
న్యూయార్క్: అమెరికాలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,157 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 2 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 1,00,226 మంది ఆసుపత్రిపాలయ్యారు. రాబోయే తీవ్రమైన చలిరోజుల్లో దేశం మరింత గడ్డుపరిస్థితులను ఎదుర్కోక తప్పదని అమెరికా ప్రధాన వైద్యాధికారి హెచ్చరించారు. ఏప్రిల్ 15తో పోల్చుకుంటే కోవిడ్ మరణాల సంఖ్య 20 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు అమెరికాలో 2,80,581 మంది మరణించగా, 14.3 మిలియన్ల మందికి కోవిడ్ సోకినట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్స్ హెచ్చరించారు. ఎక్కువ మంది ఒకచోట చేరకూడదని హెచ్చరిస్తున్నా వినకుండా, గత వారంలో జరిగిన థ్యాంక్స్ గివింగ్ లాంటి ఉత్సవాలను జరుపుకునేందుకు లక్షలాది మంది అమెరికన్లు ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించడం కూడా కోవిడ్ వ్యాప్తికి కారణమని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment