నిరుడు ఇదే సమయానికి - ఈ కొయ్యబారిన చలిరోజుల్లో... యావద్దేశం సలసల మరిగిపోతున్న రక్తంతో ‘నిర్భయ’ కోసం నినదిస్తూ ఉంది. ఆమె బతకాలని క్షణం విరామం లేకుండా ప్రార్థిస్తూనే ఉంది! ఇప్పుడు నిర్భయ లేదు. నిర్భయ చట్టం ఉంది. చట్టం ఉంది. కానీ నిశ్చింత లేదు! రోజూ ఎక్కడో ఒకచోట, ఏదో ఒక ఘటన! పార్లమెంటు చట్టం చేస్తుంది కానీ... పాఠశాల వరకూ తోడు రాలేదు. పోలీస్‌స్టేషన్‌లు ఉంటాయి కానీ... ఆఫీస్‌లో పక్కనే వచ్చి కూర్చోవు. ఎలా మరి? చదువు కోసం, కొలువుల కోసం ఆడపిల్లలు బయటికి వెళ్లిరావడం ఎలా? ఏ కవచాలు వారిని కాపాడతాయి? కవచాలు అక్కర్లేదు... కరములు చాలు అంటోంది బాలల హక్కుల సంఘం. అనడం మాత్రమే కాదు... స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్పుతోంది. అంతకన్నా ముందు... ధైర్యమే మీ తొలి ఆయుధం అని నూరిపోస్తోంది. కనీసం వెయ్యి విద్యాలయాలలో బాలికలకు, యువతులకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచాలని కంకణం కట్టుకున్న ఈ హక్కుల సంఘం బృహత్తర ప్రయత్నమే ఈవారం ‘జనహితం’.
ఆడపిల్ల బయటకు వెళితే తిరిగి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు భయంభయంగా ఎదురుచూసే రోజులివి. వారి భయం ‘ఆమె’ను మరింత బలహీనురాలిగా మారుస్తుంది. అదే ఆత్మరక్షణ విద్య నేర్పితే ‘ఆమె’ ధైర్యంగా ఎదుగుతుంది. ఇంటిల్లిపాదీ నిబ్బరంగా ఉంటారు. ఈ ఆలోచన తో రాష్ట్ర బాలల హక్కుల సంఘం ‘అమ్మాయిలకు ఆత్మరక్షణ’ పద్ధతులను నేర్పిస్తోంది. ఇందుకు గాను ఐఎమ్‌ఎఫ్ కరాటే మాస్టర్ నరేందర్‌తో కలిసి 1000 స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లోని అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ద్వారా అవగాహన కల్పిస్తోంది.
‘ప్రతి అమ్మాయి బాల్యం నుండే తనను తాను రక్షించుకోవడం ఎలా అన్నది తల్లి చిన్ననాటినుంచే నేర్పించాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం, ఆత్మరక్షణ విద్యలను సాధన చేయించాలి. ఎవరైనా తమపై దాడి జరపగలరన్న అనుమానం వచ్చిన వెంటనే అలెర్ట్ అవగలిగే అవగాహన వారిలో పెంచాలి. తమ దగ్గర ఉండే సాధారణమైన సాధనాలతోనే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి..’ అంటూ ఈ సూచనలు చేస్తున్నారు నిర్వాహకులు.
ఆత్మరక్షణ పద్ధతుల్లో చెప్పే ప్రధాన అంశాలు
మార్షల్ ఆర్ట్స్ అనేది చిట్టచివరి అధ్యాయం. ముందు కనీస జాగ్రత్తలు అమ్మాయిలు తీసుకోవడం అవసరం. పెద్దలూ వారికి ఇవి సూచించాలి...
ఇంట్లో నుంచి అమ్మాయి బయటకెళ్లేటప్పుడు వెంట మొబైల్ తీసుకెళ్లాలి. అందులో ఇంటి నెంబర్లు, పోలీసుస్టేషన్ నెంబర్లు ఉంచుకోవాలి,
అమ్మాయిలు చాలావరకు రోడ్లపై మొబైల్‌లో స్నేహితులతో చాటింగ్ చేస్తూ, కబుర్లు చెబుతూ వెళుతుంటారు. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా దాడికి గురిచేసే అవకాశం ఉండవచ్చు. అందుకని రోడ్లమీద ఫోన్ కబుర్లకు దూరంగా ఉండాలి.
బయటకు వెళ్లేటప్పుడు నలుగురితో కలిసి ఉండాలి.
వెంట విజిల్ తీసుకువెళ్లడం, కీ చెయిన్‌కు ఒక చిన్న కత్తిలాంటివి తగిలించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆగంతకులు తమ నోరు మూస్తే వారి చేతి పైన పిన్‌తో గాని, కీతో గాని గుచ్చడం... వంటివి చే సి దాడి నుంచి తప్పించుకోవచ్చు.
కొందరు బస్సులలో, రద్దీగా ఉండే ప్రాంతాలలో శరీర భాగాలను తగులుతుంటారు. అలాంటప్పుడు తమ వెంట ఉండే వస్తువులతో ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కవచ్చో తెలుసుకోవచ్చు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు.
కరాటే నేర్చుకున్న అమ్మాయిలు కూడా కొంత అమాయకంగా ఆలోచిస్తుంటారు. తమపై దాడి చేసిన వారిని గట్టిగా కొడితే చచ్చిపోతారేమో అని భయపడుతుంటారు లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వెనుకంజ వేస్తుంటారు. రోడ్డు మీద ఎవరైనా తమపై దాడికి దిగినప్పుడు వారిని తరమవచ్చు అని ‘నిర్భయ చట్టం’ చెబుతోంది.
ఆడపిల్లలు చిన్నప్పటినుంచే ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ పట్ల అవగాహన పెంచుకోవాలి. టీచర్లు, దగ్గరి బంధువులు మెచ్చుకోలు కోసం భుజాలు తట్టడం, నొక్కడం చేస్తుంటారు. వీటిలో ఆ ‘టచ్’ పట్ల ఆలోచన చేసే జ్ఞానం అలవర్చుకోవాలి. ‘తేడా’గా అనిపిస్తే ప్రిన్సిపాల్‌కు చెప్పడం లేదా నలుగురిలో నిలదీయడం, ఇంట్లో వారికి చెప్పడం చేయాలి. లేదంటే వారు మరింత చనువు తీసుకోవచ్చు.
కొంతమంది ఆడపిల్లల శారీరక అవయవాల గురించి చెబుతూ వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటప్పుడు ఆడపిల్లలు సిగ్గుపడుతూ గుంభనంగా ఉండిపోకూడదు. ఇలాంటివి ప్రోత్సహిస్తే సదరు వ్యక్తి మరింత అడ్వాన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారి గురించి నలుగురికీ తెలియజేయడం అవసరం.
ఆగంతకులు ఎవరైనా వెనక నుంచి పట్టుకుంటే ముఖంపై కొట్టాలి, ముక్కుపై గుద్దాలి, విడిపించుకునే క్రమంలో ఎలా ఉండాలో కనీస అవగాహన పెంపొందించాలి. నెగిటివ్, పాజిటివ్ అంశాలకు తేడా తెలుసుకోవాలి. నిలదీసే ధైర్యం పెంచుకోవాలి.
చదువుతోపాటు చిన్ననాటి నుంచి అబ్బాయిలకూ సంస్కారం నేర్పాలి.
ఈ ముందు జాగ్రత్తలతో పాటు మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలకు ఎంతవరకు అవసరమో తెలియజేస్తూ వారిలో అవగాహన కల్పిస్తుంది ఈ కార్యక్రమం.
- సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, ఫొటోలు: శివమల్లాల
భయం పోయింది
కరాటే నేర్చుకోకముందు ఓ సారి బస్‌లో నా మెడలో చైన్‌ను లాగారెవరో! ఆ సమయంలో అరవడానికి కూడా నాకు ధైర్యం చాలలేదు. కొన్ని రోజుల వరకు ఆ భయం పోలేదు. ఆ సంఘటన తర్వాత కరాటే నేర్చుకున్నాను. కిందటేడాది కాలేజీ నుంచి వస్తుంటే దారిలో ఆగంతుకులు దాడి చేయబోయారు. వారిని ధైర్యంగా ఎదుర్కోగలిగాను.
- పి.శాలిని, కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత
ఒక చేత వెన్నముద్ద ఒక చేత యుద్ధవిద్య
Published Fri, Dec 20 2013 1:12 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement
Advertisement