దేవ నాట్యానికి యశో వైభవం | Special story about dancer Ms. Yashoda Thakur | Sakshi
Sakshi News home page

దేవ నాట్యానికి యశో వైభవం

Published Mon, Jul 2 2018 1:06 AM | Last Updated on Mon, Jul 2 2018 4:26 AM

Special story about dancer Ms. Yashoda Thakur - Sakshi

జమీందారుల ఆస్థానంలో నాట్యగత్తెలు ఉండేవారు. తమ నాట్యరీతులతో అతిథులకు ఆహ్లాదం కలిగించేవారు. వారే దేవాలయాలలో భగవంతుని ప్రస్తుతిస్తూ నాట్యం చేస్తూ ‘దేవదాసీ’ అనే పేరుకు సార్థకతలా ఉండేవారు. రాన్రానూ దేవదాసీ నాట్యం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శ్రీమతి యశోదా ఠాకూర్‌. ఆమెది హైదరాబాద్‌. కళావంతుల కుటుంబానికి చెందినవారు. కళావంతులు, దేవదాసీల గురించి యశోదను ప్రశ్నించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.


అదొక ప్రతిష్ట: దేవదాసీలను రాజులు, జమీందారులు పోషించేవారు. ఈ కుటుంబాలకు చెందినవారికి ఒక నియమం ఉండేది. వారు నివసిస్తున్న గ్రామంలోని ఎవరో ఒకరికి మాత్రమే అంకితమై ఉండేవారు. ప్రముఖ నాట్యాచార్యులు బాలసరస్వతిగారి వరకు ఇదే సంప్రదాయం కొనసాగింది. జమీందారుల ఇళ్లకు వచ్చిన అతిథులకు కళావంతుల కుటుంబానికి చెందిన కళాకారిణితో నాట్యం చేయించడం వారి ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. దివాణంలో ఎంత అందంగా నర్తించే దేవదాసీలు ఉన్నార న్నదే ప్రధానం.

మేజువాణి: మేజువాణి అనేది మేజ్‌బన్‌ పారశీ పదం నుంచి వచ్చింది. ఈ పదానికి విందు, వేడుక అనే అర్థాలను నిఘంటువు చెబుతోంది. మేజ్‌ అంటే బల్ల, బన్‌ అంటే ఆతిథ్యం ఇచ్చేవారు అని అర్థం. ఇంటికి వచ్చిన అతిథికి బల్ల మీద భోజనం వడ్డించి, నాట్యంతో కనువిందు చేయడం వలన దేవదాసీలు చేసే నాట్యానికి మేజువాణి అనే పేరు వచ్చింది.

జమీందారులను ప్రస్తుతిస్తూ, ఎటువంటి అలంకారాలు లేకుండా, చీర కట్టుతో, ముఖకవళికలతో భావాన్ని ప్రదర్శిస్తూ, విలాసిని నాట్యం అభినయిస్తారు. గోదావరి జిల్లా ముమ్మిడివరం వాస్తవ్యులు అన్నాబత్తుల లక్ష్మీమంగతాయారు నేటికీ ఈ నాట్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో అందరికీ నేర్పుతున్నారు. భామాకలాపం, జావళి, వర్ణం, శబ్దం, పదం నేర్చుకోవడం మొదలుపెట్టాక, విలాసిని నాట్యం ఎందుకు చేస్తున్నారో తెలిశాక, ఆ నాట్యం మానేశాను.

కళావంతులు: కర్ణాటక సంగీత విద్వాంసులురాలు భారతరత్న శ్రీమతి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్‌ వసంతకుమారి, సినీ నటులు ఎస్‌. వరలక్ష్మి, జి. వరలక్ష్మి, అంజలీదేవి, వహీదా రెహమాన్, జరీనా వహాబ్, జయప్రద, శ్రీవిద్య, జ్యోతిలక్ష్మి, జయమాలిని, శ్రీప్రియ వీరంతా కళావంతుల కుటుంబాలకు చెందినవారే. దాసరి నారాయణరావుగారు కూడా కళావంతుల కుటుంబానికి చెందినవారు కావడం వల్ల, ఆయన తీసిన చాలా చిత్రాలు కళావంతుల కుటుంబ నేపథ్యంలో వచ్చినవే. జయమాలిని, జ్యోతిలక్ష్మి గార్ల అమ్మమ్మ తంజావూరు రాజసభలో నాట్యం చేసేవారు.

సింహనందిని: వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, సిఆర్‌ ఆచార్యులు...  దేవదాసీలతో స్నేహంగా ఉంటూ, వారి దగ్గర నుంచి నాట్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేవారు. ఈ ఇరు వర్గాల మధ్య ఎంతో అందమైన అనుబంధం ఉండేది. ఒకరినొకరిని గౌరవించుకునేవారు. లక్ష్మీనారాయణగారు కళావంతులను తన ఇంట్లోకి ఆహ్వానించేవారు.

సిఆర్‌ ఆచార్యులు గారు కళావంతుల ఇళ్లలోకి వెళ్లారని తెలుసుకుని, ఆయనను వారి కుటుంబం వెలివేసింది. అయినా ఆయన తన జిజ్ఞాసను విడిచిపెట్టలేదు. స్వామివారి పల్లకీ సేవలో సంప్రదాయంగా కళావంతులు వీధిలో చేస్తున్న సింహనందిని నాట్యం వారి దగ్గరే నేర్చుకున్నారు.

వేయిపడగలు: వేయిపడగలు నవలలో దేవదాసి పాత్ర గిరిక నాకు బాగా నచ్చింది. ఆ నవల చదివిన రోజుల్లో నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా అర్థం కాలేదు. అప్పటికి నాలో ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. రత్నగిరి, గిరిక పాత్రలు ఒక వైపు తక్కువగా అనిపించినా, ఎంతో లోతు ఉన్న పాత్రలు అవి. అందం, నాట్యం, తెలివితేటలు, చదువు అన్నీ పాత్రలు.  చాణక్యుడు కళావంతులను రాజకీయంగా వాడేవాడు.

దుష్ప్రచారం: ‘యోగా ఇన్‌ ఇండియన్‌ డ్యాన్స్‌ స్పెషల్లీ ఇన్‌ కూచిపూడి’ అనే అంశం మీద పిహెచ్‌డి చేశాను. నేను ఈ స్థాయికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అమ్మనాన్నల అండలో ఉండటం వల్ల నిలదొక్కుకోగలిగాను. కాలేజీ రోజుల్లో ఎంఏ డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు, మా వారు (అప్పటికి ఇంకా వివాహం కాలేదు) ఎంఏ థియేటర్‌ ఆర్ట్స్‌ చేస్తుండేవారు. మా ఇద్దరివీ ఒకే అభిప్రాయాలు కావడంతో ఇద్దరం వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నాం.

మేము కళావంతుల కుటుంబానికి చెందినవారమని నేను ఆయనకు ముందుగానే చెప్పాను. ఆయన అంగీకరించారు. నేను ఆయనను పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి కూడా చాలామంది ఆయన దగ్గరకు వెళ్లి, మా సంబంధం చెడగొట్టడానికి చూశారు. మేం ముగ్గురం అమ్మాయిలమని, ఇంకా ఆ వృత్తిలోనే ఉన్నామని మా గురించి ప్రచారం చేశారు. మేం నాలుగు తరాల క్రితమే ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేశాం.


పూర్వ వైభవం
జమీందారీ వ్యవస్థ ఉన్నంత వరకు వారి ఆస్థానంలో దేవదాసీలు ఉండేవారు. అందమైన దేవదాసీలు తమ ఆస్థానంలో ఉండటం జమీందారీకే గర్వకారణంగా భావించేవారు. మొగలుల పాలనలో జమీందారీ సంప్రదాయానికి కాలం చెల్లడంతో దేవదాసీ నిషేధ చట్టం వచ్చింది. అంతకాలం సిరిసంపదలతో తులతూగుతూ, భోగభాగ్యాలు అనుభవించిన దేవదాసీల పరిస్థితి ఒక్కసారిగా క్షీణించింది. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక పొట్ట చేత పట్టుకుని కొందరు హరికథలు చెబుతూ, మరికొందరు ఇతర వృత్తులలోకి ప్రవేశించారు.

డిగ్రీలో ఆసక్తి
పద్మ విభూషణ్‌ వెంపటి చినసత్యం గారి దగ్గర నా ఆరో ఏటనే నాట్యాభ్యాసం ప్రారంభించాను. 14 సంవత్సరాల పాటు అక్కడే పూర్తిగా నాట్యం నేర్చుకున్నాక, 1992లో మాస్టర్‌ డిగ్రీ కోసం సెంట్రల్‌ యూనివర్సిటీలో చేరి, అక్కడ నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. కోర్సులో భాగంగా దేవదాసీల గురించి, వారి నాట్యం గురించి ఆయన పరిచయం చేశారు. అప్పుడే నాకు దేవదాసీ నాట్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది.

అమ్మ చెప్పింది
వెంపటి చినసత్యం మాస్టారి దగ్గర ‘కల్యాణ శ్రీనివాసం’ నాట్యం చేస్తున్న రోజుల్లోనే, నా గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం విన్నాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి, ‘అమ్మా!  నన్ను అందరూ కళావంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి అంటున్నారు. కళావంతులు అంటే ఏమిటని ప్రశ్నించాను. కళావంతుల గురించి అమ్మ ఎంతో ఉన్నతంగా వివరించింది. అవగాహన లేకపోవడం వల్ల అందరూ వీరిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, ప్రస్తుతం వీరంతా కులవృత్తిని విడిచి, బాగా చదువుకుని, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారని అమ్మ చెప్పింది.

విద్యావంతులు
మా నాన్నగారి తరం నాటికే ఈ నాట్యం విలువ తెలియదు. మా అమ్మమ్మకి నానమ్మ, నానమ్మ చెల్లెలు అయిన మధురవాణి, పిచ్చాయమ్మ గార్లు అన్నవరం జమీందారు దగ్గర నాట్యం చేసేవారు. రాజుల కాలం నుంచి దేవదాసీలే అందరికంటె ఎక్కువగా చదువుకున్నారు. చదువుకోవటాన్ని గర్వంగా భావించేవారు. వీరు బయటకు వస్తే ఇబ్బందులు పడవలసి వస్తుంది కనుక గురువులు స్వయంగా ఇంటికి వచ్చి చదువు నేర్పేవారు. మా అమ్మమ్మగారి నానమ్మ మధురవాణి గారి నాట్యం కోసం ఇతర దేశాల నుంచి ఎందరో సంపన్న కళాభిమానులు వచ్చేవారట.

స్వామికి అంకితం
వీధివీధికి ఉన్న గుడులలో దేవదాసీలు ఉండేవారు. ఆ ఆలయస్వామికి అంకితంగా బ్రాహ్మణులు కథ రాసేవారు. ఆలయానికి చెందిన దేవదాసి మాత్రమే నాట్యం చేయాలి అన్నంత ప్రత్యేకంగా రాసేవారు. ‘ఫలానా వ్యక్తి రచించగా, ఫలానా దేవదాసి చేస్తున్న నాట్యం’ అని ముందుమాట ఉండేది. ఆ రోజుల్లో దేవదాసీలకు, బ్రాహ్మణులకు మధ్య పవిత్ర అనుబంధం ఉండేది.

రానురానూ దేవదాసీ వృత్తి దిగజారుతుండటంతో మా ముందు తరానికి చెందిన మధురవాణిగారు, ఇక  నుంచి ఈ వృత్తికి దూరంగా ఉండేలా చూడాలని భావించి, మా అమ్మమ్మగారి తండ్రిగారైన చదలవాడ గోపీనాథం (బృందావన శ్రీకృష్ణం రచించారు) గారి నుంచి మాట తీసుకున్నారుట. ఇచ్చిన మాట ప్రకారం మా అమ్మమ్మ గారి తరం నుంచి మా వంశీకులు దేవదాసీ వృత్తిని విడిచి, కోటిపల్లి నుంచి కొవ్వూరు చేరుకుని గౌడీ సంప్రదాయాన్ని పాటిస్తూ జీవనం సాగించారుట.

విలాసినీనాట్యం
మా నాన్నగారు ఆర్‌టీసీలో అడిషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నాకు సంఘంలో రక్షణ ఉండటంతో, ‘అబద్ధంలో ఎందుకు బతకాలి, మన కళను మనం ఎందుకు వదులుకోవాలి’ అనుకున్నాను. విలాసిని నాట్యం, దేవదాసి నాట్యం నేర్చుకోవాలనుకున్నాను. రంగ్‌బాద్‌ గుడిలో ప్రముఖ నాట్యకారిణి స్వప్న సుందరి గొల్లకలాపం చూశాక, నేను వెతుకుతున్న నాట్యం నాకు దొరికిందనిపించిది. ఆవిడను సంప్రదించాను.

సరిగ్గా ఆ సమయంలోనే ఆవిడ, ఆరుద్రగారితో కలిసి విలాసిని నాట్యం మీద పరిశోధన చేస్తున్నారని తెలిసింది. ఆవిడ నాతో కలిసి మొత్తం ఐదుగురికి ఈ నాట్యం నేర్పారు. ఐదేళ్ల పాటు విలాసిని నాట్యం నేర్చుకున్నాక,  అందులోనూ నేను వెతుకుతున్న మూలనాట్యం కనిపించలేదని బాధపడ్డాను. ఆ సమయంలోనే ప్రొ. దేవేశ్‌ సోనీ విలాసిని నాట్యం మీద రచించిన పుస్తకం చదివాను. ఆయన దగ్గర నేను వెతుకుతున్న నాట్యం పుట్టుపూర్వోత్తరాలు దొరికాయి.

సిగ్గుపడకూడదు
మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ప్రత్యేకత ఏంటో ప్రపంచానికి మనమే చూపాలి. నేను ఈ కమ్యూనిటీ వారిని ఒకటే కోరుతున్నాను. మీ ప్రతిభను మీరు దాచుకోకండి. నాట్యాన్ని భక్తిశ్రద్ధలతో అభ్యసించి, ‘వీరు లేనిదే ఈ నాట్యం నిలబడదు అనుకునేలా’ కళను నిలబెట్టాలి. అందుకోసం ఈ నాట్యాన్ని కొనసాగించాలి. అప్పుడు మనల్ని అందరూ గౌరవిస్తారు. ఒకవేళ వారు గౌరవించకపోతే, మనల్ని వారు ఎందుకు గౌరవించాలో చెప్పాలి.

నాకు సోషల్‌ సెక్యూరిటీ ఉండటం వల్ల నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మా కళావంతుల కుటుంబం నుంచి కనీసం నలుగురు వచ్చి అబద్ధాలు చెప్పకుండా, మేము కళావంతులం అని గర్వంగా చెప్పుకునేలా చూడాలని నా కోరిక. ఇంకా నేటికీ ఆ వృత్తిలోనే ఉండిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఆ కుటుంబాలకు చెందిన వారికి చదువు చెప్పించి డాన్స్‌ నేర్పించే ప్రయత్నంలో ఉన్నాను. వారు తప్పనిసరిగా కళావంతుల కుటుంబీకులై ఉండాలి.

– డాక్టర్‌ పురాణపండ వైజయంతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement