ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే!
ప్రతి ఒక్కరికీ ఒక మంచి రోజు ఉంటుందని సామెత.
రీనా లాంటి వాళ్లు ఉంటే..
ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే... ఎవ్రీ డే!
ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ మంచిరోజే...
మనుషులకైనా, శునకాలకైనా!
రీనా... వీధికుక్కల్ని చేరదీస్తుంటారు.
అక్కడితో అయిపోలేదు.
పెంపుడు కుక్కల కోసం...
డే కేర్ సెంటర్ నడుపుతున్నారు.
‘వి కేర్ యానిమల్’ అనే సంస్థని కూడా పెట్టారు.
కుక్కలపై రీనా ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే...
‘తనను పెళ్లిచేసుకునే అబ్బాయికి
కుక్కలంటే ప్రేమ ఉండాలి’ అని కండిషన్
పెట్టే వరకు!!
ఈ కండిషన్ వెనుక, కారుణ్యం వెనుక ఉన్న కథే...
ఈవారం ‘జనహితం’.
పెంపుడు జంతువులను ప్రేమతోసాకి, ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారు సెలబ్రెటీలనుంచి సామాన్యుల వరకూ చాలామందే ఉన్నారు. అయితే వీధికుక్కల్ని చేరదీసి వాటి హక్కులకోసం పోరాడేవారు మాత్రం చాలా అరుదు. రీనా ఆ కోవలోకే వస్తారు. ‘‘నేను తొమ్మిదోతరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు స్కూలుకి వెళుతుంటే రోడ్డు పక్కనే పడుకొన్న కుక్కమీదకు ఓ కారు దూసుకొచ్చింది. కారు కుక్క దగ్గరగా రాగానే...స్టాప్...స్టాప్ అంటూ గట్టిగా అరిచాను. అయినా కారు డ్రైవర్ వినిపించుకోకుండా కారుని కుక్కపై నుంచి పోనిచ్చేశాడు. అయితే అప్పటికే నేను కారు నెంబరు నోట్ చేసుకున్నాను... స్కూలు బ్యాగు పక్కన పెట్టి చనిపోయిన కుక్కని నేను, నా స్నేహితులు కలిసి పక్కకు లాగాము.
వెంటనే బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్‌కేర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. వాళ్లు పీపుల్ ఫర్ ఏనిమల్(పిఎఫ్‌ఎ) నెంబర్ ఇచ్చారు. పిఎఫ్‌ఎకి ఫోన్ చేస్తే వాళ్లొచ్చి చనిపోయిన కుక్కను తీసుకెళ్లి పోస్టుమార్టం చేసి ఖననం చేశారు. నేనిచ్చిన కారు నంబరు తీసుకుని కేసు ఫైల్ చేశారు. కారు నడుపుతున్నవ్యక్తి గవర్నమెంటు అధికారి కారు డ్రైవరు. ఈ కేసు వల్ల ఆర్నెల్లు తిరక్కుండానే అతని ఉద్యోగం పోయింది. అప్పటికిగాని నాకు కోపం తగ్గలేదు’’ అంటూ రీనా ఏడేళ్లకిత్రం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటున్నప్పుడు మూగజీవులకు ఆమె మనసులో ఉన్న స్థానం ఎంతటిదో అర్థమవుతుంది. తన జీవితం కుక్కల క్షేమం కోసమే అంటోన్న రీనా చెప్పిన వివరాలివి..
శునక సంరక్షణకోసం పనిచేసే స్వచ్ఛందసంస్థలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా...రోజు రోజుకీ పెరిగిపోతున్న కుక్కల సంఖ్యకు తగ్గట్టు ఆ సేవల్ని పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోడుప్పల్ దగ్గర శ్రీలక్ష్మినగర్ కాలనీలో ఉండే రీనా తను డిగ్రీ చదువుతున్న సమయంలో ‘వి కేర్ ఏనిమల్’ అనే సంస్థని స్థాపించి ఇంటిదగ్గరే కుక్కలకోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక పక్క చదువు మరో పక్క కుక్కల పెంపకం...తనకు చేతనైనంత మేరకు రెండింటికీ న్యాయం చేసింది.
‘‘నాన్న లింగారావు ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ విమల గృహిణి. చెల్లి, తమ్ముడు...అందరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టమన్నమాట. ఎంత ఎక్కువంటే...స్కూలు నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఓ పదికుక్కలు వెంటే వచ్చేవి. ఇంటర్ అయ్యేవరకూ వీధి కుక్కలకు హానీ చేయకూడదంటూ కనిపించినవారికల్లా చెబుతుండేదాన్ని. డిగ్రీలో చేరాక కుక్కల కోసం సమయం కేటాయించే అవకాశం ఏర్పడింది. దాంతో షెల్టర్ ఏర్పాటు చేశాను. చాలామంది దూరప్రాంతాలకు వెళ్లాల్సివచ్చినపుడు తమ పెంపుడు కుక్కల్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి కుక్కలకు డేకేర్‌లాంటి సదుపాయం కూడా ఏర్పాటు చేశాను.
గాయాలపాలైన వీధికుక్కల్ని తీసుకొచ్చి చికిత్స చేయించి వాటికి పిల్లలు పుట్టకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించి షెల్టర్‌లో పెట్టుకుని పెంచేదాన్ని’’ అని చెప్పారు రీనా. వీధి కుక్కలకు వైద్యం, పెంపుడు కుక్కలకు డేకేర్ సదుపాయం ఏర్పాటు చేసి ఉన్నంతలో కుక్కలకు సేవ చేసుకుంటున్న రీనాకు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. కుక్కల్లో పిల్లల తల్లులు ఆహారం లేక చాలా ఇబ్బంది పడతాయని అలాంటివి ఎక్కడైనా కనిపిస్తే తన దగ్గర వదిలేయమని ఒక ప్రకటన ఇచ్చింది. అప్పుడు మొదలైంది అసలు కథ.
పాలు తాగించి...పక్కనే ఉండి
‘‘నేనిచ్చిన ప్రకటన చూసి జిహెచ్‌ఎమ్‌సివాళ్లు ఓ నలభైకుక్కల్ని తీసుకొచ్చి నాకప్పగించారు. వాటివెంట నెలల పిల్లలతో పాటు రోజుల వయసున్న బుజ్జి బుజ్జి కూనలు కూడా ఉన్నాయి. తల్లికుక్కలకు కడుపునిండా అన్నం పెట్టి పిల్లలమధ్య వదిలేస్తే ఒక్క కుక్క కూడా పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. విషయం ఏంటంటే... ఆ పిల్లలేవీ ఆ కుక్కలకు పుట్టినవి కావు. దాంతో పాలులేక పిల్లలు అరవడం మొదలెట్టాయి. వెంటనే మెడికల్‌షాపుకెళ్లి పాలడబ్బాలు కొనుక్కొచ్చి వాటికి పాలుతాగించాను.
ఓ పదిరోజులు కాలేజి ఎగ్గొట్టి ఆ పిల్లలమధ్యే గడిపాను. తల్లికుక్కల్ని బ్లూక్రాస్‌కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి బయట వదిలేశాను. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక బయటికి పంపించాను. అలా ‘వి కేర్ ఏనిమల్’ని ఛాలెంజ్‌కి తీసుకుని నడిపించాను. అయితే భవిష్యత్తులో కుక్కల సంరక్షణకోసం పటిష్టమైన సంస్థని ఏర్పాటు చేయడానికి కావాల్సిన శిక్షణ, జ్ఞానం అవసరమని గుర్తించి ‘పీపుల్ ఫర్ ఏనిమల్’ ఆధ్వర్యంలో కొంత శిక్షణ తీసుకున్నాను’’ అని చెప్పే రీనా ఆలోచన సేవ నుంచి పోరాటందాకా విస్తరించింది. కుక్కలకు కూడా హక్కులున్నాయంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది.
కుక్కల హత్య...
రీనా ఉండే ప్రాంతంలో ఒకరోజు వీధి కుక్క ఓ చిన్నపాపను కరిచింది. ఆ పాప సర్పంచ్ మనవరాలు కావడంతో అతను వెంటనే ఆ ప్రాంతంలోని కుక్కల్ని చంపించేశాడు. ఆ సంఘటన రీనా దృష్టికి వచ్చింది. ‘‘నాకు విషయం తెలియగానే చెప్పలేనంత ఆవేశం వచ్చింది. పైగా ఆ కుక్కల్ని చంపిన విధానం ఎంత ఘోరం... అంటే ఆ కుక్కలన్నింటికీ మనుషుల్ని పెట్టి పాయిజన్ ఇప్పించి మరీ చంపించేశారు. ఈ సంఘటనలో ఎనభై కుక్కలు చనిపోయాయి. నేను నేరుగా ఆ నాయకుడి దగ్గరికి వెళ్లి ఏ అధికారంతో ఈ పని చేశారని అడిగాను. ‘నాకు పైనుంచి ఆదేశాలున్నాయి’ అన్నారు.
కుక్కని చంపే హక్కు ఎవరికీ లేదని అతనిపై కేసు వేశాను. అయితే ఆ తర్వాత నాకు అర్థమైందేమిటంటే... కుక్కల్ని చంపడం నేరమన్న విషయం చాలామందికి తెలియదని’’ రీనా చెబుతున్నప్పుడు తనకళ్లలో చెమ్మ కనిపించింది. ‘‘వీధిలో కుక్కలు లేకపోతే రాత్రిపూట ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. రాత్రివేళ కుక్క అరిచే అరుపు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే కుక్క మనల్ని కరిస్తే దాన్ని చంపేటంత కోపం వస్తుంది. ఎందుకంత కోపం... దానికి ఓ రెండు టీకాలు వేయిస్తే పోయేదానికి చంపడందేనికి’’ అని ప్రశ్నిస్తున్న రీనా ఆవేదనలో అర్థం ఉంది. మన ఇంటిముందు పడుకున్న ఓ వీధికుక్క అరుపు దాని ఆకలిని కాదు... తన కావలిని చూపిస్తుందని అర్థమైనవారికి రీనా బాధ కూడా అర్థమవుతుంది. ‘‘నన్ను పెళ్లిచేసుకునే అబ్బాయికి కుక్కలంటే ప్రేమ ఉండాలి’’ అని కండిషన్ పెడుతున్న ఈ శునకప్రేమికురాలి కోరిక నెరవాలని కోరుకుందాం.
- భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: పి. మోహన్
వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్...
భవిష్యత్తులో రీనా చేయాలనుకుంటున్న కార్యక్రమాలు చాలా పెద్దవి. సొంతంగా భూమి కొనుక్కుని వీధి కుక్కలకోసం పెద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానికోసం ‘పీపుల్స్ ఫర్ ఏనిమల్’ వారి దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు. ‘వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్’లో చేరాక మూగజీవులకు సంబంధించి రీనా చాలా విషయాలు నేర్చుకున్నారు. జెన్‌పాక్ కంపెనీలో పనిచేస్తున్న రీనా ఇంట్లో ప్రస్తుతం ఓ పది వీధి కుక్కలు ఉంటున్నాయి. వాటిని చూసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వీధికుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తున్నారు రీనా.
కారుణ్య బంధం
Published Fri, Oct 25 2013 12:02 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement