Reina
-
చనిపోయిన కూతురికి ఉత్తరం
మన పిల్లలకు మనం అన్నీ ఇస్తాం.. నాన్న ముక్కు.. అమ్మ కళ్లు... మేనమామ హైట్.. మేనత్త రంగు! అవేకాకుండా.. చదువులు.. ఆటలు..పాటలు అన్నీ! కాని ఒక్కటివ్వడం మర్చిపోతున్నాం.. కష్టమొస్తే నిలబడే శక్తి, అవసరమైతే ఎదురీదే స్థయిర్యం! మనం ఎప్పుడూ పిల్లలకు తోడుగా ఉంటామని అనుకోబట్టి కాబోలు.. వాళ్లకు ఒంటరిగా పోరాడే ఆత్మస్థయిర్యాన్ని ఇవ్వలేకపోతున్నాం! దానికి శిక్షను ఇద్దరూ అనుభవించాల్సి వస్తోంది! ఈ రెండు వ్యథలు చదివి జాగ్రత్తపడ్తారని ఆశిస్తున్నాం! ఇవి రెండు వేరువేరు కథలు.. కాని వాటి ముగింపు మాత్రం ఒక్కటే అవి ఉత్తరాలు కావు... తల్లిదండ్రులు ఆత్మఘోష... పేగు పాశం! దాదాపు పదిరోజుల కిందట... స్వతంత్య్ర వ్యక్తిత్వానికి ఉదాహరణలుగా.. ఈతరం శక్తికి ప్రతీకలుగా నిలవాల్సిన ఇద్దరమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కన్నవాళ్లను వాళ్ల మానాన వాళ్లను వదిలేసి తనువు చాలించారు. బాధ్యత తెలిసిన బిడ్డలు తమ బాధ్యతను మరచి చేసిన ఈ పనికి ఆ అమ్మానాన్నలు కుంగిపోతున్నారు.. కుమిలిపోతున్నారు. ఆ వేదనకు... కూతుళ్ల మీద పెంచుకున్న వాళ్ల మమకారానికి అక్షరరూపమే ఆ ఉత్తరాలు! ఇటు పిల్లలకు.. అటు తల్లిదండ్రులకు చురకలు! ఆ బిడ్డల నేపథ్యాలు.. సౌమ్య కొమురయ్య, మాలతిల గారాలపట్టి సౌమ్య. ఫస్ట్ క్లాస్ నుంచీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంటే! పదవతరగతిలో స్టేట్ ఫస్ట్. ఎమ్సెట్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ తెచ్చుకుంది. అంతే కష్టపడి డాక్టర్ అయింది. ఆ వెంటనే పీజీలోనూ సీటు సంపాదించింది. ఇంతలోనే పెళ్లికుదిరింది. అంతా పెళ్లి పనుల్లో తలమునకలయ్యారు. మామిడాకు తోరణాలు.. పూల పందిరి.. బాజాభజంత్రీలు... జీలకర్రబెల్లం.. అక్షింతలు.. తాళికట్టే శుభవేళ.. హమ్మయ్య ఎలాంటి అవాంతరాలు లేకుండా హాయిగా.. హ్యాపీగా సాగిపోయింది పెళ్లి! సౌమ్య ఒకింటిదైంది. అత్తింట్లో అడుగుపెట్టింది. పసుపుపారాణి పాదాలు మెట్టెల సవ్వడితో అత్తింట్లో సందడి చేశాయి. ఆ సంబరం కలకాలం నిలవాలని మనసులోనే దండం పెట్టుకున్నారు ఇరువైపు వాళ్లు. అది దేవుడికి చేరలేదో.. లేక విధి చేరనివ్వలేదో.. తెలియదు. పక్షంరోజులకే సౌమ్య తాను పీజీ చదువుతున్న కాలేజ్ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరి బిగించుకుంది. ఇంటిల్లిపాది సంతోషాల ఊపిరి తీసింది. ఎందుకు చేసింది? తెలియదు. తండ్రి అంటే ప్రాణం పెట్టే సౌమ్య కనీసం ఆయనతోనూ తనకు ఫలానా కష్టం ఉంది అంటూ చెప్పుకోలేదు. డయాలసిస్ మీదున్న తండ్రికి తనే ధైర్యమన్న విషయమూ ఆమెకు తెలుసు. అయినా ప్రాణం తీసుకోవాలనుకున్న ఆ ఆడబిడ్డను ఇవేవీ కదిలించలేకపోయాయి. నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఎప్పుడూ గలగలా నవ్వుతూ తిరిగే ఆ బిడ్డ మనసులో ఉన్న అలజడిని తండ్రీ గ్రహించలేకపోయాడు. అలాంటి మాటలు, ప్రవర్తనా అతని కంటపడలేదు. పడి ఉంటే.. అనుమానమన్నా పడి ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదు అంటూ కంటతడిపెడ్తున్నాడు కొమురయ్య. సౌమ్య తోబుట్టువూ డాక్టరే. ఆరేళ్లకిందట ఓ రోడ్డుప్రమాదంలో చెట్టంత కొడుకును పోగొట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ దిగులు నుంచి వాళ్లను బయటపడేసింది సౌమ్యే. అంతటి ధైర్యవంతురాలు ఈ పనిచేసిందేంటి? కొడుకు చనిపోయినప్పటినుంచి కూతురే సర్వస్వంగా బతుకున్న మాకేంటి ఈ శిక్ష? అని కుమిలిపోతున్నారు సౌమ్య తల్లిదండ్రులు మాలతి, కొమురయ్య! సౌమ్య... నీ మనసులో ఏదైనా బాధ ఉంటే బయటకు చెప్పుకోవాల్సింది. నువ్ లేకుండా మేం ఎలా బతకాలి? జీవచ్ఛవాల్లా మారాం. ఎదిగిన పిల్లలు అమ్మానాన్న తమకు ఓ బాధ్యత అనుకుంటే ఇలా చేస్తారా? నువ్వనే కాదు.. ఈ తరం పిల్లలంతా చిన్న చిన్న విషయాలకే జీవితాలను చాలించుకుంటున్నారు. మాకుగొప్ప పాఠాన్ని నేర్పిపోయావ్! పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడేలా పిల్లల్ని తయారు చేయాల్సి బాధ్యతను మాకు గుర్తు చేశావ్! దిగులుతో మీ అమ్మ బంగారం... కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చావ్! హాయిగా జీవితాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో ఎందుకిలా చేశావమ్మా...? నాతో అన్ని విషయాలు చెప్పేదానివి. నువ్వలా అన్నీ షేర్ చేసుకుంటుంటే ఎంత సంబరపడ్డానో తెలుసా? నా కూతురికి నేను నాన్నను మాత్రమే కాదు మంచి స్నేహితుడిని కూడా అని! కాని నా సంతోషం ఉత్త భ్రమ అని తేల్చావు తల్లీ. అసలు మన మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలియజెప్పావ్! నేను డయాలిసిస్ పేషంట్ని అని తెలిసీ నన్ను వదిలిపోయావంటే నమ్మలేకపోతున్నా! నువు చేసిన పనితో నేను, అమ్మ దిక్కులేని వాళ్లమయ్యాం! నీ మరణం.. నీ పెంపకంలో మేం చేసిన తప్పుల్ని ఎత్తిచూపిస్తోంది.. వెక్కిరిస్తోంది! అందుకే మాలాంటి తల్లిదండ్రులకు ఒకటే మాట చెప్పదల్చుకున్నా... ‘దయచేసి మార్కులు, ర్యాంకులే పరమావధిగా పిల్లల్ని పెంచకండి! వాటికన్నా విలువైనది జీవితం! ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా... ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడేటట్టు పెంచండి... ఆత్మస్థయిర్యం పెంపొందేలా చూడండి’ అని! మేం నిన్ను అలా పెంచి ఉంటే బహుశా ఈ రోజు నువ్వు ఇలా మమ్మల్ని ఒంటరిగా వదిలివెళ్లిపోయేదానివి కాదు. నీకొచ్చిన కష్టాన్ని మాతో పంచుకొని ధైర్యంగా నిలబడేదానివి! - దిక్కుతోచని స్థితితో... మీ నాన్న రీనా స్వస్థలం హైదరాబాద్. ఇరవైమూడేళ్లు. మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ ఆర్ ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. తెలివి, చురుకుదనం, ధైర్యం, అందం.. అన్నీ ఆమె సొంతం! పదవ తగరతి నుంచే తన ఫీజులు తనే కట్టుకుంటూ చదువుకుంది. పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటూనే పైచదువులు పూర్తి చేసింది. కోరుకున్న ఉద్యోగం సంపాదించుకుంది. బోలెడంత భవిష్యత్.. అనుకున్నవి సాధించే చొరవ.. అయితే ఆస్వాదించే జీవితాన్నే చాలించుకుంది. ఆ రోజు.. అర్ధరాత్రి దాటినా కూతురు డైరీ రాసుకుంటుంటే .. ఆఫీస్ పనులు చేసుకుంటోందేమో అనుకుంది ఆమె తల్లి మేరీ. ‘కాస్త టీ పెట్టిస్తా’ అనుకుంటూ వంటగదిలోకి వెళ్లింది. టీ కప్పుతో తిరిగి గదిలోకి వచ్చేసరికి ఫ్యాన్‌కు వేళ్లాడుతూ కనిపించింది రీనా. కుప్పకూలిపోయింది మేరీ. ఎంత ప్రయత్నించినా ఆ బిడ్డలో శ్వాసను నింపలేకపోయింది. అసలు ఏమైంది? రీనా ఒక అబ్బాయిని ప్రేమించింది. పేరు..డెంజిల్. ఆ అబ్బాయి ప్రపోజ్ చేసిన రోజే తల్లితో చెప్పింది. అతనితోనే జీవితం అనుకుంది. కాని అది ప్రేమ కాదు మోసం అని రీనాకు తెలిసిన క్షణం.. తట్టుకోలేకపోయింది. తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మా, నాన్న, తమ్ముడు ఉన్నారని జ్ఞాపకం రాలేదు.. తల్లిదండ్రులకు సొంతిల్లు కట్టించి ఇవ్వాలన్న ఆమె భవిష్యత్ లక్ష్యాన్నీ మరిచిపోయింది.. తన జీవితం తనకు విలువైంది అన్న ఇంగితాన్నీ విస్మరించింది... ఆత్మబలాన్ని బలహీన పరిచే ఆత్మహత్యకు బలమిచ్చింది. ఫ్యాన్‌కి తన ఉసురును బలిచ్చింది. రీనా... తెలివైనదానివి.. చురుకైనదానివి! ఇలా చేశావేంటి బేటా...? నీలాంటి పిల్లలు ఇలాంటి దారి వెదుక్కోకూడదమ్మా. అందుకే పిల్లలందరికీ దండం పెట్టి చెబుతున్నా... పిల్లల గురించి తల్లిదండ్రులకు ఎన్నో కలలుంటాయి. వాటన్నిటినీ తుడిచి పోకండి. జీవితంలో ప్రేమ ఒక్కటే ఉండదు. ఇంకా చాలా ఉంటాయి. స్నేహం ఉంటుంది.. స్నేహితులు ఉంటారు.. కుటుంబం ఉంటుంది.. బంధువులు ఉంటారు... పెద్ద ప్రపంచమే ఉంటుంది.. జీవితం మాత్రం ఒక్కటే! - బాధతో మీ అమ్మ -
కారుణ్య బంధం
ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే! ప్రతి ఒక్కరికీ ఒక మంచి రోజు ఉంటుందని సామెత. రీనా లాంటి వాళ్లు ఉంటే.. ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే... ఎవ్రీ డే! ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ మంచిరోజే... మనుషులకైనా, శునకాలకైనా! రీనా... వీధికుక్కల్ని చేరదీస్తుంటారు. అక్కడితో అయిపోలేదు. పెంపుడు కుక్కల కోసం... డే కేర్ సెంటర్ నడుపుతున్నారు. ‘వి కేర్ యానిమల్’ అనే సంస్థని కూడా పెట్టారు. కుక్కలపై రీనా ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే... ‘తనను పెళ్లిచేసుకునే అబ్బాయికి కుక్కలంటే ప్రేమ ఉండాలి’ అని కండిషన్ పెట్టే వరకు!! ఈ కండిషన్ వెనుక, కారుణ్యం వెనుక ఉన్న కథే... ఈవారం ‘జనహితం’. పెంపుడు జంతువులను ప్రేమతోసాకి, ప్రాణం కంటే మిన్నగా చూసుకునేవారు సెలబ్రెటీలనుంచి సామాన్యుల వరకూ చాలామందే ఉన్నారు. అయితే వీధికుక్కల్ని చేరదీసి వాటి హక్కులకోసం పోరాడేవారు మాత్రం చాలా అరుదు. రీనా ఆ కోవలోకే వస్తారు. ‘‘నేను తొమ్మిదోతరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు స్కూలుకి వెళుతుంటే రోడ్డు పక్కనే పడుకొన్న కుక్కమీదకు ఓ కారు దూసుకొచ్చింది. కారు కుక్క దగ్గరగా రాగానే...స్టాప్...స్టాప్ అంటూ గట్టిగా అరిచాను. అయినా కారు డ్రైవర్ వినిపించుకోకుండా కారుని కుక్కపై నుంచి పోనిచ్చేశాడు. అయితే అప్పటికే నేను కారు నెంబరు నోట్ చేసుకున్నాను... స్కూలు బ్యాగు పక్కన పెట్టి చనిపోయిన కుక్కని నేను, నా స్నేహితులు కలిసి పక్కకు లాగాము. వెంటనే బిఎస్ఎన్ఎల్ కస్టమర్‌కేర్‌కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను. వాళ్లు పీపుల్ ఫర్ ఏనిమల్(పిఎఫ్ఎ) నెంబర్ ఇచ్చారు. పిఎఫ్ఎకి ఫోన్ చేస్తే వాళ్లొచ్చి చనిపోయిన కుక్కను తీసుకెళ్లి పోస్టుమార్టం చేసి ఖననం చేశారు. నేనిచ్చిన కారు నంబరు తీసుకుని కేసు ఫైల్ చేశారు. కారు నడుపుతున్నవ్యక్తి గవర్నమెంటు అధికారి కారు డ్రైవరు. ఈ కేసు వల్ల ఆర్నెల్లు తిరక్కుండానే అతని ఉద్యోగం పోయింది. అప్పటికిగాని నాకు కోపం తగ్గలేదు’’ అంటూ రీనా ఏడేళ్లకిత్రం జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటున్నప్పుడు మూగజీవులకు ఆమె మనసులో ఉన్న స్థానం ఎంతటిదో అర్థమవుతుంది. తన జీవితం కుక్కల క్షేమం కోసమే అంటోన్న రీనా చెప్పిన వివరాలివి.. శునక సంరక్షణకోసం పనిచేసే స్వచ్ఛందసంస్థలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా...రోజు రోజుకీ పెరిగిపోతున్న కుక్కల సంఖ్యకు తగ్గట్టు ఆ సేవల్ని పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోడుప్పల్ దగ్గర శ్రీలక్ష్మినగర్ కాలనీలో ఉండే రీనా తను డిగ్రీ చదువుతున్న సమయంలో ‘వి కేర్ ఏనిమల్’ అనే సంస్థని స్థాపించి ఇంటిదగ్గరే కుక్కలకోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక పక్క చదువు మరో పక్క కుక్కల పెంపకం...తనకు చేతనైనంత మేరకు రెండింటికీ న్యాయం చేసింది. ‘‘నాన్న లింగారావు ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ విమల గృహిణి. చెల్లి, తమ్ముడు...అందరికీ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. నాకు ఇంకొంచెం ఎక్కువ ఇష్టమన్నమాట. ఎంత ఎక్కువంటే...స్కూలు నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఓ పదికుక్కలు వెంటే వచ్చేవి. ఇంటర్ అయ్యేవరకూ వీధి కుక్కలకు హానీ చేయకూడదంటూ కనిపించినవారికల్లా చెబుతుండేదాన్ని. డిగ్రీలో చేరాక కుక్కల కోసం సమయం కేటాయించే అవకాశం ఏర్పడింది. దాంతో షెల్టర్ ఏర్పాటు చేశాను. చాలామంది దూరప్రాంతాలకు వెళ్లాల్సివచ్చినపుడు తమ పెంపుడు కుక్కల్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి కుక్కలకు డేకేర్లాంటి సదుపాయం కూడా ఏర్పాటు చేశాను. గాయాలపాలైన వీధికుక్కల్ని తీసుకొచ్చి చికిత్స చేయించి వాటికి పిల్లలు పుట్టకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించి షెల్టర్‌లో పెట్టుకుని పెంచేదాన్ని’’ అని చెప్పారు రీనా. వీధి కుక్కలకు వైద్యం, పెంపుడు కుక్కలకు డేకేర్ సదుపాయం ఏర్పాటు చేసి ఉన్నంతలో కుక్కలకు సేవ చేసుకుంటున్న రీనాకు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. కుక్కల్లో పిల్లల తల్లులు ఆహారం లేక చాలా ఇబ్బంది పడతాయని అలాంటివి ఎక్కడైనా కనిపిస్తే తన దగ్గర వదిలేయమని ఒక ప్రకటన ఇచ్చింది. అప్పుడు మొదలైంది అసలు కథ. పాలు తాగించి...పక్కనే ఉండి ‘‘నేనిచ్చిన ప్రకటన చూసి జిహెచ్ఎమ్సివాళ్లు ఓ నలభైకుక్కల్ని తీసుకొచ్చి నాకప్పగించారు. వాటివెంట నెలల పిల్లలతో పాటు రోజుల వయసున్న బుజ్జి బుజ్జి కూనలు కూడా ఉన్నాయి. తల్లికుక్కలకు కడుపునిండా అన్నం పెట్టి పిల్లలమధ్య వదిలేస్తే ఒక్క కుక్క కూడా పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. విషయం ఏంటంటే... ఆ పిల్లలేవీ ఆ కుక్కలకు పుట్టినవి కావు. దాంతో పాలులేక పిల్లలు అరవడం మొదలెట్టాయి. వెంటనే మెడికల్షాపుకెళ్లి పాలడబ్బాలు కొనుక్కొచ్చి వాటికి పాలుతాగించాను. ఓ పదిరోజులు కాలేజి ఎగ్గొట్టి ఆ పిల్లలమధ్యే గడిపాను. తల్లికుక్కల్ని బ్లూక్రాస్‌కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి బయట వదిలేశాను. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక బయటికి పంపించాను. అలా ‘వి కేర్ ఏనిమల్’ని ఛాలెంజ్‌కి తీసుకుని నడిపించాను. అయితే భవిష్యత్తులో కుక్కల సంరక్షణకోసం పటిష్టమైన సంస్థని ఏర్పాటు చేయడానికి కావాల్సిన శిక్షణ, జ్ఞానం అవసరమని గుర్తించి ‘పీపుల్ ఫర్ ఏనిమల్’ ఆధ్వర్యంలో కొంత శిక్షణ తీసుకున్నాను’’ అని చెప్పే రీనా ఆలోచన సేవ నుంచి పోరాటందాకా విస్తరించింది. కుక్కలకు కూడా హక్కులున్నాయంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. కుక్కల హత్య... రీనా ఉండే ప్రాంతంలో ఒకరోజు వీధి కుక్క ఓ చిన్నపాపను కరిచింది. ఆ పాప సర్పంచ్ మనవరాలు కావడంతో అతను వెంటనే ఆ ప్రాంతంలోని కుక్కల్ని చంపించేశాడు. ఆ సంఘటన రీనా దృష్టికి వచ్చింది. ‘‘నాకు విషయం తెలియగానే చెప్పలేనంత ఆవేశం వచ్చింది. పైగా ఆ కుక్కల్ని చంపిన విధానం ఎంత ఘోరం... అంటే ఆ కుక్కలన్నింటికీ మనుషుల్ని పెట్టి పాయిజన్ ఇప్పించి మరీ చంపించేశారు. ఈ సంఘటనలో ఎనభై కుక్కలు చనిపోయాయి. నేను నేరుగా ఆ నాయకుడి దగ్గరికి వెళ్లి ఏ అధికారంతో ఈ పని చేశారని అడిగాను. ‘నాకు పైనుంచి ఆదేశాలున్నాయి’ అన్నారు. కుక్కని చంపే హక్కు ఎవరికీ లేదని అతనిపై కేసు వేశాను. అయితే ఆ తర్వాత నాకు అర్థమైందేమిటంటే... కుక్కల్ని చంపడం నేరమన్న విషయం చాలామందికి తెలియదని’’ రీనా చెబుతున్నప్పుడు తనకళ్లలో చెమ్మ కనిపించింది. ‘‘వీధిలో కుక్కలు లేకపోతే రాత్రిపూట ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. రాత్రివేళ కుక్క అరిచే అరుపు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే కుక్క మనల్ని కరిస్తే దాన్ని చంపేటంత కోపం వస్తుంది. ఎందుకంత కోపం... దానికి ఓ రెండు టీకాలు వేయిస్తే పోయేదానికి చంపడందేనికి’’ అని ప్రశ్నిస్తున్న రీనా ఆవేదనలో అర్థం ఉంది. మన ఇంటిముందు పడుకున్న ఓ వీధికుక్క అరుపు దాని ఆకలిని కాదు... తన కావలిని చూపిస్తుందని అర్థమైనవారికి రీనా బాధ కూడా అర్థమవుతుంది. ‘‘నన్ను పెళ్లిచేసుకునే అబ్బాయికి కుక్కలంటే ప్రేమ ఉండాలి’’ అని కండిషన్ పెడుతున్న ఈ శునకప్రేమికురాలి కోరిక నెరవాలని కోరుకుందాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: పి. మోహన్ వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్... భవిష్యత్తులో రీనా చేయాలనుకుంటున్న కార్యక్రమాలు చాలా పెద్దవి. సొంతంగా భూమి కొనుక్కుని వీధి కుక్కలకోసం పెద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానికోసం ‘పీపుల్స్ ఫర్ ఏనిమల్’ వారి దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు. ‘వైల్డ్‌లైఫ్ ట్రైనింగ్’లో చేరాక మూగజీవులకు సంబంధించి రీనా చాలా విషయాలు నేర్చుకున్నారు. జెన్‌పాక్ కంపెనీలో పనిచేస్తున్న రీనా ఇంట్లో ప్రస్తుతం ఓ పది వీధి కుక్కలు ఉంటున్నాయి. వాటిని చూసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వీధికుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తున్నారు రీనా.