joint family
-
Wayanad landslide: వయనాడ్ విలయానికి... ఉమ్మడి కుటుంబం బలి!
వయనాడ్: అప్పటిదాకా ఇంటినిండా 16 మంది సభ్యుల సందడితో కళకళలాడిన ఆ ఉమ్మడి కుటుంబం ఒక్కసారిగా కళతప్పింది. కొండల మీదుగా దూసుకొచ్చిన ప్రకృతి ప్రళయం కుటుంబాన్ని అమాంతం మింగేసింది. చూరల్మల కుగ్రామంలో ఆ ఉమ్మడి కుటుంబంలో 42 ఏళ్ల మన్సూర్ ఒక్కడే మిగిలాడు. విపత్తు రోజున ఊళ్లో లేకపోవడంతో బతికిపోయాడు. తన ఇంట్లో 16 మందిని కొండలు కబళించాయంటూ విలపిస్తున్నాడు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విలయానికి బలైన వారి సంఖ్య 221కి చేరినట్టు కేరళ ఆదివారం ప్రకటించింది. వాస్తవ సంఖ్య 370 దాటినట్టు స్థానిక మీడియా చెబుతోంది. జీవనదిలో నిర్జీవ దేహాలు వయనాడ్ తదితర తీరవాసులకు జీవనాడిగా పేరొందిన చలియార్ నది ఇప్పుడు విలయానికి గుర్తుగా మారింది. కొండచరియలకు బలైన వారి మృతదేహాలు ఆరు రోజులైనా ఇంకా నది ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి! ఘటనాస్థలి మీదుగా 40 కి.మీ.ల పొడవునా తీరం వెంట గాలింపు కొనసాగుతోంది.సైన్యానికి సెల్యూట్.. బాలుడి లేఖ వయనాడ్‌లో అన్వేషణ, సహాయక పనుల్లో సైన్యం కృషిని రాయన్ అనే స్థానిక చిన్నారిని కదలించింది. ‘మీరు నిజంగా గ్రేట్’ అంటూ మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు ఆరీ్మకి లేఖ రాశాడు. ‘‘ధ్వంసమైన నా వయనాడ్‌లో బాధితులను ఆర్మీ కాపాడుతున్న తీరు చూసి గర్వపడుతున్నా. మీ ఆకలిని కేవలం బిస్కెట్లతో చంపుకుంటూ శరవేగంగా బ్రిడ్జి కట్టడం టీవీలో చూశా. నేను కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తా’’ అని పేర్కొన్నాడు. ‘‘నువ్వు ఆర్మీ యూనిఫాంలో మాతో కలిసి పనిచేసే రోజు కోసం ఎదురుచూస్తున్నాం’’ అంటూ ఆర్మీ అతనికి తిరుగు లేఖ రాసింది! -
Israel-Hamas war: కుటుంబాన్ని కూల్చేశారు
రఫా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా మెల్లగా దాడులు మొదలెట్టిన ఇజ్రాయెల్ రోజురోజుకూ రెచి్చపోతోంది. అ మాయక పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుంటోంది. శనివారం ఇజ్రాయెల్ సేనల నిర్దయ దాడులకు ఒక ఉమ్మడి కుటుంబం నిట్టనిలువునా కుప్పకూలింది. గాజా సిటీలో జరిపిన దాడుల్లో ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఉద్యోగి ‘అల్–మగ్రాబీ’ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 76 మంది కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. నుసేరాత్ పట్టణ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలో స్థానిక టీవీ పాత్రికేయుడు మొహమ్మద్ ఖలీఫా ఉమ్మడి కుటుంబం బలైంది. ఈ దాడిలో 14 మంది కుటుంబసభ్యులు మరణించారు. మొత్తం దాడుల్లో 90 మందికిపైగా మరణించారని గాజా పౌరరక్షణ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. -
కొత్తవి ఇవ్వరు..పాతవాటిలో చేర్చరు
కొత్త రేషన్‌కార్డుల ఊసే లేదు. పాత కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్ల నమోదు చేస్తారా అంటే అదీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా 10,34,018 మంది కొత్తగా పేర్లు చేర్చాలంటూ దరఖాస్తు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీదానికి రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో లక్షల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – సాక్షి, సిద్దిపేట మీసేవ కేంద్రాల్లో 2021 ఆగస్టు నుంచి కొత్త రేషన్‌కార్డు ల దరఖాస్తుల ఆప్షన్ తొలగించారు. అప్పటి నుంచి కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడి..కొత్త కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. అయి తే వీరు రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు, బీసీ, మైనార్టీ బంధులకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డులు లేక అనేకమంది నష్టపోతున్నారు. ♦ రాష్ట్రంలో 90,04,563 రేషన్ కార్డులుండగా ఇందులో అంత్యోదయ కార్డులు 5,63,447, ఆహారభద్రత కార్డులు 84,35,654, అన్నపూర్ణ కార్డులు 5,462 ఉన్నాయి. ♦ ఆహార భద్రత (రేషన్) కార్డుల్లో పేర్లు సులభంగా తొలగిస్తున్నా, చేర్పులు చేపట్టకపోవడంతో కొత్త కోడళ్లకు నమోదు కావడం లేదు. పుట్టిన పిల్లలకు సైతం అవకాశం ఇవ్వలేదు. ♦ పెళ్లికాగానే కొందరు యువతులు స్వచ్ఛందంగా పేర్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. పేర్లు తొలగించినంత ఈజీగా అత్తారింటి కార్డులో పేర్లు చేర్చడం లేదు. ♦ కొత్త కోడళ్ల పేర్ల నమోదుకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా..అడుగు కూడా ముందుకు పడడం లేదు. ♦ ఆరోగ్యశ్రీ , ఇతర ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్‌కార్డుల్లో పేర్లు లేకపోవడంతో అవి వర్తించడం లేదు. దీంతో అమ్మగారిఇంట్లో కార్డు పేరు ఎందుకు తొలగించుకు న్నామా అని తలలు పట్టుకుంటున్నారు. ♦ పేర్లు తొలగించుకున్న కొత్త కోడళ్లకు బతుకమ్మ చీరలు కూడా అందడం లేదు. ఆరుసార్లు దరఖాస్తు చేశా.... నా ఇద్దరు పిల్లలపేర్లు రేషన్‌కార్డులో నమోదు చేయాలని మీ సేవలో ఆరుసార్లు దరఖాస్తు చేశా. ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్‌కార్డులో మా పిల్లల పేర్లు నమోదు చేయాలి. –బోలుమల్ల మహేందర్, రాంచంద్రాపూర్, కోహెడ రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల్లో చేర్పులకు పెండింగ్ దరఖాస్తులు ఇలా (ఆయా లాగిన్లలో) ♦ రెవెన్యూ ఇన్స్పెక్టర్ 5,67,927 ♦ తహసీల్దార్ 68,462 ♦ డీఎస్ఓ 3,97,629 మీ సేవ సర్వర్ దరఖాస్తు తీసుకోవడం లేదు.. నాకు ముగ్గురు పిల్లలు. రెండేళ్ల క్రితం రెండోబాబు పుట్టిన తర్వాత రేషన్‌కార్డులో పేరు నమోదుకు దరఖాస్తు చేశా. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇంతలోనే మూడో బాబు పుట్టిన తర్వాత మళ్లీ పేరు నమోదుకు మీసేవ కేంద్రానికి వెళ్లితే సర్వర్ అప్లికేషన్ తీసుకో వడం లేదు. పాత అప్లికేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో కొత్తగా తీసుకోవడం లేదు. – రంగు ఆంజనేయులు, పాలమాకుల -
మీకు ఈ పన్ను ప్రయోజనాల గురించి తెలుసా!
ఉమ్మడి కుటుంబంతో పలు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఈ కింద పేర్కొన్న ఉదాహరణలతో ఉమ్మడి కుటుంబం ద్వారా పన్ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవచ్చు. ► పూర్వీకుల నాటి పొలం. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టడంతో నష్టపరిహారం వచ్చింది. వరహాలగారి వసంతమ్మగారికి. ఆమెకు ముగ్గురు అబ్బాయిలు. భర్త లేరు. నష్టపరిహారాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు ఉమ్మడి కుటుంబం మీద. వడ్డీ ప్రతి ఏటా రూ. 12 లక్షలు వస్తుంది. వసంతమ్మగారికి ప్రతి నెలా రూ. 1,00,000 పెన్షన్ వస్తుంది. ముగ్గురు పిల్లలూ ఉద్యోగస్తులే. అందరికీ అదే రేంజిలో జీతభత్యాలు. ► పూర్వీకులు ఇచ్చిన భవంతి మీద అద్దె ఏటా రూ. 9,00,000 వస్తుంది శ్రేష్టిగారికి. ఆయనకు కంపెనీలో పెద్ద ఉద్యోగం. రూ. 30,00,000 జీతం. శ్రేష్టిగారి తమ్ముడికి మంచి ఉద్యోగం, పెద్ద జీతం. అద్దెను ఎవ్వరూ వారి స్వంత అసెస్మెంట్లో చూపించరు. కుటుంబం పేరు మీదే లెక్కాడొక్కా. ► తనకున్న ఎనిమిది ఇళ్లనూ చూపిస్తూ, ఎటువంటి ఎగవేత లేకుండా అన్నింటికి పక్కా అగ్రిమెంట్లు, రెంట్లు, టీడీఎస్‌లు, పన్ను చెల్లింపులు సక్రమంగా చూపిస్తూ చక్రం తిప్పుతారు చక్రధర రావు చక చకా. ► తాతల నాటి ఇన్వెస్ట్మెంట్లు, షేర్లు, డిబెంచర్లమీద ఆదాయాన్ని కుటుంబం పేరిటే లెక్కిస్తున్నారు కోట్లకు ఎగబాకిన కోటేశ్వరరావు ఈ రోజుకీ. ► పూర్వీకుల నాటి నుంచి ఎంతో కలిసి వస్తున్న వ్యాపారం. మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి ఎంతో మందికి. పేరు పక్కన ‘సన్స్’, పేరు పక్కన ‘బ్రదర్స్’ ఇటువంటి బాపతే. తాతల నాటి నుంచి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తి పాస్తులే నాడూ, నేడూ శ్రీరామరక్ష అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుటుంబ వడ్డీ కుటుంబానికే వచ్చింది కాబట్టి అలా లెక్కించాలి. అప్పుడు పన్ను భారం రూ. 1,17,000 అవుతుంది. అలా కాకుండా రూ. 12,00,000 వడ్డీని నలుగురికి సమానంగా పంచితే తలా రూ. 3,00,000 వస్తుంది. ఒక్కొక్కరికి రూ. 93,600 చొప్పున అదనంగా పన్నుభారం పడుతుంది. 80సి, 80డి ప్రయోజనం అదనంగా రాదు. మొత్తం మీద రూ. 3,74,400 మిగులుతుంది. ఈ మేరకు పన్ను మిగిలినట్లే. -
ఉమ్మడి కుటుంబంతో ఆదాయ పన్ను తగ్గించుకోవచ్చు! ఎలాగో తెలుసా?
ఈ మధ్య మన కాలమ్‌లో ఒక అయ్యర్ కుటుంబం చేసిన ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకున్నాం. ఈ వారం ఉమ్మడి/సమిష్టి కుటుంబం ద్వారా ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సౌలభ్యం కోసం మనం ‘‘ఉమ్మడి కుటుంబం’’ అని ప్రస్తావిద్దాం. ఆదాయపు పన్ను చట్టంలో ఇలాంటి కుటుంబానికి ఒక నిర్వచనం చెప్పారు. అంతే కాదు. ఒక ప్రత్యేకమైన స్టేటస్ కూడా అంటకట్టారు. స్వంతం, ఉమ్మడి కుటుంబం, భాగస్వామ్య సంస్థ, కంపెనీ, వ్యక్తుల కలయిక, ప్రాంతీయ సంస్థలు .. ఇలాంటి ప్రతి ఒక్కరికి ఒక స్టేటస్. ఆ స్టేటస్‌ని బట్టి ఆదాయం శ్లాబులు, పన్ను రేట్లు ఉంటాయి. ఉదాహరణకు స్వంతం, ఉమ్మడి కుటుంబాలకు బేసిక్ లిమిట్ రూ. 2,50,000. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలకు బేసిక్ లిమిట్లు లేవు. స్వంతానికి, ఉమ్మడి కుటుంబాలకు 10 శాతం, 20 శాతం, 30 శాతం రేట్లు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలకు ఒకే రేటు. గతంలో ఉమ్మడి కుటుంబాలు బహు సంఖ్యలో ఉండేవి. అవి కుటుంబపరంగానే వ్యాపారం చేసేవి. ఆదాయం ఉండేది. అందుకని ప్రత్యేక హోదా ఉంది. ఇది హిందువులకే వర్తిస్తుంది. ఆస్తిపాస్తులు పూర్వీకుల నుండి సంక్రమించాలి. కుటుంబంలో హక్కు సహజంగా ఏర్పడుతుంది. ఉదాహరణకు పుట్టుక, పెళ్లి వంటివి. అలాంటి కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఉంటారు. వారినే ‘‘కర్త’’ అని వ్యవహరిస్తారు. ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టి ‘‘పాన్’’ను పొందాలి. దరఖాస్తులో కుటుంబం ఎప్పుడు ఏర్పడింది.. కర్త పేరు.. అడ్రస్సు, కుటుంబ సభ్యుల పేర్లు తదితర వివరాలు ఇవ్వాలి. ఆ రోజు నుండి స్టేటస్ అమల్లోకి వస్తుంది. కర్త అంటే ఎవరు? ఉమ్మడి కుటుంబం బాగోగులు చూసే వ్యక్తిని కర్త అంటారు. కుటుంబపు వ్యవహారాలను చూసే వ్యక్తే కర్త. సీనియర్ కుటుంబీకులు .. మగవారే కర్తలు. నో పార్ట్నర్స్. ఆడవాళ్లు సభ్యులే. అందరికీ వారి వారి వాటా పొందే హక్కుంది. ఆస్తిలోనూ.. ఆదాయంలోనూ. దీనికి సంబంధించి ఎంతో పెద్ద న్యాయ సమీక్ష ఉంటుంది. ఎన్నో కోర్టు జడ్జిమెంట్లు, వివరణలు, భాష్యాలు, వ్యాఖ్యలు, వాదోపవాదాలు ఉన్నాయి. వాటన్నింటిని కాస్త పక్కన పెడితే.. సెపరేటు స్టేటస్ కాబట్టి కుటుంబానికి బేసిక్ లిమిట్ రూ. 2,50,000 వర్తిస్తుంది. ఇది కాకుండా కుటుంబీకులందరికీ వ్యక్తిగతంగా, స్వంతంగా విడిగా, అదనంగా బేసిక్ లిమిట్ వర్తిస్తుంది. అన్ని మినహాయింపులు, తగ్గింపులు ప్రత్యేకం. 80సి, 80డి మొదలైనవి అదనం. ప్రత్యేకమైన డీమ్యాట్ అకౌంటుతో షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు.. వాటిపై వడ్డీ మీద ట్యాక్స్‌లు, టీడీఎస్‌లు వేరు. మూలధన లాభాలు వేరు .. వ్యాపారం, వృత్తిగత లాభాలు వేరుగా ఉంటాయి. ఏయే ఆదాయాలు ఉండవచ్చు ►ఇంటి మీద అద్దె/ఆదాయం ►ఇతర ఆస్తుల మీద ఆదాయం ►మూలధన లాభాలు ►వ్యాపారం/ వృత్తుల మీద ఆదాయం ►ఇతర ఆదాయాలు -
ఆ ఇల్లు ఓ నందనవనంలా.. ఉమ్మడి కుటుంబం
ఆ ఇళ్లు నందనవనాలు.. ఆదర్శనీయమైన ఉమ్మడి కుటుంబాలు.. విభేదాలు మర్చిపోతాయి.. అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఉంటాయి.. మారుతున్న సామాజిక ధోరణులకు తలొగ్గకుండా.. పెద్దల మాటలు జవదాటకుండా ముందుకు సాగుతున్నాయి.. ఇందుకు ప్రధాన కారణం తోడికోడళ్లు.. అత్తామామల ఆలనాపాలన చూసుకుంటూ.. ఆడబిడ్డలకు మంచిగౌరవమిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని ఇలాంటి కొన్ని కుటుంబాలపై ప్రత్యేక కథనం.. కుర్చీలో కూర్చున్న అత్త పేరు రాధ. ఆమె వెనకాల నిల్చున్నవారు ముగ్గురు ఆమె కోడళ్లు జ్యోతి, రజని, స్వరూప. వీళ్లు పేరుకే అత్తాకోడళ్లు. ఇంట్లో అందరూ తల్లీకూతుళ్లలానే ఉంటారు. కుటుంబ పెద్ద అత్త. ఆమె సూచనలు, సలహాలు పాటిస్తూ ఉంటారు ముగ్గురు కోడళ్లు. తర్వాతి స్థానం పెద్దకోడలు జ్యోతిది. మిగతా ఇద్దరు తోడికోడళ్లను చెల్లెళ్లులుగా చూసుకుంటారు జ్యోతి. ఈమెను కూడా అక్కకన్నా ఎక్కువగా గౌరవిస్తారు తోడికోడళ్లు. ఈఇంట్లో నలుగురు తోడికోడళ్లు ఉన్నారు. సొంత అక్కాచెల్లెళ్లలా కలిసి ఉంటున్నారు. అత్తామామలు, ఆడబిడ్డలు, చుట్టాలు వస్తే.. వారికి చేసే మర్యాదల్లో ఏమాత్రం లోటు రానివ్వరు. ఎలాంటి అరమరికలు లేకుండా సాగుతున్న వీళ్లు ప్రస్తుత సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాక్షి, సిరిసిల్ల : అన్యోన్యత చాటుతున్న తోడికోడళ్లు. అత్తమ్మ సారథ్యంలో కుటుంబ నిర్వహణ, బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. వేరే ఇంటి అమ్మాయి అయినా.. మెట్టినింట్లో కాలుపెట్టాక తమ జీవితం అత్తవారిల్లే అంటూ అందరినీ కలుపుకుని భవిష్యత్‌కు మంచిబాటలు వేసుకుంటున్నారు. అత్తమామలు, ఆడబిడ్డలకు గౌరవం ఇస్తూ.. భర్త కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటున్నారు. వివాహమయ్యాక కొద్దిరోజుల్లోనే వేరు కాపురాలు పెడుతున్న ఈరోజుల్లో ఎలాంటి వైషమ్యాలకు తావులేకుండా పండంటి కాపురాలుగా తీర్చిదిద్దుతున్నారు తోడికోడళ్లు. ఇలాంటివారిలో కొన్ని కుటుంబాలపై కథనం.. ఈ చిత్రంలోనివాళ్లు తోడికోడళ్లు లక్ష్మి, మల్లేశ్వరి, రేణుక. లక్ష్మి భర్త మల్లేశం, మల్లేశ్వరి భర్త రమేశ్, రేణుక భర్త రాజు, భూదేవి – కృష్ణ దంపతులు కూడా వీరి కుటుంబంలోనివారే. పురుషులందరూ పూలవ్యాపారం చేస్తున్నారు. తోడికోడళ్లు ఇంట్లో పనులు పూర్తయ్యాక పూలదండలు అల్లుతూ ఉంటారు. వీళ్ల కుటుంబంలో తొమ్మిదిమంది పిల్లలు శ్వేత, బబిత, శివ, శరత్, సోమేశ్, చందు, రాజశ్రీ, అఖిలేశ్వర్, అఖిలేశ్వరి. ఆడబిడ్డ సబితకు వివాహమైంది. పుల్లూరులో కుటుంబంతో కలిసి ఉంటోంది. సబిత వస్తే ఆ ఇంట్లో పండుగే. నలుగురు తోడికోడళ్లను చూసి ‘మంచిఫ్యామిలీ’ కితాబిస్తారు. ఇది వారిలో ఎంతో సంతోషాన్నిస్తోంది అత్తామామలంటే గౌరవం మాది ఉమ్మడి కుటుంబం. మా అత్తామామలు అబ్దుల్ గఫూర్–ఫాత్మోలి. మా వారు గఫార్కి ఐదుగురు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు. తోడికోడళ్లు సత్తార్–నూర్ఉన్నీసా, జబ్బార్–అజ్గిరి, ఖదీర్–మున్నీ, రావూఫ్–హమేరా. మా వివాహం జరిగి 36 ఏండ్లు. ఆడబిడ్డలు ము గ్గురు. జాలనాలో బుగ్నా, పర్బనిలో షబానా, సిరిసిల్లలో సాజిం ఉంటారు. మా ఇంట్లో అత్తామామలే అన్నీ. పురుషులు చిరువ్యాపారాలు చేస్తరు. మేం బీడీలు చుడుతం. మా కు టుంబంలో ఘర్షణలకు తావులేదు. అత్తామామ ల సూచనలతోనే శుభకార్యాలు చేసుకుంటం. – అబ్దుల్ రెహనబీ, పెద్దకోడలు కలిసే ఉంటాం మాది ఉమ్మడి కుటుంబం. అత్తమ్మ గూడూరి భారతి, బావ, అక్క శ్రీధర్–సుమ, మావారు డాక్టర్ రవీందర్, మరిది, చెల్లి అనిల్–లలిత, పిల్లలు తన్మయి, సిద్ధూ, రిత్విక, గౌతం. ఇంట్లో అత్తమ్మే యజమాని. నేను ఇక్కడే ప్రైవేటుగా డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్త. పేషెంట్లతో నిత్యం బిజీ. అయినా ఆదివారం, పండుగ రోజుల్లో అత్మమ్మ వద్దకే వెళ్తం. అక్కయ్య, చెల్లెలు, పిల్లలతో ఆనందం షేర్ చేసుకుంటం. అందరం కలిసే ఉంటం.. కలిసే భోజనం చేస్తం. వీకెండ్స్, తీర్థయాత్రలు కూడా చేస్తం. – డాక్టర్ గీతావాణి, రెండో కోడలు అత్తామామల ఆశీర్వాదం మాది ఉమ్మడి కుటుంబం. అత్తామామల ఆశీర్వాద మే ముఖ్యం. మామయ్య ప్రోత్సాహంతో మావారు అనిల్, ఆయన తమ్ముళ్లు అజయ్, అరుణ్Š స్వర్ణకారులుగా స్థిరపడ్డరు. తోడికోడళ్లు లావణ్య, లాస్య కలిసి ఇంటి పనులు షేర్ చేసుకుంటం. అత్తమ్మ అరుణ ఏ ది చెబితే అది చేస్తం. ఏనాడూ ఆమె మాట జవదాటలే. మా ఆడబిడ్డ అనిత. ఆమెతో విడదీ యరాని బం ధం. వృత్తిపరంగా మా ఆయన, ఆయన తమ్ముళ్లు ఎప్పుడూ బిజీనే. మా మామయ్య ప్రభాకర్ చనిపోయాక ఏడాదికి ప్రణయ్ పుట్టిండు. మళ్లీ మామయ్య వచ్చిండని సంబురపడ్డం. ఇవి జీవితంలో మర్చి పోలేని క్షణాలు. – కనపర్తి రాధిక, పెద్దకోడలు -
ఆ కుటుంబంలో 66 ఓట్లున్నాయ్!
అలహాబాద్‌లోని బహ్రయిచా గ్రామానికి చెందిన రామ్ నరేశ్ భుర్తియా కుటుంబ సభ్యులు మొత్తం 82 మంది. వారిలో ఓటు హక్కున్న వాళ్లు 66 మంది. కాబట్టే అభ్యర్ధులంతా భుర్తియాను బుజ్జగించేందుకు వస్తారు. ప్రత్యేకంగా హామీలు కూడా ఇస్తారు. అయితే, వాటిని నెరవేర్చడం లేదని 98 ఏళ్ల నరేశ్ ఆరోపిస్తున్నారనుకోండి. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న ఈ ఉమ్మడి కుటుంబం ఆర్థికంగా మంచి స్థానంలోనే ఉంది. ప్రస్తుతం వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అది మట్టి ఇల్లు. దాని స్థానంలో పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు.అయితే, ఆ ఇంటి మీదుగా హై టెన్షన్ కరెంటు వైర్లు వెళుతున్నాయి. వాటిని తొలగిస్తే తాము పక్కా ఇల్లు కట్టుకుంటామని నరేశ్ ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులను కోరడం, వారు హామీ ఇవ్వడం జరుగుతోందే కాని ఇంత వరకు పని కాలేదు.అయినా వాళ్లు ఓట్లువేయడం మానడం లేదు. వచ్చే సారి మాత్రం మా సమస్య పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని కచ్చితంగా చెబుతున్నాడు నరేశ్ మనుమడు శంకర్. -
‘ఆ మూడింటి’పై స్పష్టతివ్వండి
జీవోలో ఉద్యోగం సంగతి లేదేం? * ఉమ్మడి కుటుంబంపై స్పష్టతేదీ? * ధరల సూచీ ప్రస్తావన లేదేం? * సర్కారును ప్రశ్నించిన హైకోర్టు * స్పష్టత ఇవ్వాలంటూ విచారణ 16కు వాయిదా * పారిశ్రామిక విధానం మేరకు ఉద్యోగాలు: ఏజీ * హామీ కోరుతున్నామన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో తలపెట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు భూ సేకరణ వల్ల జీవనోపాధి కోల్పోయే వారికోసం ఏ చర్యలు తీసుకుంటున్నదీ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలో పేర్కొన్న అంశాలపై హైకోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. నిమ్జ్ భూ సేకరణకు ఇచ్చిన జీవో 123 కొట్టివేతను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుల ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.‘‘బాధితులకు ఉద్యోగం కల్పించే విషయాన్ని జీవోలో ఎందుకు పేర్కొనలేదో చెప్పండి. ఎస్సీ, ఎస్టీలు కాని వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి జీవనభృతి కింద నెలకు రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లిస్తామని నిర్ణయించింది వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగానా, మరో అంశం ఆధారంగానా? ఉమ్మడి కుటుంబానికి రూ.7.5 లక్షలు చెల్లిస్తామన్న నేపథ్యంలో, అసలు ఉమ్మడి కుటుంబమంటే ఏమిటో స్పష్టంగా తెలియజేయండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మూడు అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఆదేశించొచ్చు గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు... బాధితులకు ఏయే ప్రయోజనాలు కల్పిస్తున్నదీ వివరిస్తూ జీవో జారీ చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి తెలిపారు. జీవోను పరిశీలన నిమిత్తం ధర్మాసనం ముందుంచి, అందులోని వివరాలను చదివి వినిపించారు. నిమ్జ్ కోసం 12,600 ఎకరాలు సేకరిస్తున్నామని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు వచ్చే అవకాశముందని చెప్పారు. ఉద్యోగాలివ్వాలని ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వమెలా చెప్పగలదన్నారు. విజయవాడ థర్మల్ పవర్ కార్పొరేషన్ (వీటీపీఎస్) బాధితులకు ప్రభుత్వం ఉద్యోగాలిప్పించిందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రభుత్వానికి ఆ అధికారముందని పేర్కొంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా జీవనభృతిని నిర్ణయించినట్టు భూ సేకరణ చట్టం 2013, షెడ్యూల్ 2లో పేర్కొన్నారని, అయితే ప్రభుత్వ జీవోలో మాత్రం ధరల సూచీ (సీపీఐ) ప్రస్తావనే లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి అన్నారు. అందులో పేర్కొన్న ప్రయోజనాల కంటే ఎక్కువే కల్పిస్తున్నట్టు ఏజీ చెప్పగా, సీపీఐతో సంబంధం లేకుండా జీవనభృతిని ఎలా నిర్ణయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. ‘‘భవిష్యత్తులో ధరలు పెరిగితే ప్రభుత్వమిచ్చే రూ.2,500 భృతి ఎలా సరిపోతుంది? పెరిగిన ధరల ప్రకారం అప్పుడు రూ.10 వేలు చెల్లించాల్సి రావచ్చు, మీరు రూ.2,500 మాత్రమే ఇస్తామనడం ఎలా సబబు?’’ అని ప్రశ్నించింది. బాధితులకు ఉద్యోగం కల్పించే విషయాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదని అడిగింది. నిమ్జ్‌లో పరిశ్రమలు పెట్టేవన్నీ ప్రైవేటు కంపెనీలేనని, ఉద్యోగాలివ్వాలని వాటినెలా ఆదేశిస్తామని ఏజీ అన్నారు. తమ పారిశ్రామిక విధానం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలొస్తాయని చెప్పారు. తామూ అదే కోరుతున్నామని, స్థానికుల ఉద్యోగాల గురించే హామీ అడుగుతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారులు అపార్థం చేసుకుంటే...? ఉమ్మడి కుటుంబానికి రూ.7.5 లక్షలు ఇస్తామని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం, అంతకుముందు దాఖలు చేసిన అఫిడవిట్లో కుటుంబం అని మాత్రమే పేర్కొందని మూర్తి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఉమ్మడి కుటుంబం అనడం వల్ల బాధితులకు న్యాయం జరగదన్నారు. దీనిపై ధర్మాసనం వివరణ కోరగా... తల్లి, తండ్రి, పెళ్లి కాని పిల్లలు ఉమ్మడి కుటుంబంలోకి వస్తారని ఏజీ చెప్పారు. ‘‘ఈ స్పష్టత జీవోలో లేదు గనుక దాన్ని అమలు చేయాల్సిన అధికారులు మరోలా అర్థం చేసుకునే ఆస్కారముంది. కాబట్టి ఉమ్మడి కుటుంబమంటే ఏమిటో జీవోలో స్పష్టతనివ్వండి’’ అని తేల్చి చెప్పింది. నిమ్జ్ స్వరూపం ఎలా ఉండనుందో కనుక్కోవాలని మూర్తి కోరగా ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఆ వివరాలు మాకసలే అవసరం లేదు. బాధితుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది, అది నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదా అన్నదే చూస్తాం. మిగతా వాటన్నింటినీ తుది విచారణలో తేలుస్తాం’’ అంది. -
నా ఫ్రెండ్స్... అమ్మకీ ఫ్రెండ్సే...
అమ్మ జ్ఞాపకం నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ ధాన్యం కొట్లో పనిచేస్తోందంట. అక్కడే నేను పుట్టానట. అప్పట్లో ఆడవాళ్లు పురుడొచ్చేవరకు పనిచేస్తూనే ఉండేవాళ్లు. నేను పుట్టిన పద్నాలుగో రోజు మా అమ్మమ్మ చనిపోయిందట. నా చిన్నతనం, నా బాల్యం ఏడు రంగుల ఇంద్రధనుస్సంత అందమైంది. యాభై మందున్న ఉమ్మడి కుటుంబంలో మా గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. నా బాల్యంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆంక్షలు లేని స్వేచ్ఛ ఉండేది. మమ్మల్ని ఎవరూ ఏమీ అనేవారు కాదు. మా అమ్మ నన్ను తిట్టినట్టు, కొట్టినట్టు ఒక్క జ్ఞాపకం కూడా లేదు. అలాగని విపరీతంగా పట్టించుకుని ప్రేమించిన జ్ఞాపకం కూడా లేదు. నాన్న వ్యాపారం తుకారాం వ్యాపారమే... నేను చదువుకోవడం కొరకు చాలా పోరాటమే చేశాను. ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ లేని అమ్మ ఏం చేయగలుగుతుంది? అష్టకష్టాలు పడి ఎన్నో అడ్డంకుల్ని దాటి, డిగ్రీ వరకు చదువుకోగలిగాను. ఉమ్మడి కుటుంబంలో అమ్మ ఎన్నో కష్టాలు పడింది. నాన్న వ్యాపార నిర్వాకాల వల్ల కష్టాలు పడింది. నాన్నకి శ్రమ చేయడం తప్ప కల్లాకపటం తెలియదు. అలాంటి వాడు వ్యాపారం చేస్తే తుకారాం వ్యాపారమే అవుతుంది. నాన్న చనిపోయాక మా కుటుంబం చాలా కష్టాలు పడింది. 1979లో నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగం వచ్చింది. ఒక గది రూ.60కి అద్దెకు తీసుకుని అమ్మని, తమ్ముడిని తీసుకొచ్చేశాను. అలా వచ్చిన అమ్మ 2005 మే నెలలో చనిపోయేవరకు నాతోనే ఉండిపోయింది. నా జీవితంలో ఎగుడుదిగుడులకి, ఎదుగుదలకి అమ్మ ప్రత్యక్ష సాక్షి. నా స్వేచ్ఛకి తను ఏనాడూ అడ్డుపడలేదు. ‘ఇలా చెయ్యి అలా చెయ్యి’ అని ఎప్పుడూ నాకు చెప్పలేదు. నేను ఏం చేసినా కరెక్టుగా, కచ్చితంగా చేస్తానని అమ్మకి గొప్ప నమ్మకం. నేను నాస్తికత్వాన్ని నా జీవితాచరణగా ఎంచుకుని, ఒక నాస్తికుణ్ని ఇష్టపడి, అతనితో కలిసి ఉంటానని చెప్పినప్పుడు తను నన్నేమీ అనలేదు. అమ్మ సాక్షిగా పెళ్లి... నేను రిజిస్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాత్రం... సంప్రదాయ పద్ధతిలో చేసుకోమని అడిగింది. నేను సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనని, తాళి, మట్టెలు, నల్లపూసలు లాంటివి వేసుకోనని కచ్చితంగా చెప్పాను. నేనలా దృఢంగా చెప్పేసరికి తను ఇంకేమీ అనలేదు. నీ ఇష్టం అంది. 1981లో మేమిద్దరం అమ్మ సాక్షిగానే రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం. అమ్మ ఎప్పటికీ నాతోనే ఉంటుందని అతనికి ముందే చెప్పాను. నేను అత్తారింటికి వెళ్లలేదు. నా సహచరుడే ఒక చిన్న పెట్టెతో నా గదికి వచ్చేశాడు. నా సహచరుడు మా అమ్మని ‘అమ్మా!’ అనే పిలిచేవాడు. అమ్మకు నాతోపాటు బయటకి రావడం ఇష్టం. తనకి తెలియని రచయిత్రి లేదు. అందరితో కలివిడిగా మాట్లాడేది. నా ఫ్రెండ్స్ తనకీ ఫ్రెండ్సే. అమ్మకి జీవితం పట్ల ఎంతో ప్రేమ. తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం. శరీరం పట్ల ఎంతో శ్రద్ధ. అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి. ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ. తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారుచేసుకుని తలకి పట్టించేది. ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది. చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు కూడా తనను చూడ్డానికి వచ్చేవాళ్లకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారుచేసుకోవాలో చెబుతుండేది. అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. జీవితం పట్ల తన ప్రేమకి నిదర్శనంలా నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ల మధ్య నానాటికీ కనిపిస్తూనే ఉంటుంది. - కొండవీటి సత్యవతి, ‘భూమిక’ ఎడిటర్ -
ప్రజలకోసం ఫస్టొచ్చారు!
ముందుండాలని ఫస్ట్ వస్తారు ఎవరైనా. వెనకుండడం కోసం ఫస్ట్ తెచ్చుకున్నారు వేణుగోపాల్! టెన్త్‌లో స్కూల్ ఫస్ట్... డిగ్రీలో కాలేజ్ ఫస్ట్... ఎమ్మెస్సీలో యూనివర్శిటీ ఫస్ట్... గ్రూప్ 1లో స్టేట్ ఫస్ట్... ఈ ఫస్ట్‌లన్నీ - ప్రజల కోసం, ప్రజల వెనుక వుండడం కోసం కాలే కడుపుతో, నిద్ర లేని కళ్లతో సాధించారాయన! ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాణిజ్య పన్నుల అధికారిగా ఎంపికైనా... గ్రూప్ 1 మళ్లీ రాసి రెవిన్యూ సర్వీసును ఎంచుకున్నది కూడా... ఆ ప్రజల కోసమే! పగిలిన పలక ముక్కపై అక్షరాలు దిద్దుకుని... స్నేహితుల పుస్తకాలు అరువు తెచ్చుకుని... ఆశల్ని చంపుకుని, ఆశయాల్ని నింపుకుని... ప్రజాసేవకుడినై తీరాలని ప్రతిన పూనిన వేణుగోపాల్‌ను అంతగా ప్రేరేపించిన పరిస్థితులేమిటి? చదవండి... ఈవారం ‘జనహితం’లో... ఆదర్శాలు అందరికీ ఉంటాయి.. కానీ ఆచరణలో ఎన్ని అమలు చేయగలం?.. చిన్ననాడు అన్నీ స్ఫూర్తికలిగిస్తాయి... అందులో ఎన్ని జీవితంలో ఆచరణలోకి వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఓసారి వేణుగోపాల్ రెడ్డి జీవితంలోకి తొంగి చూడాల్సిందే... తన జీవితంలో పేదరికం ఉంది. అడుగడుగునా కష్టాలు వెన్నాడుతున్నాయి. ఆఖరికి బడిలో.. చదువుల ఒడిలో అన్నీ సమస్యలే.. అయినా అమ్మానాన్నల ఆశీస్సులే పెట్టుబడిగా.. అన్నదమ్ముల ఆలంబనే ఆశీర్వాదాలుగా బతుకు చిత్రంలో ఒదిగి.. సర్కారీ బడిలోనే కష్టపడి చదివి... అధికారి అయ్యారు. కడప జిల్లా బద్వేలు మండలం జాఫర్‌సాహెబ్ పల్లి అనే ఓ చిన్ని గ్రామానికి చెందిన ఆయనే గ్రూప్-1 సర్వీసులో 2006 బ్యాచ్ స్టేట్ టాపర్‌గా నిలిచి, ప్రస్తుతం రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్న మట్లి వేణుగోపాల రెడ్డి. నిండా నలభై గడపలు కూడా లేని ఒక కుగ్రామంలో, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలోని ఆరుగురు అన్నదమ్ముల్లో నాలుగో సంతానం ఈయన. సర్కారీబడులు తప్ప చదువుకోవడానికి మరో మార్గం లేని ఆ గ్రామంలో పట్టుదలే ముందుకు నడిపిందంటూ తన జీవిత విశేషాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘అడిగితే ఇంకొంత కష్టం చేసి అన్నీ కొనిస్తాడు నాయన. కానీ అది ఆయనకు ఎంత భారమో నాకు తెలుసు. పలక విరిగిపోతే, రెండు ముక్కలను ఇద్దరు అన్నదమ్ములం తీసుకునేవాళ్ళం. పుస్తకాలు కొనడానికి కూడా ఆలోచించవలసిన రోజులు అవి. స్నేహితుల వద్ద పుస్తకాలు తీసుకుని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకునేవాడిని. ఇలా పడిన కష్టం ఫలించింది. పదోతరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచాను. ఇంటర్లో కాలేజీలో రెండవస్థానంతో సరిపుచ్చుకున్నా, డిగ్రీలో మాత్రం మళ్లీ కాలేజీ టాపర్నే అయ్యా. ఎమ్మెస్సీలో కూడా యూనివర్సిటీ ఫస్టు నేనే.. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడదంతా ఓ అనుభూతిలా మిగిలింది.’ అంటున్నారాయన. నిబద్ధతతో జీవితాన్ని చిన్ననాటి నుంచి కొనసాగిస్తూ వస్తే ‘సాధ్యం’ ముంగిట ‘అసాధ్యం’ చిన్నదై పోతుందని చెబుతున్న వేణుగోపాలరెడ్డి తన జీవిత పుస్తకాన్ని నేటి యువతకు మార్గదర్శకం అయ్యేందుకు సాక్షికి ఓసారి తెరిచి చూపించారు. మొదటిసారి 2005లో గ్రూప్-1లో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ఎంపికయ్యారు. కానీ అది తన లక్ష్యాలకు తగ్గట్టుగా లేదని ప్రజాసేవకు దగ్గరలో ఉండే బాధ్యతలు నిర్వర్తించాలని మరోసారి ప్రయత్నించి 2006లో స్టేట్ టాపర్‌గా నిలిచి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఎందుకనుకున్నానంటే... నేను అప్పర్ ప్రైమరీ చదువులో ఉండగా మా కుటుంబానికి ఓ ధృవపత్రం అవసరమైంది. దానికోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నాలాగే ఎందరో రకరకాల సర్టిఫికెట్ల కోసం బారులు తీరారు. ఎవరి బాధలు వారివి. అక్కడ జనం పడిగాపులు చూసి నేను ఇలాంటి ఆఫీసులో సేవకుడు కావాలని బలంగా అనుకున్నాను. అదే స్ఫూర్తి రెవెన్యూ సర్వీసెస్ కోసం నన్ను ముందుకు నడిపించింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యం... ‘మాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉండేది. వర్షాధార వ్యవసాయం. నాన్న చిన్నకృష్ణారెడ్డి అయిదో తరగతి వరకు చదివారు. అమ్మ చెన్నమ్మ చదువుకోలేదు. ఆరుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు చదువులబాట పడితే, మరో ముగ్గురు వ్యవసాయానికి అంకితమయ్యారు. గ్రామంలో నా పెద్దన్న రాజగోపాల్‌రెడ్డి ఎం.ఏ పట్టా పుచ్చుకున్న మొదటి వ్యక్తి. మరో అన్నయ్య సూర్యనారాయణరెడ్డి బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ చదివారు. నేను తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, గణితశాస్త్రం చదివాను. చదివిన అన్నలు, మా చదువుల కోసం వ్యవసాయానికి అంకితం అయిన సోదరులు అందించిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను’ అంటున్న వేణుగోపాల్, ఇద్దరు సోదరులు చదువు మీద కాక, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ సోదరులకు తమ వాటాగా వచ్చిన భూమిని ఇచ్చేశారు. ‘నాయన నుంచి వచ్చిన ఆస్తి వాటాను చదువుకోని నా అన్నదమ్ములకే విడిచేశాను. నాకు మంచి ఉద్యోగం ఉంది. అన్నలిద్దరూ కూడా చదువుకుని మంచిగానే బతుకు తున్నారు. అందుకే చదువుకున్న వాళ్లు ముగ్గురం మా ఆస్తులు చదువుకోని సోదరులకు ఇచ్చేశాం’ అని చెప్పుకొచ్చిన వేణుగోపాల్ తన జీవన ప్రస్థానంలో అర్ధాంగి సహకారం మరువలేనిదన్నారు. క్రికెట్ చూడటం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉందంటున్న వేణుగోపాల్‌కి శ్రీశ్రీ, గురజాడ కన్యాశుల్కం, చలం సాహిత్యం అభిమాన గ్రంథాలట! దిశా నిర్దేశం అవసరం... ‘ఈనాటి యువత చదువులో దిశానిర్దేశం లేకుండా ఉన్నారు. కళాశాల విద్యలోకి ప్రవేశించాక... నిర్ణీత లక్ష్యాలు ఎంచుకోవాలి. ఆ దిశగా ఎంచుకునే కోర్సులు ఉండాలి. ఏదో చదివాంలే... పట్టభద్రులు అయ్యాంలే.. అనుకుంటే మంచి భవిష్యత్తు పొందలేరు’ అంటారు. ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యం లేని విద్యకు విలువ లేదంటున్న వేణుగోపాల్ మాటలకు విలువ ఇస్తే, యువత తామనుకున్న మార్గంలో నడవడానికి ఎన్ని కష్టాలెదురైనా వెనుకడుగు వేయరేమో! - దేవళ్ల సూర్యనారాయణ మూర్తి, సాక్షి, రాజమండ్రి