కోనసీమ దసరా ఉత్సవాల్లో ఇదే హైలైట్.. గగుర్పాటుకు గురిచేసే యుద్ధ విన్యాసాలు
సంస్థానాల నుంచి స్వాతంత్య్ర పోరాటం వరకు 170 ఏళ్ల ప్రస్థానం.. నాలుగు తరాలుగా ప్రదర్శిస్తున్న అబ్బిరెడ్డి కుటుంబీకులు
కోనసీమ.. మైమరపించే ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మిక సౌరభాలకు.. సంస్థానాల పాలనకు.. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలకు ఆలవాలంగా నిలుస్తోంది. ఇక్కడ జరిగే సంక్రాంతి.. దసరా పండగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ప్రభల తీర్థాలతోపాటు దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే చెడీ తాలింఖానా ప్రదర్శన సైతం జాతీయ స్థాయిలో గుర్తింపు సంతరించుకుంది.
బ్రిటిష్ కాలంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని సంస్థానాల్లో యువకులకు యుద్ధ విద్యలు నేర్పించేందుకు చెడీ తాలింఖానా మొదలైంది. తరువాత కాలంలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి.. సమరయోధుల మధ్య ఐక్యతకు ప్రతీకగా మారింది.
నాటినుంచి నేటి వరకు దశాబ్దాల కాలంగా ఈ వీరుల విద్య కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైంది. ఏటా దసరా ఉత్సవాలలో కత్తులు, బళ్లేలు, బాణా కర్రలతో సాగే ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ నెల 12న దసరా రోజున రాత్రి చెడీ తాలింఖానా ప్రదర్శనలు అమలాపురంలో వీధుల్లో రోమాంచితం కానున్నాయి. – సాక్షి, అమలాపురం
బర్మాలో శిక్షణ పొంది..
చెడీ తాలింఖానా బర్మా (మయన్మార్)కు చెందిన విద్య. ఉమ్మడి గోదావరి జిల్లాలోని సంస్థానాల్లో పనిచేసే సైనికులకు, యువతకు యుద్ధ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అమలాపురం పట్టణానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు (తొలి తరం వ్యక్తి) బర్మా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. పిఠాపురం, పెద్దాపురం, మొగల్తూరు తదితర సంస్థానాల నుంచి, స్థానిక యువకులు ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకునేవారు. స్వాతం్రత్యానికి పూర్వం బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయులలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు.
ఊరేగింపులలో జాతీయ సమైక్యత చాటాలని ఆయన ఇచ్చిన పిలుపుతో దసరా ఉత్సవాలలో చెడీ తాలింఖానా ప్రదర్శన ఒక భాగమైంది. దసరా ఉత్సవాల్లో ఇది ప్రారంభమై 168 ఏళ్లు అయ్యింది. అమలాపురం పట్టణంలో దసరా రోజు సాయంత్రం నుంచి ఏడు వీధులకు చెందినవారు దసరా వాహనాలను ఊరేగిస్తారు. ఈ ప్రదర్శనలో చెడీ తాలింఖానా, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి.
నాలుగు తరాలుగా..
అమలాపురానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానాకు అంకురార్పణ చేశారు. తరువాత ఆయన కుమారుడు అబ్బిరెడ్డి నరసింహరావు (రెండవ తరం వ్యక్తి) ఈ వీర విద్యను ప్రోత్సహించారు. అబ్బిరెడ్డి రామదాసు (మూడవ తరం) తాత బాటలో ఈ విద్యకు రాష్ట్రస్థాయి గుర్తింపును తీసుకువచ్చారు. అబ్బిరెడ్డి మల్లేశ్వరస్వామి (మల్లేష్–నాల్గవ తరం) తాత, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మల్లేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా యూఎస్‌లోని టెక్సాస్‌లో పనిచేస్తున్నారు. దసరా సమయంలో ముందుగానే ఇక్కడకు వచ్చి స్థానికులకు శిక్షణ ఇస్తుంటారు.
కత్తులు దూస్తూ.. బళ్లేలు తిప్పుతూ..
దసరా వస్తుందంటే చాలు అమలాపురంలో సంప్రదాయ చెడీ తాలింఖానా ప్రదర్శనకు సిద్ధమయ్యే యువతీ యువకులు ఎందరో. దసరా సందర్భంగా వీధుల్లో అమ్మవారు వివిధ రకాల రథాలపై కొలువై ఊరేగింపుగా వెళతారు. దీనికి ముందే ఏడు వీధులకు చెందిన యువకులు పట్టా కత్తులకు పదును పెడతారు.
బళ్లేలు, బాణా కర్రలు, కత్తులతో విన్యాసాలు చేస్తారు. రాచరిక యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను తిలకించేందుకు దసరా రోజు రాత్రి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి శరీరంపైన, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు.
అగ్గి బరాటాలు, లేడి కొమ్ములు, పట్టా కత్తులను చురుగ్గా కదిలిస్తూ యువకులు చేసే విన్యాసాలు యుద్ధ సన్నివేశాలను తలపిస్తాయి. ప్రదర్శన ఆసాంతం ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు జాము వరకు ఊరేగిస్తారు.
త్వరలో వెబ్‌సైట్
చెడీ తాలింఖానాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నదే నా ధ్యేయం. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా దీనికి విస్తృత స్థాయిలో ప్రచారం తీసుకువస్తున్నాం. త్వరలోనే తాలింఖానాకు ప్రత్యేక వెబ్‌సైట్ డిజైన్ చేస్తాం.
– అబ్బిరెడ్డి మల్లేష్, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment