నలుగురి మృతదేహాలు లభ్యం
ఇంకా 12 మంది జాడ గల్లంతు
వయనాడ్: అప్పటిదాకా ఇంటినిండా 16 మంది సభ్యుల సందడితో కళకళలాడిన ఆ ఉమ్మడి కుటుంబం ఒక్కసారిగా కళతప్పింది. కొండల మీదుగా దూసుకొచ్చిన ప్రకృతి ప్రళయం కుటుంబాన్ని అమాంతం మింగేసింది. చూరల్మల కుగ్రామంలో ఆ ఉమ్మడి కుటుంబంలో 42 ఏళ్ల మన్సూర్ ఒక్కడే మిగిలాడు. విపత్తు రోజున ఊళ్లో లేకపోవడంతో బతికిపోయాడు. తన ఇంట్లో 16 మందిని కొండలు కబళించాయంటూ విలపిస్తున్నాడు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విలయానికి బలైన వారి సంఖ్య 221కి చేరినట్టు కేరళ ఆదివారం ప్రకటించింది. వాస్తవ సంఖ్య 370 దాటినట్టు స్థానిక మీడియా చెబుతోంది.
జీవనదిలో నిర్జీవ దేహాలు
వయనాడ్ తదితర తీరవాసులకు జీవనాడిగా పేరొందిన చలియార్ నది ఇప్పుడు విలయానికి గుర్తుగా మారింది. కొండచరియలకు బలైన వారి మృతదేహాలు ఆరు రోజులైనా ఇంకా నది ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి! ఘటనాస్థలి మీదుగా 40 కి.మీ.ల పొడవునా తీరం వెంట గాలింపు కొనసాగుతోంది.
సైన్యానికి సెల్యూట్.. బాలుడి లేఖ
వయనాడ్‌లో అన్వేషణ, సహాయక పనుల్లో సైన్యం కృషిని రాయన్ అనే స్థానిక చిన్నారిని కదలించింది. ‘మీరు నిజంగా గ్రేట్’ అంటూ మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆరీ్మకి లేఖ రాశాడు. ‘‘ధ్వంసమైన నా వయనాడ్‌లో బాధితులను ఆర్మీ కాపాడుతున్న తీరు చూసి గర్వపడుతున్నా. మీ ఆకలిని కేవలం బిస్కెట్లతో చంపుకుంటూ శరవేగంగా బ్రిడ్జి కట్టడం టీవీలో చూశా. నేను కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తా’’ అని పేర్కొన్నాడు. ‘‘నువ్వు ఆర్మీ యూనిఫాంలో మాతో కలిసి పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ ఆర్మీ అతనికి తిరుగు లేఖ రాసింది!
Comments
Please login to add a commentAdd a comment