John Hopkins University
-
మూడేళ్లలో 60 లక్షల మరణాలు
బ్యాంకాక్: కోవిడ్–19 ప్రబలిన మూడేళ్లలో ప్రపంచదేశాల్లో 60 లక్షల మందిని బలితీసుకుంది. ఇప్పటికీ వైరస్ తీవ్రతతో చాలా దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. మాస్క్ ధరించడం మానేసి, ప్రయాణాలు, వ్యాపారాలు తిరిగి మొదలైనా ఈ మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. గత నాలుగు నెలల్లోనే 10 లక్షల కోవిడ్ మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఇప్పటి వరకు వైరస్ సోకని పసిఫిక్ ద్వీపాల్లో సైతం మొదటి వేవ్ ప్రజలను వణికిస్తోంది. హాంకాంగ్ ప్రభుత్వం ఈ ఒక్క నెలలోనే మొత్తం 75 లక్షల మంది ప్రజలకు మూడు పర్యాయాలు కరోనా పరీక్షలు జరిపింది. అయినప్పటికీ అక్కడ రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 10 లక్షల మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 45 కోట్ల మంది కోవిడ్ బారినపడినట్లు లెక్కలు తేల్చింది. అయితే, కోవిడ్‌తో 1.40 కోట్ల నుంచి 2.35 కోట్ల మంది మరణించినట్లు ‘ది ఎకనామిస్ట్’విశ్లేషకుల అంచనా. చైనాలో మళ్లీ కోవిడ్ చైనా ప్రభుత్వం కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించేందుకు అత్యంత కఠినమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు కొత్తగా బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో సోమవారం ఒక్క రోజు వ్యవధిలో వెలుగు చూసిన 214 కొత్త కేసుల్లో గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులో 69, జిలిన్లో 54, షాడోంగ్ ప్రావిన్స్‌లో 46 నిర్ధారణ అయినట్లు ప్రధాని లీ కెకియాంగ్ తాజాగా నేషనల్ లెజిస్లేచర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో తెలిపారు. 2019లో వూహాన్లో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ జాడలు వెలుగుచూశాక ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. దేశ రాజధాని బీజింగ్‌లో కొత్తగా కేసులు రానప్పటికీ మాస్క్ తప్పనిసరి చేశారు. కోవిడ్ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. స్వల్పసంఖ్యలో కేసులు బయటపడిన చోట్ల కూడా క్వారంటైన్, లాక్డౌన్లను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. బీజింగ్‌లోని ప్రముఖ బౌద్ధాలయాలు, చర్చిలు, మసీదులను జనవరి నుంచి నిరవధికంగా మూసే ఉంచారు.చైనాలో ఇప్పటి వరకు 1,11,195 కేసులు, 4,636 మరణాలు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,837 మంది కోవిడ్‌తో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. -
కోవిడ్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదం!
జెనీవా: కోవిడ్ ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ పరిస్థితుల ఆధారంగా కరోనా సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ దేశాలకు హితవు పలికింది. చైనాలోని వూహాన్లో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాది గడిచిపోయినప్పటికీ దాని చుట్టూ ఇంకా ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. కరోనా వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు, గాలిలో నాణ్యత వంటి అంశాలు ఎలా ప్రేరేపిస్తున్నాయనే దిశగా యూఎన్‌కి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు చేసిన 16 మంది సభ్యుల బృందం అధ్యయనం నిర్వహించింది. వీరి అధ్యయనంలో ఈ వైరస్ సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదముందని తేలింది. శ్వాస కోశకు సంబంధించిన వ్యాధులన్నీ సీజనల్‌గానే వస్తాయని, శీతల వాతావరణం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధులు ఎక్కువని చెప్పింది. ఇక ఫ్లూ తరహా వ్యాధులు కూడా సమశీతోష్ణ ప్రాంతాల్లో కూడా తరచూ విజృంభిస్తూ ఉంటాయని వెల్లడించింది . కరోనా, ఫ్లూ ఇంచుమించుగా ఒకటే రకం వ్యాధి కావడంతో ఇదే పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే కరోనా కూడా సీజనల్ వ్యాధిగా మారుతుందని ఆ బృందం అభిప్రాయపడింది. అందుకే ఇప్పటికిప్పుడు వాతావరణ మార్పుల్ని అంచనా వేసుకొని కోవిడ్ ఆంక్షల్ని సడిలించవద్దని హెచ్చరించింది. అత్యంత శీతల వాతావరణంలో కరోనా వ్యాప్తి ఎలా చెందుతోందో, వేడి వాతావరణంలో కూడా అదే స్థాయిలో విజృంభిస్తోందని వచ్చే సీజన్లలో కూడా అలాగే జరిగే అవకాశం ఉందని బృందానికి నేతృత్వం వహించిన జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి శాస్త్రవేత్త బెన్ జెయిట్‌చిక్ చెప్పారు. -
అమెరికాలో ఒక్కరోజే 3,157 కోవిడ్ మరణాలు
న్యూయార్క్: అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,157 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 1,00,226 మంది ఆసుపత్రిపాలయ్యారు. రాబోయే తీవ్రమైన చలిరోజుల్లో దేశం మరింత గడ్డుపరిస్థితులను ఎదుర్కోక తప్పదని అమెరికా ప్రధాన వైద్యాధికారి హెచ్చరించారు. ఏప్రిల్ 15తో పోల్చుకుంటే కోవిడ్ మరణాల సంఖ్య 20 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 2,80,581 మంది మరణించగా, 14.3 మిలియన్ల మందికి కోవిడ్ సోకినట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్స్ హెచ్చరించారు. ఎక్కువ మంది ఒకచోట చేరకూడదని హెచ్చరిస్తున్నా వినకుండా, గత వారంలో జరిగిన థ్యాంక్స్ గివింగ్ లాంటి ఉత్సవాలను జరుపుకునేందుకు లక్షలాది మంది అమెరికన్లు ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించడం కూడా కోవిడ్ వ్యాప్తికి కారణమని భావిస్తున్నారు. -
కొత్తగా 24,850 కేసులు
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తి నానాటికీ విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. కేవలం ఒక్కరోజు వ్యవధిలో 24,850 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 613 మంది బాధితులను కరోనా పొట్టనపెట్టుకుంది. దేశంలో ఇప్పటివరకు 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం, ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కి, మరణాల సంఖ్య 19,268కు చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 2,44,814. చికిత్సతో 4,09,082 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 60.77 శాతంగా నమోదయ్యింది. ప్రపంచంలో కరోనా ప్రభావిత దేశాల్లో భారత్ 4వ స్థానానికి చేరిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా ఉన్నాయి. కరోనా సంబంధిత మరణాల్లో భారత్ 8వ స్థానంలో నిలిచింది. 78 శాతం కేసులు 7 రాష్ట్రాల్లోనే.. దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 78 శాతం కేవలం 7 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం, బిహార్ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 7,074 కేసులు, తమిళనాడులో 4,280 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం, బిహార్‌లో కలిపి 7,935 కేసులు నిర్ధారణయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం 97,89,066 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మహారాష్ట్రలో 2 లక్షలు సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షల మార్కును దాటేశాయి. రాష్ట్రంలో లక్ష కేసులకు 97 రోజులు పట్టగా, తర్వాత 22 రోజుల్లోనే మరో లక్ష కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 24 గంటల్లో 7,074 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,064కు చేరింది. గడిచిన 24 గంటల్లో 124 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 8,671కి చేరింది. రాష్ట్రంలో 1,08,082 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో రికవరీ రేటు 54.02 శాతంగా ఉంది. -
‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!
వాషింగ్టన్: కరోనా వైరస్ సోకిన తొలినాళ్లలోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి సోకనట్లు తప్పుడు ఫలితాలు రావచ్చని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. లక్షణాలు కనిపించాక మూడు రోజులకు పరీక్షలు చేయడం మేలని అధ్యయనం సూచించింది. అధ్యయనంలో భాగంగా తాము 1330 మంది రోగుల నమూనాలను విశ్లేషించామని, ఆసుపత్రిలో చేరిన రోగులతోపాటు పలు వర్గాల వారు ఇందులో ఉన్నారని లారెన్ కౌసిర్కా అనే శాస్త్రవేత్త తెలిపారు. ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ ఫలితాలు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన సమయం ఆధారంగా తాము పరీక్షల ఫలితం నెగటివ్ వచ్చేందుకు ఉన్న అవకాశాలను లెక్కించామని తెలిపారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించేటప్పుడు ముక్కు, గొంతుల్లోని ద్రవాల నమూనాలు సేకరించడంతోపాటు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి అన్నదీ నమోదు చేస్తారని ఈ సమాచారం ద్వారా తాము వైరస్ సోకిన తరువాత నాలుగు రోజులకు పరీక్షలు చేస్తే 67 శాతం నెగటివ్ ఫలితాలు రావచ్చునని అంచనా వేసినట్లు వివరించారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ వైరస్ ఉన్నట్లుగానే భావించి చికిత్స అందించాలని సూచించారు. కరోనా పరీక్షల్లోని ఈ లోటును రోగులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. జూలైలో మోడెర్నా కోవిడ్ టీకా పరీక్షలు కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన వ్యాక్సిన్‌ను జూలైలో భారీగా ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడనున్నట్లు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా ప్రకటించాయి. జూలైలో 30 వేల మంది వలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించి చూస్తామని, ఇందుకు అవసరమైన డోసులను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచామని తెలిపాయి. పెద్దల్లో ఎలా పనిచేస్తుందో చూడటమే కీలకమైన ఈ ప్రయోగ ఉద్దేశం. మార్చిలో 45 మంది వలంటీర్లపై ప్రారంభ ప్రయోగం ఫలితాలు అందాల్సి ఉంది. -
కొనసాగుతున్న విధ్వంసం
పారిస్: కరోనా మృత్యుపాశానికి బలవుతున్న వారి సంఖ్య బుధవారం నాటికి మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 186 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య ఏకంగా 43,082కు చేరుకోగా, వైరస్ సోకిన వారి సంఖ్య 8.65 లక్షలు దాటిపోయింది. అయితే సుమారు 1.72 లక్షల మంది చికిత్స తరువాత వ్యాధి నయమై ఇళ్లకు చేరుకోవడం ఒకింత సాంత్వన కలిగించే అంశం. గత ఏడాది చైనాలో తొలిసారి గుర్తించిన ఈ వైరస్ ఇప్పుడు యూరప్, అమెరికాల్లో తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. అమెరికాలో 4వేల మంది.. న్యూయార్క్: అమెరికాలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య నాలుగు వేలు దాటిపోయింది. ఈ మరణాల పరంపర ఇప్పుడిప్పుడే ఆగేది కాదని, అమెరికాలోనే సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రాణాలను బలిగొనే అవకాశముందని ఆ దేశంలోనే అత్యున్నత ఆరోగ్య నిపుణుడు హెచ్చరించడం ఆందోళన కలిగించే అంశమైంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి సుమారు 1,90,000 మంది వైరస్ బారిన పడగా, నాలుగు వేల మంది మరణించారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్ చెబుతోంది. 2001నాటి అల్‌ఖైదా దాడుల్లో మరణించిన వారు మూడు వేల వరకూ ఉంటే కరోనా మృతుల సంఖ్య దీనికంటే ఎక్కువవడం గమనార్హం. అంతేకాదు.. కరోనావైరస్ పుట్టిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పటివరకూ దాదాపు 3,300 మంది మాత్రమే మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... అమెరికా రానున్న రెండు వారాల్లో అత్యంత కఠినమైన, వేదన భరితమైన పరిస్థితులను ఎదుర్కోనుందని, ప్రజలు ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ట్రంప్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రెండు వారాల కష్టకాలం ముందు ఉంది. ఆ తరువాత, నిపుణులు అంచనా వేస్తున్నట్లు, నేను.. మనలో చాలామంది ఆలోచిస్తున్నట్లుగా పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుందని ఆశిస్తున్నాం. అయితే ఈ రెండు వారాలు మాత్రం చాలా చాలా బాధకరంగా ఉండబోతున్నాయి’’అని స్పష్టం చేశారు. ఇరాన్లో మృతులు 3036 మంది! మధ్యప్రాచ్య దేశం ఇరాన్లో గత 24 గంటల్లో సుమారు 138 మంది కరోనా కారణంగా మరణించారని, కొత్తగా 2,987 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి కిమానౌష్ జహాన్‌పౌర్ తెలిపారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,75,93కి చేరుకోగా 3,036 మంది మరణించారని చెప్పారు. -
గాల్లోంచి నీరు.. కొత్త రికార్డు!
గాల్లోని తేమను పిండి, నీటిగా మార్చేందుకు ఇటీవలి కాలంలో బోలెడన్ని యంత్రాలు, టెక్నాలజీలూ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవేవీ అనుకున్నంత సమర్థంగా పనిచేయవు. గంటల సమయం తీసుకుని అరకొరగా నీళ్లు ఇస్తాయీ యంత్రాలు. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంఓఎఫ్)పై చేసిన ప్రయోగం అందరి దష్టిని ఆకర్శిస్తోంది. కేవలం ఒక గ్రాము మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ పదార్థం ఫుట్‌బాల్ మైదానమంత ఉపరితలం కలిగి ఉంటుంది. గతంలోనూ ఈ ఎంఓఎఫ్లతో గాల్లోని తేమను నీటిగా మార్చవచ్చునని రుజువైంది. కిలోగ్రాము ఎంఓఎఫ్తో బెర్క్లీ యూనివర్శిటీ కాలేజీ ఒక రోజులో వంద మిల్లీలీటర్ల నీటిని ఒడిసిపట్టగలిగింది. గత ఏడాది ఈ మోతాదు 1.3 లీటర్లకు చేరింది. జాన్హాప్కిన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం ఏకంగా 8.66 లీటర్ల నీటిని ఒడిసిపట్టడంలో విజయం సాధించారు. తాము ఇప్పటివరకూ దాదాపు పది ఎంఓఎఫ్లపై ప్రయోగాలు చేశామని, వీటిల్లో ఒకటి ప్రతి కిలోగ్రాము పదార్థానికి ఒక రోజులో 8.66 లీటర్ల నీటిని అందిస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝియాంగ్ షీ తెలిపారు. వాతావరణ పరిస్థితులను మార్చడం ద్వారా మరింత ఎక్కువ నీటిని రాబట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పారు. పరిశోధనల వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఆపిల్స్, టమాటాలతోఊపిరితిత్తులకు మేలు!
ధూమపానం మానేసిన వారికి ఎప్పుడూ ఓ సందేహం ఉంటుంది. కొద్దోగొప్పో పాడైన తమ ఉపిరితిత్తులను ఆరోగ్యవంతంగా చేయవచ్చా? అని. ఈ సందేహంపై జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ ప్యారిస్ శాస్త్రవేత్తలు ఒక స్పష్టత ఇచ్చారు. తినే ఆహారంలో టమాటాలతోపాటు అధిక స్థాయిలో పండ్లు ముఖ్యంగా ఆపిల్స్ తింటే ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని తగ్గిస్తుందని వారు అంటున్నారు. దాదాపు పదేళ్లపాటు తాము పరిశీలన జరిపామని.. ఈ కాలంలో ఆపిల్స్, టమాటాలు ఎక్కువగా తిన్న మాజీ ధూమపాన ప్రియుల్లో ఊపిరితిత్తుల పనితీరు ఇతరులతో పోలిస్తే మెరుగ్గా ఉందని వెనెస్సా గార్షియా లార్సెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. జర్మనీ, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు చెందిన కొంతమందిపై ఈ పరిశోధన జరిగింది. వారు తీసుకునే ఆహారం, ఊపిరితిత్తుల పనితీరును పదేళ్ల అంతరంలో రెండు సార్లు పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని చెప్పారు. సగటున రోజుకు రెండు టమాటాలు లేదంటే మూడుకంటే ఎక్కువసార్లు పండ్లు తినేవారి ఊపిరితిత్తులు... ఒకటి కంటే తక్కువ టమాటాలు, పండ్లు తినే వారికంటే నెమ్మదిగా సమస్యలకు గురవుతున్నట్లు తెలిసిందన్నారు. టమాటాలు, పండ్లు ఊపిరితిత్తులకు మేలుస్తాయని, అలాగే ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయని తమ పరిశోధన చెబుతోందన్నారు. -
మెదడు వల్లే బరువు తగ్గలేరట!
పరిపరి శోధన ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా? అయితే, మీ మెదడులోనే ఏదో లోపం ఉన్నట్లు లెక్క అంటున్నారు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. మెదడులోని ‘ఆకలి’ కణాల్లో తేడా ఉంటే, ఎంత తింటున్నా ఆకలి తీరినట్లుగా అనిపించదని, అందుకే ఎడాపెడా తినేస్తూ లావెక్కిపోతారని వారు చెబుతున్నారు. మెదడులోని పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్ అనే భాగం ఆకలిని నియంత్రించే ఎంజైమ్‌ను గుర్తించలేని పరిస్థితుల్లోనే ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వారు చెబుతున్నారు. -
ఆదివాసీలకు అభయ్ హస్తాలు
సమస్యను పరిష్కరించడం ఒక పద్దతి. సమస్యకు మూలం కనుక్కుని, మళ్లీ అది తలెత్తకుండా చికిత్స చేయడం ఇంకో పద్ధతి. డాక్టర్ అభయ్ దంపతులు రెండో పద్ధతిని ఎంచుకుని... మారుమూల గ్రామాల్లోకి వెళ్లిపోయారు! ఫారిన్లో మెడిసిన్ చేసి వచ్చినా, పట్టణాల్లోనే ఉండిపోకుండా ఆదివాసీల ముంగిళ్లకెళ్లి, గత ముప్పై ఏళ్లుగా వైద్య, సామాజిక సేవలు అందిస్తున్నారు. యువ వైద్యులకు స్ఫూర్తిగా వీరు సాధించిన విజయాలే ఈవారం ‘జనహితం’. అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ’ నుంచి ఎంపిహెచ్ (మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్) పట్టాపుచ్చుకున్నారు అభయ్ బంగ్, రాణి బంగ్ దంపతులు. పొరుగుదేశాల్లో పేరు ప్రతిష్టలతో పాటు బోలెడంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ అన్నింటినీ వదులుకుని ఆదివాసి, గ్రామీణ ప్రజలసేవలతో తరించాలనుకున్నారు. అందుకోసం గడ్చిరోలిని ఎంచుకున్నారు. దేశంలోని వెనకబడ్డ ప్రాంతాల్లో అది ఒకటి. అంతేకాదు, మహారాష్ర్టలో అతిపేద జిల్లా. అక్షరం, ఆరోగ్యం అనే పదాలు తెలియని ఆదివాసీ ప్రాంతం అది. సేవా వారసత్వం... అభయ్బంగ్ తండ్రి ఠాకూర్ దాస్బంగ్ మహాత్మాగాంధీ అనుచరుల్లో ఒకరు. పైచదువులకోసం ఇంగ్లండ్ వెళ్లాల్సిన ఠాకూర్‌దాస్ గాంధీజీ ఆజ్ఞమేరకు గ్రామీణప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు చేశారు. ఆ కారణంగా అభయ్బంగ్ వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమం పరిసరాల్లో పెరగడంతో బాల్యం నుంచి గాంధీజి పారంభించిన ‘నయా తాలీం’(నూతన శిక్షణ పద్ధతి)లో విద్యాభ్యాసం చేశారు. దాంతో చిన్నవయసులోనే పేదలకు సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగపూర్ మెడికల్ కాలేజీలో చదువుతుండగా రాణితో పరిచయం ఏర్పడింది. తమ ఆలోచనల తీరు, ఆశయాలు ఒకటే అవడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. అమెరికాలో చదువుతున్నప్పుడు గడ్చిరోలిలోని గ్రామాల వివరాలు సేకరించి వారు చేయదలుచుకున్న సేవాకార్యక్రమాలకు స్కెచ్ వేసుకున్నారు. 1980లో గడ్చిరోలికి వచ్చారు. ఓ ఐదేళ్లపాటు పరిశోధనలు చేసి... 1985లో సెర్చ్సంస్థని నెలకొల్పారు. ముందుగా గ్రామీణులు తరచు ఎదుర్కొనే జబ్బుల వివరాలు తీసుకుని వాటికి వైద్యం మొదలుపెట్టారు. ఆ జబ్బుల వెనకున్న జీవనవిధానాల్లో మార్పు తేవడానికి కావాల్సిన పథకాలను రచించి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటి నిర్మూలనకు పూనుకున్నారు. శిశుమరణాలపై... ఈ దంపతులు మొదటగా గడ్చిరోలిలోని గ్రామీణప్రాంతాల్లోని శిశుమరణాలపై పరిశోధన జరిపారు. వెయ్యిమంది పిల్లలు పుడితే 120 మందికంటే ఎక్కువ బతకడంలేదు. మరో చిత్రమైన విషయం...నూటికి 83 శాతం మందికి ప్రసవాలు ఇంటిదగ్గరే. దాంతో గడ్చిరోలిలోని ఒక కుగ్రామంలో అభయ్ బంగ్, రాణి బంగ్ల ఇల్లు కొన్నాళ్లకి ఆసుపత్రిలా మారిపోయింది. సెర్చ్ సెంటర్లో కొందరు గ్రామీణ మహిళలకు ఇంటి దగ్గర ప్రసవానికి పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేసరికి శిశుమరణాల సంఖ్యని తగ్గించగలిగారు గైనకాలజిస్టు రాణి. మరోపక్క అభయ్ బంగ్ ఫిజిషియన్‌గా సేవలు అందిస్తూనే...పేదల గుడిసెల మధ్యన ఏరులై పారుతున్న మద్యంపై దృష్టి పెట్టారు. దీంతోపాటు అనేక వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు వైద్యం చేస్తున్నారు. అన్నింటికీ అసలు కారణం నిరక్షరాస్యతేనంటూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి వీధిపిల్లలను దగ్గరుండి మరీ పాఠశాలల్లో చేర్పించారు. అంతేకాదు, శిశుమరణాల వివరాలు ప్రభుత్వం దృష్టికి రాకపోడాన్ని నేరంగా పరిగణించాలంటూ ప్రభుత్వాధికారులకు వ్యతిరేకంగా పోరాడారు. విద్య, వైద్యం కొరవడిన చోట జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో దగ్గరగా చూసిన ఈ దంపతులు శిశుమరణాలకు న్యూమోనియాలాంటి వ్యాధులు కారణమని తెలుసుకున్నారు. దానిని నిర్థారించేందుకు ‘బ్రెత్ కౌంటర్’ (శ్వాసను కౌంట్చేసే యంత్రం)ను కనుగొన్నారు. అలాగే వీరు చేపట్టిన పలు వైద్య చికిత్సా పద్ధతుల ద్వారా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పద్ధతిని దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించాలని భావిస్తోంది. మద్యరహిత ప్రాంతంగా గడ్చిరోలి గడ్చిరోలి మురికివాడల్లో మద్యం బారిన పడ్డ కుటుంబాలకు కౌన్సెలింగ్, అవసరమైతే వైద్యం చేసి ఆ మత్తు వదిలించడంలో విజయం సాధించారు అభయ్, రాణి. ఈ దంపతులు మద్యంపై పదేళ్లపాటు చేసిన పోరాటం ఫలితంగా గడ్చిరోలి మద్యపాన రహిత జిల్లాగా నిలిచింది. విదేశాల్లో విలాసంగా జీవించాల్సిన బంగ్ దంపతులు తమ విద్యను, వైద్యాన్ని దేశంలోని పేదప్రాంతానికి అంకితం చేసినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన ‘మహారాష్ట్ర భూషణ్’ పురస్కారం సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ అవార్డులు, రివార్డులు వారిని వరించాయి. - గుండారి శ్రీనివాస్, ముంబై మేం వచ్చిన కొత్తలో ఇక్కడి మహిళలెవరూ మాతో కలిసేవారు కాదు. మా వైద్యానికి వారు అలవాటు పడడానికి సమయం పట్టినా... అతి తక్కువ సమయంలోనే వారిలో చాలా విషయాలపై అవగాహన తెప్పించగలిగాము. ఫలితంగా గర్భస్థ శిశువుల మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. పౌష్టికాహారం మొదలు...ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలవరకూ... ఇలా ప్రతి ఇంటికీ మా సేవలు వెళ్లడానికి రెండు దశాబ్దాల సమయం పట్టింది.