నా ఫ్రెండ్స్... అమ్మకీ ఫ్రెండ్సే...
అమ్మ జ్ఞాపకం
నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ ధాన్యం కొట్లో పనిచేస్తోందంట. అక్కడే నేను పుట్టానట. అప్పట్లో ఆడవాళ్లు పురుడొచ్చేవరకు పనిచేస్తూనే ఉండేవాళ్లు. నేను పుట్టిన పద్నాలుగో రోజు మా అమ్మమ్మ చనిపోయిందట. నా చిన్నతనం, నా బాల్యం ఏడు రంగుల ఇంద్రధనుస్సంత అందమైంది. యాభై మందున్న ఉమ్మడి కుటుంబంలో మా గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. నా బాల్యంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆంక్షలు లేని స్వేచ్ఛ ఉండేది. మమ్మల్ని ఎవరూ ఏమీ అనేవారు కాదు.
మా అమ్మ నన్ను తిట్టినట్టు, కొట్టినట్టు ఒక్క జ్ఞాపకం కూడా లేదు. అలాగని విపరీతంగా పట్టించుకుని ప్రేమించిన జ్ఞాపకం కూడా లేదు.
నాన్న వ్యాపారం తుకారాం వ్యాపారమే...
నేను చదువుకోవడం కొరకు చాలా పోరాటమే చేశాను. ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ లేని అమ్మ ఏం చేయగలుగుతుంది? అష్టకష్టాలు పడి ఎన్నో అడ్డంకుల్ని దాటి, డిగ్రీ వరకు చదువుకోగలిగాను. ఉమ్మడి కుటుంబంలో అమ్మ ఎన్నో కష్టాలు పడింది. నాన్న వ్యాపార నిర్వాకాల వల్ల కష్టాలు పడింది. నాన్నకి శ్రమ చేయడం తప్ప కల్లాకపటం తెలియదు. అలాంటి వాడు వ్యాపారం చేస్తే తుకారాం వ్యాపారమే అవుతుంది. నాన్న చనిపోయాక మా కుటుంబం చాలా కష్టాలు పడింది. 1979లో నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగం వచ్చింది. ఒక గది రూ.60కి అద్దెకు తీసుకుని అమ్మని, తమ్ముడిని తీసుకొచ్చేశాను. అలా వచ్చిన అమ్మ 2005 మే నెలలో చనిపోయేవరకు నాతోనే ఉండిపోయింది.
నా జీవితంలో ఎగుడుదిగుడులకి, ఎదుగుదలకి అమ్మ ప్రత్యక్ష సాక్షి. నా స్వేచ్ఛకి తను ఏనాడూ అడ్డుపడలేదు. ‘ఇలా చెయ్యి అలా చెయ్యి’ అని ఎప్పుడూ నాకు చెప్పలేదు. నేను ఏం చేసినా కరెక్టుగా, కచ్చితంగా చేస్తానని అమ్మకి గొప్ప నమ్మకం. నేను నాస్తికత్వాన్ని నా జీవితాచరణగా ఎంచుకుని, ఒక నాస్తికుణ్ని ఇష్టపడి, అతనితో కలిసి ఉంటానని చెప్పినప్పుడు తను నన్నేమీ అనలేదు.
అమ్మ సాక్షిగా పెళ్లి...
నేను రిజిస్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాత్రం... సంప్రదాయ పద్ధతిలో చేసుకోమని అడిగింది. నేను సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనని, తాళి, మట్టెలు, నల్లపూసలు లాంటివి వేసుకోనని కచ్చితంగా చెప్పాను. నేనలా దృఢంగా చెప్పేసరికి తను ఇంకేమీ అనలేదు. నీ ఇష్టం అంది. 1981లో మేమిద్దరం అమ్మ సాక్షిగానే రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం. అమ్మ ఎప్పటికీ నాతోనే ఉంటుందని అతనికి ముందే చెప్పాను. నేను అత్తారింటికి వెళ్లలేదు. నా సహచరుడే ఒక చిన్న పెట్టెతో నా గదికి వచ్చేశాడు. నా సహచరుడు మా అమ్మని ‘అమ్మా!’ అనే పిలిచేవాడు. అమ్మకు నాతోపాటు బయటకి రావడం ఇష్టం. తనకి తెలియని రచయిత్రి లేదు. అందరితో కలివిడిగా మాట్లాడేది. నా ఫ్రెండ్స్ తనకీ ఫ్రెండ్సే.
అమ్మకి జీవితం పట్ల ఎంతో ప్రేమ.
తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం. శరీరం పట్ల ఎంతో శ్రద్ధ. అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి. ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ. తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారుచేసుకుని తలకి పట్టించేది. ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది. చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు కూడా తనను చూడ్డానికి వచ్చేవాళ్లకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారుచేసుకోవాలో చెబుతుండేది. అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. జీవితం పట్ల తన ప్రేమకి నిదర్శనంలా నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ల మధ్య నానాటికీ కనిపిస్తూనే ఉంటుంది.
- కొండవీటి సత్యవతి, ‘భూమిక’ ఎడిటర్