తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో కోవిడ్ మృతుడికి పీపీఈ కిట్లు ధరించి నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల విషయంలో బ్రెజిల్‌ను భారత్ అధిగమించింది. ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో అగ్రరాజ్యం అమెరికా కొనసాగుతోంది. ఇండియాలో తాజాగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదేతొలిసారి. ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనాతో దేశవ్యాప్తంగా 904 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,70,179కు చేరింది.
10 రోజుల్లోనే కేసులు రెట్టింపు
కొత్తగా నమోదైన కేసుల్లో 83.02 శాతం కేసులు కేవలం పది రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కరోనా జడలు విప్పుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 63,294 కేసులు రాగా, ఉత్తరప్రదేశ్‌లో 15,276 కేసులు, ఢిల్లీలో 10,774 కేసులు వచ్చాయి. దేశంలో ఏప్రిల్ 1న 72,330 కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 5న 1,03,558 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 12న 1,68,912 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఏప్రిల్ నెల ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 10 రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది.
5 రాష్ట్రాల్లో్ల 70.16 శాతం యాక్టివ్ కేసులు
దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 12 లక్షల మార్కును దాటేశాయి. రికవరీ రేటు 90 శాతానికి పడిపోయింది. నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 8.8 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల్లో 70.16% వాటా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలదే. దేశంలో యాక్టివ్ కేసులు గత ఏడాది సెప్టెంబర్ 18న అత్యధికంగా 10,17,754 ఉండగా, అత్యల్పంగా ఫిబ్రవరి 12న 1,35,926 ఉన్నాయి. మరోవైపు రికవరీ రేటు 89.86 శాతానికి పడిపోయింది.
ముంబైలో 3 జంబో కరోనా ఆసుపత్రులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రచండవేగంతో విస్తరిస్తోంది. బాధితులకోసం ముంబైలో మూడు జంబో ఫీల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 5 వారాల్లోగా వీటిని నెలకొల్పనున్నట్లు బృహన్ ముంబై కార్పొరేషన్ చైర్మన్ ఇక్బాల్‌సింగ్ చాహల్ సోమవారం చెప్పారు. ఒక్కో ఆసుపత్రిలో 2వేల పడకలు, ఇందులో 200 ఐసీయూ పడకలు, 70 శాతం ఆక్సిజన్ పడకలు ఉంటాయని తెలిపారు. కొన్ని 4–స్టార్, 5–స్టార్ హోటళ్లను ప్రైవేట్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో కోవిడ్–19 కేర్ సెంటర్లుగా మార్చాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా కరోనా పాజిటివ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఆసుపత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఐసీయూ పడకల సంఖ్య 2,466కు చేరిందన్నారు. 141 ఆసుపత్రుల్లో మొత్తం 19,151 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.
25.78 కోట్ల టెస్టులు
దేశంలో కరోనా మహమ్మారి బారినపడి వారిలో ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. కోవిడ్–19 నిర్ధారణ పరీక్షల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 వరకు 25,78,06,986 నమూనాలను(శాంపిల్స్) పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment