గాల్లోని తేమను పిండి, నీటిగా మార్చేందుకు ఇటీవలి కాలంలో బోలెడన్ని యంత్రాలు, టెక్నాలజీలూ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవేవీ అనుకున్నంత సమర్థంగా పనిచేయవు. గంటల సమయం తీసుకుని అరకొరగా నీళ్లు ఇస్తాయీ యంత్రాలు. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంఓఎఫ్)పై చేసిన ప్రయోగం అందరి దష్టిని ఆకర్శిస్తోంది. కేవలం ఒక గ్రాము మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ పదార్థం ఫుట్‌బాల్ మైదానమంత ఉపరితలం కలిగి ఉంటుంది.
గతంలోనూ ఈ ఎంఓఎఫ్‌లతో గాల్లోని తేమను నీటిగా మార్చవచ్చునని రుజువైంది. కిలోగ్రాము ఎంఓఎఫ్‌తో బెర్క్‌లీ యూనివర్శిటీ కాలేజీ ఒక రోజులో వంద మిల్లీలీటర్ల నీటిని ఒడిసిపట్టగలిగింది. గత ఏడాది ఈ మోతాదు 1.3 లీటర్లకు చేరింది. జాన్‌హాప్కిన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం ఏకంగా 8.66 లీటర్ల నీటిని ఒడిసిపట్టడంలో విజయం సాధించారు. తాము ఇప్పటివరకూ దాదాపు పది ఎంఓఎఫ్‌లపై ప్రయోగాలు చేశామని, వీటిల్లో ఒకటి ప్రతి కిలోగ్రాము పదార్థానికి ఒక రోజులో 8.66 లీటర్ల నీటిని అందిస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఝియాంగ్ షీ తెలిపారు. వాతావరణ పరిస్థితులను మార్చడం ద్వారా మరింత ఎక్కువ నీటిని రాబట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పారు. పరిశోధనల వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment