న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. శనివారం తాజాగా మరో 76,472 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,972కు చేరుకుంది. గత 24 గంటల్లో 65,050 మంది కోలుకోగా 1,021 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 62,550కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 26,48,998కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,52,424గా ఉంది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.72గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు ఎక్కువగా కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.47 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.81 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 28 వరకు 4,04,066,09 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 9,28,761 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరిపే దిశగా దేశం పయనిస్తోందని తెలిపింది. గత వారం రోజుల్లో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అమెరికాలోనూ.. రెండోసారి
రెనో: అమెరికాలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్ సోకింది. దేశంలో ఇలాంటిది ఇదే మొట్టమొదటి కేసుగా భావిస్తున్నారు. యూరప్‌తోపాటు హాంకాంగ్‌లో ఇటీవల ఇలాంటి కేసులు బయటపడిన విషయం తెలిసిందే. నెవడాలోని రెనోకు చెందిన ఓ వ్యక్తి(25) ఏప్రిల్‌లో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాడు. జూన్‌లో అతనికే మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణయింది. మొదటిసారి కంటే ఈసారి అతడిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. న్యుమోనియా కూడా రావడంతో ఆస్పత్రిలో ఆక్సిజన్‌తో చికిత్స అందించాల్సి వచ్చింది. కరోనా వైరస్ మళ్లీ సోకేందుకు అవకాశం ఉందనీ, రెండోసారి మరింత తీవ్రంగా ఉండొచ్చని నెవడా స్టేట్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ డైరెక్టర్ మార్క్ పండోరి అన్నారు.
110 ఏళ్ల కోవిడ్ విజేత
మలప్పురం: కరోనా సోకిందని తెలియగానే తీవ్ర భయాందోళనలకు లోనవుతున్న వారు ఎందరో. అలాంటిది కేరళలో ఓ శతాధిక వృద్ధురాలు కరోనాను జయించింది. రంధాథాని వరియత్ పథూ అనే 110 ఏళ్ల బామ్మకు తన కూతురు నుంచి కరోనా సోకింది.
ఆగస్టు 18వ తేదీన మలప్పురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరిన పథూ కోలుకొని శనివారం డిశ్చార్జి అయ్యింది. ఆమెకు స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని, నిబ్బరంగా ఉంటూ చికిత్స తీసుకుందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే.కే.శైలజ వెల్లడించారు. పథూకు చికిత్స అందించి కోలుకునేలా చేసిన డాక్టర్లను మంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment