ప్రజలకోసం ఫస్టొచ్చారు! | Phastoccaru people! | Sakshi
Sakshi News home page

ప్రజలకోసం ఫస్టొచ్చారు!

Dec 12 2013 11:34 PM | Updated on Sep 2 2017 1:32 AM

ఆదర్శాలు అందరికీ ఉంటాయి.. కానీ ఆచరణలో ఎన్ని అమలు చేయగలం?.. చిన్ననాడు అన్నీ స్ఫూర్తికలిగిస్తాయి... అందులో ఎన్ని జీవితంలో ఆచరణలోకి వస్తాయి?

ముందుండాలని ఫస్ట్ వస్తారు ఎవరైనా.
 వెనకుండడం కోసం ఫస్ట్ తెచ్చుకున్నారు వేణుగోపాల్!
 టెన్త్‌లో స్కూల్ ఫస్ట్... డిగ్రీలో కాలేజ్ ఫస్ట్...
 ఎమ్మెస్సీలో యూనివర్శిటీ ఫస్ట్... గ్రూప్ 1లో స్టేట్ ఫస్ట్...  
 ఈ ఫస్ట్‌లన్నీ -
 ప్రజల కోసం, ప్రజల వెనుక వుండడం కోసం
 కాలే కడుపుతో,  నిద్ర లేని కళ్లతో సాధించారాయన!
 ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాణిజ్య పన్నుల అధికారిగా ఎంపికైనా...
 గ్రూప్ 1 మళ్లీ రాసి రెవిన్యూ సర్వీసును ఎంచుకున్నది కూడా...
 ఆ ప్రజల కోసమే!
 పగిలిన పలక ముక్కపై అక్షరాలు దిద్దుకుని...
 స్నేహితుల పుస్తకాలు అరువు తెచ్చుకుని...
 ఆశల్ని చంపుకుని, ఆశయాల్ని నింపుకుని...
 ప్రజాసేవకుడినై తీరాలని ప్రతిన పూనిన వేణుగోపాల్‌ను
 అంతగా ప్రేరేపించిన పరిస్థితులేమిటి?
 చదవండి... ఈవారం ‘జనహితం’లో...

 
ఆదర్శాలు అందరికీ ఉంటాయి.. కానీ ఆచరణలో ఎన్ని అమలు చేయగలం?.. చిన్ననాడు అన్నీ స్ఫూర్తికలిగిస్తాయి... అందులో ఎన్ని జీవితంలో ఆచరణలోకి వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఓసారి వేణుగోపాల్ రెడ్డి జీవితంలోకి తొంగి చూడాల్సిందే... తన జీవితంలో పేదరికం ఉంది. అడుగడుగునా కష్టాలు వెన్నాడుతున్నాయి.

ఆఖరికి బడిలో.. చదువుల ఒడిలో అన్నీ సమస్యలే.. అయినా అమ్మానాన్నల ఆశీస్సులే పెట్టుబడిగా.. అన్నదమ్ముల ఆలంబనే ఆశీర్వాదాలుగా బతుకు చిత్రంలో ఒదిగి.. సర్కారీ బడిలోనే కష్టపడి చదివి... అధికారి అయ్యారు. కడప జిల్లా బద్వేలు మండలం జాఫర్‌సాహెబ్ పల్లి అనే ఓ చిన్ని గ్రామానికి చెందిన ఆయనే గ్రూప్-1 సర్వీసులో 2006 బ్యాచ్ స్టేట్ టాపర్‌గా నిలిచి, ప్రస్తుతం రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్న మట్లి వేణుగోపాల రెడ్డి. నిండా నలభై  గడపలు కూడా లేని ఒక కుగ్రామంలో, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలోని ఆరుగురు అన్నదమ్ముల్లో నాలుగో సంతానం ఈయన. సర్కారీబడులు తప్ప చదువుకోవడానికి మరో మార్గం లేని ఆ గ్రామంలో పట్టుదలే ముందుకు నడిపిందంటూ తన జీవిత విశేషాలను సాక్షితో పంచుకున్నారు.
 
 ‘‘అడిగితే ఇంకొంత కష్టం చేసి అన్నీ కొనిస్తాడు నాయన. కానీ అది ఆయనకు ఎంత భారమో నాకు తెలుసు. పలక విరిగిపోతే, రెండు ముక్కలను ఇద్దరు అన్నదమ్ములం తీసుకునేవాళ్ళం. పుస్తకాలు కొనడానికి కూడా ఆలోచించవలసిన రోజులు అవి. స్నేహితుల వద్ద పుస్తకాలు తీసుకుని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకునేవాడిని. ఇలా పడిన కష్టం ఫలించింది. పదోతరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచాను. ఇంటర్‌లో కాలేజీలో రెండవస్థానంతో సరిపుచ్చుకున్నా, డిగ్రీలో మాత్రం మళ్లీ కాలేజీ టాపర్‌నే అయ్యా. ఎమ్మెస్సీలో కూడా యూనివర్సిటీ ఫస్టు నేనే.. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడదంతా ఓ అనుభూతిలా మిగిలింది.’ అంటున్నారాయన. నిబద్ధతతో జీవితాన్ని చిన్ననాటి నుంచి కొనసాగిస్తూ వస్తే ‘సాధ్యం’ ముంగిట ‘అసాధ్యం’ చిన్నదై పోతుందని చెబుతున్న వేణుగోపాలరెడ్డి తన జీవిత పుస్తకాన్ని నేటి యువతకు మార్గదర్శకం అయ్యేందుకు సాక్షికి ఓసారి తెరిచి చూపించారు.
 
 మొదటిసారి 2005లో గ్రూప్-1లో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ఎంపికయ్యారు. కానీ అది తన లక్ష్యాలకు తగ్గట్టుగా లేదని ప్రజాసేవకు దగ్గరలో ఉండే బాధ్యతలు నిర్వర్తించాలని మరోసారి ప్రయత్నించి 2006లో స్టేట్ టాపర్‌గా నిలిచి ఆర్‌డీఓగా బాధ్యతలు చేపట్టారు.
 
 ఎందుకనుకున్నానంటే...
 
 నేను అప్పర్ ప్రైమరీ చదువులో ఉండగా మా కుటుంబానికి ఓ ధృవపత్రం అవసరమైంది. దానికోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నాలాగే ఎందరో రకరకాల సర్టిఫికెట్ల కోసం బారులు తీరారు. ఎవరి బాధలు వారివి. అక్కడ జనం పడిగాపులు చూసి నేను ఇలాంటి ఆఫీసులో సేవకుడు కావాలని బలంగా అనుకున్నాను. అదే స్ఫూర్తి రెవెన్యూ సర్వీసెస్ కోసం నన్ను ముందుకు నడిపించింది.
 
  ఉమ్మడి కుటుంబం నేపథ్యం...
 ‘మాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉండేది. వర్షాధార వ్యవసాయం. నాన్న చిన్నకృష్ణారెడ్డి అయిదో తరగతి వరకు చదివారు. అమ్మ చెన్నమ్మ చదువుకోలేదు. ఆరుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు చదువులబాట పడితే, మరో ముగ్గురు వ్యవసాయానికి అంకితమయ్యారు. గ్రామంలో నా పెద్దన్న రాజగోపాల్‌రెడ్డి ఎం.ఏ పట్టా పుచ్చుకున్న మొదటి వ్యక్తి. మరో అన్నయ్య సూర్యనారాయణరెడ్డి బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ చదివారు. నేను తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, గణితశాస్త్రం చదివాను.

చదివిన అన్నలు, మా చదువుల కోసం వ్యవసాయానికి అంకితం అయిన సోదరులు అందించిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను’ అంటున్న వేణుగోపాల్, ఇద్దరు సోదరులు చదువు మీద కాక, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ సోదరులకు తమ వాటాగా వచ్చిన భూమిని ఇచ్చేశారు. ‘నాయన నుంచి వచ్చిన ఆస్తి వాటాను చదువుకోని నా అన్నదమ్ములకే విడిచేశాను. నాకు మంచి ఉద్యోగం ఉంది. అన్నలిద్దరూ కూడా చదువుకుని మంచిగానే బతుకు తున్నారు. అందుకే చదువుకున్న వాళ్లు ముగ్గురం మా ఆస్తులు చదువుకోని సోదరులకు ఇచ్చేశాం’ అని చెప్పుకొచ్చిన వేణుగోపాల్ తన జీవన ప్రస్థానంలో అర్ధాంగి సహకారం మరువలేనిదన్నారు.  క్రికెట్ చూడటం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉందంటున్న వేణుగోపాల్‌కి శ్రీశ్రీ, గురజాడ కన్యాశుల్కం, చలం సాహిత్యం  అభిమాన గ్రంథాలట!
 
 దిశా నిర్దేశం అవసరం...
 
  ‘ఈనాటి యువత చదువులో దిశానిర్దేశం లేకుండా ఉన్నారు. కళాశాల విద్యలోకి ప్రవేశించాక... నిర్ణీత లక్ష్యాలు ఎంచుకోవాలి. ఆ దిశగా ఎంచుకునే కోర్సులు ఉండాలి. ఏదో చదివాంలే... పట్టభద్రులు అయ్యాంలే.. అనుకుంటే  మంచి భవిష్యత్తు పొందలేరు’ అంటారు. ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యం లేని విద్యకు విలువ లేదంటున్న వేణుగోపాల్ మాటలకు విలువ ఇస్తే, యువత తామనుకున్న మార్గంలో నడవడానికి ఎన్ని కష్టాలెదురైనా వెనుకడుగు వేయరేమో!
 
 - దేవళ్ల సూర్యనారాయణ మూర్తి, సాక్షి, రాజమండ్రి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement