45 లక్షలు దాటిన కేసులు | Sakshi
Sakshi News home page

45 లక్షలు దాటిన కేసులు

Published Sat, Sep 12 2020 4:03 AM

India records highest 24 hours spike of 96551 COVID-19 cases - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96,551 కేసులు బయటపడ్డాయి. గురువారం 95 వేలకుపైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం ఆ రికార్డును దాటి 96 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో వచ్చిన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,414కు చేరుకుంది. గత 24 గంటల్లో 70,880 మంది కోలుకోగా 1,209 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 76,271కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,663కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,43,480గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.68 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారానికి ఇది 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  యశవంతపుర: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

మేలోనే 64 లక్షల మందికి కోవిడ్‌
మే ఆరంభం నాటికే దేశంలో 0.73% మందికి అంటే 64 లక్షల మందికి కరోనా వైరస్‌ సోకినట్లు జాతీయ స్థాయి సీరో సర్వే లెక్కగట్టింది. జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఐసీఎంఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) చేపట్టిన ఈ సర్వే ఫలితాలు తాజాగా ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి. మే 11 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు 28 వేల మంది నుంచి సేకరించిన రక్త నమూనాల్లో యాంటీబాడీలను ‘కోవిడ్‌ కవచ్‌ ఎలిసా’కిట్‌ను ఉపయోగించి లెక్కించారు. 18–45 మధ్య ఏళ్ల వారిలో సీరోపాజిటివిటీ(రక్తంలో యాంటీబాడీల స్థాయి) రేటు అత్యధికంగా 43.3% ఉండగా, 46–60 ఏళ్ల గ్రూపులో 39.5%, 60 ఏళ్లు పైబడిన వారిలో అతి తక్కువగా 17.2% మాత్రమే ఉన్నట్లు రుజవైందని నివేదిక తెలిపింది. మే ఆరంభంలోనే దేశంలో 64లక్షల మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement