ఢిల్లీలో కరోనా మృతుడి అంత్యక్రియలకు పీపీఈ కిట్లు ధరించి హాజరైన బంధువులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి నవంబర్ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో విధించిన 8 వారాల లాక్‌డౌన్‌తోపాటు ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను పెంచడం వల్ల ఈ గరిష్ట స్థాయి అనేది 34 నుంచి 76 రోజులు వెనక్కి జరుగుతున్నట్లు తేలింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరితే బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత తప్పకపోవచ్చని అధ్యయనం వెల్లడించింది. అందుకే ఇప్పటినుంచే అప్రమత్తం కావడం మంచిదని సూచించింది. పరిశోధకులు ఇంకా ఏం చెప్పారంటే..
► లాక్‌డౌన్, ఇతర నియంత్రణ చర్యల వల్ల కరోనా వ్యాప్తిలో గరిష్ట స్థాయి దాదాపు రెండున్నర నెలలు ఆలస్యమవుతోంది. తద్వారా కరోనా బాధితుల సంఖ్య 97 శాతం నుంచి 69 శాతానికి తగ్గిపోతుంది. ఈ రెండున్నర నెలల సమయాన్ని ఆరోగ్య రంగంలో వనరుల కల్పనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వాడుకోవచ్చు.
► ఐసోలేషన్ బెడ్లు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల డిమాండ్‌ను నవంబర్ మొదటి వారం వరకు తట్టుకోవచ్చు. ఆ తర్వాత ఐసోలేషన్ బెడ్ల కొరత 5.4 నెలలు, ఐసీయూ పడకల కొరత 4.6 నెలలు, వెంటిలేటర్ల కొరత 3.9 నెలలు తప్పకపోవచ్చు.
► కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించాలంటే టెస్టింగ్, ట్రీట్‌మెంట్, కాంట్రాక్టు ట్రేసింగ్‌ను పెంచాలి.
► కరోనా బాధితుల కోసం 2,313 హెల్త్‌సెంటర్లు పని చేస్తున్నాయని, 1,33,037 ఐసోలేషన్ బెడ్లు, 10,748 ఐసీయూ బెడ్లు, 46,635 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది.
9 వేలు దాటిన మరణాలు
భారత్‌లో కరోనా విలయం యథాతథంగా కొనసాగుతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 3.20 లక్షలు, మరణాలు 9 వేల మార్కును దాటేశాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,929 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 311 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా మొత్తం కేసులు 3,20,922కు, మరణాలు 9,195కి చేరాయి. దేశంలో ప్రసుత్తం క్రియాశీల కరోనా కేసులు 1,49,348. కరోనా బాధితుల్లో 1,62,378 మంది చికిత్సతో కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు క్రమంగా మెరుగుపడుతుండడం సానుకూలం పరిణామంగా చెప్పొచ్చు. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉండడం విశేషం. ప్రస్తుతం రికవరీ రేటు 50.60 శాతంగా నమోదైంది. తాజాగా కరోనా వల్ల 311 మంది మరణించగా, వీరిలో 113 మంది మహారాష్ట్రలోనే కన్నుమూయడం గమనార్హం. ఢిల్లీలో 57, గుజరాత్‌లో 33, తమిళనాడులో 30 మంది చనిపోయారు.
మరణాల్లో తొమ్మిదో స్థానం
కరోనా మహమ్మారి కాటుకు దేశంలో ఇప్పటిదాకా 9,195 మంది మరణించారు. దీంతో కరోనా సంబంధిత మరణాల్లో దేశం ప్రపంచంలో తొమ్మిదో స్థానానికి చేరింది. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచింది. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో పరీక్షల సంఖ్య పెంచుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 893 ల్యాబ్‌ల్లో ఇప్పటివరకు 56,58,614 కరోనా టెస్టులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment