National Investment and Manufacturing Zone
-
చావనైనా చస్తాం.. భూములిచ్చే ప్రసక్తే లేదు’
సాక్షి, సంగారెడ్డి: నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్షరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని మెజారిటీ రైతులు స్పష్టంచేశారు. ‘ఒక్కో కుటుంబానికి ఉన్న రెండు, మూడెకరాల సాగు భూమిని ఇవ్వడం కుదరదు. భూమి తల్లిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడి బతుకుతున్నాం.. ఉన్న భూమిని కూడా లాక్కుంటే మేము ఎలా బతకాలి. చావనైనా చస్తాం గాని.. భూములను మాత్రం ఇచ్చే ప్రసక్తేలేదు’అని మెజారిటీ రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘నిమ్జ్’కోసం టీఎస్ఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఝరాసంగం మండలంలోని బర్ధిపూర్ గ్రామ శివారులో బుధవారం ‘పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ’కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికోసం ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. అయితే నిమ్జ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడతారనుకున్న గ్రామాల ప్రజలను, సామాజిక సేవా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను వేదికవద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అనేకమందిని పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుని వెనక్కు పంపించారు. చదవండి: ‘ఆటో’మేటిక్‌గా బతుకు‘చక్రం’ తిరిగింది సమీప గ్రామాల ప్రజలు కొందరిని మాత్రమే వేదిక వద్దకు అనుమతించారు. అక్కడకూడా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వెంటనే వారిని బయటకు పంపించివేశారు. కాగా, పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిమ్జ్‌ను వ్యతిరేకిస్తున్న వందలాది మంది రైతులు పోలీసులకు చిక్కకుండా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెజారిటీ రైతులు, ప్రజలు నిమ్జ్‌కు వ్యతిరేకంగానే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు తదితరులు మాట్లాడారు. భూములు కోల్పోతున్న వారి పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రజలకు నచ్చజెప్పారు. భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని, భూములు కోల్పోతున్న వారి కుటుంబంలో ఒకరికి, అవకాశం ఉంటే ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించాలని వారు అధికారులకు సూచించారు. రైతులు, ప్రజలు అపోహ పడవద్దని, కాలుష్య రహిత ఫ్యాక్టరీలే ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలిపారు. జాతీయ పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రం దేశానికే తలమానికం కాబోతున్నదని టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి అన్నారు. దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు. -
‘ఆ మూడింటి’పై స్పష్టతివ్వండి
జీవోలో ఉద్యోగం సంగతి లేదేం? * ఉమ్మడి కుటుంబంపై స్పష్టతేదీ? * ధరల సూచీ ప్రస్తావన లేదేం? * సర్కారును ప్రశ్నించిన హైకోర్టు * స్పష్టత ఇవ్వాలంటూ విచారణ 16కు వాయిదా * పారిశ్రామిక విధానం మేరకు ఉద్యోగాలు: ఏజీ * హామీ కోరుతున్నామన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో తలపెట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు భూ సేకరణ వల్ల జీవనోపాధి కోల్పోయే వారికోసం ఏ చర్యలు తీసుకుంటున్నదీ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలో పేర్కొన్న అంశాలపై హైకోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. నిమ్జ్ భూ సేకరణకు ఇచ్చిన జీవో 123 కొట్టివేతను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావుల ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.‘‘బాధితులకు ఉద్యోగం కల్పించే విషయాన్ని జీవోలో ఎందుకు పేర్కొనలేదో చెప్పండి. ఎస్సీ, ఎస్టీలు కాని వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి జీవనభృతి కింద నెలకు రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లిస్తామని నిర్ణయించింది వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగానా, మరో అంశం ఆధారంగానా? ఉమ్మడి కుటుంబానికి రూ.7.5 లక్షలు చెల్లిస్తామన్న నేపథ్యంలో, అసలు ఉమ్మడి కుటుంబమంటే ఏమిటో స్పష్టంగా తెలియజేయండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మూడు అంశాలపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం ఆదేశించొచ్చు గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు... బాధితులకు ఏయే ప్రయోజనాలు కల్పిస్తున్నదీ వివరిస్తూ జీవో జారీ చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి తెలిపారు. జీవోను పరిశీలన నిమిత్తం ధర్మాసనం ముందుంచి, అందులోని వివరాలను చదివి వినిపించారు. నిమ్జ్ కోసం 12,600 ఎకరాలు సేకరిస్తున్నామని, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు వచ్చే అవకాశముందని చెప్పారు. ఉద్యోగాలివ్వాలని ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వమెలా చెప్పగలదన్నారు. విజయవాడ థర్మల్ పవర్ కార్పొరేషన్ (వీటీపీఎస్) బాధితులకు ప్రభుత్వం ఉద్యోగాలిప్పించిందని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రభుత్వానికి ఆ అధికారముందని పేర్కొంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా జీవనభృతిని నిర్ణయించినట్టు భూ సేకరణ చట్టం 2013, షెడ్యూల్ 2లో పేర్కొన్నారని, అయితే ప్రభుత్వ జీవోలో మాత్రం ధరల సూచీ (సీపీఐ) ప్రస్తావనే లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది మూర్తి అన్నారు. అందులో పేర్కొన్న ప్రయోజనాల కంటే ఎక్కువే కల్పిస్తున్నట్టు ఏజీ చెప్పగా, సీపీఐతో సంబంధం లేకుండా జీవనభృతిని ఎలా నిర్ణయిస్తారని ధర్మాసనం ప్రశ్నిం చింది. ‘‘భవిష్యత్తులో ధరలు పెరిగితే ప్రభుత్వమిచ్చే రూ.2,500 భృతి ఎలా సరిపోతుంది? పెరిగిన ధరల ప్రకారం అప్పుడు రూ.10 వేలు చెల్లించాల్సి రావచ్చు, మీరు రూ.2,500 మాత్రమే ఇస్తామనడం ఎలా సబబు?’’ అని ప్రశ్నించింది. బాధితులకు ఉద్యోగం కల్పించే విషయాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదని అడిగింది. నిమ్జ్‌లో పరిశ్రమలు పెట్టేవన్నీ ప్రైవేటు కంపెనీలేనని, ఉద్యోగాలివ్వాలని వాటినెలా ఆదేశిస్తామని ఏజీ అన్నారు. తమ పారిశ్రామిక విధానం ప్రకారం స్థానికులకు ఉద్యోగాలొస్తాయని చెప్పారు. తామూ అదే కోరుతున్నామని, స్థానికుల ఉద్యోగాల గురించే హామీ అడుగుతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారులు అపార్థం చేసుకుంటే...? ఉమ్మడి కుటుంబానికి రూ.7.5 లక్షలు ఇస్తామని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం, అంతకుముందు దాఖలు చేసిన అఫిడవిట్లో కుటుంబం అని మాత్రమే పేర్కొందని మూర్తి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఉమ్మడి కుటుంబం అనడం వల్ల బాధితులకు న్యాయం జరగదన్నారు. దీనిపై ధర్మాసనం వివరణ కోరగా... తల్లి, తండ్రి, పెళ్లి కాని పిల్లలు ఉమ్మడి కుటుంబంలోకి వస్తారని ఏజీ చెప్పారు. ‘‘ఈ స్పష్టత జీవోలో లేదు గనుక దాన్ని అమలు చేయాల్సిన అధికారులు మరోలా అర్థం చేసుకునే ఆస్కారముంది. కాబట్టి ఉమ్మడి కుటుంబమంటే ఏమిటో జీవోలో స్పష్టతనివ్వండి’’ అని తేల్చి చెప్పింది. నిమ్జ్ స్వరూపం ఎలా ఉండనుందో కనుక్కోవాలని మూర్తి కోరగా ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఆ వివరాలు మాకసలే అవసరం లేదు. బాధితుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది, అది నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదా అన్నదే చూస్తాం. మిగతా వాటన్నింటినీ తుది విచారణలో తేలుస్తాం’’ అంది. -
మొత్తం సేకరించేదాకా భూములు తీసుకోం
* నిమ్జ్ భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం * హైకోర్టుకు నివేదన... పునరావాస చర్యలపై అఫిడవిట్ సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో తలపెట్టిన నేషనల్ ఇన్వెస్టిమెంట్ అండ్ మానిఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు మొత్తం 12,600 ఎకరాల భూమి అవసరమని, దాన్నంతా సేకరించేదాకా ఏ ఒక్కరి భూమినీ స్వాధీనం చేసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. చివరి ఎకరా సేకరించేంతదాకా భూ యజమానులు సాగు కొనసాగించుకోవచ్చు. కాబట్టి ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కార్మికులకు ఎలాంటి నష్టమూ ఉండదు. భూములను స్వాధీనం చేసుకునేటప్పుడు బాధితులకు ఏం చేయాలని నిర్ణయించామో అవన్నీ చేస్తాం. ఈ విషయంలో కలెక్టర్లకు ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికి 1,500 ఎకరాలు సేకరించాం. మిగతా భూమిని కూడా సేకరించాకే నిమ్జ్‌ను ప్రారంభిస్తాం. ఆ 1,500 ఎకరాలను స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేశాం. కొనగలిగినంత మంది నుంచి కొంటాం. ఆ తరవాత భూ సేకరణ చట్టం కింద సేకరిస్తాం. ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం తదితర ప్రజావసరాల నిమిత్తం జీవో 123 ద్వారా తాము తీసుకుంటున్న భూముల వల్ల జీవనాధారం ప్రభావితమయ్యే వారి, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. భూముల్లేని, మూడేళ్లుగా గ్రామంలో నివసిస్తున్న వ్యవసాయ కార్మికుల కోసమూ చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించింది. 2013 భూ సేకరణ చట్టం కింద లభించే ప్రయోజనాలను, ప్రభుత్వ పునరావాస ప్రతిపాదనలను టేబుల్ రూపంలో సమర్పించింది. వాటిని పరిశీలించిన ధర్మాసనం, ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇది మంచి పథకంగానే కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పరిహార ప్రతిపాదనలపై ఏమంటారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్లతో చర్చించి చెబుతాననడంతో ఆయన కోరిక మేరకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ ప్రతిపాదనలివీ... ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను రైతుల నుంచి కొనుగోలు చేసే నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడం, దాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయడం, భూ సేకరణతో జీవనోపాధి కోల్పోతున్న వారికోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ) కె.ప్రదీప్ చంద్ర సోమవారం అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచారు. దాన్ని పరిశీలించిన జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుల ధర్మాసనం, ఈ చెల్లింపులన్నీ 2013 భూ సేకరణ చట్టం కన్నా మెరుగ్గానే ఉన్నాయా అని ప్రశ్నించింది. అవునని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండింటినీ తులనాత్మకంగా టేబుల్ రూపంలో వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో అనేక కీలకాంశాలు, విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున కేసును విస్తృత ధర్మాసనానికి నివేదిస్తే ఎలా ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించగా, కేసు కొలిక్కి వచ్చాక పరిస్థితిని బట్టి నిర్ణయించవచ్చని బదులిచ్చారు. జీవో 123పై మరిన్ని పిటిషన్లు జీవో 123పై హైకోర్టులో మరిన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ అభ్యర్థనలొచ్చాయి. తాను ఓ పార్టీ తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేశానని సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ చెప్పడంతో, పార్టీలకు అనుమతిచ్చేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఒప్పందాల ద్వారా భూముల కొనుగోలు నిమిత్తం జారీ చేసిన పలు జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపైనా వాదనలు మొదలయ్యాయి. ఇవి మంగళవారమూ కొనసాగుతాయి. -
నిమ్జ్‌కు భూసేకరణ చట్టం బ్రేకులు
భూసేకరణకు అడ్డంకిగా మారిన ‘రైతుకు వాటా’ నిబంధన చట్టంలో మార్పుల అనంతరమే ముందుకు హైదరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుకానున్న ‘జాతీయ పెట్టుబడి మరియు మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’కు భూ సేకరణ చట్టం అడ్డంకిగా మారింది. చట్టంలోని నిబంధన ల నేపథ్యంలో భూమిని సేకరించడం పెద సమస్యగా మారడంతో దానిని తాత్కాలికంగా నిలిపివేశారు. నిమ్జ్ ఏర్పాటు కోసం వ్యవసాయయోగ్యం కాని భూముల వివరాలను ఇప్పటికే పరిశ్రమలశాఖ సేకరించింది. ఏయే ప్రాంతంలో ఎంత భూమిని సేకరిం చాలనేది కూడా గుర్తించింది. చివరకు భూమిని సేకరించే సమయానికి ‘రైతు నుంచి సేకరించిన భూమికి భూమి ఇవ్వడం, నివాసయోగ్యం కల్పించడంతోపాటు, సదరు ప్రాజెక్టులో వాటా కూడా ఇవ్వాలి’ అనే భూసేకరణ చట్టంలోని నిబంధన కారణంగా దానికి బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ చట్టాన్ని మార్చాలని కేంద్రంపై అనేక రాష్ట్రాలు ఒత్తిడి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో జరిగిన రెవెన్యూ మంత్రుల సమావేశంలో ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ చట్టంలో మార్పులు చేసేందుకు సానుకూలంగా ఉందని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. చట్టంలో మార్పులు చేసిన అనంతరమే నిమ్జ్‌కు భూసేకరణ విషయంపై ముందుకెళతామని పరిశ్రమలశాఖవర్గాలు పేర్కొంటున్నాయి. ‘వాస్తవానికి నిమ్జ్ విధానాన్ని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో నిమ్జ్ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా అన్న మీమాంస ఉండేది. బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో అనుమానానికి తెరపడింది. ఇక భూసేకరణకు కూడా మార్గం సుగమం అయితే తెలంగాణ రా ష్ర్టంలో భారీగా మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీరంగ) పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. తద్వారా తక్కువ తరగతి చదువుకున్న నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి’ అని పరిశ్రమలశాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు.