ఉపాధ్యాయులు
పెండింగ్‌లో ఉన్న రెండు కరవు భత్యాల ఊసెత్తని సర్కార్
పీఆర్సీని నియమించాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు
ఐఆర్‌పై ప్రకటన కోసం ఎదురుచూపులు
ఉమ్మడి జిల్లాలో 80వేల మంది ఉద్యోగులు, పెన్షన్‌దారులు
రాయవరం: ఎన్నికల ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఏలపై ప్రకటన వస్తుందని, 12వ పీఆర్సీ చైర్మన్‌ను ప్రకటిస్తారని, పీఆర్సీ ఇచ్చే లోగా మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటినా వాటి విషయం పట్టించుకోలేదు.
ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ డీఏలు, పీఆర్సీ చైర్మన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. సంక్రాంతి కానుకగానైనా ఇస్తారని ఆయా వర్గాలు ఆశించినప్పటికీ, అటువంటి ప్రకటన ఏదీ రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డీలా పడ్డారు. పీఆర్సీ చైర్మన్‌ను నియమించి, నివేదిక ఇచ్చేలోగా ఇంటెర్మ్ రిలీఫ్ (మధ్యంతర భృతి) కోసం ఉద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల కరువు భత్యం(డీఏ) బకాయిలు ఉన్న నేపథ్యంలో ఐఆర్‌పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లలో నెలకొంది.
పీఆర్సీ ఏర్పాటు ఎప్పుడు?
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించారు. అయితే ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. 2024 మే నెలలో సాధారణ ఎన్నికల అనంతరం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. కమిషన్ చైర్మన్‌ను నియమించిన వెంటనే మధ్యంతర భృతిని మంజూరు చేయాల్సి ఉంది.
43 శాతానికి మించి ఇస్తారా..
2014లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పీఆర్సీ నివేదిక ఇచ్చేలోగా 2014 ఫిబ్రవరిలో 27శాతం ఐఆర్‌ను ప్రకటించారు. పీఆర్సీ నివేదికను రాష్ట్ర విభజన జరిగిన తేదీని ప్రాతిపదికగా తీసుకుని, అప్పటి నుంచి ఆర్థిక లబ్ధిని కల్పించారు. 43శాతం ఫిట్‌మెంట్‌తో కిరణ్‌కుమార్‌రెడ్డి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీఆర్సీని అమలు చేశారు. అయితే పీఆర్సీ అరియర్ల విషయంలో మాత్రం శీతకన్ను వేశారు. ఎన్నో విజ్ఞాపనలు, ఆందోళనలతో ఎట్టకేలకు 2016 అక్టోబర్ నుంచి సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతలుగా, రెగ్యులర్ ఉద్యోగులకు ఒక విడతగా పీఆర్సీ అరియర్లు చెల్లించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే అరియర్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా అప్పట్లో విన్పించాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా 43 శాతానికి మించి ఫిట్‌మెంట్ ఇవ్వాలనే డిమాండ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి విన్పిస్తోంది.
ఆందోళనకు సిద్ధం
పీఆర్సీ ప్రకటించిన తర్వాత నివేదిక వచ్చేలోపు ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. పీఆర్సీ కమిషన్‌ను నియమించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి సాధారణంగా ఏడాది సమయాన్ని ఇస్తారు. పీఆర్సీ కమిటీ నియామకం అయిన తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాల్సి ఉంటుంది. పీఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ప్రకటించాల్సిన మధ్యంతర భృతి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. ఐఆర్ ఇవ్వాల్సిందేనంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
డీఏలు ఇచ్చేదెన్నడు?
ప్రతి ఆరు నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ధరల సూచి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కరవు భత్యం ప్రకటిస్తుంది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రేషియో ప్రకారం డీఏ ఇవ్వాల్సి ఉంది. గతేడాది జనవరి, జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు డీఏలను ఇవ్వాల్సి ఉంది. ఈ నెల పోతే మరో డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. అయినప్పటికీ రెండు డీఏలను ఇప్పటికీ ఇవ్వక పోవడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే రెండు డీఏలను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉద్యోగులపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల పరిస్థితి ఇదీ..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ శాఖల్లో ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగులు కలిసి సుమారు 42వేల వరకు ఉండగా, పెన్షనర్లు 38వేల వరకు ఉన్నట్లు సమాచారం. వీరందరూ రెండు విడతల కరవు భత్యంతో పాటు, 12వ పీఆర్సీ మధ్యంతర భృతి ప్రకటనకు ఎదురుచూస్తున్నారు.
గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు
ఉద్యోగులు, ఉపాధ్యాయులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు సాకుగా చూపి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. మధ్యంతర భృతిని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. సీపీఎస్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి.
– గొల్లవిల్లి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, కోనసీమ జిల్లా
ఐఆర్ ప్రకటించాలి
అందరికీ ఆమోదయోగ్యమైన ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించాలి. పెండింగ్ డీఏలను విడుదల చేయాలి. ఆర్థిక పరమైన బకాయిలను విడుదల చేయాలి. న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించకుంటే పోరాట బాటను పట్టాల్సి వస్తుంది.
– చింతాడ ప్రదీప్‌కుమార్, అధ్యక్షుడు, పీఆర్‌టీయూ, కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment