* నిమ్జ్ భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం
* హైకోర్టుకు నివేదన... పునరావాస చర్యలపై అఫిడవిట్
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లాలో తలపెట్టిన నేషనల్ ఇన్వెస్టిమెంట్ అండ్ మానిఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు మొత్తం 12,600 ఎకరాల భూమి అవసరమని, దాన్నంతా సేకరించేదాకా ఏ ఒక్కరి భూమినీ స్వాధీనం చేసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. చివరి ఎకరా సేకరించేంతదాకా భూ యజమానులు సాగు కొనసాగించుకోవచ్చు. కాబట్టి ఆ భూములపై ఆధారపడ్డ వ్యవసాయ కార్మికులకు ఎలాంటి నష్టమూ ఉండదు. భూములను స్వాధీనం చేసుకునేటప్పుడు బాధితులకు ఏం చేయాలని నిర్ణయించామో అవన్నీ చేస్తాం.
ఈ విషయంలో కలెక్టర్లకు ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికి 1,500 ఎకరాలు సేకరించాం. మిగతా భూమిని కూడా సేకరించాకే నిమ్జ్‌ను ప్రారంభిస్తాం. ఆ 1,500 ఎకరాలను స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేశాం. కొనగలిగినంత మంది నుంచి కొంటాం. ఆ తరవాత భూ సేకరణ చట్టం కింద సేకరిస్తాం. ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం తదితర ప్రజావసరాల నిమిత్తం జీవో 123 ద్వారా తాము తీసుకుంటున్న భూముల వల్ల జీవనాధారం ప్రభావితమయ్యే వారి, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం.
భూముల్లేని, మూడేళ్లుగా గ్రామంలో నివసిస్తున్న వ్యవసాయ కార్మికుల కోసమూ చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించింది. 2013 భూ సేకరణ చట్టం కింద లభించే ప్రయోజనాలను, ప్రభుత్వ పునరావాస ప్రతిపాదనలను టేబుల్ రూపంలో సమర్పించింది. వాటిని పరిశీలించిన ధర్మాసనం, ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇది మంచి పథకంగానే కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పరిహార ప్రతిపాదనలపై ఏమంటారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పిటిషనర్లతో చర్చించి చెబుతాననడంతో ఆయన కోరిక మేరకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వ ప్రతిపాదనలివీ...
ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను రైతుల నుంచి కొనుగోలు చేసే నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడం, దాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయడం, భూ సేకరణతో జీవనోపాధి కోల్పోతున్న వారికోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ) కె.ప్రదీప్ చంద్ర సోమవారం అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచారు.
దాన్ని పరిశీలించిన జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుల ధర్మాసనం, ఈ చెల్లింపులన్నీ 2013 భూ సేకరణ చట్టం కన్నా మెరుగ్గానే ఉన్నాయా అని ప్రశ్నించింది. అవునని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి చెప్పారు. రెండింటినీ తులనాత్మకంగా టేబుల్ రూపంలో వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో అనేక కీలకాంశాలు, విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున కేసును విస్తృత ధర్మాసనానికి నివేదిస్తే ఎలా ఉంటుందని ధర్మాసనం ప్రశ్నించగా, కేసు కొలిక్కి వచ్చాక పరిస్థితిని బట్టి నిర్ణయించవచ్చని బదులిచ్చారు.
జీవో 123పై మరిన్ని పిటిషన్లు
జీవో 123పై హైకోర్టులో మరిన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ అభ్యర్థనలొచ్చాయి. తాను ఓ పార్టీ తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేశానని సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ చెప్పడంతో, పార్టీలకు అనుమతిచ్చేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఒప్పందాల ద్వారా భూముల కొనుగోలు నిమిత్తం జారీ చేసిన పలు జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపైనా వాదనలు మొదలయ్యాయి. ఇవి మంగళవారమూ కొనసాగుతాయి.
మొత్తం సేకరించేదాకా భూములు తీసుకోం
Published Tue, Aug 9 2016 3:53 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM
Advertisement