కోవిడ్ పరీక్షకోసం నమూనాలను సేకరిస్తున్న రోబో. దీనిని కోయంబత్తూర్‌కు చెందిన కార్తీ వేలాయుధన్ రూపొందించాడు
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ విశ్వరూపం చూపిస్తోంది. లక్ష కేసులకి చేరడానికి 110 రోజులు పడితే ఆ తర్వాత కేవలం 39 రోజుల్లో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం భయాందోళనలు పుట్టిస్తోంది. కేవలం ఆరంటే ఆరే రోజుల్లో లక్ష మందికి వైరస్ సోకడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటేసింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 18,552 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 5,08,953కి చేరుకుంది. 24 గంటల్లో 384 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,685కి చేరుకుంది. రోజుకి 15 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరసగా ఇది నాలుగో రోజు. అయితే దేశంలో రికవరీ రేటు మాత్రం నిలకడగా 58.13శాతంగా ఉంది.
అన్‌లాక్ 1 మొదలయ్యాకే..
భారత్‌లో లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత కాలం కేసులు బాగానే అదుపులో ఉన్నాయి. 100 కేసుల నుంచి లక్ష కేసులు చేరుకోవడానికి 64 రోజుల సమయం పట్టింది. అదే నాలుగు లక్షల నుంచి 5 లక్షలు కేవలం ఆరు రోజుల్లోనే దాటేసింది. కేవలం కంటైన్‌మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ఎత్తేసి, మిగిలిన ప్రాంతాల్లో అన్‌లాక్1 మొదలుపెట్టడంతోనే కేసులు పెరిగిపోతున్నాయని మాక్స్ హెల్త్‌కేర్‌లో ఇంటర్నల్ మెడిసన్ డైరెక్టర్ డాక్టర్ మోనికా మహాజన్ చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తేశాక ప్రజలు భౌతిక దూరాన్ని సరిగా పాటించడం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉండడం వల్ల ఒకరి నుంచి అత్యధికులకు వైరస్ సోకుతోందని అన్నారు. అంతేకాకుండా కరోనా పరీక్షలు పెరగడం కూడా కేసులు పెరగడానికి కారణమేనని ఆమె విశ్లేషించారు. కోవిడ్ టెస్ట్ కిట్స్ ధరలు బాగా తగ్గి, అందరికీ అందుబాటులో ఉండడంతో రోజూ ఎక్కువ మందికి పరీక్షలు చేస్తుండటంతో కేసులు పెరిగిపోతున్నాయని ఆమె విశ్లేషించారు.
రోజూ 2 లక్షలకు పైగా పరీక్షలు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం జూన్ 26 నాటికి 79,96,707 కరోనా పరీక్షలు దేశవ్యాప్తంగా జరిగాయి. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,20,479 మందికి పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా 1,007 ల్యాబ్‌లు ఉంటే అందులో 734 ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. 273 ల్యాబ్‌ల్లో ప్రైవేటు సంస్థలు కోవిడ్ పరీక్షలు చేస్తున్నాయి. మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్ మొదలయ్యే నాటికి దేశంలో 100 మాత్రమే పరీక్ష ల్యాబ్‌లు ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యి దాటింది.
8 రాష్ట్రాల నుంచే 85% కేసులు
మొత్తం కేసుల్లో 85.5 శాతం కేసులు , 87 శాతం మరణాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌సహా 8 రాష్ట్రాల నుంచి నమోదవుతున్నట్టుగా కేంద్ర తెలిపింది. కేసుల్ని కట్టడి చేయడానికి ఆరోగ్య సదుపాయాలు మెరుగుకు చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందానికి కేంద్రం సూచించింది.కేంద్ర మంత్రులు, ప్రజారోగ్య నిపుణులు, వ్యాధి నిరోధక నిపుణులు, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులతో 15 కేంద్ర బృందాలు కోవిడ్ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment