బుక్కైతే లక్కే!
సి.ఐ.ప్రకాశ్ కన్నుగప్పి ఎవరూ తప్పించుకోలేరు.
అది కాదు విశేషం.
ప్రకాశ్ కంట్లో పడ్డాక ఎవరూ తప్పించుకోవాలని చూడరు!
ఎనీ టైమ్, ఎనీ సెంటర్... యూత్ హస్క్ కొడుతుంటే అతడి బైక్ వచ్చి ఆగుతుంది. అందర్నీ ఒక్క చూపు చూస్తాడు...
దగ్గరికి రమ్మంటాడు.
తర్వాత ఏం చేస్తాడు? ‘నేనేరా పోలీస్’ అంటాడా? అనడు!
‘కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటాడా? అనడు!
మరేం చేస్తాడు? న్యూసెన్స్ కేస్ బుక్ చేస్తాడా?
చేస్తాడు. కానీ న్యూసెన్స్ కేస్ కాదు...
‘న్యూ’సెన్స్ క్లాసుకు బుక్ చేస్తాడు!
ఒకసారి ఆ క్లాస్‌కి బుక్కయ్యారా...
ఆర్మీలో పోస్టుతోనే ఎవరైనా తిరిగి బయటికి రావడం!
అవును.
ప్రకాశ్ లాంటి పోలీస్ ఉంటే... ఊర్లో పోలీస్ ఫోర్సు ఉన్నట్లే.
ఈ స్టోరీ చదవండి. బుక్కైతే లక్కే అని మీకూ అనిపిస్తుంది.
అర్ధరాత్రిపూట పీకలదాకా మద్యం తాగి రోడ్డుపై అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుర్రాళ్లు పోలీసుల కంటపడితే ఏం చేస్తారు? సాధారణంగా చేసేది ఏమిటంటే... అలాంటి వారిని తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో పడేసి వార్నింగ్‌లు, కౌన్సెలింగ్‌లు... ఇలా వారి డ్యూటీ వారు చేస్తారు. అయితే సీఐ ప్రకాశ్ అలా చేసి ఊరుకోలేదు. దారితప్పుతున్న యువత భవితవ్యం గురించి ఆలోచించారు. అలాంటి వారి కోసం ఓ వెలుగు బాట వేయాలనుకున్నారు. లాఠీ పట్టుకున్న చేత్తోనే గురువుగా బెత్తం పట్టుకున్నారు. దగ్గరుండి మరీ వారికి పాఠాలు చెప్పించారు. గ్రౌండ్‌కి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. అలా 142 మంది యుతకు రక్షణశాఖలో ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తే... వారిలో 72మందికి రక్షణశాఖలో వివిధ రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయి. దాంతో ప్రకాశ్ తన పై అధికారులతోనే కాదు ప్రపంచ పోలీసు విభాగం నుంచి ప్రశంసలందుకున్నారు. కిందటివారం అమెరికాలో ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆ్‌ఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్’ ఆధ్వర్యంలో ‘కమ్యునిటీ పోలీస్’ అవార్డు అందుకున్న కరీంనగర్ జిల్లా గోదావరిఖని సీఐ ఆర్. ప్రకాశ్ చేస్తున్న సేవాకార్యక్రమాలే ఈవారం ‘జనహితం’
‘‘మూడేళ్లక్రితం ఒకరోజు రాత్రి పెట్రోలింగ్ చేస్తుంటే... సింగరేణి దగ్గర ఒక స్టేడియం కింద ఓ ఎనిమిదిమంది కుర్రాళ్లు మద్యం సేవిస్తూ నా కంటపడ్డారు. అందరినీ జీపెక్కించుకుని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారిస్తే వారిలో ఆరుగురు ఇంజినీరింగ్, ఒకరు ఫార్మసీ పూర్తిచేసినవారు. మరొకరు సింగరేణిలో ఉద్యోగి. నాకు వారిని చూసి కోప్పడాలో, జాలిపడాలో అర్థంకాలేదు. ఇలాంటి వారిని ఎలా దారిలో పెట్టాలో అని ఆలోచిస్తుండగా ఒక స్నేహితుడిచ్చిన సలహా మేరకు రక్షణ విభాగంలో ఉద్యోగాలకు వారికి శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందనిపించింది’’ అని గుర్తుచేసుకున్నారు ప్రకాశ్. రక్షణ విభాగంలో శిక్షణ తీసుకోడానికి మొదటి అర్హత పదోతరగతి పాస్ అవ్వడం, రెండోది పద్ధెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ల వయసులోపు వారై ఉండాలి. మొదట ఓ ఎనిమిదిమంది కుర్రాళ్లకు ఏడాదిపాటు శిక్షణ ఇచ్చారు ప్రకాశ్. వారిలో ఇద్దరికి ఆర్మీలో పోస్టింగ్‌లు వచ్చాయి.
మూడు జిల్లాల్లో...
తన శిక్షణలో ఆర్మీలో ఉద్యోగాలు పొందిన యువకుల గురించి చెబుతూ... ‘రక్షణ విభాగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న యువతకు ఆహ్వానం’ అంటూ ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పత్రికాప్రకటనలు ఇచ్చారు. నాలుగు జిల్లాల నుంచి వచ్చిన యువతలో అర్హతని బట్టి 142 మంది యువతను ఎంపిక చేశారు. వారిలో 12మంది అమ్మాయిలు కూడా ఉన్నారు.‘‘ నా మొదటి బ్యాచ్‌లో ఆర్మీ ఉద్యోగాలు సంపాదించిన ఇద్దరు కుర్రాళ్లను చూపించడంతో రెండోబ్యాచ్‌లో చేరడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. ఇంచుమించు వీరంతా ఖాళీగా తిరుగుతూ నా దృష్టిలో పడ్డవారే. వీరిలో చాలామంది పేదవారున్నారు.
వీళ్లందరికీ ఉచితంగా ఆశ్రయం కల్పించడానికి ఏర్పాట్లు చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నేను సాయం కోసం ఎవరినీ డబ్బు రూపంలో అడగలేదు. అన్నీ వస్తురూపంలోనే సేకరించాను. సింగరేణి కాలరీస్ కంపెనీవాళ్లు ఈ యువతకి ఉచితంగా ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారం, మిగతా అవసరాలకోసం దాతల్ని ఆశ్రయించాను. నా పై అధికారులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు...ఎవరు సాయం చేస్తామని ముందుకొచ్చినా బియ్యం, ఉప్పు, పప్పులు.. అంటూ భోజనం తయారీకి కావాల్సిన సరుకుల జాబితానే ఇచ్చేవాడ్ని. వాళ్లు సరుకుల్నే నేరుగా పంపేవారు’’ అని చెప్పారు ప్రకాశ్. పోలీసులపై ఉన్న అపోహల వల్ల ప్రకాశ్ దాతల వివరాలను పారదర్శకంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
ఉపాధ్యాయుల సహకారం...
‘‘మొదటి బ్యాచ్‌లో ఆర్మీకి ఎంపికైన విద్యార్థులకు పాఠాలు చెప్పిన హైస్కూల్ హెడ్‌మాస్టార్ రామ్‌గోపాల్‌తో పాటు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా వచ్చి మరీ మా విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం, సైన్స్, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పారు. ఇక గ్రౌండ్ పాఠాల విషయానికొస్తే పొద్దునే ఐదుగంటలకల్లా నిద్రలేపి ఎగ్, పాలు, అరటిపండు ఇచ్చి 5 కిలోమీటర్లు రన్నింగ్‌కి తీసుకెళ్లేవాడ్ని. తర్వాత లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ వంటివి నేర్పేవాళ్లం. ఏడాదిపాటు సాగిన ఈ శిక్షణకాలంలో నాకు ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. అయినాసరే శిక్షణతీసుకున్న యువతకు మంచి ఉద్యోగాలొచ్చే తీపి క్షణాలకోసం ఏడాదికాలం ఓపిగ్గా ఎదురుచూశాను. ’’ అని చెబుతున్నప్పుడు ప్రకాశ్‌లో పోలీసుకి బదులు ఉపాధ్యాయుడు కనిపించాడు.
72మందికి ఉద్యోగాలు...
‘‘శిక్షణ పూర్తయ్యాక అందరితో రక్షణవిభాగంలోని అన్ని శాఖల్లో ఉద్యోగాలకోసం దరఖాస్తు చేయించాం. ఆర్మీలోని సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యురిటీ ఫోర్స్, పోలీస్ విభాగంలో సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లలో మొత్తం 72మందికి ఉద్యోగాలొచ్చాయి. ఈ విజయం వెనక నాకు నాపై అధికారులు డి.ఎస్.పి డి. ఉదయ్‌కుమార్‌గారు, ఎస్‌పి వి. రవీందర్‌గారి సహకారం చాలా ఉంది’’ అని ముగించారు ప్రకాశ్. ఒకచేతితో లాఠీ పట్టుకుని పోలీసు ఉద్యోగం చేసుకునే ప్రకాశ్ మరో చేత్తో యువతకు పాఠాలు చెప్పి రక్షణశాఖకు బహుమతిగా ఇద్దామనుకోవడం వెనక ఆయన మంచిమనసుతో పాటు జీవితం విలువతెలిసిన ఒక ఉపాధ్యాయుడి పెంపకం కూడా ఉంది. ప్రకాశ్ తండ్రి బక్కన్న ఓ స్కూల్ టీచర్. ప్రకాశ్‌ని పోలీస్‌గానే కాదు సమాజానికి తన వంతుసాయం చేసే సేవకునిగా కూడా చూడాలనుకున్నారాయన. ఆయన కోరికతో పాటు ప్రకాశ్ లక్ష్యం కూడా నెరవేరినందుకు మనం కూడా సంతోషిద్దాం.
- భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
‘‘నాపై అధికారుల ప్రోత్సాహంతోనే ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్’ (ఐఎసిపి) వారికి నా ప్రాజెక్ట్ వివరాలు పంపాను. వారు నా సేవల్ని గుర్తించి ‘కమ్యూనిటీ పోలీస్’ అవార్డు ఇచ్చారు. గత వారంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన 120 ఐఎసిపి సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కడినే వెళ్లాను. మూడురోజులపాటు జరిగిన ఆ సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా 162 దేశాల నుంచి 1600మంది పోలీసులు వచ్చారు. ఈ అవార్డుకోసం 400మంది నామినేషన్లు వచ్చాయి. మూడురోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రజల రక్షణకోసం పోలీసులు ఎదుర్కోవాల్సిన సవాళ్ల గురించి విస్తృతమైన చర్చలు జరిగాయి’’.
- ఆర్. ప్రకాశ్, సీఐ, గోదావరిఖని