చనిపోయిన కూతురికి ఉత్తరం | Letter to dead daughter | Sakshi
Sakshi News home page

చనిపోయిన కూతురికి ఉత్తరం

Published Tue, Apr 12 2016 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

చనిపోయిన   కూతురికి ఉత్తరం

చనిపోయిన కూతురికి ఉత్తరం

మన పిల్లలకు మనం అన్నీ ఇస్తాం.. నాన్న ముక్కు.. అమ్మ కళ్లు... మేనమామ హైట్.. మేనత్త రంగు! అవేకాకుండా.. చదువులు.. ఆటలు..పాటలు అన్నీ! కాని ఒక్కటివ్వడం మర్చిపోతున్నాం.. కష్టమొస్తే నిలబడే శక్తి, అవసరమైతే ఎదురీదే స్థయిర్యం! మనం ఎప్పుడూ పిల్లలకు తోడుగా ఉంటామని అనుకోబట్టి కాబోలు.. వాళ్లకు ఒంటరిగా పోరాడే ఆత్మస్థయిర్యాన్ని ఇవ్వలేకపోతున్నాం! దానికి శిక్షను ఇద్దరూ అనుభవించాల్సి వస్తోంది! ఈ రెండు వ్యథలు చదివి జాగ్రత్తపడ్తారని ఆశిస్తున్నాం!

 

ఇవి రెండు వేరువేరు కథలు.. కాని వాటి ముగింపు మాత్రం ఒక్కటే
అవి ఉత్తరాలు కావు... తల్లిదండ్రులు ఆత్మఘోష... పేగు పాశం! దాదాపు పదిరోజుల కిందట...  స్వతంత్య్ర వ్యక్తిత్వానికి ఉదాహరణలుగా.. ఈతరం శక్తికి ప్రతీకలుగా నిలవాల్సిన ఇద్దరమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కన్నవాళ్లను వాళ్ల మానాన వాళ్లను వదిలేసి తనువు చాలించారు. బాధ్యత తెలిసిన బిడ్డలు తమ బాధ్యతను మరచి చేసిన ఈ పనికి ఆ అమ్మానాన్నలు కుంగిపోతున్నారు.. కుమిలిపోతున్నారు. ఆ వేదనకు... కూతుళ్ల మీద పెంచుకున్న వాళ్ల మమకారానికి అక్షరరూపమే ఆ ఉత్తరాలు! ఇటు పిల్లలకు.. అటు తల్లిదండ్రులకు చురకలు! ఆ బిడ్డల నేపథ్యాలు..

 


సౌమ్య

కొమురయ్య, మాలతిల గారాలపట్టి సౌమ్య. ఫస్ట్ క్లాస్ నుంచీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంటే! పదవతరగతిలో స్టేట్ ఫస్ట్. ఎమ్‌సెట్ ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ తెచ్చుకుంది. అంతే కష్టపడి డాక్టర్ అయింది. ఆ వెంటనే పీజీలోనూ సీటు సంపాదించింది. ఇంతలోనే పెళ్లికుదిరింది. అంతా పెళ్లి పనుల్లో తలమునకలయ్యారు. మామిడాకు తోరణాలు.. పూల పందిరి.. బాజాభజంత్రీలు... జీలకర్రబెల్లం.. అక్షింతలు.. తాళికట్టే శుభవేళ.. హమ్మయ్య ఎలాంటి అవాంతరాలు లేకుండా హాయిగా.. హ్యాపీగా సాగిపోయింది పెళ్లి! సౌమ్య ఒకింటిదైంది. అత్తింట్లో అడుగుపెట్టింది. పసుపుపారాణి పాదాలు మెట్టెల సవ్వడితో అత్తింట్లో సందడి చేశాయి. ఆ సంబరం కలకాలం నిలవాలని మనసులోనే దండం పెట్టుకున్నారు ఇరువైపు వాళ్లు. అది దేవుడికి చేరలేదో.. లేక విధి చేరనివ్వలేదో.. తెలియదు.  పక్షంరోజులకే సౌమ్య తాను పీజీ చదువుతున్న కాలేజ్ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరి బిగించుకుంది. ఇంటిల్లిపాది సంతోషాల ఊపిరి తీసింది.

 
ఎందుకు చేసింది?

తెలియదు. తండ్రి అంటే ప్రాణం పెట్టే సౌమ్య కనీసం ఆయనతోనూ తనకు ఫలానా కష్టం ఉంది అంటూ చెప్పుకోలేదు. డయాలసిస్ మీదున్న  తండ్రికి తనే ధైర్యమన్న విషయమూ ఆమెకు తెలుసు. అయినా ప్రాణం తీసుకోవాలనుకున్న ఆ ఆడబిడ్డను ఇవేవీ కదిలించలేకపోయాయి. నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఎప్పుడూ గలగలా నవ్వుతూ తిరిగే ఆ బిడ్డ మనసులో ఉన్న అలజడిని తండ్రీ గ్రహించలేకపోయాడు. అలాంటి మాటలు, ప్రవర్తనా అతని కంటపడలేదు. పడి ఉంటే.. అనుమానమన్నా పడి ఉంటే.. ఈ ఘోరం జరిగేది కాదు అంటూ కంటతడిపెడ్తున్నాడు కొమురయ్య. సౌమ్య తోబుట్టువూ డాక్టరే. ఆరేళ్లకిందట ఓ రోడ్డుప్రమాదంలో  చెట్టంత కొడుకును పోగొట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ దిగులు నుంచి వాళ్లను బయటపడేసింది సౌమ్యే. అంతటి ధైర్యవంతురాలు ఈ పనిచేసిందేంటి? కొడుకు  చనిపోయినప్పటినుంచి కూతురే సర్వస్వంగా బతుకున్న మాకేంటి ఈ శిక్ష? అని కుమిలిపోతున్నారు సౌమ్య తల్లిదండ్రులు మాలతి, కొమురయ్య!

 

సౌమ్య...
నీ మనసులో ఏదైనా బాధ ఉంటే బయటకు చెప్పుకోవాల్సింది. నువ్ లేకుండా మేం ఎలా బతకాలి? జీవచ్ఛవాల్లా మారాం. ఎదిగిన పిల్లలు అమ్మానాన్న తమకు ఓ బాధ్యత అనుకుంటే ఇలా చేస్తారా? నువ్వనే కాదు.. ఈ తరం పిల్లలంతా చిన్న చిన్న విషయాలకే జీవితాలను చాలించుకుంటున్నారు. మాకుగొప్ప పాఠాన్ని నేర్పిపోయావ్! పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడేలా పిల్లల్ని తయారు చేయాల్సి బాధ్యతను మాకు గుర్తు చేశావ్!  దిగులుతో మీ అమ్మ

 

బంగారం...
కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చావ్! హాయిగా జీవితాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో ఎందుకిలా చేశావమ్మా...? నాతో అన్ని విషయాలు చెప్పేదానివి. నువ్వలా అన్నీ షేర్ చేసుకుంటుంటే ఎంత సంబరపడ్డానో తెలుసా? నా కూతురికి నేను నాన్నను మాత్రమే కాదు మంచి స్నేహితుడిని కూడా అని! కాని నా సంతోషం ఉత్త భ్రమ అని తేల్చావు తల్లీ. అసలు మన మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలియజెప్పావ్! నేను డయాలిసిస్ పేషంట్‌ని అని తెలిసీ  నన్ను వదిలిపోయావంటే నమ్మలేకపోతున్నా!  నువు చేసిన పనితో  నేను, అమ్మ దిక్కులేని వాళ్లమయ్యాం! నీ మరణం.. నీ పెంపకంలో మేం చేసిన తప్పుల్ని ఎత్తిచూపిస్తోంది.. వెక్కిరిస్తోంది! అందుకే మాలాంటి తల్లిదండ్రులకు ఒకటే మాట చెప్పదల్చుకున్నా... ‘దయచేసి మార్కులు, ర్యాంకులే పరమావధిగా పిల్లల్ని పెంచకండి! వాటికన్నా విలువైనది  జీవితం! ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా... ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడేటట్టు పెంచండి...  ఆత్మస్థయిర్యం పెంపొందేలా చూడండి’ అని! మేం నిన్ను అలా పెంచి ఉంటే బహుశా ఈ రోజు నువ్వు ఇలా మమ్మల్ని ఒంటరిగా వదిలివెళ్లిపోయేదానివి కాదు. నీకొచ్చిన కష్టాన్ని మాతో పంచుకొని ధైర్యంగా నిలబడేదానివి!  -  దిక్కుతోచని స్థితితో... మీ నాన్న

 



రీనా
స్వస్థలం హైదరాబాద్. ఇరవైమూడేళ్లు. మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ ఆర్  ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. తెలివి, చురుకుదనం, ధైర్యం, అందం.. అన్నీ ఆమె సొంతం! పదవ తగరతి నుంచే తన ఫీజులు తనే కట్టుకుంటూ చదువుకుంది. పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకుంటూనే పైచదువులు పూర్తి చేసింది. కోరుకున్న ఉద్యోగం సంపాదించుకుంది. బోలెడంత భవిష్యత్.. అనుకున్నవి సాధించే చొరవ.. అయితే ఆస్వాదించే జీవితాన్నే చాలించుకుంది.

 
ఆ రోజు..

అర్ధరాత్రి దాటినా  కూతురు డైరీ రాసుకుంటుంటే .. ఆఫీస్ పనులు చేసుకుంటోందేమో అనుకుంది ఆమె తల్లి మేరీ. ‘కాస్త టీ పెట్టిస్తా’ అనుకుంటూ వంటగదిలోకి వెళ్లింది. టీ కప్పుతో తిరిగి గదిలోకి వచ్చేసరికి ఫ్యాన్‌కు వేళ్లాడుతూ కనిపించింది రీనా. కుప్పకూలిపోయింది మేరీ. ఎంత ప్రయత్నించినా ఆ బిడ్డలో శ్వాసను నింపలేకపోయింది.

 

అసలు ఏమైంది?
రీనా ఒక అబ్బాయిని ప్రేమించింది. పేరు..డెంజిల్. ఆ అబ్బాయి ప్రపోజ్ చేసిన రోజే తల్లితో చెప్పింది. అతనితోనే జీవితం అనుకుంది. కాని అది ప్రేమ కాదు మోసం అని రీనాకు తెలిసిన క్షణం.. తట్టుకోలేకపోయింది. తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మా, నాన్న, తమ్ముడు ఉన్నారని జ్ఞాపకం రాలేదు..  తల్లిదండ్రులకు సొంతిల్లు కట్టించి ఇవ్వాలన్న ఆమె భవిష్యత్ లక్ష్యాన్నీ మరిచిపోయింది.. తన జీవితం తనకు విలువైంది అన్న ఇంగితాన్నీ విస్మరించింది... ఆత్మబలాన్ని బలహీన పరిచే ఆత్మహత్యకు బలమిచ్చింది. ఫ్యాన్‌కి తన ఉసురును బలిచ్చింది.

రీనా...
తెలివైనదానివి.. చురుకైనదానివి!  ఇలా చేశావేంటి బేటా...? నీలాంటి పిల్లలు ఇలాంటి దారి వెదుక్కోకూడదమ్మా. అందుకే పిల్లలందరికీ దండం పెట్టి చెబుతున్నా...   పిల్లల గురించి తల్లిదండ్రులకు ఎన్నో కలలుంటాయి. వాటన్నిటినీ తుడిచి పోకండి. జీవితంలో ప్రేమ ఒక్కటే ఉండదు. ఇంకా చాలా ఉంటాయి. స్నేహం ఉంటుంది.. స్నేహితులు ఉంటారు.. కుటుంబం ఉంటుంది.. బంధువులు ఉంటారు... పెద్ద ప్రపంచమే ఉంటుంది.. జీవితం మాత్రం ఒక్కటే!  -  బాధతో  మీ అమ్మ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement