అవునా! దెయ్యాలు ప్రేమిస్తాయా? | is it true ghosts loves or not? | Sakshi
Sakshi News home page

అవునా! దెయ్యాలు ప్రేమిస్తాయా?

Published Mon, Mar 27 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

అవునా!  దెయ్యాలు ప్రేమిస్తాయా?

అవునా! దెయ్యాలు ప్రేమిస్తాయా?

మేల్‌ వాయిస్‌

మూడు రోజుల క్రితం ఊరెళ్లి ఉండకపోతే, ఊళ్లో రాత్రి పన్నెండు గంటల సమయంలో  చెరువుగట్టు దాటి మా ఫ్రెండుగాడింటికి చేరకపోయి ఉంటే ‘దెయ్యాలు ప్రేమిస్తాయా?’ అని నన్ను ఎవరైనా అడిగి ఉంటే ఇట్టి విషయాన్ని ఖండించడానికి నూట ఒక్క కత్తులను నా ఒర నుండి తీసేవాడిని. చార్వాకుడినై ‘దైవం దెయ్యం జాన్తానై’ అని అరిచేవాడిని. ఇప్పుడు నేను ఖండించలేను. అరవనూ లేను. ఎందుకో తెలుసా?
ఆ రాత్రి... సన్నని వర్షం నన్ను ప్రేమగా కౌగిలించుకోవడానికి వస్తుంటే చెరువుకట్ట మీద నా అడుగులు వడివడిగా పడుతున్నాయి. దూరంగా జిట్టీత చెట్ల నుంచి ఆడపిల్ల నవ్వు! ‘భ్రమ’ అనుకొని ధైర్యం చెప్పుకున్నాను.

మళ్లీ అదే నవ్వు. నా ధైర్యాన్ని నిలువునా చీల్చేసిన నవ్వు. నేను ఎంత వేగంగా పరుగు తీశానంటే ‘ప్రసన్నాంజనేయం’ పద్యం పూర్తయ్యేలోపు ఫ్రెండుగాడింట్లో ఉన్నాను. నాకు ఎదురైన అనుభవాన్ని వాడికి చెబితే ‘పాతాళభైరవి’ విలన్‌లా నవ్వాడు. ఆ తరువాత ఒక కథ చెప్పాడు. దాని సారాంశం: పెళ్లి కాకుండా చనిపోయిన అమ్మాయిలు కన్నెదెయ్యాలై యువకులను వెంబడిస్తాయట. ప్రేమిస్తాయట. పెళ్లి చేసుకోమని పోరుతాయట. మా ఫ్రెండు అబద్ధాల పుట్ట. ఈ కథ ఆ పుట్టలోనిదై ఉండొచ్చు. నిజమై కూడా ఉండొచ్చు. దెయ్యాలు ప్రేమిస్తాయా? అని మా అమ్మను అడిగాను. అమ్మమ్మను అడిగాను. వాళ్ల చెల్లిని అడిగాను. ఆమె భర్తను అడిగాను. ఏ ఒక్కరూ ‘నో’ అనలేదు. ఒక్కొక్కరూ ఒక్కో కథ చెప్పారు. నమ్మకం అపనమ్మకాల విషయం ఎలా ఉన్నా ఆ కథలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి.మహారచయిత్రి మహాశ్వేతాదేవి ఒక మాట ఇలా అన్నారు.

‘దెయ్యాల భయం పద్మవ్యూహం. అందులో చొరబడ్డమే గానీ బైట పడ్డం అనేది ఉండదు’ నేను కూడా పద్మవ్యూహంలోనే ఉన్నాను. అయితే దానిలో నుంచి ఎలా తప్పించుకోవాలని మాత్రం ఆలోచించలేదు. అప్పుడప్పుడూ భయాల్లో కూడా తెలియని మజా ఉంటుంది. కన్నెదెయ్యాలకు వాళ్ల రాజ్యాంగం ప్రకారం మగవాళ్ల ‘రక్తమాంసాలు పీల్చేసే’ ప్రత్యేక అధికారం దాఖలవుతుందట. నా ‘మగ’ జాతి జనులు ప్రేయసి తలను, పెళ్లాం తలను నరికి చేతుల్లో పెట్టుకొని సగౌరవంగా ఊరేగుతున్న రాక్షససమయాల్లో కూడా కరుణామయులైన కన్నెదెయ్యాలు తమ ప్రత్యేక అధికారాన్ని వినియోగించుకున్న దాఖలా లేదు.

పైగా అమాయకంగా నాలాంటి మగవాళ్లను చెట్టు మీది నవ్వుతో ‘ఐ లవ్‌ యూ’ అనేస్తారు. దెయ్యాలై కూడా నిప్పుల వర్షం కురిపించకుండా చిరుగాలి సితార సంగీతమై అడుగు అడుగులో సుతారంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. ఈ అమాయక ఆడపిల్లలు ఎప్పుడు బాగుపడతారో ఏమో?
– యాకూబ్‌ పాషా యం.డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement