సినిమా సెట్టింగ్‌లతో కోడిపందేల బరులు
వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు
కోనసీమకు ఆంధ్ర గోవా అని పేరు పెట్టి మురిసిపోతున్నకూటమి ఎమ్మెల్యేలు
సాక్షి, అమలాపురం: కోడిపందేలంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతమే గుర్తొస్తుంది. ఈసారి భీమవరం తరహా ఏర్పాట్లను తలదన్నేలా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పందేలకు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సినిమా సెట్టింగ్‌లను తలపించేలా.. పెద్దపెద్ద సినిమాల ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ల మాదిరిగా కోనసీమలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో కోడిపందేలు, గుండాటలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఇక్కడ పెద్దఎత్తున కోడి పందేలు, పొట్టేలు పందేలు, గుండాటలు నిర్వహించారు. ఈసారి అంతకుమించి మురమళ్లల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) స్వగ్రామం మురమళ్ల కావడం, ఆయన అశీస్సులు పుష్కలంగా ఉండటంతో నిర్వాహకులు రెండు ఫుట్‌బాల్ మైదానాలంత స్థలంలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 ఎకరాల స్థలంలో 10 వేల మందికి పైగా కూర్చుని పందేలు చూసేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దూరప్రాంతాల నుంచి వచ్చే 500 మంది వీవీఐపీల కోసం సోఫా సెట్‌లు, కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. రెండు బరుల్లో పందేలు నిర్వహించనున్నారు. పందేలు అందరికీ కనిపించేలా చుట్టూ భారీ ఎల్‌సీడీలు ఏర్పాటు పెడుతున్నారు. కోడి పందేలతోపాటు గుండాటలు కూడా పెద్దఎత్తున నిర్వహించనున్నారు.
కోనసీమ రుచులను చూపించేందుకు ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని పేరొందిన బిర్యానీలు, మాంసాహారం, ఆత్రేయపురం పూతరేకులతో పాటు పలు స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
ఆంధ్రా గోవా అంటూ..
ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం బీచ్‌ను ‘ఆంధ్రా గోవా’గా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తరచూ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి పండుగ మూడు రోజులు బీచ్‌వద్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో టీడీపీ, జనసేన నాయకులు సమీపంలోనే కోడి పందేలు, గుండాటలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు వేలం పాటలు కూడా నిర్వహించినట్టు సమాచారం. ఆంధ్రా గోవా అని పిలుస్తున్నందుకు పండుగ రోజులలో బీచ్‌ను గోవా తరహాలో జూద కేంద్రంగా మారుస్తున్నారని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment