‘ఆ మూడింటి’పై స్పష్టతివ్వండి | Government challenging to High Court | Sakshi
Sakshi News home page

‘ఆ మూడింటి’పై స్పష్టతివ్వండి

Published Fri, Aug 12 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

‘ఆ మూడింటి’పై స్పష్టతివ్వండి

‘ఆ మూడింటి’పై స్పష్టతివ్వండి

జీవోలో ఉద్యోగం సంగతి లేదేం?
* ఉమ్మడి కుటుంబంపై స్పష్టతేదీ?
* ధరల సూచీ ప్రస్తావన లేదేం?
* సర్కారును ప్రశ్నించిన హైకోర్టు
* స్పష్టత ఇవ్వాలంటూ విచారణ 16కు వాయిదా
* పారిశ్రామిక విధానం మేరకు ఉద్యోగాలు: ఏజీ
* హామీ కోరుతున్నామన్న ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో తలపెట్టిన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు భూ సేకరణ వల్ల జీవనోపాధి కోల్పోయే వారికోసం ఏ చర్యలు తీసుకుంటున్నదీ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలో పేర్కొన్న అంశాలపై హైకోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది.

నిమ్జ్ భూ సేకరణకు ఇచ్చిన జీవో 123 కొట్టివేతను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుల ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.‘‘బాధితులకు ఉద్యోగం కల్పించే విషయాన్ని జీవోలో ఎందుకు పేర్కొనలేదో చెప్పండి. ఎస్సీ, ఎస్టీలు కాని వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి జీవనభృతి కింద నెలకు రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లిస్తామని నిర్ణయించింది వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగానా, మరో అంశం ఆధారంగానా? ఉమ్మడి కుటుంబానికి రూ.7.5 లక్షలు చెల్లిస్తామన్న నేపథ్యంలో, అసలు ఉమ్మడి కుటుంబమంటే ఏమిటో స్పష్టంగా తెలియజేయండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మూడు అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
 
ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఆదేశించొచ్చు

గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు... బాధితులకు ఏయే ప్రయోజనాలు కల్పిస్తున్నదీ వివరిస్తూ జీవో జారీ చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి తెలిపారు. జీవోను పరిశీలన నిమిత్తం ధర్మాసనం ముందుంచి, అందులోని వివరాలను చదివి వినిపించారు. నిమ్జ్ కోసం 12,600 ఎకరాలు సేకరిస్తున్నామని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు వచ్చే అవకాశముందని చెప్పారు. ఉద్యోగాలివ్వాలని ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వమెలా చెప్పగలదన్నారు. విజయవాడ థర్మల్ పవర్ కార్పొరేషన్ (వీటీపీఎస్) బాధితులకు ప్రభుత్వం ఉద్యోగాలిప్పించిందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రభుత్వానికి ఆ అధికారముందని పేర్కొంది.

వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా జీవనభృతిని నిర్ణయించినట్టు భూ సేకరణ చట్టం 2013, షెడ్యూల్ 2లో పేర్కొన్నారని, అయితే ప్రభుత్వ జీవోలో మాత్రం ధరల సూచీ (సీపీఐ) ప్రస్తావనే లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి అన్నారు. అందులో పేర్కొన్న ప్రయోజనాల కంటే ఎక్కువే కల్పిస్తున్నట్టు ఏజీ చెప్పగా, సీపీఐతో సంబంధం లేకుండా జీవనభృతిని ఎలా నిర్ణయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. ‘‘భవిష్యత్తులో ధరలు పెరిగితే ప్రభుత్వమిచ్చే రూ.2,500 భృతి ఎలా సరిపోతుంది? పెరిగిన ధరల ప్రకారం అప్పుడు రూ.10 వేలు చెల్లించాల్సి రావచ్చు, మీరు రూ.2,500 మాత్రమే ఇస్తామనడం ఎలా సబబు?’’ అని ప్రశ్నించింది.

బాధితులకు ఉద్యోగం కల్పించే విషయాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదని అడిగింది. నిమ్జ్‌లో పరిశ్రమలు పెట్టేవన్నీ ప్రైవేటు కంపెనీలేనని, ఉద్యోగాలివ్వాలని వాటినెలా ఆదేశిస్తామని ఏజీ అన్నారు. తమ పారిశ్రామిక విధానం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలొస్తాయని చెప్పారు. తామూ అదే కోరుతున్నామని, స్థానికుల ఉద్యోగాల గురించే హామీ అడుగుతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.
 
అధికారులు అపార్థం చేసుకుంటే...?
ఉమ్మడి కుటుంబానికి రూ.7.5 లక్షలు ఇస్తామని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం, అంతకుముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో కుటుంబం అని మాత్రమే పేర్కొందని మూర్తి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఉమ్మడి కుటుంబం అనడం వల్ల బాధితులకు న్యాయం జరగదన్నారు. దీనిపై ధర్మాసనం వివరణ కోరగా... తల్లి, తండ్రి, పెళ్లి కాని పిల్లలు ఉమ్మడి కుటుంబంలోకి వస్తారని ఏజీ చెప్పారు. ‘‘ఈ స్పష్టత జీవోలో లేదు గనుక దాన్ని అమలు చేయాల్సిన అధికారులు మరోలా అర్థం చేసుకునే ఆస్కారముంది. కాబట్టి ఉమ్మడి కుటుంబమంటే ఏమిటో జీవోలో స్పష్టతనివ్వండి’’ అని తేల్చి చెప్పింది. నిమ్జ్ స్వరూపం ఎలా ఉండనుందో కనుక్కోవాలని మూర్తి కోరగా ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఆ వివరాలు మాకసలే అవసరం లేదు. బాధితుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది, అది నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదా అన్నదే చూస్తాం. మిగతా వాటన్నింటినీ తుది విచారణలో తేలుస్తాం’’ అంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement