సమస్యను పరిష్కరించడం ఒక పద్దతి. సమస్యకు మూలం కనుక్కుని, మళ్లీ అది తలెత్తకుండా చికిత్స చేయడం ఇంకో పద్ధతి. డాక్టర్ అభయ్ దంపతులు రెండో పద్ధతిని ఎంచుకుని... మారుమూల గ్రామాల్లోకి వెళ్లిపోయారు! ఫారిన్‌లో మెడిసిన్ చేసి వచ్చినా, పట్టణాల్లోనే ఉండిపోకుండా ఆదివాసీల ముంగిళ్లకెళ్లి, గత ముప్పై ఏళ్లుగా వైద్య, సామాజిక సేవలు అందిస్తున్నారు. యువ వైద్యులకు స్ఫూర్తిగా వీరు సాధించిన విజయాలే ఈవారం ‘జనహితం’.
అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ’ నుంచి ఎంపిహెచ్ (మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్) పట్టాపుచ్చుకున్నారు అభయ్ బంగ్, రాణి బంగ్ దంపతులు. పొరుగుదేశాల్లో పేరు ప్రతిష్టలతో పాటు బోలెడంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ అన్నింటినీ వదులుకుని ఆదివాసి, గ్రామీణ ప్రజలసేవలతో తరించాలనుకున్నారు. అందుకోసం గడ్‌చిరోలిని ఎంచుకున్నారు. దేశంలోని వెనకబడ్డ ప్రాంతాల్లో అది ఒకటి. అంతేకాదు, మహారాష్ర్టలో అతిపేద జిల్లా. అక్షరం, ఆరోగ్యం అనే పదాలు తెలియని ఆదివాసీ ప్రాంతం అది.
సేవా వారసత్వం...
అభయ్‌బంగ్ తండ్రి ఠాకూర్ దాస్‌బంగ్ మహాత్మాగాంధీ అనుచరుల్లో ఒకరు. పైచదువులకోసం ఇంగ్లండ్ వెళ్లాల్సిన ఠాకూర్‌దాస్ గాంధీజీ ఆజ్ఞమేరకు గ్రామీణప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు చేశారు. ఆ కారణంగా అభయ్‌బంగ్ వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమం పరిసరాల్లో పెరగడంతో బాల్యం నుంచి గాంధీజి పారంభించిన ‘నయా తాలీం’(నూతన శిక్షణ పద్ధతి)లో విద్యాభ్యాసం చేశారు. దాంతో చిన్నవయసులోనే పేదలకు సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగపూర్ మెడికల్ కాలేజీలో చదువుతుండగా రాణితో పరిచయం ఏర్పడింది. తమ ఆలోచనల తీరు, ఆశయాలు ఒకటే అవడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.
అమెరికాలో చదువుతున్నప్పుడు గడ్‌చిరోలిలోని గ్రామాల వివరాలు సేకరించి వారు చేయదలుచుకున్న సేవాకార్యక్రమాలకు స్కెచ్ వేసుకున్నారు. 1980లో గడ్‌చిరోలికి వచ్చారు. ఓ ఐదేళ్లపాటు పరిశోధనలు చేసి... 1985లో సెర్చ్‌సంస్థని నెలకొల్పారు. ముందుగా గ్రామీణులు తరచు ఎదుర్కొనే జబ్బుల వివరాలు తీసుకుని వాటికి వైద్యం మొదలుపెట్టారు. ఆ జబ్బుల వెనకున్న జీవనవిధానాల్లో మార్పు తేవడానికి కావాల్సిన పథకాలను రచించి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటి నిర్మూలనకు పూనుకున్నారు.
శిశుమరణాలపై...
ఈ దంపతులు మొదటగా గడ్‌చిరోలిలోని గ్రామీణప్రాంతాల్లోని శిశుమరణాలపై పరిశోధన జరిపారు. వెయ్యిమంది పిల్లలు పుడితే 120 మందికంటే ఎక్కువ బతకడంలేదు. మరో చిత్రమైన విషయం...నూటికి 83 శాతం మందికి ప్రసవాలు ఇంటిదగ్గరే. దాంతో గడ్‌చిరోలిలోని ఒక కుగ్రామంలో అభయ్ బంగ్, రాణి బంగ్‌ల ఇల్లు కొన్నాళ్లకి ఆసుపత్రిలా మారిపోయింది. సెర్చ్ సెంటర్‌లో కొందరు గ్రామీణ మహిళలకు ఇంటి దగ్గర ప్రసవానికి పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేసరికి శిశుమరణాల సంఖ్యని తగ్గించగలిగారు గైనకాలజిస్టు రాణి.
మరోపక్క అభయ్ బంగ్ ఫిజిషియన్‌గా సేవలు అందిస్తూనే...పేదల గుడిసెల మధ్యన ఏరులై పారుతున్న మద్యంపై దృష్టి పెట్టారు. దీంతోపాటు అనేక వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు వైద్యం చేస్తున్నారు. అన్నింటికీ అసలు కారణం నిరక్షరాస్యతేనంటూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి వీధిపిల్లలను దగ్గరుండి మరీ పాఠశాలల్లో చేర్పించారు. అంతేకాదు, శిశుమరణాల వివరాలు ప్రభుత్వం దృష్టికి రాకపోడాన్ని నేరంగా పరిగణించాలంటూ ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా పోరాడారు.
విద్య, వైద్యం కొరవడిన చోట జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో దగ్గరగా చూసిన ఈ దంపతులు శిశుమరణాలకు న్యూమోనియాలాంటి వ్యాధులు కారణమని తెలుసుకున్నారు. దానిని నిర్థారించేందుకు ‘బ్రెత్ కౌంటర్’ (శ్వాసను కౌంట్‌చేసే యంత్రం)ను కనుగొన్నారు. అలాగే వీరు చేపట్టిన పలు వైద్య చికిత్సా పద్ధతుల ద్వారా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పద్ధతిని దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించాలని భావిస్తోంది.
మద్యరహిత ప్రాంతంగా గడ్‌చిరోలి
గడ్‌చిరోలి మురికివాడల్లో మద్యం బారిన పడ్డ కుటుంబాలకు కౌన్సెలింగ్, అవసరమైతే వైద్యం చేసి ఆ మత్తు వదిలించడంలో విజయం సాధించారు అభయ్, రాణి. ఈ దంపతులు మద్యంపై పదేళ్లపాటు చేసిన పోరాటం ఫలితంగా గడ్‌చిరోలి మద్యపాన రహిత జిల్లాగా నిలిచింది. విదేశాల్లో విలాసంగా జీవించాల్సిన బంగ్ దంపతులు తమ విద్యను, వైద్యాన్ని దేశంలోని పేదప్రాంతానికి అంకితం చేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన ‘మహారాష్ట్ర భూషణ్’ పురస్కారం సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ అవార్డులు, రివార్డులు వారిని వరించాయి.
- గుండారి శ్రీనివాస్, ముంబై
మేం వచ్చిన కొత్తలో ఇక్కడి మహిళలెవరూ మాతో కలిసేవారు కాదు. మా వైద్యానికి వారు అలవాటు పడడానికి సమయం పట్టినా... అతి తక్కువ సమయంలోనే వారిలో చాలా విషయాలపై అవగాహన తెప్పించగలిగాము. ఫలితంగా గర్భస్థ శిశువుల మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. పౌష్టికాహారం మొదలు...ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలవరకూ... ఇలా ప్రతి ఇంటికీ మా సేవలు వెళ్లడానికి రెండు దశాబ్దాల సమయం పట్టింది.
ఆదివాసీలకు అభయ్ హస్తాలు
Published Thu, Nov 7 2013 10:57 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement