ముంబైలో భారీ వర్షంలోనూ వైద్య సేవలు అందించేందుకు వెళ్తున్న ఆరోగ్య కార్యకర్తలు
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తి నానాటికీ విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. కేవలం ఒక్కరోజు వ్యవధిలో 24,850 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 613 మంది బాధితులను కరోనా పొట్టనపెట్టుకుంది. దేశంలో ఇప్పటివరకు 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం, ఇన్ని మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కి, మరణాల సంఖ్య 19,268కు చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు 2,44,814. చికిత్సతో 4,09,082 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 60.77 శాతంగా నమోదయ్యింది. ప్రపంచంలో కరోనా ప్రభావిత దేశాల్లో భారత్ 4వ స్థానానికి చేరిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా ఉన్నాయి. కరోనా సంబంధిత మరణాల్లో భారత్ 8వ స్థానంలో నిలిచింది.
78 శాతం కేసులు 7 రాష్ట్రాల్లోనే..
దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 78 శాతం కేవలం 7 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం, బిహార్ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 7,074 కేసులు, తమిళనాడులో 4,280 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, అస్సాం, బిహార్‌లో కలిపి 7,935 కేసులు నిర్ధారణయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం 97,89,066 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
మహారాష్ట్రలో 2 లక్షలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రెండు లక్షల మార్కును దాటేశాయి. రాష్ట్రంలో లక్ష కేసులకు 97 రోజులు పట్టగా, తర్వాత 22 రోజుల్లోనే మరో లక్ష కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 24 గంటల్లో 7,074 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,00,064కు చేరింది. గడిచిన 24 గంటల్లో 124 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 8,671కి చేరింది. రాష్ట్రంలో 1,08,082 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో రికవరీ రేటు 54.02 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment