ఉన్నది పోయె.. కొత్తది రాదాయె!
రేషన్‌కార్డులు లేక పేదల అగచాట్లు
జిల్లాలో 1.15 లక్షల మంది ఎదురు చూపు
ఆధార్ సీడింగ్ పేరుతో తొలగించినవి 6.09 లక్షల కార్డులు
రేషన్ కార్డుల కోసం పేదలు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు సర్వేలు, ఆధార్ సీడింగ్ పేరుతో ఉన్న కార్డులను తొలగించారు. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు అతీగతీ లేదు. ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. సంక్షేమ పథకాలకు దూరమవుతున్నా పాలకులూ స్పందించడంలేదని అర్హులైన లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
తిరుపతి : రేషన్ కార్డుల కోసం పేద ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అర్జీలు చేత పట్టుకుని రెవెన్యూ కార్యాలయా లు, అధికార పార్టీ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు మాత్రం అదిగో అంటూ పేదలను మభ్యపెడుతూనే ఉన్నారు. గత జన్మభూమిలో రేషన్‌కార్డుల కోసం ఇచ్చిన అర్జీలు, ప్రజావాణి, మండ ల కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యా ప్తంగా 1.15 లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జన్మభూమి కమిటీ ఆమో దం తెలిపి అర్హమైనవిగా గుర్తించి నవి దాదాపు లక్షకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం ఈపీడీఎస్ వెబ్‌సైట్‌లో వీటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంది. కానీ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
రేషన్ కోత...
ఆధార్ లింక్ పేరుతో పేదల రేషన్‌కార్డులకు ప్రభుత్వం ఎసరు పెట్టిం ది. జిల్లాలో మొత్తం 10,30,917 రేషన్ కార్డులు ఉండగా, ఇందులో 82,086 కార్డులను ఇన్ యాక్టివ్(స్తబ్దత)లో ఉంచారు. పేదలు కొంత మంది ఆధార్ కార్డు ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల లింక్ కాకపోవడంతో రేషన్ బియ్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయాల చుట్టూ తిరిగి పలుమార్లు ఆధార్‌కార్డు ఇచ్చినప్పటికీ కార్డు యాక్టివ్ కావడం లేదు. దీనికి తోడు డబుల్ ఎంట్రీల పేరుతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 6,09,260 యూనిట్లను తొలగించారు. ఇదికాక బయోమెట్రిక్ విధానం పేరుతో కూడా ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ-పాస్ యంత్రాలు కొన్ని చోట్ల మొరాయించడంతో డీలర్ల వద్దకు రేషన్ సరుకుల కోసం పలుమార్లు వెళ్లాల్సి వస్తోంది.
సంక్షేమ ఫలాలకూ లింక్
ప్రతి సంక్షేమ పథకానికీ ప్రభుత్వం రేషన్ కార్డును లింక్ పెట్టింది. కార్డుల్లేనివారు సంక్షేమ ఫలాలను పొందలేక నష్ట పోతున్నారు. కొంతమంది వృద్ధులు, వికలాంగులకు పింఛన్లకు సంబంధించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రేషన్‌కార్డులు లేకపోవడంతో పింఛన్ అందడం లేదు.
ముఖ్యంగా ఉపకార వేతనాలు, సంక్షేమ రుణాలతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ వంటి సంక్షేమ పథకాలకు ఎంపికవ్వక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తకార్డులు రాక, కార్డుల వెరిఫికేషన్, ఆధార్‌లింక్‌తో ఉన్న కార్డులను తొ లగించడంతో ప్రజలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.