devadasi
-
యువతిని దేవదాసిగా మార్చి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
సాక్షి,బళ్లారి(కర్ణాటక): ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో దేవదాసి పద్ధతి ఇంకా కొనసాగుతోంది. తాజాగా కొప్పళ జిల్లాలో చలవాడి గ్రామంలో ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు దేవదాసిగా మార్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల క్రితం గ్రామానికి చెందిన ఒక యువతిని హులిగిలోని హులిగమ్మ ఆలయంలో కాలుకు చైను, చేతికి గాజులు తొడిగి, మెడలో తాళి కట్టించి దేవదాసిగా మార్చారు. ఈ పద్ధతిని రూపుమాపేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నా సంప్రదాయాల పేరుతో కుటుంబ సభ్యులే ఈ రకంగా చేయడంపై సంబంధిత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చదవండి: ప్రియురాలితో గోవా టూర్ కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే! -
తవాయిఫ్‌ల నుంచి దేవదాసీల వరకు
స్త్రీని తన లైంగిక బానిస చేసుకోవడానికి పురుషుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బలవంతపు పడుపువృత్తి లేదా ఆచారాల ముసుగులో నిర్బంధ లొంగుబాటు కొనసాగించాడు. దక్షిణభారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఉత్తర భారతదేశంలో తవాయిఫ్‌లు గొప్ప నాట్యకత్తెలుగా సంగీతకారిణిలుగా గుర్తింపు పొందినా వీరి లైంగిక అస్తిత్వం వీరిని సమాజంలో అథమ స్థానానికి నెట్టింది. సినిమా ఈ పాత్రలను తరచూ ప్రస్తావించింది. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా దేవదాసీ వ్యవస్థ దురాచారాన్ని గట్టిగా చర్చించింది. అలాంటి పాత్రలపై ఒక అవలోకన. ‘శ్యాం సింగరాయ్’ సినిమాలో బెంగాల్లో 1970 నాటి సాంఘిక దురన్యాయాల మీద తిరగబడతాడు హీరో నాని. ఆ కాలంలో హరిజనులపై అగ్రకులాలు చేసే దుర్మార్గాలను వ్యతిరేకిస్తాడు. అది కొంత వరకు కుటుంబం సహిస్తుంది. కాని ఎప్పుడైతే అతడు ‘దేవదాసి’ వ్యవస్థలో మగ్గుతున్న సాయి పల్లవిని తీసుకుని కోల్‌కతా వెళ్లిపోయి ఆమెకు విముక్తి ప్రసాదించి వివాహం చేసుకుంటాడో ఆ కుటుంబం రగిలిపోతుంది. తమ పరువును బజారున పడేస్తున్నాడని ఏకంగా అతణ్ణి హత్య చేసి శవం మాయం చేస్తుంది. ‘స్త్రీ శరీరానికి’, ‘పాతివ్రత్యానికి’, దాని చుట్టూ ఉండే ‘సామాజిక విలువ’కు ఈ హత్య ఒక తీవ్ర సూచిక. తమ ఇంటి యువకుడు స్త్రీలను పేదరికంలో నుంచి బయటకు తెస్తే ఆమోదం ఉంటుందేమో కాని, తక్కువ కులం నుంచి వివాహం చేసుకుంటే ఆమోదం ఉంటుందేమో కాని, ‘శీల పతనం’లో ఉండే స్త్రీకి గౌరవం తేవడానికి ప్రయత్నిస్తే మాత్రం కుటుంబం కాని, సమాజం కాని సహించదు. పురుషుడి శీల పతనానికి మించి స్త్రీల శీల పతనానికి ఎక్కువ విలువ, తీవ్రత ఆపాదిస్తుంది సమాజం. నిజానికి పురుషుడు తన స్వార్థం, సుఖం కోసం కల్పించిన వ్యవస్థ ‘దేవదాసీ’ వ్యవస్థ. దేవుణ్ణి అడ్డం పెట్టి పై వర్గాల వారు కింద వర్గాల స్త్రీలను లైంగిక దోపిడికి వాడుకోవడమే ఈ వ్యవస్థ పరమ ఉద్దేశం. పురుషుడు తాను తయారు చేసిన ఈ వ్యవస్థను గౌరవించడు సరి కదా ఈసడిస్తాడు. ఈ వర్గంలో ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉన్న స్త్రీలు కళల్లో తయారైనా వారంతా ఇంటి బయటే ఉండాలి తప్ప ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఈ భావజాలాన్ని భారతీయ/ తెలుగు సినిమా అప్పుడప్పుడు చర్చిస్తూ వచ్చింది. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ కూడా చర్చించింది. ‘ధర్మపత్ని’తో మొదలయ్యి... 1941లో బి.శాంతకుమారి, భానుమతి నటించిన ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ‘దేవదాసీ’ వ్యవస్థ ప్రస్తావన మన సినిమాల్లో వస్తూనే ఉంది. ‘ధర్మపత్ని’లో హీరోయిన్ శాంతకుమారి పెంపుడు తల్లి ఒకప్పుడు దేవదాసి అని తెలియడంతో హీరోకు కష్టాలు మొదలవుతాయి. దేవదాసి పెంచిన కూతురిని కోడలిగా ఆమోదించడం అసాధ్యమని హీరో వివాహానికి ఆటంకం ఏర్పడుతుంది. చివరకు శాంతకుమారి హీరోను పెళ్లి చేసుకోలేకపోతుంది. ‘దేవదాసు’లో ప్రేమ విఫలమైన అక్కినేని దేవదాసి అయిన చంద్రముఖి (లలిత–ట్రావెన్కోర్ సిస్టర్స్) పంచన చేరుతాడు. ఆ పాత్ర ఎంత ఉదాత్తంగా ఉన్నా ఆమె స్థాయి ఇలాంటి పతితులకు ఆశ్రయం కల్పించేదే తప్ప ఇల్లాలు అయ్యే స్థాయి మాత్రం కాదు. ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రి అంతటివాడు ‘ఆటపాటలే వృత్తి’గా చేయబడిన కుటుంబం నుంచి వచ్చిన మంజుభార్గవి చేతికి తంబూర ఇస్తేనే సహించలేకపోతుంది పాడులోకం. మంజుభార్గవి సంగతి సరే ఏకంగా శంకరశాస్త్రినే నిరాకరిస్తుంది. స్త్రీలు మోయాల్సిన పాతివ్రత్యపు బరువు పట్ల దానికుండే పట్టింపు అది. మరి ఆ స్త్రీలను ఆ స్థితికి తెచ్చింది ఎవరు? ‘మేఘ సందేశం’లో ఇంటి ఇల్లాలి నుంచి ఎటువంటి స్ఫూర్తి పొందలేని అక్కినేని కళావంతురాలైన జయప్రదను అభిమానిస్తే ఆరాధిస్తే వారిరువురికి కూడా ఏకాంత వాసమే దక్కుతుంది. స్త్రీలకు తమ శరీరాల మీద, జీవితాల మీద పూర్తి హక్కు లేదని సమాజం పదే పదే చెప్పడం ఇది. అనార్కలికి దక్కని ప్రేమ... దక్షణాదిలో దేవదాసీ వ్యవస్థ ఉన్నట్టే ఉత్తరాదిలో తవాయిఫ్‌ల వ్యవస్థ ఉంది. తవాయిఫ్‌లు వినోద నాట్యకత్తెలు. గాయనీమణులు. దర్బారుల్లో ఆడిపాడటం వీరి పని. అంతిమంగా ఎవరో ఒకరి పంచన వీరు చేరక తప్పదు. వైవాహిక జీవితం వీరికి ఉండే అవకాశం లేదు. అందుకే ‘మొఘల్–ఏ–ఆజమ్’లో దిలీప్ కుమార్‌ను ప్రేమించిన మధుబాలకు ఆ ప్రేమ దక్కదు. ఆమెకు ప్రాణాలతో బొందపెట్టే శిక్ష దక్కుతుంది. ఆమె ఏ చిన్న నవాబు కూతురో అయినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తండ్రి ఎవరో తెలియని ఒక వ్యవస్థను తయారు చేసి ఆ పుట్టిన సంతానాన్ని తిరిగి అదే కూపంలో ఉంచే అమానవీయమైన వ్యవస్థ ప్రతిఫలం ఇది. దీనిని స్త్రీలే అనుభవించాలి. పురుషుడు కాదు. ‘గైడ్’ సినిమాలో దేవదాసీ అయిన వహిదా రహెమాన్‌ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాననుకుంటాడు ఆమె భర్త. కాని అతడి లోలోపల ఆమె మీద అనుమానం, చిన్నచూపు. ఆ పెళ్లి నుంచి ఆమె బయటపడి దేవానంద్లో ప్రేమ వెతుక్కున్నా ఆ పరుషుడు కూడా అంతే దారుణంగా ఆమెతో వ్యవహరిస్తాడు. చివరకు ఆమె జీవితకాల విరక్తిని పొందుతుంది. ఇక రేఖ చేసిన ‘ఉమ్రావ్‌జాన్’ తవాయిఫ్‌ల జీవన విషాద వీచిక. ఎన్నో ప్రశ్నలు.. పాత్రలు మత దురాచారాల వల్ల కాని, కొన్ని సమూహాల వెనుకబాటుతనం వల్ల గాని, సామాజిక దోపిడి వల్ల గాని స్త్రీలు లైంగిక వ్యాపారాల్లో చిక్కుకుంటే ఆ స్త్రీలు తిరిగి గౌరవం పొందడానికి యుగాల కొలదీ పోరాటం చేయవలసి వస్తోంది. వారికి ఉండవలసిన సమాన హక్కుల గురించి, సమాన మర్యాద గురించి మారవలసిన భావజాల దృష్టి చాలా ఉంది. ‘పవిత్రత’, ‘శీలం’ అనే మాటలకు సర్వకాల సర్వావస్థల్లో ఒకే ప్రమాణం ఉండదని, స్థలకాలాలను బట్టి వాటికి అర్థాన్ని ఆపాదించాల్సిన పద్ధతి మారుతుండాలని, ముఖ్యంగా ఇవి స్త్రీలు మాత్రమే మోయాల్సిన పదాలు కావని పురుషులు కూడా సమాన హక్కుదారులే అని మళ్లీ మళ్లీ చర్చించాల్సిన సినిమాలు పాత్రలు రావాలి. ఇకపై అదే జరుగుతుందని ఆశిద్దాం. -
చిట్టచివరి దేవదాసి మృతి
భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని సంస్కృతిలో దేవదాసి సంస్కృతికి తెర పడింది. చిట్టచివరి దేవదాసి పరశమణి (87) పూరీలోని బలి సాహి కామాక్ష మందిరం దగ్గర అద్దె ఇంటిలో శనివారం తుదిశ్వాస విడిచింది. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఆమె మృతి చెందినట్లు సమాచారం. జగన్నాథునికి దేవదాసీగా అంకితమై శ్రీ మందిరంలో సంరక్షకురాలిగా తుదిశ్వాస వరకు ఆమె కొనసాగింది. 1955వ సంవత్సరంలో జగన్నాథ దేవస్థానంలో దేవదాసీ సంప్రదాయం ప్రారంభమైంది. -
కన్నతల్లే ఆమెను బ్రోకర్లకు అప్పగించింది
'దేవదాసి’ ఆచారం పేరుతో కొన్నిచోట్ల, ఆకలి చంపుకొనే మార్గం కానరాక మరికొన్నిచోట్ల, బలవంతంగా ఇంకొన్నిచోట్ల.. వేశ్యావాటికలకు చేరుతున్న వాళ్లెందరో! ఇలాంటి వాళ్లలో చాల్వాడి భీమవ్వ ఒకరు. కుటుంబం కోసం విధిలేక విషయంలో చిక్కినప్పటికీ ఓ స్వచ్ఛంద సంస్థ చేయూతతో బయటపడి, బలపడిన ఆమె.. ఆ తర్వాత తనలా ఇంకెవరూ ‘దేవదాసి’ బాట పట్టకూడదని చేస్తున్న పోరాటం ప్రశంసనీయమైనది. దేశానికి పశ్చిమాన, కొంకణ్ తీరంలో ఉండే చిన్న రాష్ట్రం గోవా. అక్కడే ఓ చిన్నపట్టణమైన వాస్కోలోని ఓ మురికివాడలో పుట్టింది భీమవ్వ. ఐదుగురు చెల్లెళ్లు్ల. తండ్రి తాగుబోతు. తల్లి చిత్తుకాగితాలు, గాజు సీసాలు ఏరుకొని, వాటిని అమ్ముతూ కుటుంబాన్ని పోషించేది. బతుకు పోరాటం చాలా కష్టంగా సాగేది. భీమవ్వకు పదిహేనేళ్లు రాగానే ‘దేవదాసి’ దురాచారంలోకి మభ్యపెట్టి దింపింది ఆమె తల్లి. కుటుంబం బతకాలంటే తప్పదని ఒప్పించింది. నాలుగు నెలలు గడిచాయో లేదో ఓ బ్రోకర్ చేతికి చిక్కిన భీమవ్వ వాస్కోలోని బైనా అనే వేశ్యావాటికకు చేరింది. అక్కడ లైంగికంగా చిత్రహింసలకు గురైంది. తప్పించుకోవటానికి రెండు, మూడుసార్లు ప్రయత్నించి పట్టుబడింది. ఒకసారి తల్లే తిరిగి బ్రోకర్లకు అప్పగించింది. చివరికి విధిలేక అక్కడే కొససాగింది. ఆ సమయంలోనే.. అక్కడ తనలాంటి అభాగ్యులు, బలవంతంగా తీసుకు రాబడిన వాళ్లు చాలామంది ఉన్నట్లు గుర్తించింది. స్వచ్ఛంద సంస్థ చేయూత దాదాపు రెండేళ్లు గడిచాక 2003లో ఓ రోజు స్థానిక క్రైంబ్రాంచ్ అధికారులు ‘అన్యాయ్ రహిత్ జిందగీ(ఏఆర్‌జడ్)’ స్వచ్ఛంద సంస్థతో కలసి బైనాపై దాడి చేశారు. భీమవ్వతోపాటు చాలామందిని అక్కడి నుంచి బయటపడేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓ కేంద్రంలోకి వీరిని తరలించారు. ఆ కేంద్రం నుంచి భీమవ్వ విడుదలయ్యాక ఆమె బాగోగులు చూసుకునే బాధ్యతను ఏఆర్‌జడ్ సంస్థే తీసుకుంది. తమ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చింది. ఈ క్రమంలో భీమవ్వ ఎంతో మంది మహిళలను కలుసుకొని, వారి గాథలు వింది. తానంటే తప్పించుకుంది. మరి అదే వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్న అమ్మాయిల పరిస్థితేంటీ?’ అని ఆలోచింది. వారికోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే తనలాంటి దేవదాసీలతో కలసి ఓ సంఘం ఏర్పాటు చేసింది. అమ్మాయిల్ని దేవదాసిగా మార్చబోతున్న కుటుంబాలను గుర్తించి, వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా సుమారు 800 మంది బాలికలను వీరు కాపాడింది. అంతేకాదు, వారి ఉపాధికి తగిన మార్గాలనూ చూపింది. వేశ్యావృత్తిలోని వందలాది మందికి విముక్తి కల్పించి, వారికి దారి దివ్వె అయింది. సీఐఐ అవార్డు దేవదాసి వ్యవస్థ నుంచి బాలికలను కాపాడడం, మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవడం, వేశ్యావృత్తి నుంచి బయటపడిన వారికి ఉపాధి కల్పించడడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న భీమవ్వను 2019లో సీఐఐ ఉమెన్ ఎగ్జమ్‌ప్లర్ అవార్డు వరించింది. ఈ పురస్కారం తనకెంతో ప్రోత్సాహం ఇచ్చిందంటుందామె. ‘అవార్డు వచ్చిందని తెలియగానే నమ్మలేకపోయా. చాలాసేపటి వరకు ఏడుపు ఆపుకోలేకపోయాను. దాదాపు 200 మంది ఈ అవార్డు బరిలో ఉన్నా నాకు దక్కడమంటే అద్భుతం అనిపిస్తోంది. చదువులేని, వాస్కో పట్టణం తప్ప మిగిలిన ప్రపంచాన్ని చూడని నాకు ఈ అవార్డు దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే భవిష్యత్తులో నా పనిని నేను మరింత బాధ్యతగా నిర్వహించేందుకు ఈ అవార్డు నాకో ప్రోత్సాహం కలిగించింది’ అని దృఢనిశ్చయంతో చెబుతోంది భీమవ్వ. -
ఈ రొంపి ఇంకెన్నాళ్లు?
-
కదిలిస్తే కన్నీళ్లే.. ఈ రొంపి ఇంకెన్నాళ్లు!
-
కదిలిస్తే కన్నీళ్లే.. ఈ రొంపి ఇంకెన్నాళ్లు!
సాక్షి, అమరావతి: అభం శుభం తెలియని బాలికలను బలవంతంగా దేవదాసీ వృత్తిలోకి దింపుతున్నారు. వారు దేవుడికి సేవ చేయాలన్న కారణం చూపి.. లైంగిక వాంఛ తీర్చుకుంటున్న దారుణాలు నేటికీ ఎన్నో జరుగుతున్నాయి. జోగిణి, బసివిణి, దేవదాసి, మాతంగి.. ఇలా పేరు ఏదైనా జరిగేది మాత్రం లైంగిక దోపిడీయే. మొదట.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓ బాలికను ఎంచుకుంటారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులకు పొలం ఇస్తామంటారు. లేదంటే ఇంటి స్థలమో, లేదంటే అనారోగ్యాన్ని కారణంగా చూపుతారు. అమ్మవారు పట్టిందని అంటారు. దేవుడికి జీవితాన్ని అంకితం ఇవ్వాలని ఇది సంప్రదాయమని ఎప్పటినుంచో వుందని అంటారు. జోగిని, బసివిని, మాతంగి, దేవదాసి, పార్వతి, పద్మావతి ఇలా ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో ఈ దురాచారం కొనసాగుతోంది. ఇలా పలు కారణాలతో ఈ రొంపిలోకి అమాయక ఆడ పిల్లలను దింపుతున్నారు. దేవుడు పేరు చెప్పి దెయ్యాల్లాంటి మనుషులు లొంగదీసుకుంటున్నారు. ఆడపిల్లల్ని ఆటవస్తువులుగా మార్చి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది. ఈ ఆధునిక యుగంలో కూడా ఈ దురాచారం కొనసాగుతోందా అని ఆశ్చర్యపోతున్నారా?. నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలోనే కాదు కర్నూలు, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లోనూ ఈ విష సంస్కతి ఇంకా కొనసాగుతోందనడానికి ఈ అమాయక మహిళల గోడే నిదర్శనం. -
టీచర్ చేతి స్టిక్ ప్లేయర్‌ని చేసింది
తల్లికి ఊహ తెలియక ముందే ఆమె మాతమ్మ (దేవదాసీ) అయింది. తనకు ఊహ తెలిసే వయసుకు నాన్నెవరో తెలియదు. ఫలానా వ్యక్తి మీ నాన్న అని కుమార్తెకు చెప్పే పరిస్థితి ఆ అమ్మకు లేదు. ఈ సమాజంలో తనేమిటో, తన కుటుంబం ఏమిటో కూడా ఎరుగదు. అమ్మలోనే అమ్మానాన్నను చూసుకుంది. ఆరో తరగతిలో ఉండగా టీచర్ చేతిలో ఓ ‘కర్ర’ను చూసి అదేమిటని అడిగింది. ‘‘హాకీ స్టిక్ అమ్మా!’’ అని టీచర్ చెప్పింది. ‘‘నేనూ ఆ స్టిక్‌తో ఆడతాను’’ ముందుకొచ్చింది. ఆ టీచర్ సరేనంది. అలా పదేళ్ల వ్యవధిలోనే ఆ మాతమ్మ కూతురు జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి జాతీయ స్థాయి హాకీ ప్లేయర్ అయింది! చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన దేవదాసీ కొండా రేణుక కుమార్తె పద్దెనిమిదేళ్ల సుశీల అసామాన్య విజయగాథ ఇది. అన్ని అవకాశాలూ ఉన్నా క్రీడల్లో రాణించలేని వారెందరో ఉన్నారు. ఏ ఆసరా లేని సుశీల.. తన తల్లి కళ్లలో ఆనందాన్ని నింపాలన్న ఏకైక లక్ష్యంతో హాకీలో జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి అమ్మ చెప్పినట్టు ఊరుకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని ధీమాగా చెబుతోంది. తోటి జోగినీ, దేవదాసీ, మాతమ్మల కుటుంబాల్లో స్ఫూర్తి నింపుతోంది. చంద్రయానం చేస్తున్న ఈ రోజుల్లోనూ దేవదాసీ దురాచారం ఇకపై కొనసాగడానికి వీల్లేదని సుశీల అంటోంది. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై ఇటీవల విజయవాడలో నిర్వహించిన సదస్సుకు మాతమ్మ రేణుక వెంట వచ్చిన కుమార్తె సుశీలతో ‘సాక్షి’ ముచ్చటించింది. అమ్మ జీతం ఆరువేలు ‘‘నాకు అన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. నాన్న ఎవరో? ఎలా ఉంటారో తెలియదు. నాన్నెవరమ్మా? అని అడిగితే అమ్మ మౌనం దాల్చేది. కొన్నాళ్లకు తెలిసింది.. అమ్మ ‘మాతంగి’ అని.. మాకు నాన్న ఉండరని. అమ్మ రుయా ఆస్పత్రిలో కాంట్రాక్టు స్వీపర్. అమ్మకు వచ్చే నెల జీతం ఆరు వేలూ కుటుంబ పోషణకు చాలక పాచి పనులు కూడా చేసి ఇల్లు నడుపుతోంది. మేమూ నీకు సాయపడతామంటే.. ‘వద్దు.. మీరు బాగా చదువుకుని ప్రయోజకులవ్వండి. నాకంతే చాలు’ అంటుంది. మమ్మల్ని చదివించడానికే తను కష్టపడుతోంది. చిన్నప్పట్నుంచి నాకు ఆటలంటే చాలా ఇష్టం. రన్నింగ్, జూడో, త్రోబాల్, వాలీబాల్, రెజ్లింగ్, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ వంటి క్రీడల్లో నాకు మంచి పేరొచ్చింది. నేను ఆరో తరగతిలో ఉండగా మా పీఈటీ ప్రసన్న మేడం చేతిలో ఉన్న కర్రను చూసి అదేమిటి టీచర్? అని అడిగా. దీన్ని హాకీ స్టిక్ అంటారని చెప్పారామె. ఈ ఆట ఆడాలని ఉంది టీచర్.. అని చెప్పడంతో ఆమె నన్ను ప్రోత్సహించారు. మిగిలిన ఆటలకంటే హాకీపై ఆసక్తి పెంచుకున్నాను. ఎనిమిదో తరగతిలో మదనపల్లెలో జరిగిన జిల్లా స్థాయి హాకీ టోర్నమెంట్లో ప్రతిభ చూపడంతో (అండర్–17) నేషనల్స్‌కు ఎంపికయ్యాను. ఇలా ఇప్పటిదాకా 23 జిల్లా స్థాయి, 5 రాష్ట్రస్థాయి, అండర్ – 17, అండర్ 19 కేటగిరీల్లో జూనియర్, సీనియర్స్ విభాగాల్లో గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 5 జాతీయ స్థాయి టోర్నమెంట్లు ఆడాను. దాతల సాయంతోనే..! అమ్మ సంపాదన కుటుంబ పోషణకే సరిపోదు. మరి నాకు హాకీ టోర్నమెంట్లకయ్యే ఖర్చు ఎక్కడ నుంచి వస్తుంది? ఒకసారి నేషనల్స్‌కు వెళ్లాలంటే కనీసం రూ.5–6 వేలయినా ఖర్చవుతుంది. మా కుటుంబ పరిస్థితిని చూసి మా కోచ్ లక్ష్మీ కరుణ, ప్రసన్న టీచర్, రమణ సార్ వంటి వారితో పాటు మా గ్రామస్తులు ఆర్థికంగా చేయూత నిస్తున్నారు. దాంతోనే నేషనల్స్‌కు వెళ్తున్నాను. పట్టుదలతో విజయం సాధించుకుని వస్తున్నాను. హాకీలో నేను రాణించడం వెనక అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది. ఆటలో చిన్న చిన్న దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా ముందుకుకెళ్లమ్మా! అని ప్రోత్సహిస్తుంది. హాకీలో బాగా రాణించి ఊరుకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. నాకు అమ్మా, నాన్నా అమ్మే. అన్న దినేష్ డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేరవుతున్నాడు. తమ్ముడు వెంకటేష్ కబడ్డీ (జిల్లా స్థాయి)లో ప్లేయర్. చెల్లి భూమిక కూడా హాకీ (రాష్ట్ర స్థాయి)తో పాటు ఇతర క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇలా అమ్మ నాతో పాటు మిగిలిన పిల్లలనూ ఆటల్లోను, చదువులోనూ పేరు తెచ్చుకోవాలి చెబుతుంటుంది. అమ్మ సపోర్టు మాపై చాలా ప్రభావం చూపుతోంది. చంద్రయాన్‌కు చేరుకుంటున్న ఈ రోజుల్లో దేవదాసీ వ్యవస్థను ఇంకా కొనసాగించడం తగదు. మా దుస్థితి పిల్లలకు రాకూడదు నాకు ఊహ తెలియకముందే నన్ను మాతమ్మ (దేవదాసీ)ను చేసేశారు. పన్నెండేళ్ల వయసొచ్చే సరికి నన్ను మాతమ్మను చేసినట్టు తెలిసింది. నలుగురు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తున్నా. పెద్ద కూతురు సుశీల హాకీలో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు గర్వంగా ఉంది. రెండో కూతురూ హాకీతో పాటు ఇంకొన్ని ఆటలు ఆడుతోంది. చిన్నోడు కబడ్డీ బాగా ఆడతాడు. నా బతుకు ఎలా ఉన్నా మా పిల్లలకు నాలాంటి దుస్థితి రాకూడదు. ఈ దుర్వ్యవస్థ ఇకపై కొనసాగకూడదు.– కొండా రేణుక (మాతమ్మ) ఇల్లు ఉంటే బాగుంటుంది నెలకు రూ.400 చెల్లించి మా ఊళ్లో చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలకు నారావారిపల్లె వచ్చినప్పుడు వెళ్లి కలిశాను. సొంత ఇల్లు మంజూరు చేయమని, హాకీ మెటీరియల్ ఇప్పించమని కోరాను. మరోసారి వచ్చి కలవాలని చెప్పి పంపేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వాల నుంచి నాకు ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు. ఏ సపోర్టు లేదు. కొత్త సీఎం జగనన్న మనసున్న వాడని అంటున్నారు. ఆయన ఆదుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చేతులు జోడించింది సుశీల.– బొల్లం కోటేశ్వరరావు,సాక్షి, అమరావతి బ్యూరో -
దేవుడి భార్యలు.. దెయ్యాలతో సంసారం
దేవదాసి, బసివిని, మాతంగి... పేరేదైనా.. వారి బతుకులు మాత్రం దుర్భరం..ఎప్పుడో...ఎవరో సృష్టించిన అనాగరిక ఆచారానికి బలైపోయిన మహిళలు వారు. అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్న దేవదాసీలు వారు. పేరుమారి...సమాజం తీరు మారి..తమ బతుకులే మారిపోయాక...తమను మనుషులుగా గుర్తించాలని కోరుతున్న అభాగ్యులు వారు...ఊపిరున్నంత వరకూ ఊరందరికీ అంగడిబొమ్మలు వాళ్లు. ఊరంతా కలిసి చేసిన అన్యాయానికి...నిత్యం నరకం అనుభవిస్తున్న అబలల జీవితాలపై ‘సాక్షి’ ఫోకస్ ఒక్కడు మూడుముళ్లేశాడు... ఊరంతా అనుభవిస్తున్నారు దేవుడి సతినంటారు.. దెయ్యాల్లా వెంటబడతారు పగలంతా వెట్టి కష్టం...రాత్రయితే నరకం..పిలిస్తే వెళ్లాలంటారు.. కడుపొస్తే కనాలంటారు..బిడ్డలకు తండ్రిగా ఏ ఒక్కడూ ముందుకురాడు..అడుక్కోవడం..అవమాన పడడం..అత్యాచారాలకు బలైపోవడం..కాదు..బానిసలవడంఅందరిలా మేమూ ఆడవాళ్లం కాదా...మాకూ మనసు లేదా...మాకు హక్కులు వర్తించవా..మానెత్తినెక్కిన ఆ భవవంతునికీ దయరాదా..గొంతెత్తి ఘోషిస్తున్నా ఈ పాలకులకూ వినపడదా..మేమింతేనా...మా బతుకింతేనా..దేవదాసి...బసివిని...మాతంగి..పేరేదైనా..అనాగరిక సమాజంలో బలైపోయిన అబలల ఆక్రందన ఇదీ.. అక్షరజ్ఞానం లేక ఎందరో పడుతున్న ఆవేదన ఇది. ఇకనైనా తమకో గుర్తింపు ఇవ్వాలని..తమకూ హక్కులు కల్పించి ఆదరించాలంటున్న ఎన్నో గొంతుకల ఆక్రోశమిది... అనంతపురం : జిల్లాలోని 11 మండలాల్లో దాదాపు 2,529 మంది జోగినులు, బసివినులు, దేవదాసీలు ఉన్నట్లు అధికారుల రికాకార్డులు చెబుతున్నాయి. ఇందులో కర్ణాటక సరిహద్దులో ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోని మండలాల్లోనే 285 మంది దేవదాసీలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక వివక్షకు.. దౌర్జన్యాలకు బలైపోయిన వీరి సంక్షేమం గురించి అటు పాలకులు..ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. దేవదాసీ వ్యవస్థకు ఎలా బీజం పడిందంటే... ఎంతమంది దేవదాసీలుంటే ఆ దేవాలయానికి అంత ప్రతిష్ట అనే భావనతో పూజారి, పురోహితులు దేవదాసీల వ్యవస్థకు బీజం వేశారు. దేవదాసీలు తొలుత ఆలయాల్లో నాట్యకత్తెలుగా ఉండేవారు. అలాగే లలిత కళలు నేర్చుకున్న కొందరు మహిళలు దేవాలయాలు, రాజుల కొలువుల్లో నాట్యమాడేవారు. వారిపై కన్నేసిన కొందరు పెద్దలు వారి కామవాంఛలు తీర్చే వస్తువుగా, ఉంపుడుగత్తెలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత వీరికి దేవదాసీ..జోగినీ..మాతంగి పేరు తగిలించి ఊరందరికీ అప్పగించారు. వంశపార్యపరంగా కొంతమంది, మరోమార్గం లేక పొట్టకూటి కోసం మరి కొంతమంది ఈ రొంపిలోకి నెట్టబడ్డారు. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం దేవుడి భార్యగా మార్చి ఊరంతా వంతులు వేసుకుని అనుభవించారు. ఇలా బలైపోయిన దేవదాసీల జీవితాల్లో నిత్యం అవమానం, హేళన, ఛీదరింపులే. కరువుకు నిలయంగా పేరొందిన ‘అనంత’లోని ఎన్నో సరిహద్దు మండలాల్లో ఇప్పటికీ ఈ వ్యవస్థ కొనసాగతుండడం గమనార్హం. తల్లిదండ్రుల అమాయకత్వం వల్లే.. దేవదాసీలు, బసివినులుగా మారిన వారికే ఎక్కువగా దళితులే ఉన్నారు. పెద్దల అమాయకత్వం, నిరక్షరాస్యత వెరసి ఆడపిల్లల జీవితాలు నాశమయ్యాయి. కొడుకులు లేని తల్లిదండ్రులు ఆడపిల్లకు పెళ్లి చేస్తే తమకు వృద్ధాప్యంలో ఆసరా ఉండదని భావించి తమ ఆడపిల్లలను దేవదాసీలుగా మార్చేవారు. అంటే ప్రత్యక్షంగా వ్యభిచార కూపంలోకి నెట్టేవారు. తల్లిదండ్రులతోనే ఉంటూ ఊరిజనం కోరిక తీర్చే అంగడి బొమ్మగా, వయసు ముదిరిన తర్వాత వ్యవసాయకూలీగా దుర్భరజీవితం గడుపుతున్న మహిళల ఆవేదన వర్ణనాతీతం. దేవదాసీలుగా మార్చే వైనం అభం శుభం తెలియని పదేళ్ల లోపు బాలికలను ఉలిగమ్మ, యల్లమ్మ, పెన్నోబిలేసు, హనుమంతరాయుడు తదితర దేవాలయాల పేరుతో దేవదాసీలుగా మారుస్తున్నారు. బాలికను పెళ్లికూతురుగా అలంకరించి దేవాలయానికి తీసుకెళతారు. సంప్రదాయం పేరుతో వరుసకు మామ అయ్యే వ్యక్తితో గానీ, లేక ఊరి పెద్దతో గానీ తాళి కట్టించి దేవుడికి వదిలేస్తారు. తదనంతరం పుష్పవతి అయ్యేంత వరకు ఆ అమ్మాయి తల్లిదండ్రుల సంరక్షణలోనే పెరుగుతుంది. పుష్పవతి కాగానే తొట్టతొలుత ఆ ఊరి పెద్దమనిషి కామవాంఛ తీర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఊర్లో ఎవరు పిలిచినా వెళ్లాల్సి ఉంటుందని ఈ అనాగరిక ఆచారానికి బలైన వారు చెబుతున్నారు. హక్కుల కోసం పోరాటం 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బసివిని, దేవదాసిలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేశారు. అప్పటి నుంచి వీరి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దాదాపు 33 ఏళ్లుగా హక్కుల కోసం ఉద్యమాలు సాగిస్తున్నా... ఏమాత్రం స్పందించడం లేదు. అయితే ఇటీవలే దేవదాసి, మాతంగి, బసివిని తెగల స్థితిగతులపై ఆధ్యాయనం చేయడం కోసం ప్రభుత్వం రఘనాథన్రావు కమిటీని నియమించింది. అయితే కమిటీ మాత్రం జిల్లాలో అలాంటివారు ఎవరూ లేరని ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ అనాగరిక ఆచారంపై ఇప్పుడిప్పుడే బాధితుల్లో చైతన్యం వస్తోంది..ఎస్సీ సంక్షేమ సంఘం లాంటి సంస్థలు వారి తరఫున ప్రభుత్నాన్ని ప్రశ్నిస్తున్నాయి. వారి హక్కుల కోసం పోరాడుతున్నాయి. ఆర్డీటీ సంస్థ ఎందరికో ఉపాధి కల్పిం చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. దేవదాసీల డిమాండ్లు ♦ జోగిని, మాతంగి, బసివిని, దేవదాసీలకు రూ.10 లక్షల సెక్యురిటీ డిపాజిట్ చేయాలి. ♦ 250 చదరపు అడుగులు మేర డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించాలి. ♦ ఉపాధి కోసం మూడు ఎకరాల సాగుభూమి ఇవ్వాలి. ♦ నెలకు కుటుంబానికి సరిపడా నిత్యావసర వస్తువులు ప్రభుత్వమే ఇవ్వాలి. ♦ ఎస్సీ కార్పొరేషన్ నుంచి పూర్తి సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహకారం అందించాలి. ♦ అన్ని రకాల వైద్యసేవలు ఉచితంగా అందించాలి. ♦ బాల జోగినీ , దేవదాసీ, బసివి, మాతంగిల పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య , చదివిన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి. వారి వివాహాలకు ప్రోత్సాహకాలు అందించాలి. ♦ దేవదాసి రక్షణ కోసం , వ్యవస్థ నిర్మూలన కోసం ఏపీ దేవదాసీ (అంకిత నిషేధ) నియమాలు అమలు చేయాలి. ♦ దేవదాసీ వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగాశిక్షించాలి. దేవుడి భార్యను.. దెయ్యాలతో సంసారం అపుడు నాకు పదేళ్లు. అక్షరజ్ఞానం లేని మా తల్లిదండ్రులు నన్ను కూడా చదివించలేదు. అమాయకత్వం, అల్లరితనం తప్ప నాకు ఏమీ తెలియవు. అలాంటి సమయంలో నాకు దేవుడితో పెళ్లి చేస్తామన్నారు. దేవుడితో పెళ్లి అంటే నేను దేవతతో సమానమని భావించాను. దేవుడి గుడికి వెళ్లి చూశాను. ఈ దేవుడే నాకు భర్త అవుతాడని నవ్వుకున్నా. దేవుడితో పాటు నాకు కూడా పూజలు చేస్తారు... గౌరవం ఉంటుందనుకుని ఎగిరి గంతేశాను. నా తోటి స్నేహితులకు సంతోషంగా చెప్పాను. మా తల్లిదండ్రులు నిర్ణయించిన గడువు రానే వచ్చింది. నన్ను పెళ్లి కూతురిగా అలంకరించారు. దేవుడి గుడికి తీసుకెళ్లారు. ఏవేవో పూజలు చేశారు. చివరికి వేరే వ్యక్తితో నాకు తాళి కట్టించారు. ఈయన కూడా దేవుడేనా అనుకున్నా. పెళ్లి తంతు ముగిసింది. అప్పటి నుంచి రోజూ దేవుడి గుడికి వెళ్లి పూజలు చేసి వచ్చేదాన్ని. కానీ మా గ్రామంలో నన్నెవరూ గౌరవంగా చూడలేదు సరికదా కొత్తగా బసివిని అని పిలవడం మొదలు పెట్టారు. ఏంటి నన్ను కొంతమంది బసివిని అంటున్నారని మా అమ్మానాన్నను అడిగా. అయితే మా తల్లిదండ్రులు సమాధానం సరిగా చెప్పలేదు. నా పన్నెండవ ఏట నేను పుష్పవతినయ్యాను. 16 రోజుల వరకు ఆచారాలు, సంప్రదాయాలు అంటూ ఏవేవో చేశారు. కొన్ని రోజుల తర్వాత మా తల్లిదండ్రులే నన్ను ఓ పెద్దాయన ఉన్న గుడిసెలోకి తీసుకెళ్లి వదిలారు. నా భర్త కానప్పుడు అతని దగ్గరకు ఎందుకు వదిలారా..అని ఆలోచిస్తుండగానే... కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ గంభీరపు ఆకారం చేతిలో నేను బలైపోయాను. అప్పుడు తెలిసింది నేను దేవుడి భార్య కాదు, నా తల్లిదండ్రులే నన్ను వ్యభిచార రొంపిలోకి దించారని, నన్ను అంగడి బొమ్మగా మార్చారని. ఇక ఆనాటి నుంచి నా జీవితం రోజు నరకప్రాయమే. ఎవరు పడితే వారు నన్ను పిలిచే వారు. తల్లిదండ్రులకు చెబితే వారు నాకు సపోర్ట్ చేసేవారు కాదు. ‘‘వెళ్లాలమ్మా’’ అని చెప్పేవారు. నా బతుకుపై నాకే అసహ్యం వేసింది. తల్లిదండ్రుల ఓదార్పు మాటలు, ఇరుగుపొరుగు ఆడవారు చెప్పిన మాటలు విని నా బ్రతుకింతే అని సర్దుకుపోవడం నేర్చుకున్నాను. గ్రామంలో నన్ను వ్యభిచారిగా ముద్ర వేశారు. గౌరవం లేదు, మర్యాదా లేదు. దారెంట పోయే ప్రతి కామపిశాచి నాతో కామవాంఛ తీర్చుకున్నారు. ఇలా నా జీవితం దుర్భరంగా మారింది.– బసివిని, అంబాపురం గ్రామం, కణేకల్లు మండలం చీదరించుకునేవాళ్లు శెట్టూరు: నా పేరు గంగమ్మ... శెట్టూరులో అందరూ జోగినీగానే పిలుస్తారు. 36 ఏళ్ల క్రితం అంటే నాకు 12 ఏళ్ల వయస్సు నుంచే అమ్మవారు ఒళ్లోకి వచ్చేది. ఇలా ఉండగానే నా తల్లిదండ్రులు బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే నేను జోగినీగా మారినట్లు గుర్తించిన అత్త, మామ, భర్త నన్ను పెళ్లైన మూడేళ్లకే ఇంటి నుంచి పంపించేశారు. నేను పుట్టింటికి వచ్చాక గర్భవతినయ్యాను. ఓ బిడ్డకు జన్మనిచ్చాను. భర్తలేని లోటు తెలియకుండా ఒక్కగానొక్క కుమార్తె రాజేశ్వరిని పెద్ద చేసి పెళ్లిచేశాను. అప్పటి నుంచి ఇల్లిల్లూ తిరుగుతూ ఒంటరిగానే జీవితం గడుపుతున్నాను. ఇంటింటికీ వెళ్లినప్పుడు చాలా మంది చీదరించుకునేవాళ్లు. ఇలా ఉన్నావు పనులు చేసుకుని..కూలీ పోయి బతకడానికి ఏమైందంటూ అవమానించేవారు. ప్రభుత్వం ఇటీవల ఇళ్లు మంజూరు చేసినా..కట్టుకునేందుకు డబ్బు లేక అర్ధాంతరంగా నిలిపివేశాను. తమకు సాయం చేయకపోయినా ఫర్వాలేదు గానీ...వివక్ష చూపవద్దని గంగమ్మ వేడుకుంటోంది. జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీ సమాజమంతా చిన్నచూపు చూసినా ఆర్డీటీ సంస్థ మమ్మల్ని అక్కున చేర్చుకుంది. వ్యవస్థ మార్పుకు శ్రీకారం చుట్టింది. ఉపాధి చూపుతూ మా జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నేను ఆర్డీటీ హెచ్ఐవీ విభాగంలో పనిచేస్తున్నాను. ఈ అవకాశంతో దేవదాసీలు, బసివినులకు ఎప్పటికప్పుడు హెచ్ఐవీ టెస్టులు చేయించాను. వారెవరికీ సుఖవ్యాధులు కూడా లేవు. ఆర్డీటీ సంస్థ కొంతమందికి కుట్టులో శిక్షణ ఇచ్చి, ఉచితంగా కుట్టుమిషన్లు అందజేసింది. మరికొందరు ఆర్డీటీ చేయూత ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. నేను కూడా ఊహ తెలియని వయస్సులోనే దేవదాసిగా మారాను. నాకు ఓ కూతురు ఉంది. చాలా కష్టపడి డిగ్రీ రెండో సంవత్సరం వరకు చదివించాను. స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే తండ్రి పేరు అడిగారు. ఏదో పేరు పెడదామంటే సంతకం కావాలన్నారు. మూడు నెలలు కష్టపడి... ఒకాయన్ను ఒప్పించి ఆయన పేరు రాయించా. అయితే నిన్ను తీసుకెళ్లేందుకు మీ నాన్న రావడం లేదని తోటి విద్యార్థులు అడుగుతుంటే, సమాధానం చెప్పలేక మా అమ్మాయి చదువు మానేసింది. – మీనాక్షమ్మ,ఆర్డీటీ హెచ్ఐవీ కోఆర్డినేటర్, ఉద్దేహాళ్ తల్లిదండ్రులే మా జీవితాలు బుగ్గి చేశారు మా తల్లిదండ్రుల అమాయకత్వానికి మా జీవితాలు బలయ్యాయి. మేము ఆడవాళ్లమే. సమాజంలో మాకు గౌరవం ఉండాలని కోరుకుంటాం. అయితే దురాచారాలకు బలైపోయాం. పేరుకు దేవుడి భార్యలమైనా... పిలిచిన వారందరి కోరిక తీర్చాల్సి ఉంటుంది. అలా కలిగిన మా సంతానం అనుభవించే అవమానాలు మాటల్లో చెప్పలేం. మా ఇంట్లోని ఆడపిల్లలకు పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. మగపిల్లలనైతే తూటాల్లాంటి మాటలతో ఈ సమాజం అవమానిస్తుంది. పాఠశాలల్లో చేర్పించే సమయంలో తండ్రి పేరు అడుగుతున్నారు. ఎవరిపేరు చెప్పాలో తెలియడం లేదు. అందుకే బడులకు పంపలేకపోతున్నాం. మావల్ల పిల్లల కూడా దుర్భర జీవితం గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. – లక్ష్మి, దేవదాసి, చెర్లోపల్లి, డి.హీరేహాళ్ మండలం పిల్లలను చదివించలేకపోతున్నాం నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి వివాహం చేశాను. మిగిలిన ఇద్దరు పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదు. కాయకష్టం చేసి చదివించాలనుకున్నా..తోటి విద్యార్థులు చులకనగా మాట్లాడుతారేమోనన్న భయం వెంటాడింది. అందుకే అతికష్టమ్మీద పదో తరగతి వరకు మాత్రమే చదివించాను. నా ఇద్దరు పిల్లలు బళ్లారికి కూలీ పనులకు పోతున్నారు. గ్రామాల్లో మమ్మల్ని పిలిచే సమయంలో పేరు ముందు బసివిని చేరుస్తారు. ఏమీ చేయలేని స్థితిలో.. మేము కూడా ఆ పేరుకే అలవాటుపడ్డాం.– బసివి మారెక్క, ఉద్దేహాళ్ ప్రభుత్వం స్పందించాలి జోగినీ, దేవదాసిల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వయస్సుతో సంబంధం లేకుండా వారికి పిం ఛన్లు ఇవ్వాలి. అలాగే ఇళ్లు..పొలం మంజూరు చేయాలి. అలాగే వారి పిల్లలకు ఉచిత విద్యనందించాలి. ఈ సామాజిక రుగ్మత మార్పుకోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. ఈ వ్యవస్థను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబును కలిసి విన్నవించాం. జోగినీ, దేవదాసీ, మాతంగిల హక్కుల సాధన కోసం ఇటీవల రాయదుర్గం నుంచి పాదయాత్ర నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. సమస్యలన్నీ కలెక్టర్‌కు విన్నవించాం. – చామలూరు రాజగోపాల్, ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
దేవ నాట్యానికి యశో వైభవం
జమీందారుల ఆస్థానంలో నాట్యగత్తెలు ఉండేవారు. తమ నాట్యరీతులతో అతిథులకు ఆహ్లాదం కలిగించేవారు. వారే దేవాలయాలలో భగవంతుని ప్రస్తుతిస్తూ నాట్యం చేస్తూ ‘దేవదాసీ’ అనే పేరుకు సార్థకతలా ఉండేవారు. రాన్రానూ దేవదాసీ నాట్యం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శ్రీమతి యశోదా ఠాకూర్. ఆమెది హైదరాబాద్. కళావంతుల కుటుంబానికి చెందినవారు. కళావంతులు, దేవదాసీల గురించి యశోదను ప్రశ్నించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అదొక ప్రతిష్ట: దేవదాసీలను రాజులు, జమీందారులు పోషించేవారు. ఈ కుటుంబాలకు చెందినవారికి ఒక నియమం ఉండేది. వారు నివసిస్తున్న గ్రామంలోని ఎవరో ఒకరికి మాత్రమే అంకితమై ఉండేవారు. ప్రముఖ నాట్యాచార్యులు బాలసరస్వతిగారి వరకు ఇదే సంప్రదాయం కొనసాగింది. జమీందారుల ఇళ్లకు వచ్చిన అతిథులకు కళావంతుల కుటుంబానికి చెందిన కళాకారిణితో నాట్యం చేయించడం వారి ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. దివాణంలో ఎంత అందంగా నర్తించే దేవదాసీలు ఉన్నార న్నదే ప్రధానం. మేజువాణి: మేజువాణి అనేది మేజ్బన్ పారశీ పదం నుంచి వచ్చింది. ఈ పదానికి విందు, వేడుక అనే అర్థాలను నిఘంటువు చెబుతోంది. మేజ్ అంటే బల్ల, బన్ అంటే ఆతిథ్యం ఇచ్చేవారు అని అర్థం. ఇంటికి వచ్చిన అతిథికి బల్ల మీద భోజనం వడ్డించి, నాట్యంతో కనువిందు చేయడం వలన దేవదాసీలు చేసే నాట్యానికి మేజువాణి అనే పేరు వచ్చింది. జమీందారులను ప్రస్తుతిస్తూ, ఎటువంటి అలంకారాలు లేకుండా, చీర కట్టుతో, ముఖకవళికలతో భావాన్ని ప్రదర్శిస్తూ, విలాసిని నాట్యం అభినయిస్తారు. గోదావరి జిల్లా ముమ్మిడివరం వాస్తవ్యులు అన్నాబత్తుల లక్ష్మీమంగతాయారు నేటికీ ఈ నాట్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో అందరికీ నేర్పుతున్నారు. భామాకలాపం, జావళి, వర్ణం, శబ్దం, పదం నేర్చుకోవడం మొదలుపెట్టాక, విలాసిని నాట్యం ఎందుకు చేస్తున్నారో తెలిశాక, ఆ నాట్యం మానేశాను. కళావంతులు: కర్ణాటక సంగీత విద్వాంసులురాలు భారతరత్న శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్ వసంతకుమారి, సినీ నటులు ఎస్. వరలక్ష్మి, జి. వరలక్ష్మి, అంజలీదేవి, వహీదా రెహమాన్, జరీనా వహాబ్, జయప్రద, శ్రీవిద్య, జ్యోతిలక్ష్మి, జయమాలిని, శ్రీప్రియ వీరంతా కళావంతుల కుటుంబాలకు చెందినవారే. దాసరి నారాయణరావుగారు కూడా కళావంతుల కుటుంబానికి చెందినవారు కావడం వల్ల, ఆయన తీసిన చాలా చిత్రాలు కళావంతుల కుటుంబ నేపథ్యంలో వచ్చినవే. జయమాలిని, జ్యోతిలక్ష్మి గార్ల అమ్మమ్మ తంజావూరు రాజసభలో నాట్యం చేసేవారు. సింహనందిని: వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, సిఆర్ ఆచార్యులు... దేవదాసీలతో స్నేహంగా ఉంటూ, వారి దగ్గర నుంచి నాట్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేవారు. ఈ ఇరు వర్గాల మధ్య ఎంతో అందమైన అనుబంధం ఉండేది. ఒకరినొకరిని గౌరవించుకునేవారు. లక్ష్మీనారాయణగారు కళావంతులను తన ఇంట్లోకి ఆహ్వానించేవారు. సిఆర్ ఆచార్యులు గారు కళావంతుల ఇళ్లలోకి వెళ్లారని తెలుసుకుని, ఆయనను వారి కుటుంబం వెలివేసింది. అయినా ఆయన తన జిజ్ఞాసను విడిచిపెట్టలేదు. స్వామివారి పల్లకీ సేవలో సంప్రదాయంగా కళావంతులు వీధిలో చేస్తున్న సింహనందిని నాట్యం వారి దగ్గరే నేర్చుకున్నారు. వేయిపడగలు: వేయిపడగలు నవలలో దేవదాసి పాత్ర గిరిక నాకు బాగా నచ్చింది. ఆ నవల చదివిన రోజుల్లో నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా అర్థం కాలేదు. అప్పటికి నాలో ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. రత్నగిరి, గిరిక పాత్రలు ఒక వైపు తక్కువగా అనిపించినా, ఎంతో లోతు ఉన్న పాత్రలు అవి. అందం, నాట్యం, తెలివితేటలు, చదువు అన్నీ పాత్రలు. చాణక్యుడు కళావంతులను రాజకీయంగా వాడేవాడు. దుష్ప్రచారం: ‘యోగా ఇన్ ఇండియన్ డ్యాన్స్ స్పెషల్లీ ఇన్ కూచిపూడి’ అనే అంశం మీద పిహెచ్డి చేశాను. నేను ఈ స్థాయికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అమ్మనాన్నల అండలో ఉండటం వల్ల నిలదొక్కుకోగలిగాను. కాలేజీ రోజుల్లో ఎంఏ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, మా వారు (అప్పటికి ఇంకా వివాహం కాలేదు) ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తుండేవారు. మా ఇద్దరివీ ఒకే అభిప్రాయాలు కావడంతో ఇద్దరం వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నాం. మేము కళావంతుల కుటుంబానికి చెందినవారమని నేను ఆయనకు ముందుగానే చెప్పాను. ఆయన అంగీకరించారు. నేను ఆయనను పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి కూడా చాలామంది ఆయన దగ్గరకు వెళ్లి, మా సంబంధం చెడగొట్టడానికి చూశారు. మేం ముగ్గురం అమ్మాయిలమని, ఇంకా ఆ వృత్తిలోనే ఉన్నామని మా గురించి ప్రచారం చేశారు. మేం నాలుగు తరాల క్రితమే ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేశాం. పూర్వ వైభవం జమీందారీ వ్యవస్థ ఉన్నంత వరకు వారి ఆస్థానంలో దేవదాసీలు ఉండేవారు. అందమైన దేవదాసీలు తమ ఆస్థానంలో ఉండటం జమీందారీకే గర్వకారణంగా భావించేవారు. మొగలుల పాలనలో జమీందారీ సంప్రదాయానికి కాలం చెల్లడంతో దేవదాసీ నిషేధ చట్టం వచ్చింది. అంతకాలం సిరిసంపదలతో తులతూగుతూ, భోగభాగ్యాలు అనుభవించిన దేవదాసీల పరిస్థితి ఒక్కసారిగా క్షీణించింది. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక పొట్ట చేత పట్టుకుని కొందరు హరికథలు చెబుతూ, మరికొందరు ఇతర వృత్తులలోకి ప్రవేశించారు. డిగ్రీలో ఆసక్తి పద్మ విభూషణ్ వెంపటి చినసత్యం గారి దగ్గర నా ఆరో ఏటనే నాట్యాభ్యాసం ప్రారంభించాను. 14 సంవత్సరాల పాటు అక్కడే పూర్తిగా నాట్యం నేర్చుకున్నాక, 1992లో మాస్టర్ డిగ్రీ కోసం సెంట్రల్ యూనివర్సిటీలో చేరి, అక్కడ నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. కోర్సులో భాగంగా దేవదాసీల గురించి, వారి నాట్యం గురించి ఆయన పరిచయం చేశారు. అప్పుడే నాకు దేవదాసీ నాట్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. అమ్మ చెప్పింది వెంపటి చినసత్యం మాస్టారి దగ్గర ‘కల్యాణ శ్రీనివాసం’ నాట్యం చేస్తున్న రోజుల్లోనే, నా గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం విన్నాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి, ‘అమ్మా! నన్ను అందరూ కళావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి అంటున్నారు. కళావంతులు అంటే ఏమిటని ప్రశ్నించాను. కళావంతుల గురించి అమ్మ ఎంతో ఉన్నతంగా వివరించింది. అవగాహన లేకపోవడం వల్ల అందరూ వీరిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ప్రస్తుతం వీరంతా కులవృత్తిని విడిచి, బాగా చదువుకుని, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారని అమ్మ చెప్పింది. విద్యావంతులు మా నాన్నగారి తరం నాటికే ఈ నాట్యం విలువ తెలియదు. మా అమ్మమ్మకి నానమ్మ, నానమ్మ చెల్లెలు అయిన మధురవాణి, పిచ్చాయమ్మ గార్లు అన్నవరం జమీందారు దగ్గర నాట్యం చేసేవారు. రాజుల కాలం నుంచి దేవదాసీలే అందరికంటె ఎక్కువగా చదువుకున్నారు. చదువుకోవటాన్ని గర్వంగా భావించేవారు. వీరు బయటకు వస్తే ఇబ్బందులు పడవలసి వస్తుంది కనుక గురువులు స్వయంగా ఇంటికి వచ్చి చదువు నేర్పేవారు. మా అమ్మమ్మగారి నానమ్మ మధురవాణి గారి నాట్యం కోసం ఇతర దేశాల నుంచి ఎందరో సంపన్న కళాభిమానులు వచ్చేవారట. స్వామికి అంకితం వీధివీధికి ఉన్న గుడులలో దేవదాసీలు ఉండేవారు. ఆ ఆలయస్వామికి అంకితంగా బ్రాహ్మణులు కథ రాసేవారు. ఆలయానికి చెందిన దేవదాసి మాత్రమే నాట్యం చేయాలి అన్నంత ప్రత్యేకంగా రాసేవారు. ‘ఫలానా వ్యక్తి రచించగా, ఫలానా దేవదాసి చేస్తున్న నాట్యం’ అని ముందుమాట ఉండేది. ఆ రోజుల్లో దేవదాసీలకు, బ్రాహ్మణులకు మధ్య పవిత్ర అనుబంధం ఉండేది. రానురానూ దేవదాసీ వృత్తి దిగజారుతుండటంతో మా ముందు తరానికి చెందిన మధురవాణిగారు, ఇక నుంచి ఈ వృత్తికి దూరంగా ఉండేలా చూడాలని భావించి, మా అమ్మమ్మగారి తండ్రిగారైన చదలవాడ గోపీనాథం (బృందావన శ్రీకృష్ణం రచించారు) గారి నుంచి మాట తీసుకున్నారుట. ఇచ్చిన మాట ప్రకారం మా అమ్మమ్మ గారి తరం నుంచి మా వంశీకులు దేవదాసీ వృత్తిని విడిచి, కోటిపల్లి నుంచి కొవ్వూరు చేరుకుని గౌడీ సంప్రదాయాన్ని పాటిస్తూ జీవనం సాగించారుట. విలాసినీనాట్యం మా నాన్నగారు ఆర్టీసీలో అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. నాకు సంఘంలో రక్షణ ఉండటంతో, ‘అబద్ధంలో ఎందుకు బతకాలి, మన కళను మనం ఎందుకు వదులుకోవాలి’ అనుకున్నాను. విలాసిని నాట్యం, దేవదాసి నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. రంగ్బాద్ గుడిలో ప్రముఖ నాట్యకారిణి స్వప్న సుందరి గొల్లకలాపం చూశాక, నేను వెతుకుతున్న నాట్యం నాకు దొరికిందనిపించిది. ఆవిడను సంప్రదించాను. సరిగ్గా ఆ సమయంలోనే ఆవిడ, ఆరుద్రగారితో కలిసి విలాసిని నాట్యం మీద పరిశోధన చేస్తున్నారని తెలిసింది. ఆవిడ నాతో కలిసి మొత్తం ఐదుగురికి ఈ నాట్యం నేర్పారు. ఐదేళ్ల పాటు విలాసిని నాట్యం నేర్చుకున్నాక, అందులోనూ నేను వెతుకుతున్న మూలనాట్యం కనిపించలేదని బాధపడ్డాను. ఆ సమయంలోనే ప్రొ. దేవేశ్ సోనీ విలాసిని నాట్యం మీద రచించిన పుస్తకం చదివాను. ఆయన దగ్గర నేను వెతుకుతున్న నాట్యం పుట్టుపూర్వోత్తరాలు దొరికాయి. సిగ్గుపడకూడదు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ప్రత్యేకత ఏంటో ప్రపంచానికి మనమే చూపాలి. నేను ఈ కమ్యూనిటీ వారిని ఒకటే కోరుతున్నాను. మీ ప్రతిభను మీరు దాచుకోకండి. నాట్యాన్ని భక్తిశ్రద్ధలతో అభ్యసించి, ‘వీరు లేనిదే ఈ నాట్యం నిలబడదు అనుకునేలా’ కళను నిలబెట్టాలి. అందుకోసం ఈ నాట్యాన్ని కొనసాగించాలి. అప్పుడు మనల్ని అందరూ గౌరవిస్తారు. ఒకవేళ వారు గౌరవించకపోతే, మనల్ని వారు ఎందుకు గౌరవించాలో చెప్పాలి. నాకు సోషల్ సెక్యూరిటీ ఉండటం వల్ల నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మా కళావంతుల కుటుంబం నుంచి కనీసం నలుగురు వచ్చి అబద్ధాలు చెప్పకుండా, మేము కళావంతులం అని గర్వంగా చెప్పుకునేలా చూడాలని నా కోరిక. ఇంకా నేటికీ ఆ వృత్తిలోనే ఉండిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబాలకు చెందిన వారికి చదువు చెప్పించి డాన్స్ నేర్పించే ప్రయత్నంలో ఉన్నాను. వారు తప్పనిసరిగా కళావంతుల కుటుంబీకులై ఉండాలి. – డాక్టర్ పురాణపండ వైజయంతి -
దాసీపై మాస్పతాస్త్రం
దురాచారం ఒక వ్యవస్థగా వేళ్లూనుకున్నప్పుడు దానిని పెకలించే మహాశక్తి ఏదైనా ఆవిర్భవించాలి.అలా ఆవిర్భవించి, ‘దేవదాసీ’ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేస్తున్న స్త్రీశక్తే... మాస్. కడుపులో ఉన్న ఆడబిడ్డను కడుపులో ఉండగానే చంపేయడం, పదేళ్లు కూడా దాటని పసిమొగ్గలపై అత్యాచారాలకు పాల్పడటం.. ఇవన్నీ ప్రతిరోజూ మనం వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. అయితే కడుపులో ఆడబిడ్డ ఉందని తెలిస్తే చాలు, ఆ బిడ్డను అప్పుడే అమ్మేసే సంస్కృతి గురించి విన్నప్పుడు మాత్రం మనం ఉన్నది ఎలాంటి సమాజంలో! అనే ప్రశ్న తలెత్తక మానదు. ఒకరిది పేదరికం, మరొకరిది తెలియనితనం, ఇంకొకరిది ఇదేంటని ప్రశ్నించలేని పిరికితనం.. ఇవన్నీ కలిసి వారిని దేవదాసీలుగా మార్చాయి. తమ పెద్దలు, ఊళ్లో వాళ్లు చెప్పిందే వేదవాక్కంటూ ఎన్నో ఏళ్లు దేవదాసీలుగా మగ్గిపోయారు. ఎన్నో అవమానాలు పడ్డారు. దేవుడికి అంకితం చేశామనే పేరుతో ‘మగాళ్ల‘కు అప్పగించేస్తుంటే పంటిబిగువున బాధను ఆపుకున్నారు. తమ బిడ్డలకు సమాజం నుండి ఛీత్కారాలు ఎదురవుతున్నా తమ రక్తాన్ని గంజిగా మార్చి దానినే వారికి పానకంలా తాగించారు. అలా ఎన్నో ఏళ్లు సాగాయి. తమలా మరికొందరు ఆ దారుల్లోకి వస్తూనే ఉన్నారు. అంతేకాదు, కడుపులో ఉన్న ఆడబిడ్డలు కడుపులోనే అమ్ముడయిపోతున్నారు. అప్పుడే వారికి అర్థమైంది.. ఇంకా ఇలానే భరిస్తూ పోతే తమ బిడ్డలను కూడా అదే నరకంలోకి తోస్తారని. అంతే.. కళ్లు తెరిచారు. తమ భావితరాలు ‘దాసీ’ బతుకుల్లో మగ్గిపోకూడదని పోరాటం ప్రారంభించారు. ఇంకా పోరాడు తూనే ఉన్నారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన దేవదాసీల్లో వచ్చిన ఈ మార్పు ఓ విప్లవంలా కొనసాగుతోంది. కర్ణాటక దేవదాసీ(ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేషన్)యాక్ట్-1982 ద్వారా రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అయితే కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48 వేల మంది దేవదాసీలున్నట్ల్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వీరిలో ఎక్కువమంది బీదర్, బెల్గాం, రాయచూరు, బళ్లారి ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్క బెల్గ్గాంలోనే దాదాపు 5 వేల మంది దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా బెల్గ్గాం జిల్లాలో దేవదాసీలుగా జీవనాన్ని సాగిస్తూ అనంతరం తమ జీవన విధానాన్ని మార్చుకున్న కొంతమంది మహిళలతో ఏర్పాటైన సంస్థే ‘మాస్’(మహిళల అభివృద్ధి సంరక్షణా సంస్థ-ఎంఏఎస్ఎస్). సామాజిక దురాచారమైన దేవదాసీ చెరలో మగ్గుతున్న బెళ్గావి జిల్లాలోని కొందరు మహిళలు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల ప్రమేయంతో ఆ చెర నుండి బయటపడ్డారు. వారిలో సీతవ్వ, సరసవ్వ, ఐరావతిలు కూడా ఉన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో 1997లో ‘మాస్’ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో సభ్యత్వంతో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం దాదాపు 4,500 మంది మాజీ దేవదాసీలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దేవదాసీ పద్ధతిని రూపుమాపేందుకు ‘మాస్’ సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ విషయంపై ‘మాస్’ సంస్థ కార్యనిర్వాహక అధికారిగా పనిచేస్తున్న సీతవ్వ, సంస్థ సభ్యురాలైన ఐరావతి ఏమంటారంటే...‘‘బెళ్గావిలోని గోకాక్ తాలూకాలో ఉన్న యల్లమ్మ గుడ్డలో జరిగే జాతరలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అమ్మాయిలను దేవదాసీలుగా మార్చేవారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి తమ ఆడపిల్లలను దేవదాసీలుగా మారుస్తుంటారు. అయితే మా సంఘం ఏర్పాటైన నాటి నుండి అక్కడ ఎవరినీ దేవదాసీలుగా మార్చకుండా చూస్తున్నాం. ఇంతకు ముందు మేము దేవదాసీలుగా ఉన్న వాళ్లమే కాబట్టి ఎవరైనా తమ సంబంధీకుల్లో లేదా ఇతరుల ఆడబిడ్డలను దేవదాసీలుగా మారుస్తున్నారా అన్న విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంటుంది. దేవదాసీ వ్యవస్థపై నిషేధం విధించిన నాటినుండి అమ్మాయిలను దేవదాసీలుగా మార్చే ప్రక్రియ రాత్రివేళల్లో సాగుతోంది. అందుకే మా సంస్థ సభ్యులతో బృందంగా వెళ్లి రాత్రివేళల్లో నిఘా వేసేవాళ్లం. ఆ సందర్భంలో అమ్మాయి సంబంధీకులు మాపై దాడులకు కూడా పాల్పడ్డారు. అయినా సరే, మరే ఆడబిడ్డా మాలాగా మారకూడదనే దృఢ నిశ్చయంతో వారిని అడ్డుకునేవాళ్లం. అలా ఎంతోమంది ఆడబిడ్డలను ఆ చెరలో పడకుండా చూడగలిగాము’’ అంటూ తమ సంఘం చేసిన పనులను చెప్పారు ఐరావతి. చెరవీడినవారికి.... దేవదాసీ వ్యవస్థలో మగ్గి ప్రస్తుతం ఆ చెరనుండి బయటపడ్డ వారు వారి పిల్లలకు ఓ పుట్టినిల్లులా భరోసా ఇస్తోంది ‘మాస్’. మాజీ దేవదాసీలు, వారి పిల్లలకు రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేమున్నామంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తోంది. తమపై జరిగే అన్యాయాలను నిరోధించేందుకు గాను మాస్ సంస్థలో న్యాయ సలహా కేంద్రం కూడా ఏర్పాటైంది. న్యాయవ్యవస్థ నుండి తమకు లభించే ప్రయోజనాలు, న్యాయస్థానాల నుండి సహాయాన్ని ఎలా పొందవచ్చు అనే అంశాలపై కూడా సలహాలు, సూచనలు అందిస్తోంది. వీటితో పాటు మాస్ సంస్థలోని సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బాల్యవివాహాలను అరికట్టడంతో పాటు వివిధ సామాజిక దురాచారాలపై వీధినాటికలను ప్రదర్శిస్తూ గ్రామాల్లోని మహిళల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు చేయాల్సిన కృషి వంటి అంశాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉంటారు. మాజీ దేవదాసీల పిల్లలకు మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేస్తోంది మాస్. ఈ క్రమంలో మాస్ సంస్థ సభ్యులపై కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సరే ఎలాంటి అవరోధాలనూ లెక్కచేయక ముందుకు సాగుతున్నారు. - షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు; ఫొటోలు: టి.కె. ధనుంజయ స్వయం ఉపాధి కూడా... ‘దేవదాసీ విధానం నుండి విముక్తి కల్పించిన తర్వాత మేం ఆలోచించింది మా ఉపాధి గురించి, మా బిడ్డల భవిష్యత్తు గురించి. అందుకే ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ముందుగా మేం స్వయం ఉపాధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నాం. బుట్టల అల్లిక, ఎంబ్రాయిడరీ, అగరుబత్తుల తయారీలో శిక్షణ పొంది మా సభ్యులకు కూడా శిక్షణ ఇప్పించాం. ప్రస్తుతం మా సంస్థలోని సభ్యులంతా స్వశక్తితో జీవనాన్ని సాగిస్తున్నారు. మా సంఘంలోని సభ్యుల పిల్లల ఉన్నత చదువుల కోసం రుణాలను కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది మాజీ దేవదాసీల పిల్లలు ‘దాసీ’ శృంఖలాలను తెంచుకుంటూ తమదైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. - సీతవ్వ, మాస్ సంస్థ కార్యనిర్వాహక అధికారి