కొత్తవి ఇవ్వరు..పాతవాటిలో చేర్చరు | Over Ten Lakh Ration Applications Are Pending Across The State | Sakshi
Sakshi News home page

కొత్తవి ఇవ్వరు..పాతవాటిలో చేర్చరు

Published Sat, Sep 2 2023 3:51 AM | Last Updated on Sat, Sep 2 2023 4:54 AM

Over ten lakh ration applications are pending across the state - Sakshi

కొత్త రేషన్‌కార్డుల ఊసే లేదు. పాత కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్ల నమోదు చేస్తారా అంటే అదీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా  10,34,018 మంది కొత్తగా పేర్లు చేర్చాలంటూ దరఖాస్తు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతీదానికి రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో లక్షల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.     – సాక్షి, సిద్దిపేట

మీసేవ కేంద్రాల్లో 2021 ఆగస్టు నుంచి కొత్త రేషన్‌కార్డు ల దరఖాస్తుల ఆప్షన్‌ తొలగించారు. అప్పటి నుంచి కొత్త రేషన్‌కార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడి..కొత్త కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. అయి తే వీరు రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు, బీసీ, మైనార్టీ బంధులకు ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డులు లేక అనేకమంది నష్టపోతున్నారు.

రాష్ట్రంలో 90,04,563 రేషన్‌ కార్డులుండగా ఇందులో అంత్యోదయ కార్డులు 5,63,447, ఆహారభద్రత కార్డులు 84,35,654, అన్నపూర్ణ కార్డులు 5,462 ఉన్నాయి.  
ఆహార భద్రత (రేషన్‌) కార్డుల్లో పేర్లు సులభంగా తొలగిస్తున్నా, చేర్పులు చేపట్టకపోవడంతో కొత్త కోడళ్లకు నమోదు కావడం లేదు.  పుట్టిన పిల్లలకు సైతం అవకాశం ఇవ్వలేదు.  
పెళ్లికాగానే కొందరు యువతులు స్వచ్ఛందంగా పేర్ల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. పేర్లు తొలగించినంత ఈజీగా అత్తారింటి కార్డులో పేర్లు చేర్చడం లేదు.  
కొత్త కోడళ్ల పేర్ల నమోదుకు  మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా..అడుగు కూడా ముందుకు పడడం లేదు.  
ఆరోగ్యశ్రీ , ఇతర ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్‌కార్డుల్లో పేర్లు లేకపోవడంతో అవి వర్తించడం లేదు. దీంతో అమ్మగారిఇంట్లో కార్డు పేరు ఎందుకు తొలగించుకు న్నామా అని తలలు పట్టుకుంటున్నారు. 
పేర్లు తొలగించుకున్న కొత్త కోడళ్లకు బతుకమ్మ చీరలు కూడా అందడం లేదు. 

ఆరుసార్లు దరఖాస్తు చేశా.... 
నా ఇద్దరు పిల్లలపేర్లు రేషన్‌కార్డులో నమోదు చేయాలని మీ సేవలో ఆరుసార్లు దరఖాస్తు చేశా. ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్‌కార్డులో మా పిల్లల పేర్లు నమోదు చేయాలి.  –బోలుమల్ల మహేందర్, రాంచంద్రాపూర్, కోహెడ

రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల్లో చేర్పులకు పెండింగ్‌ దరఖాస్తులు ఇలా (ఆయా లాగిన్‌లలో) 
రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ 5,67,927 
తహసీల్దార్‌ 68,462 
డీఎస్‌ఓ 3,97,629 

మీ సేవ సర్వర్‌ దరఖాస్తు తీసుకోవడం లేదు.. 
నాకు ముగ్గురు పిల్లలు. రెండేళ్ల క్రితం రెండోబాబు పుట్టిన తర్వాత రేషన్‌కార్డులో పేరు నమోదుకు దరఖాస్తు చేశా. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇంతలోనే మూడో బాబు పుట్టిన తర్వాత మళ్లీ పేరు నమోదుకు  మీసేవ కేంద్రానికి వెళ్లితే సర్వర్‌ అప్లికేషన్‌ తీసుకో వడం లేదు. పాత అప్లికేషన్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో కొత్తగా తీసుకోవడం లేదు.   – రంగు ఆంజనేయులు, పాలమాకుల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement