దురాచారం ఒక వ్యవస్థగా వేళ్లూనుకున్నప్పుడు దానిని పెకలించే మహాశక్తి ఏదైనా ఆవిర్భవించాలి.అలా ఆవిర్భవించి, ‘దేవదాసీ’ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేస్తున్న స్త్రీశక్తే... మాస్.
కడుపులో ఉన్న ఆడబిడ్డను కడుపులో ఉండగానే చంపేయడం, పదేళ్లు కూడా దాటని పసిమొగ్గలపై అత్యాచారాలకు పాల్పడటం.. ఇవన్నీ ప్రతిరోజూ మనం వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. అయితే కడుపులో ఆడబిడ్డ ఉందని తెలిస్తే చాలు, ఆ బిడ్డను అప్పుడే అమ్మేసే సంస్కృతి గురించి విన్నప్పుడు మాత్రం మనం ఉన్నది ఎలాంటి సమాజంలో! అనే ప్రశ్న తలెత్తక మానదు.
ఒకరిది పేదరికం, మరొకరిది తెలియనితనం, ఇంకొకరిది ఇదేంటని ప్రశ్నించలేని పిరికితనం.. ఇవన్నీ కలిసి వారిని దేవదాసీలుగా మార్చాయి. తమ పెద్దలు, ఊళ్లో వాళ్లు చెప్పిందే వేదవాక్కంటూ ఎన్నో ఏళ్లు దేవదాసీలుగా మగ్గిపోయారు. ఎన్నో అవమానాలు పడ్డారు. దేవుడికి అంకితం చేశామనే పేరుతో ‘మగాళ్ల‘కు అప్పగించేస్తుంటే పంటిబిగువున బాధను ఆపుకున్నారు. తమ బిడ్డలకు సమాజం నుండి ఛీత్కారాలు ఎదురవుతున్నా తమ రక్తాన్ని గంజిగా మార్చి దానినే వారికి పానకంలా తాగించారు. అలా ఎన్నో ఏళ్లు సాగాయి.
తమలా మరికొందరు ఆ దారుల్లోకి వస్తూనే ఉన్నారు. అంతేకాదు, కడుపులో ఉన్న ఆడబిడ్డలు కడుపులోనే అమ్ముడయిపోతున్నారు. అప్పుడే వారికి అర్థమైంది.. ఇంకా ఇలానే భరిస్తూ పోతే తమ బిడ్డలను కూడా అదే నరకంలోకి తోస్తారని. అంతే.. కళ్లు తెరిచారు. తమ భావితరాలు ‘దాసీ’ బతుకుల్లో మగ్గిపోకూడదని పోరాటం ప్రారంభించారు. ఇంకా పోరాడు తూనే ఉన్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన దేవదాసీల్లో వచ్చిన ఈ మార్పు ఓ విప్లవంలా కొనసాగుతోంది.
కర్ణాటక దేవదాసీ(ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్)యాక్ట్-1982 ద్వారా రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అయితే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48 వేల మంది దేవదాసీలున్నట్ల్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది బీదర్, బెల్గాం, రాయచూరు, బళ్లారి ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్క బెల్గ్గాంలోనే దాదాపు 5 వేల మంది దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తున్నారు.
ఇలా బెల్గ్గాం జిల్లాలో దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తూ అనంతరం తమ జీవన విధానాన్ని మార్చుకున్న కొంతమంది మహిళలతో ఏర్పాటైన సంస్థే ‘మాస్’(మహిళల అభివృద్ధి సంరక్షణా సంస్థ-ఎంఏఎస్‌ఎస్). సామాజిక దురాచారమైన దేవదాసీ చెరలో మగ్గుతున్న బెళ్గావి జిల్లాలోని కొందరు మహిళలు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ప్రమేయంతో ఆ చెర నుండి బయటపడ్డారు. వారిలో సీతవ్వ, సరసవ్వ, ఐరావతిలు కూడా ఉన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 1997లో ‘మాస్’ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో సభ్యత్వంతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం దాదాపు 4,500 మంది మాజీ దేవదాసీలు సభ్యులుగా ఉన్నారు.
ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దేవదాసీ పద్ధతిని రూపుమాపేందుకు ‘మాస్’ సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ విషయంపై ‘మాస్’ సంస్థ కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్న సీతవ్వ, సంస్థ సభ్యురాలైన ఐరావతి ఏమంటారంటే...‘‘బెళ్గావిలోని గోకాక్ తాలూకాలో ఉన్న యల్లమ్మ గుడ్డలో జరిగే జాతరలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలను దేవదాసీలుగా మార్చేవారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ ఆడపిల్లలను దేవదాసీలుగా మారుస్తుంటారు. అయితే మా సంఘం ఏర్పాటైన నాటి నుండి అక్కడ ఎవరినీ దేవదాసీలుగా మార్చకుండా చూస్తున్నాం.
ఇంతకు ముందు మేము దేవదాసీలుగా ఉన్న వాళ్లమే కాబట్టి ఎవరైనా తమ సంబంధీకుల్లో లేదా ఇతరుల ఆడబిడ్డలను దేవదాసీలుగా మారుస్తున్నారా అన్న విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంటుంది. దేవదాసీ వ్యవస్థపై నిషేధం విధించిన నాటినుండి అమ్మాయిలను దేవదాసీలుగా మార్చే ప్రక్రియ రాత్రివేళల్లో సాగుతోంది. అందుకే మా సంస్థ సభ్యులతో బృందంగా వెళ్లి రాత్రివేళల్లో నిఘా వేసేవాళ్లం. ఆ సందర్భంలో అమ్మాయి సంబంధీకులు మాపై దాడులకు కూడా పాల్పడ్డారు. అయినా సరే, మరే ఆడబిడ్డా మాలాగా మారకూడదనే దృఢ నిశ్చయంతో వారిని అడ్డుకునేవాళ్లం. అలా ఎంతోమంది ఆడబిడ్డలను ఆ చెరలో పడకుండా చూడగలిగాము’’ అంటూ తమ సంఘం చేసిన పనులను చెప్పారు ఐరావతి.
చెరవీడినవారికి....
దేవదాసీ వ్యవస్థలో మగ్గి ప్రస్తుతం ఆ చెరనుండి బయటపడ్డ వారు వారి పిల్లలకు ఓ పుట్టినిల్లులా భరోసా ఇస్తోంది ‘మాస్’. మాజీ దేవదాసీలు, వారి పిల్లలకు రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేమున్నామంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తోంది. తమపై జరిగే అన్యాయాలను నిరోధించేందుకు గాను మాస్ సంస్థలో న్యాయ సలహా కేంద్రం కూడా ఏర్పాటైంది. న్యాయవ్యవస్థ నుండి తమకు లభించే ప్రయోజనాలు, న్యాయస్థానాల నుండి సహాయాన్ని ఎలా పొందవచ్చు అనే అంశాలపై కూడా సలహాలు, సూచనలు అందిస్తోంది. వీటితో పాటు మాస్ సంస్థలోని సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బాల్యవివాహాలను అరికట్టడంతో పాటు వివిధ సామాజిక దురాచారాలపై వీధినాటికలను ప్రదర్శిస్తూ గ్రామాల్లోని మహిళల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు చేయాల్సిన కృషి వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉంటారు. మాజీ దేవదాసీల పిల్లలకు మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేస్తోంది మాస్. ఈ క్రమంలో మాస్ సంస్థ సభ్యులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే ఎలాంటి అవరోధాలనూ లెక్కచేయక ముందుకు సాగుతున్నారు.
- షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు; ఫొటోలు: టి.కె. ధనుంజయ
స్వయం ఉపాధి కూడా...
‘దేవదాసీ విధానం నుండి విముక్తి కల్పించిన తర్వాత మేం ఆలోచించింది మా ఉపాధి గురించి, మా బిడ్డల భవిష్యత్తు గురించి. అందుకే ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ముందుగా మేం స్వయం ఉపాధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నాం. బుట్టల అల్లిక, ఎంబ్రాయిడరీ, అగరుబత్తుల తయారీలో శిక్షణ పొంది మా సభ్యులకు కూడా శిక్షణ ఇప్పించాం. ప్రస్తుతం మా సంస్థలోని సభ్యులంతా స్వశక్తితో జీవనాన్ని సాగిస్తున్నారు. మా సంఘంలోని సభ్యుల పిల్లల ఉన్నత చదువుల కోసం రుణాలను కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది మాజీ దేవదాసీల పిల్లలు ‘దాసీ’ శృంఖలాలను తెంచుకుంటూ తమదైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు.
- సీతవ్వ, మాస్ సంస్థ కార్యనిర్వాహక అధికారి