర్మాణం కూడా చేసింది. గ్రౌండ్ లెవల్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి కూడా వెనకాడకుండా ఇళ్లకు మంచినీటిని అందించింది. వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటివరకూ రాష్ర్ట వ్యాప్తంగా 530 ప్రాజెక్టులు చేపట్టింది. దీనివల్ల 11 లక్షలమందికి మంచినీరు అందుతోంది. గ్రామంలోని ప్రజల ఆరోగ్యాల్ని దృష్టిలో పెట్టుకుని నీటిసౌకర్యం, రైతుల సంక్షేమం కోసం సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ, ఎరువులు, పెట్టుబడులు, మార్కెటింగ్ అంటూ అన్నింటా రైతుకు రక్షణ కవచంలా మారింది బాలవికాస్. విద్య... వికాసం మారుమూల గ్రామాల్లో బడులున్నా... చదువుకునే పిల్లలుండరు. కారణాలు...బోలెడు. వరంగల్ జిల్లాలో 225 పాఠశాలలు బాలవికాస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు అన్నిరకాల సౌకర్యాలతో దాదాపు 8 వేల మంది విద్యార్థులు ఉచితంగా విద్యనందుకుంటున్నారు. ఇందులో భాగంగానే 400 మంది వికలాంగుల్ని చేరదీసి విద్య చెప్పిస్తోంది. ఈ మధ్యనే మొదలుపెట్టిన వితంతు సంక్షేమం కార్యక్రమంలో భాగంగా వెయ్యిమంది వితంతువుల పిల్లలకు కూడా బాలవికాస్ ఉచితవిద్య అందిస్తోంది. ముప్పైఏళ్ల వయసుకే వితంతువులైన మహిళలు వేలల్లో ఉన్నారు. సమాజం దృష్టిలో వారు సమానం కాదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో వారిని తలుపుల చాటునే నిలబెడుతున్నారు. మూడునెలల క్రితం వరంగల్‌లో బాలవికాస్ ఏర్పాటే చేసిన వితంతువుల సభకు ఆరు వేలమంది వితంతువులు హాజరయ్యారు. విద్యతో పాటు గ్రామాల్లోని మహిళ సంక్షేమం కూడా ముఖ్యమని... వారిలో చైతన్యం తీసుకొచ్చే రకరకాల పథకాలు తయారుచేసింది. పొదుపు, సహకారం, వ్యాపారం, చైతన్యం... అంటూ ఇళ్లలోని మహిళల్ని బయటికి తీసుకొచ్చి వెలుగుని చూపించే పనిలో బాలవికాస్ విజయం సాధించింది. దీని గురించి ఆ సంస్థ ఎగ్జిగ్యూటివ్ డెరైక్టర్ ఎస్. శౌరీరెడ్డి చెబుతూ... ‘‘ఇప్పటివరకూ బాలవికాస్‌లో రాష్ర్టవ్యాప్తంగా 1500 గ్రామాల్లో రెండు లక్షలమంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారు వారి గ్రామాల్లోని మిగతా మహిళల సంక్షేమం కోసం బాలవికాస్ తరపున పనిచేస్తారన్నమాట. విద్య, ఉపాధి, పొదుపు, వ్యాపారం... అన్నింటా వారికి తోడుగా ఉండి మా సంస్థ ద్వారా వారికి సాయం చేస్తుంటారు. సాయమంటే ఆర్థికసాయమొక్కటే కాదు... అభివృద్ధివైపు వారిని చెయ్యిపట్టుకుని నడిపించడం. అదే మా సంస్థ ప్రత్యేకత కూడా. మంచినీటి ట్యాంకులు మొదలు... మరుగుదొడ్లు వరకూ గ్రామస్థులే దగ్గరుండి వాటిని పరిరక్షించుకోవాలి. దానికి తగ్గ శిక్షణ, పర్యవేక్షణ మా సంస్థ సిబ్బంది చూసుకుంటారు’’ అని చెప్పారాయన. 500 ఎన్జీవోలకు శిక్షణ... సాయం చెయ్యడం కంటే... సాయపడ్డవాడితో మరొకడికి సాయం చేయించడం గొప్ప పని. బాలవికాస్ ధనవంతుడితో పేదవాడికి, పేదవాడితో నిరుపేదకు సాయం చేయిస్తుంది. అలా చేసే... పేద మహిళల నుంచి ఈ ఏడాది 40 లక్షల రూపాయలు సేకరించింది. అలా సేకరించిన డబ్బుతో వందలమంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది బాలవికాస్. వెయ్యిమందివృద్ధులకు తిండిపదార్థాలు, మోడ్రన్ విలేజ్ల నిర్మాణాల కోసం యువకులకు శిక్షణ, వితంతువు పిల్లలకు కౌన్సెలింగ్... అంటూ గ్రామాభివృద్ధి కోసం బాలవికాస్ ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. మూడు దశాబ్దాలుగా బాలవికాస్ సేవలు దేశవ్యాప్తంగా గుర్తుంపు తెచ్చుకున్నాయి. బాలథెరీసా, ఆండ్రీ జింగ్రాస్లు పట్టుదలతో సాధించిన విజయం వెనకున్న రహస్యం తెలుసుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వందల స్వచ్ఛంద సంస్థలు వరంగల్ చేరుకుని బాలవికాస్ దగ్గర శిక్షణ పొందుతున్నాయి. విజయం వరించడం ఒకెత్తు... కొనసాగించడం మరొకెత్తు... వేళ్లూనుకుంటూ విస్తరించడం బాలవికాస్ సొత్తు. పేదరికాన్ని పారదోలడంలో పేదల్ని ఎలా మమేకం చేయాలి? అనే అంశంపై ఎల్లలు దాటి వచ్చిన 500 ఎన్జీవోలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోన్న బాలవికాస్కి సలాం చెబుదాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫిలిప్పీన్సలో శిక్షణకు 35 దేశాల నుంచి వెళ్లిన వందమందిలో బాలథెరీసా ఒకరు. మరొకరు కెనడా నుంచి వచ్చిన ఆండ్రీ జింగ్రాస్. వీరిలో ఉన్న సేవాభావం వీరిని స్నేహితులుగా మార్చింది. బాలథెరీసా ఇండియాకి తిరుగుముఖం పట్టేనాటికి అది ప్రేమగా చిగురు తొడిగింది. కోర్సు పూర్తవ్వగానే బాలథెరీసా తిరిగి రెడ్డిపాలానికి వచ్చేసింది. ఏడాదిపాటు ఆండ్రీ బాలథెరీసాకి రాసిన ప్రేమలేఖలు ఇంట్లోవాళ్లతోనే కాదు, ఊరందరితో కూడా పెళ్లికి ఒప్పించాయి. ఒకటా రెండా...రోజుకో లేఖ! తెలుగమ్మాయి మెడలో ఆ కెనడా అబ్బాయి తాళి కట్టేవరకూ ఆ లేఖలు ఆగలేదు. ప్రస్తుతం వీరి కుటుంబం (ఇద్దరు కొడుకులు, కూతురు) కెనడాలోనే ఉంటోంది. మన రాష్ట్రానికి సేవలు అందిస్తోంది. -
చీకటిని ఓ చూపు చూశాడు!
ఐదేళ్ల వయసులో షాకీర్ కళ్ల ముందరి రంగులన్నీ డిజాల్వ్ అయిపోయాయి! చీకటి మాత్రమే ఒక రంగుగా మిగిలింది. ఊహ తెలిసివచ్చి, యవ్వనకాంతులీనే వేళ... చుట్టూ చీకటి! సముద్రమంత చీకటి. ఆకాశమంత చీకటి. షాకీ ర్కి వేరే మార్గం లేదు. చీకటిని ఛేదించాలి, చీల్చి చెండాడాలి. లేకుంటే జీవితమే డిజాల్వ్ అయిపోతుంది. దేవుడిచ్చిన జీవితాన్నివృధా కానీయకూడదనుకున్నాడు. దేవుడేదో ఇవ్వలేదని... వ్యధ చెందకూడదనుకున్నాడు. ఇప్పుడు షాకీర్ ఓ లైట్ హౌజ్!! జీవన సాగరయానం చేస్తున్న ఎందరో యువతీయువకులకొక దీపస్తంభం! ఈవారం ‘జనహితం’ చదవండి. షాకీర్కి ఎన్ని కళ్లున్నాయో, అవి ఎంత నిశితంగా చూస్తున్నాయో తెలుస్తుంది. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, స్పోకెన్ ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పేరుతెచ్చుకున్న 33 ఏళ్ల షాకీర్ ఉంటున్నది హైదరాబాద్ లోని అమీర్‌పేట్‌లో! సొంత ఊరు తిరుపతి. తల్లిదండ్రులకి కలిగిన ఐదుగురు సంతానంలో మూడవ బిడ్డ షాకీర్! తండ్రిది మిలటరీలో ఉద్యోగం. తల్లికి పిల్లల ఆలనపాలనే సర్వస్వం. తల్లిదండ్రులది మేనరికం అవడం వల్లనో, మరే కారణమో తెలియదు గాని షాకీర్‌కు ఐదేళ్ల వయసులోనే గ్లకోమా వ్యాధి వల్ల లోకం చీకటిమయమైంది. ఎన్నో ఆసుపత్రులు తిప్పారు. ఎంతోమంది డాక్టర్లను కలిశారు. ఇక చూపు రాదని డాక్టర్లు తేల్చిచెప్పేశారు. కుటుంబం మొత్తం షాకీర్ మీద ఆశలు వదులుకుంది. కాని వెక్కిరించిన విధిని ధిక్కరించాలనుకున్నాడు షాకీర్. చదువంటే అమితమైన ఇష్టం. ఐదో తరగతి వరకు అంధుల పాఠశాలలో చదివాడు. అటు పిమ్మట చూపున్న పిల్లలు చదివే స్కూల్‌కే వెళ్లేవాడు. పాఠాలు చూసి చదివే పరిస్థితి లేదు. స్నేహితులు పాఠాలు పెద్దగా చదివితే, రికార్డ్ చేసుకొని, వాటిని మళ్లీ మళ్లీ విని గుర్తుపెట్టుకొని పరీక్ష లకు హాజరయ్యేవాడు. అలా టెన్త్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. కంటిచూపు లేకపోతేనేం వినడానికి చెవులున్నాయి కదా! అనుకునేవాడు. అందరిలా అన్నీ చేయలేకపోయినా ఏదో చేయాలన్న కసి మాత్రం అతన్ని కుదురుగా కూర్చోనిచ్చేది కాదు. ఇంటర్మీడియెట్‌లో సైన్స్ గ్రూప్‌లో చేరాలనుకుంటే, ‘చూపులేని వాడి వి ప్రాక్టికల్స్ ఎలా చేస్తావు’ అనడిగారు. దాంతో తప్పనిసరై ఆర్ట్స్ గ్రూప్ ఎంచుకున్నాడు. ఒక దారి మూసుకుపోతేనేం మరో దారి ఉంది కదా అని బయల్దేరేవాడు షాకీర్! అతని పట్టుదలకు తగిన ప్రోత్సాహాన్నివ్వడమే అతనికి ఇవ్వవలసిన ఆస్తిగా భావించారు కుటుంబ సభ్యులు. తల్లిదండ్రుల ఆసరాతో డిగ్రీ అయ్యాక ఎం.బి.ఏ పూర్తి చేశాడు. రాష్ట్రంలోనే మొదటిసారి ఓ అంధుడు ఎం.బి.ఏ పూర్తిచేసిన రికార్డ్‌ను షాకీర్ సొంతం చేసుకున్నాడు. జీతం తీసుకోవడం కాదు... ఇవ్వాలి... డిగ్రీ పూర్తయ్యాక షాకీర్‌కు విజయవాడలోని ఓ గవర్నమెంట్ కాలేజీలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. అకౌంట్స్ చూడాలంటే కళ్లు కనపడవు. తనకోసం బ్రెయిలీ లిపిలో అకౌంట్స్ చేయలేరు. అలా రోజంతా ఖాళీగా కూర్చొని జీతాలనాడు జీతం తీసుకోవాలంటే.. చాలా గిల్టీగా అనిపించేది. దీనికితోడు చుట్టూ ఉన్నవారి వెటకారంతో కూడిన సానుభూతి... ఇంతకుమించి మంచి జీవితం తనకు రాదా అని ప్రశ్నించుకున్నాడు. తన శక్తిని తాను గుర్తించి, ప్రయోగం చేయగలిగినవాడు ఎక్కడైనా సక్సెస్ అవుతాడు అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. కాలేజీలో లెక్చరర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తే ఇంటర్వ్యూలో ‘బోర్డు మీద రాస్తావా?’అని ప్రశ్నించారు. కంప్యూటర్ జాబ్కెళితే ‘ఆపరేట్ చేయగలవా!’ అన్నారు. తన పరిస్థితికి బాధపడుతూ కూర్చోవడం కాదు, తానే పదిమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలనుకున్నాడు. హైదరాబాద్‌కు పయనమయ్యాడు. ఉదయం లేచింది మొదలు ఇంటర్నెట్ ముందు కూర్చునేవాడు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు బ్రెయిలీ లిపిలో చదివేవాడు. టాకింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాక షాకీర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. ప్రయత్నించేవాడికి నడిసముద్రంలో కూడా ఊతం లభిస్తుందనడానికి షాకీర్ జీవితమే ఒక చక్కని ఉదాహరణ. పుస్తకాన్ని స్కాన్ చేసి, టాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు అటాచ్ చేస్తే చాలు.. అందులో ఉన్న అంశాలన్నీ చక్కగా వినవచ్చు. ఈ సాఫ్ట్వేర్ అతనికి ఎంతో ఉపకరించింది. ‘‘జీవితంలో లేని దాని గురించి బాధపడటం కన్నా, ఉన్నవాటితో ఏం చేయగలమో ఆలోచించగలిగితే ప్రతిదానికీ పరిష్కారం దొరుకుతుంది’’ అంటాడు షాకీర్! సాఫ్ట్వేర్స్కి మోటివేటర్!! జీవితం అంటే ఏంటి? ఏం చేస్తే, ఎంత సాధిస్తే గొప్పవాళ్లమవుతాం..? ఈ తరహాలో ఎప్పుడూ ఆలోచించలేదు షాకీర్! లెక్కలు వేస్తూ, మంచి టైమ్ అదే వస్తుందిలే అని కూర్చోలేదు. నెట్ పాఠాలు వింటూ ఇంగ్లీష్ మీద పట్టు సాధించాడు. ఇంట్లోనే స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాడు. మొదట ఒకరూ ఇద్దరూ వచ్చేవారు. మెల్లగా కాలేజీలకు వెళ్లి గెస్ట్ లెక్చర్ ఇచ్చేవాడు. అక్కడి నుంచి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారాడు. ఆ తర్వాత టాప్ లెవల్ మల్టీనేషనల్ కంపెనీలకు మోటివేటర్‌గా మారాడు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అనడానికి షాకీర్ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు. జీవితంలో చీకటిని మాత్రమే చూసిన షాకీర్ ఎంతోమందిని వెలుగులోకి ఎలా తీసుకురావాలో తెలుసుకున్నాడు. ఎలా మాట్లాడాలి, ఎలా పని విభజన చేయాలి, టీమ్‌ను ఎలా లీడ్ చేయాలి, లీడర్‌గా ఎలా ఎదగాలి.. ఇలా ఎన్నో లక్ష్యాలకు మార్గాలు చూపాడు షాకీర్! ఇప్పుడు ఎన్నో కంపెనీలకు షాకీర్ మోటివేటర్! విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మారిన ప్రయాణం ఇలా అనుకోని మలుపు తిరిగింది. ఐటి, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా సంస్థల్లో ట్రైనింగ్ ప్రారంభించాడు. సొంతంగా ‘ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్’ ప్రారంభించాడు. నిష్ణాతులైన మెమరీ ట్రైనర్స్‌ని కలిశాడు. ‘‘మనకు తెలియంది నేర్చుకుంటూ ఉండాలి. పదిమందికి నేర్పుతూ ఉండాలి’’ అంటాడు. ‘‘జ్ఞానం అందరికీ ఉంటుంది. కాని ఆ జ్ఞానాన్ని లక్ష్యానికి అనుగుణంగా మలుచుకోవాలి. నేను ఏర్పాటుచేసిన ఎంపవర్ని ఒక ఎంపైర్‌గా మార్చాలి. అంత ర్జాతీయ స్థాయిలో పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు కండక్ట్ చేయాలన్నవి నా లక్ష్యాలు. సమస్య ఉందని ఆగిపోకూడదు. సమస్యను సైతం సవాల్‌గా తీసుకునే ధైర్యాన్ని పెంచుకోవాలి. అందరూ ఎంప్లాయ్ కావాలనుకుంటే ఎంప్లాయర్ ఎవరు అవుతారు? ఈ విధంగా ఆలోచించగలిగితే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది’’ అంటాడు ఉద్వేగంగా షాకీర్! షాకీర్ వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా క్లాస్‌లు తీసుకోవడమే కాదు పుస్తకాలూ రాస్తుంటాడు. తన కాళ్ల మీద తను నిలబడ్డాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పడమే కాదు అమ్మాయి ఇష్టాన్నీ కనుక్కున్నాడు. ఇప్పుడు షాకీర్‌కు పెళ్లయి నాలుగు నెలలు అవుతోంది. షాకీర్ ఇంటర్మీడియెట్ నుంచే ఖురాన్ని బ్రెయిలీ లిపిలో రాయడం మొదలుపెట్టాడు. రోజులో పది గంటల సమయాన్ని దీనికోసమే కేటాయించేవాడు. అలా ఖురాన్‌లోని 60 భాగాలు బ్రెయిలీ లిపిలో రాశాడు. దీంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదైంది. ఈ సందర్భంగా నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ని కలిసినప్పుడు ‘‘సముద్రంలో ఓడలకు దారి చూపే లైట్ హౌజ్ లాంటి వాడివి నువ్వు. నీలాంటి వాళ్లే ఈ దేశానికి అవసరం’’ అని అభినందించారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. అన్నీ ఉన్నా కష్టాల సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాం అని భావించే ఎంతో మందికి... షాకీర్ లాంటి వ్యక్తుల శ్రమ, తపనలే ఆదర్శం. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆత్మవిశ్వాసం పెంచారు మాది వైజాగ్! మా కాలేజీలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వర్క్‌షాప్ నిర్వహించారు. అందులో షాకీర్సార్ చెప్పిన విషయాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. చదువు పూర్తి కాగానే శిక్షణ కోసం షాకీర్ సార్ దగ్గర చేరాను. ఇప్పుడు నాలో ఏ పని అయినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ పెరిగింది. త్వరలో ఉద్యోగంలో చేరబోతున్నాను. - భార్గవ్, షాకీర్ స్టూడెంట్ నా అదృష్టం మాది చిత్తూరు. పదోతరగతి వరకు చదువుకున్నాను. మా పెద్దలు ఈ సంబంధం తీసుకువచ్చినప్పుడు కొంచెం తటపటాయించిన మాట నిజం. ఈయన ఆశయాలు విన్నాక నాకు అద్భుతం అనిపించింది. ఆ ఆశయాలకు సపోర్ట్‌గా నిలిచే అదృష్టాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడని భావించాను. - షబానా, షాకీర్ భార్య నిరంతర శ్రమ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను ఇంటర్నెట్ ద్వారా చదువుతూ, వింటూ అందులోని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐదు వందలకు పైగా క్లాసులు తీసుకున్నాను. నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను. - షాకీర్ -
చైనాకు ఇచ్చేస్తా...
పదేళ్లుగా ఫైట్ చేస్తున్నారు యెనిశెట్టి సాంబశివరావు. కేంద్రానికి లేఖల మీద లేఖలు రాశారు. ప్రధానికి సైతం విన్నవించుకున్నారు. మంత్రుల కాళ్లూ గడ్డాలూ పట్టుకున్నారు. అయినా పని కాలేదు! ఇప్పుడాయన వయసు 72 ఏళ్లు. అయినా ఫైటింగ్ స్పిరిట్ తగ్గలేదు. ఈ వయసులోనూ తన ఆశయసాధన కోసం... ఎక్కిన మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఒకే ఒక్కడై జనాన్ని జాగృతం చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ రిటైర్డ్ ప్రొఫెసర్‌కి ఏం కావాలి? ‘ఏమీ వద్దు, నేనే ఇస్తా’నంటున్నారు! గాంధీజీ తత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తే... తన సర్వస్వాన్నీ ధారపోస్తానంటున్నారు! కాదంటే చెప్పండి, చైనాకు ఇచ్చేస్తానంటున్నారు!! మహాత్ముడి సమగ్ర తత్వబోధనకు... దేశంలో ఒక్క విశ్వవిద్యాలయమైనా లేకపోవడంపై సాంబశివరావు ప్రకటించిన సత్యాగ్రహమే ఈవారం ‘జనహితం’! ఎల్‌కెజి క్లాస్‌కి వెళ్లి జీ ఫర్...అనగానే పిల్లలందరూ‘గన్’ అనే స్థాయికి ఎ‘దిగాయి’ ప్రపంచ పరిస్థితులు. అందుకేనేమో చైనా దేశం గన్ స్థానంలో గాంధీజీని పెట్టాలనుకుంటోంది! అవును... మహాత్మాగాంధీ ప్రబోధించిన అహింసా మార్గాన్ని తమ పాఠ్యపుస్తకాల్లో చేరుస్తున్నట్లు ఇటీవల చైనా చేసిన ప్రకటన చాలామంది భారతీయుల్ని ఆలోచింపజేస్తోంది. ‘‘నేటితరం పిల్లలకు గన్ గురించి తెలిసినంత వివరంగా గాంధీ గురించి తెలియడం లేదు. పోరాటం అంటే హింస అని పసిమనసుల్లో నాటుకుపోడానికి కారణం...పాఠ్యపుస్తకాల్లో గాంధీకి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే’’ అంటూ ఆవేదన చెందుతున్నారు ఓ పెద్దాయన. గాంధీతత్వం గురించి విద్యార్థులకు తెలియజేయడమే ధ్యేయంగా మన దేశంలోనూ...అదీ మన రాష్ర్టంలో పోరాటం చేస్తున్న ఆ పెద్దాయనే...గుంటూరు జిల్లాకి చెందిన యెనిశెట్టి సాంబశివరావు. ‘మహాత్ముని మైక్’ పేరుతో ఆయన చెబుతున్న మాటల్ని చెవులు కాస్త పెద్దవి చేసుకుని వింటే ఆయన అభిప్రాయాలతో మనమూ ఏకీభవిస్తాం. ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ‘‘నాలుగు మంచి మాటలతో సమస్యలు పరిష్కరించుకోవాల్సిన ప్రతిచోట హింస రాజ్యమేలుతోంది. దేశాలు, ప్రాంతాల మధ్య వైరాలు పెరుగుతున్నాయి. రానురాను మనుషుల మధ్య ప్రేమానురాగాలు, మైత్రీ సంబంధాలు తగ్గుతున్నాయి. అందుకే మన జాతిపిత చెప్పిన అహింసా మార్గాన్ని ప్రపంచ పటంలో చాలాదేశాలు అనుసరించడానికి నడుం బిగించాయి... ఒక్క మన దేశం తప్ప! అందుకే 2004లో ‘మహాత్మాగాంధీ తత్వ విశ్వవిద్యాలయ ఆకాంక్ష సమితి’ ఏర్పాటు చేశాను. మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో గాంధీ విశ్వవిద్యాలయాలున్నాయి. అయితే ఏం లాభం? గాంధీతత్వంపై బోధించే అధ్యాపకులు పదిమందికంటే ఎక్కువ లేరు. గ్రీకులు సోక్రటీస్ ఐడియాలజీని ఏథెన్స్ విశ్వవిద్యాలయంలో ప్రచారం చేశారు. నలంద, తక్షశిల నాటి నాగార్జున విశ్వవిద్యాలయాలు బుద్ధుని బోధనలను విశ్వవ్యాప్తం చేశాయి. దీనివల్ల థాయ్‌లాండ్, కంబోడియా, ఈజిప్టు, మలేషియా వంటి దేశాల్లో బుద్ధుని బోధనలు విస్తారంగా ప్రచారం జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన చైనా మన గాంధీ మార్గాన్ని, తత్వాన్ని ప్రచారం చేసేందుకు గాంధీజీ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తోంది. మరి అలాంటప్పుడు మన దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో అవిశ్రాంత కృషి చేసిన బాపూజీ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఓ ప్రత్యేక యూనివర్శిటీని మనం ఎందుకు ఏర్పాటు చేయకూడదన్నదే నా ప్రశ్న’’ అంటున్నారు సాంబశివరావు. గొంతెత్తి చాటినా... ‘‘మా గుంటూరు జిల్లా వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడితో మా సమితి చేస్తున్న పోరాటం గురించి వివరంగా చెప్పేవాడిని. అందరూ నా ఆలోచనను మెచ్చుకుని తప్పకుండా చేద్దామని అనేవారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లలేదు. దాంతో నేను నేరుగా ప్రధానమంత్రికి ఉత్తరాలు రాయడం మొదలెట్టాను. మా సమితి అధ్యక్షులు గ్రంథి సుబ్బారావు, కళ్ళం హరనాధరెడ్డిగారు... ఇంకా చాలామంది నాతో చేయి కలిపి వారి వంతు కృషి చేస్తున్నారు. గాంధీ పేరుతో ఒక విశ్వవిద్యాలయం స్థాపించి చేతులు దులుపుకోవడం కాకుండా మొత్తం మన విద్యావిధానాన్నే మార్చేయాలి. గాంధీజీ అనుసరించిన మార్గం, ఆయన సూచించిన ఆర్థిక సంస్కరణలు, లౌకికవాదం, సమానత్వాన్ని గురించి ఒకటో తరగతి నుంచి కళాశాల విద్య వరకూ పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. అలాగే కళాశాల పాఠ్యాంశాల్లో గాంధీయిజం గురించి ప్రత్యేకంగా బోధించడం వల్ల యువతకు ఆలోచనశక్తి పెరుగుతుంది. మానసికంగా ఎదగడానికి, సమస్యలకు ఎదురు నిలబడి శాంతియుతంగా పరిష్కరించడానికి గాంధీ భావజాలాన్ని మించిన పాఠం మరొకటి ప్రపంచంలో ఎక్కడ వెదికినా దొరకదు. నేటితరం విద్యార్థులకు గాంధీ అంటే ఓ తాతగా మాత్రమే తెలుసు. అహింసతో ప్రపంచాన్ని జయించిన ఓ తత్వవేత్తగా గాంధీజీని వారికి పరిచయం చేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. గాంధీ అంటే ఎవరు? అని భవిష్యత్తరాలు అడగకముందే మేలుకొని ఆయన తత్వం గురించి బోధన మొదలవ్వాలి’’ అని హెచ్చరిస్తున్నారు సాంబశివరావు. గాంధీతత్వంపై పిహెచ్డి... ‘‘గుంటూరు జిల్లా మేడికొండూరు దగ్గర పేరేచర్ల గ్రామం మాది. నాన్న సుందరయ్య వ్యాపారం చేసేవారు. నేను కళ్లు తెరిచేనాటికి అమ్మ కన్ను మూసింది. అప్పటి నుంచి మా మేనత్త, నాయనమ్మలు నన్ను పెంచి పెద్ద చేశారు. నాన్న కోరిక మేరకు నేను పై చదువులు చదువుకుని అధ్యాపకుడిని అయ్యాను. చీరాల, హిందూపురం, మార్కాపురం డిగ్రీ కళాశాలల్లో ఆంధ్ర అధ్యాపకునిగా, ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేసి 1999లో హెచ్ఓడిగా ఉద్యోగ విరమణ చేశాను. చిన్నప్పటి నుంచి స్వాతంత్య్రపోరాటయోధుల జీవితచరిత్రలు చదివి... వారి భావనలకు బాగా ఆకర్షితుడినయ్యాను. అందులో భాగంగానే గాంధీయిజం నా జీవితంలో భాగమైపోయింది అందుకే కావొచ్చు... తోటివారంతా రకరకాల సబ్జెక్టులపై పిహెచ్‌డిలు చేస్తుంటే ఆయన గాంధీతత్వంపై పిహెచ్డి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం మొదలెట్టారు. ‘విద్యార్థి మార్గదర్శిని’, ‘అభ్యుదయ వాదులారా ఏకం కండి’ పేరుతో పుస్తకాలను రాసి ఆ మహాత్మునికి అంకితం ఇచ్చారు. వార్తల ఆధారంగా... పదేళ్ల కిందటి వరకూ సైకిల్‌పై నగరమంతా తిరుగుతూ సభలు, సమావేశాలున్నచోట గాంధీజీ సిద్ధాంతాలకు సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చేవారు సాంబశివరావు. గాంధీతత్వం గురించి ఆయన చెప్పే విషయాల్ని జనం చాలా ఆసక్తిగా వినేవారు. ‘‘అది నా గొప్పతనం కాదు... ఆ మహాత్ముడు ఎన్నుకున్న మార్గం వెనకున్న శక్తి అలాంటిది’’ అంటారాయన. అంత శక్తిమంతమైనది కనుకే ప్రపంచం మొత్తం ఆయన సిద్ధాంతాలను గౌరవించింది. మనదేశం తప్ప అన్ని దేశాలు బాపూని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. గాంధీజీ మనకి కేవలం తాతగా మాత్రమే మిగిలిపోతారేమోనన్న సాంబశివరావు భయం వెనకున్న వాస్తవాన్ని గుర్తించి, ఇకనైనా గాంధీయిజాన్ని మన మనసులలోకి ఆహ్వానిద్దాం. ఆచరణకు సహకరిద్దాం. మన గడ్డపై గాంధీజీ తత్వ విశ్వవిద్యాలయానికి పునాది పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. - జి. వేణుగోపాల్, ‘సాక్షి’ ప్రతినిధి, గుంటూరు ఫొటోలు: వై. వెంకటేశ్వర్లు ఈ ఇల్లు ఉచితం! ‘‘గుంటూరు జిల్లాలోని కొండవీడు కోటల పక్కనున్న 60 ఎకరాల ప్రభుత్వ భూమిలో మహాత్మాగాంధీ తత్వ విశ్వవిద్యాలయం స్థాపిస్తే గనక నాకున్న యావదాస్తి దానికోసం రాసివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే గాంధీ మహాత్మునికి సంబంధించిన ఎంతో విలువైన గ్రంథాల కలెక్షన్ కూడా ఇస్తాను. ‘సుందర చక్రవర్తి మందిరం’ పేరుతో ఉన్న నా ఇల్లు మూడుకోట్ల విలువ చేస్తుంది. ప్రభుత్వం కోరితే నా ఇంటిని విశ్వవిద్యాలయానికి పాలనాభవనంగా సమర్పిస్తానని నా వీలునామాలో పేర్కొన్నాను. ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నా ఆశయం వెనకున్న ఆలోచనను మన్నించి మన రాష్ట్రంలో గాంధీతత్వాన్ని బోధించే విశ్వవిద్యాలయ నిర్మాణం చేపడితే సరే సరి. లేదంటే చైనా ప్రభుత్వం కట్టబోతున్న విశ్వవిద్యాలయానికి నా ఆస్తిని ఇచ్చేసి ఆ మహాత్ముని రుణం తీర్చుకుందామనుకుంటున్నాను’’ - సాంబశివరావు -
హరేకృష్ణ ఉద్యమం అక్షయం... అమృతం
అక్షయపాత్ర... మహాభారత కాలం నాటిది. ధర్మరాజు దగ్గర ఉండేదంటారు. ఇప్పుడు కనుక ఉంటే ప్రభుత్వాలకు... ‘ఆహార భద్రత బిల్లు’ పెట్టే అవసరం ఉండకపోయేది. అమృతం... భాగవతకాలం నాటిది. సాగరమథనంలో బయటపడిందంటారు. ఇప్పుడు కనుక ఉంటే శాస్త్రవేత్తలకు... మృత్యువును జయించే ప్రయోగాలు తప్పివుండేవి. ఒకవేళ ఉన్నా... అక్షయం, అమృతం.... నిరుపేద బడిపిల్లలకు... అసుపత్రులలోని రోగుల సహాయకులకు... అందుబాటులోకి వచ్చేవంటారా? చెప్పలేం, డౌటే! కానీ ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇస్కాన్ వారి ‘హరేకృష్ణ ఉద్యమమే’ లేకుంటే... లక్షలాదిమందికి పిల్లలకు, పెద్దలకు రోజూ ఇంత... అక్షయ భోజనం, అమృత భోజనం దొరికేవి కావు. ఇంతకన్నా ‘జనహితం’ ఏముంటుంది?! ఏ ఆధ్యాత్మిక సంస్థయినా ఏం చేస్తుంది? గుడి కడుతుంది.. సకల జీవరాశికి శుభాలు జరగాలని పూజలు చేసి ప్రసాదాలు పెడుతుంది.. మహా అయితే, అడపాదడపా అన్నదానం చేస్తుంది. కానీ, ‘హరేకృష్ణ ఉద్యమం’ అంతటితో ఆగడం లేదు. ఆధ్యాత్మికతకు సేవాతత్పరతను జోడిస్తోంది. పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టే పక్కా కార్యాచరణకు దిగుతోంది. చదువుల తల్లి కటాక్షానికి బడుగుల బిడ్డలు పాత్రులవ్వాలంటే.. ముందు ఆకలిని బడి దరిదాపుల్లోంచి తరిమికొట్టాల్సిందేనని త్రికరణ శుద్ధిగా నమ్ముతోంది. అందుకే, ‘అక్షయపాత్ర’ను చేపట్టి.. ప్రభుత్వబడుల్లో మధ్యాహ్న వేళ వేడివేడిగా పుష్టికరమైన ఆహారం వడ్డిస్తూ... ఇటు ప్రభుత్వ సాయానికి అటు ప్రైవేటు వితరణను జోడించి చక్కని ఫలితాలు సాధిస్తోంది. 13 ఏళ్ల ప్రస్థానం... ‘అక్షయపాత్ర’ దేశంలోని వేలాది గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న లక్షలాది మంది పేద విద్యార్థుల కడుపునింపుతోంది. ఊరు కాని ఊరిలో ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్న తమ ఆత్మీయులతోపాటు ఉంటూ నానాయాతన పడుతున్న నిస్సహాయులకు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చక్కని మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది ‘హరేకృష్ణ ఉద్యమం’. ‘అపరిమిత ఆహారంతో అపార విద్య’ ఇదే ఈ ఉద్యమ నినాదం. ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్) బెంగళూరు అనుబంధ సంస్థగా 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో హరేకృష్ణ ఉద్యమం మొదలైంది. ‘అక్షయ పాత్ర’ ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో ఉంది. 1500 మందితో ప్రారంభమై ప్రతిరోజూ 14 లక్షల మందికి భోజనం అందించే దశకు విస్తరించింది. 2020 నాటికి రోజూ 50 లక్షల మందికి భోజనం వడ్డించాలని అక్షయ పాత్ర ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. డా.వైఎస్ఆర్ ఆహ్వానంతో.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు అక్షయపాత్ర మన రాష్ట్రంలో సర్కారీ బడి పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. 2008 అక్టోబర్ 13న ప్రారంభమైన ‘అక్షయ పాత్ర’ కార్యక్రమం క్రమంగా కొత్తబడులకు విస్తరిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా హరేకృష్ణ ఉద్యమ సేవకులు సుశిక్షిత సైన్యంగా కదులుతున్నారు. ఈ అద్భుత కృషి వెనుక 15 మంది పూర్తికాల సేవకుల కఠోర శ్రమ, 180 మంది సిబ్బంది దీక్ష దాగి ఉన్నాయి. వందలాది సర్కారీ బడులు, అనేక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో రోజూ 88 వేల మందికి పుష్టికరమైన ఆహారం అందుతోంది. పటాన్‌చెరులోని అద్దె షెడ్లలో ఏర్పాటైన అత్యాధునిక సెంట్రల్ కిచెన్ నుంచే.. వందకిలోమీటర్ల దూరాన ఉన్న బడిలో బాలలకు కూడా.. అప్పుడే వండినట్టుండే పొగలు కక్కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. తృప్తికరం.. మెదక్ జిల్లాలో 11 మండలాల్లోని 439 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ‘అక్షయ పాత్ర’ కార్యక్రమం ద్వారా రోజూ మధ్యాహ్న భోజనం అందుతోంది. 61,348 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ భోజనం ఇష్టంగా తింటూ చదువులపై ధ్యాసపెడుతున్నారు. మధ్యతరగతి పిల్లలు ప్రైవేటు కాన్వెంట్లలో ఉదయం ఎప్పుడో వండిన అన్నం క్యారియర్లలో తెచ్చుకొని తింటూ సరిపెట్టుకుంటున్న పరిస్థితుల్లో పేదపిల్లలు ప్రభుత్వ బడుల్లో వేడి వేడిగా భోజనం చేయడం ‘అక్షయపాత్ర’ పుణ్యమే. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ‘అక్షయ పాత్ర’ 123 కోట్లమందికి భోజనం వడ్డించింది. ప్రతిరోజు 13లక్షలమంది విద్యార్థుల పళ్లాల్లో అన్నం పెడుతున్న అక్షయపాత్రకు దాతలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నారు. 1,29,045 మంది దాతల సాయంతో నడుస్తోన్న ఈ పాత్ర తన పరిధిని మరింత విస్తరింపజేసుకోవడానికి కొత్త పథకాలను పరిచయం చేస్తోంది. అదే ‘భోజనామృతం’. పటాన్చెరు కిచెన్‌లో... తెల్లవారు జామున 4 గంటల నుంచే పటాన్చెరు కిచెన్‌లో వంటల హడావుడి ప్రారంభమవుతుంది. అన్నం, సాంబారు/పప్పుతోపాటు వారానికోరోజు అనేక స్పెషల్వంటకాలను విద్యార్థులకు అందిస్తున్నారు. వారానికోసారి వెజ్ బిర్యానీ, పులిహోర, వేరుశనగ ఉండలు, మురుకులు, బిస్కెట్లు, అరటి/బత్తాయి వంటి పండ్లు, శనగలు ఇస్తున్నారు. 20 నిమిషాల్లో క్వింటాల్ బియ్యాన్ని ఉడికించే సామర్థ్యం ఉన్న 10 రైస్ బాయిలర్లున్నాయి. శుచిలోనూ, శుభ్రతలోనూ ఎక్కడా రాజీ లేకుండా వేలమందికి ప్రణాళికాబద్ధంగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన వంటలు సిద్ధమవుతున్న తీరు, 80 కిలోమీటర్ల దూరంలోని బడుల్లోనూ వేడివేడిగా అన్నామృతాన్ని వడ్డిస్తున్న తీరు అబ్బుర పరుస్తుంది. జీపీఎస్ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను గమనిస్తూ సమయపాలన పాటిస్తుండడం విశేషం. గతనాలుగేళ్లలో మన హైదరాబాద్‌లో 3,38,06,088 మంది విద్యార్థులకు అన్నం వడ్డించింది. రోజుకి 61వేల విద్యార్థులకు భోజనం సరఫరా చేస్తోంది. ఎందరో దాతలు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘అక్షయపాత్ర’ కార్యక్రమం నడుస్తోంది. అయితే, పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీల విరాళాలతో నడిచే ‘భోజనామృతం’ కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. ఎంఈఐఎల్ తదితర సంస్థలు, ఎందరో వ్యక్తులు ఆర్థికంగా దోహదపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆహారాన్ని తరలించే ప్రత్యేక వాహనాలను హెచ్‌పీసీఎల్, అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలు విరాళంగా అందించడం విశేషం. హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో సొంత భవనాల్లో ఆధునిక కిచెన్‌ను ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. - పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్ ఫొటోలు: రమేష్ ఆసుపత్రిలో ‘భోజనామృతం’! దూరప్రాంతాల నుంచి వచ్చి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న తమ బంధువులకు తోడుగా ఉంటున్న పేదల కు హరేకృష్ణ ఉద్యమం అండగా నిలుస్తోంది. ‘భోజనామృతం’ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం రోజూ 1100 మందికి మధ్యాహ్న భోజనం అందిస్తోంది. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి, నీలోఫర్ పిల్లల ఆసుపత్రి, మహావీర్ ఆసుపత్రులలోని రోగుల సహాయకులకు ప్రత్యేక బార్కోడ్ కూపన్ల ద్వారా ఆసుపత్రి ఆవరణలో భోజనామృతం వడ్డిస్తున్నారు. వీటితోపాటు నిజామాబాద్, మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రుల్లో కూడా అక్షయపాత్ర భోజనం సరఫరా చేస్తోంది. ‘మాది టెంపుల్ బేస్డ్ స్పిరిచ్యువల్ కమ్యూనిజం’! ఆకలితో అలమటిస్తున్న బాలలు చదువుపై మనసు పెట్టలేరు. విద్యపై ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా ఖర్చుపెడుతున్నప్పటికీ, అమల్లో సమస్యల వల్ల పూర్తి ప్రయోజనం నెరవేరడం లేదు. అందుకే, ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు ఐఎస్ఓ 22,000 ప్రమాణాలతో మధ్యాహ్న భోజనాన్ని అందించడంలో స్వచ్ఛందంగా మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. మెదక్ జిల్లాలోని 61,348 మంది విద్యార్థులకు, శేరిలింగంపల్లి మండలంలోని అంగన్వాడీల్లో 25,693 మందికి రోజూ పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. అంతేకాదు... వీరి సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. దాతలు స్పందిస్తే ఏడాదిలోనే ఈ కిచెన్ సిద్ధమవుతుంది. సహాయపడదలచినవారు పూర్తి వివరాలకోసం www.akshayapatra.org ను చూడవచ్చు. - సత్యగౌర చంద్రదాస, అధ్యక్షులు, హరేకృష్ణ ఉద్యమం/ అక్షయపాత్ర యూనిట్, హైదరాబాద్ -
ఎవరికి చుట్టం!
ఎక్కడ : అసెంబ్లీ పక్కన పబ్లిక్‌గార్డెన్స్ ఎప్పుడు : ఆదివారం, ఉదయం 9గంటలకు ఏమిటి : కొందరు మగవాళ్ల సమావేశం ఎందుకు : కుటుంబ వ్యవస్థను కాపాడడం కోసం ఎలా : సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా...... ఈవారం జనహితంలో పబ్లిక్ గార్డెన్స్ గేట్ లోపలికి అడుగుపెట్టాక...ఎడమచేతివైపు ఓ వంద అడుగులు వేస్తే....చింతచెట్లకింద ఓ యాభైమంది మగవాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిమధ్యలో ఓ పెద్దాయన నిలబడి తన బాధలు చెప్పుకుంటున్నాడు. ‘‘మా కోడలు మామీద 498ఎ కేసు పెడతానంటోంది. తనకి మా కొడుకుతో ఇబ్బందులుంటే....కాటికి కాళ్లు చాచుకున్న మేం బలవ్వాలా...అంటూ మొదలుపెట్టాడు’’ అతను చెప్పిన సమస్యలన్నీ విన్నాక అక్కడ కూర్చున్న వాళ్లలో ఒకతను లేచి ఆ పెద్దాయనకి సలహాలిచ్చాడు. ‘‘మీ అబ్బాయిని, కోడల్ని కూర్చోబెట్టి మంచిగా మాట్లాడండి. మీ అబ్బాయి తప్పుంటే సరిచేసుకోడానికి, అతని ప్రవర్తన మార్చుకోడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మీ కోడలి బాధల్ని కూడా విని ఆమెని సమస్యల్ని నుంచి బయటపడేయడానిక్కూడా మీరే చొరవ తీసుకోండి. మీ కోడలైనా, కూతురైనా ఒక్కసారి పోలీస్‌స్టేషన్ గుమ్మం తొక్కితే ఒకటి కాదు, రెండు కాదు.. మూడు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి.’’ అంటూ సలహా ఇచ్చాడు. అసలు ఎవరు వీళ్లంతా? ఎందుకు అక్కడికి వచ్చారో చూద్దాం... ‘‘ఎంత శక్తిమంతమైన చట్టాలున్నా... ఇంకా చాలామంది మహిళలు గృహహింసకు బలైపోతూనే ఉన్నారు. కట్నాల వేధింపులు, అనుమానంతో వేధించే భర్తలు చట్టాల్ని లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటివారిపై 498 ఎ సెక్షన్ కేసు పెడితే వారికి న్యాయం జరుగుతుంది. అలాకాకుండా... జీతం చేతికివ్వలేదని, తల్లిదండ్రుల్ని చూడమన్నాడని, చెప్పిన మాట వినలేదని పంతాలకు పోయి క్షణికావేశంలో ఈ చట్టాన్ని ఆశ్రయించడం మన దేశ కుటుంబ వ్యవస్థని అవమానపరచడమే’’ అంటూ తమ పోరాటం గురించి పరిచయం చేసుకున్నారు. ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పబ్లిక్‌గార్డెన్స్‌లో మీట్ అయ్యే ఈ బృందం...‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్)’ సభ్యులు. ముందుగా వీరంతా సెక్షన్ 498 ఎ బాధితులు. వీరంతా కలిసి ఈ సెక్షన్ దుర్వినియోగం కాకుండా కృషిచేస్తూ కుటుంబ వ్యవస్థని రక్షించడంకోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. సిఫ్ సభ్యుడు ఫెరాజ్ మాట్లాడుతూ...‘‘మహిళలపై వేధింపుల్ని అరికట్టాలన్న ఉద్దేశంతో పుట్టిన ఈ చట్టం చిన్న చిన్న ఇగోలకు కూడా పరిఆసరాగా మారడం చాలా దారుణం. ఏదో చిన్న గొడవకి 498 ఎ సెక్షన్ కింద కేసు వేసి కుటుంబాన్ని సర్వనాశం చేసుకుంటున్న మహిళలసంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబం విలువైంది... ‘‘మన దేశంలో అన్నింటికన్నా బలమైంది, విలువైంది కుటుంబమే. మహిళైనా, పురుషుడైనా కుటుంబం లేకుండా ప్రశాంతంగా బతకలేరు. క్షణికావేశంలో కుటుంబాన్ని కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు కారణాలలో 498 ఎ సెక్షన్ దుర్వినియోగం కూడా ఒకటి. రకరకాల కారణాల వల్ల భర్త నుంచి విడిపోవాలనుకుంటున్న కొందరు మహిళలు నేరుగా విడాకులకు దరఖాస్తు చేసుకోకుండా... ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. పోనీ భర్తమీద కేసు వేసి ఊరుకుంటున్నారా... అంటే ... కాదు, అతనితోపాటు తనకు కోపం ఉన్న అందరి పేర్లని రాసేస్తున్నారు. అత్త, మామ, ఆడపడచు, మరిది, బావ... అంటూ ఓ ఐదారు మందిని రోడ్డుకి ఈడుస్తున్నారు. దీనివల్ల ఆమెకొరిగేదేమీ ఉండదు. కొన్నాళ్ల తర్వాత ‘అనవసరంగా తొందరపడ్డానే’ అని బాధపడేవాళ్లూ ఉన్నారు. ఏ మహిళైనా 498 ఎ సెక్షన్‌కింద కేసు నమోదు చేస్తే భర ్తని వెంటనే అరెస్టు చేస్తారు. ఆ తర్వాత... మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా పోలీసులు నిర్దాక్షిణ్యంగా సెల్లో పడేస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న ఆడపడుచుని కూడా అరెస్టు చేయించారు. భర్త తప్పుచేస్తే అతనిమీద కేసు పెట్టాలి. అంతేకాని రక్తసంబంధీకులైన పాపానికి ఎక్కడో దేశం దాటిపోయినవాళ్లమీద కేసులు పెట్టి వారి కుటుంబాల్ని బజారుకీడ్చే హక్కు ఈమెకి ఎవరిచ్చారు? పెళ్లిచేసి నా బతుకు నాశనం చేశారనే అమ్మాయిలెంత మంది ఉన్నారో, అందులో పదోవంతు అబ్బాయిలు కూడా తమ జీవితభాగస్వాములతో ఇంచుమించు ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఎన్నోవిషయాల్లో ఎంతో పురోగమిస్తున్న మనం మన చట్టాలకు మగవాళ్ల సంక్షేమం ఎందుకు పట్టదో అర్థం కావట్లేదు. అందుకే ఎనిమిదేళ్ల క్రితం ముంబయిలో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ వెలిసింది’’ అని చెప్పారు సిఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అలీ షా. దేశవ్యాప్తంగా... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సంస్థలో 13, 500 మంది సభ్యులున్నారు. స్వచ్ఛందంగా పనిచేస్తున్నవారు ఇంతకు మూడింతలున్నారు. వీరి పోరాటం 498 ఎ చట్టం దుర్వినియోగం మీద మాత్రమే కాదు... ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ కన్నబిడ్డలతో గడిపే అవకాశాన్ని కోల్పోతున్న మగవారి కోసం కూడా. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిఫ్ సభ్యులు ఉన్నారు. మొన్నటివరకూ 498ఎ సెక్షన్‌కింద కేసు పెడితే వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. రెండేళ్లక్రితం ట్యాంక్‌బండ్‌పై మేం చేసిన పోరాట ఫలితంగా మన రాష్ర్ట హైకోర్టు కేసుని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది. కాని, ఏం లాభం... కొందరు మహిళలు కేసు పెట్టి వెనక్కి తీసుకోడానికి బేరాలాడుతున్నారు. భార్యాభర్తలమధ్య మధ్యవర్తుల పేరుతో పుట్టుకొచ్చే కొందరు పెద్దలు మరీ అన్యాయంగా డబ్బు సెటిల్మెంట్లు చేస్తున్నారు. దీనివల్ల వివాహవ్యవస్థ పైనే విరక్తి పుడుతోంది. ఇదిగో...ఇక్కడ ఉన్నవారిలో ఓ పదిమంది విదేశాల్లో స్థిరపడ్డవాళ్లున్నారు. ఈ కేసు పుణ్యాన అక్కడ ఉద్యోగం ఊడగొట్టుకుని ఇక్కడకొచ్చి పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ల భార్యలేమో ఉద్యోగాలు చేసుకుంటూ వీళ్లదగ్గర పోషణకు డబ్బులు తీసుకుంటూ హాయిగా బతికేస్తున్నారు. ఇక్కడ మా ఉద్దేశ్యం వీళ్లంతా మంచివారు, వీరి భార్యలు చెడ్డవారు అని కాదు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవడం ఎందుకు...అని!’’ అంటూ తన వాదనని వివరించారు మరో సభ్యుడు. కుటుంబం కోసం... మా పోరాటం మగవారికోసం కాదు...కుటుంబ సంక్షేమం కోసం అంటోన్న ఈ సంస్థ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఉచిత కౌన్సిలింగ్‌లు కూడా ఇస్తోంది. లోక్ అదాలత్ కింద న్యాయ సేవా సదన్‌లో ప్రీ ప్రివెన్షన్ కౌన్సిలింగ్లో పాల్గొంటోంది. కుటుంబంలో ఎవరితోనైనా సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా లోక్ అదాలత్‌ని ఆశ్రయిస్తే అక్కడ అధికారులు సమస్య పరిష్కారానికి సహకరిస్తారు. ఇలాంటి సంస్థల్ని ఆశ్రయించి కుటుంబాలను పదికాలలపాటు పచ్చగా ఉండేలా చూసుకోకుండా పోలీసుల్ని ఆశ్రయించి పొరపాటు చేస్తున్న మహిళలు కళ్లు తెరవాలని కోరుకుంటున్నారు సిఫ్ బృందం. 498ఎ చట్టం విలువైంది. శక్తిమంతమైన ఆయుధం. అయితే ఆ ఆయుధాన్ని జాగ్రత్తగా వాడాలి కాని దుర్వినియోగం చేయకూడదు. వందమంది నేరస్థులు తప్పించుకున్నా పరవాలేదు కాని... ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అన్న మన న్యాయశాస్త్ర సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని, హింసకు గురవుతున్న మహిళలకు రక్షణకవచంలా ఉన్న ఈ చట్టం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడదాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదొక్కటే కాదు... మన దేశంలో ఒక్క మహిళా చట్టాలే కాదు అన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న చట్టాలివి. భర్త కొట్టినా, బాధ్యతగా ప్రవర్తించకపోయినా, అనుమానించినా... ఎలాంటి ఇబ్బంది అయినా వాటి నుంచి బయటపడడానికి నేటి మహిళలకి 498 సెక్షన్ ఒక్కటే దిక్కు. సమస్య చిన్నదయినా, పెద్దదయినా తట్టుకునే శక్తిలేనప్పుడు ఎవ్వరూ తనకు తోడుగా నిలబడనపుడు ఆ మహిళ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం 498. ఆడ, మగ భేదాలు పక్కనపెడితే ఎవరికి అన్యాయం జరిగిందో కేసు విచారణ చేస్తేగాని చెప్పలేం. - నిశ్చల సిద్దారెడ్డి, ఎడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్ దుర్వినియోగం పెరుగుతోంది... రక్షణగా ఉపయోగపడాల్సిన చట్టాన్ని అవగాహన లేకుండా, క్షణికావేశంతో దుర్వినియోగం చేస్తున్నవారి సంఖ్య నిజంగానే పెరుగుతోంది. వాస్తవం చెప్పాలంటే నిజంగా హింసకు గురవుతున్న మహిళలు నేరాల్ని రుజువుచేయడంలో విఫలమై ఇబ్బందులు పడుతుంటే... తమ స్వార్థాలకు కేసులు పెట్టి జీవితాల్ని నాశనం చేసున్న మహిళలు కూడా మన కళ్లముందే ఉన్నారు. భార్యా, భర్త సంగతేమోగాని మధ్యలో పెద్దలు, మధ్యవర్తులు బాగుపడిపోతున్నారన్నది కూడా వాస్తవం! - పుణ్యవతి, ఐద్వా సంఘం ఉపాధ్యక్షురాలు