సమాజంలో సముచిత స్థానంతో గౌరవించాలని కోరుతున్న దేవదాసీలు
దేవదాసి, బసివిని, మాతంగి... పేరేదైనా.. వారి బతుకులు మాత్రం దుర్భరం..ఎప్పుడో...ఎవరో సృష్టించిన అనాగరిక ఆచారానికి బలైపోయిన మహిళలు వారు. అక్షర జ్ఞానం లేని తల్లిదండ్రులు చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్న దేవదాసీలు వారు. పేరుమారి...సమాజం తీరు మారి..తమ బతుకులే మారిపోయాక...తమను మనుషులుగా గుర్తించాలని కోరుతున్న అభాగ్యులు వారు...ఊపిరున్నంత వరకూ ఊరందరికీ అంగడిబొమ్మలు వాళ్లు. ఊరంతా కలిసి చేసిన అన్యాయానికి...నిత్యం నరకం అనుభవిస్తున్న అబలల జీవితాలపై ‘సాక్షి’ ఫోకస్
ఒక్కడు మూడుముళ్లేశాడు... ఊరంతా అనుభవిస్తున్నారు దేవుడి సతినంటారు.. దెయ్యాల్లా వెంటబడతారు పగలంతా వెట్టి కష్టం...రాత్రయితే నరకం..పిలిస్తే వెళ్లాలంటారు.. కడుపొస్తే కనాలంటారు..బిడ్డలకు తండ్రిగా ఏ ఒక్కడూ ముందుకురాడు..అడుక్కోవడం..అవమాన పడడం..అత్యాచారాలకు బలైపోవడం..కాదు..బానిసలవడంఅందరిలా మేమూ ఆడవాళ్లం కాదా...మాకూ మనసు లేదా...మాకు హక్కులు వర్తించవా..మానెత్తినెక్కిన ఆ భవవంతునికీ దయరాదా..గొంతెత్తి ఘోషిస్తున్నా ఈ పాలకులకూ వినపడదా..మేమింతేనా...మా బతుకింతేనా..దేవదాసి...బసివిని...మాతంగి..పేరేదైనా..అనాగరిక సమాజంలో బలైపోయిన అబలల ఆక్రందన ఇదీ.. అక్షరజ్ఞానం లేక ఎందరో పడుతున్న ఆవేదన ఇది. ఇకనైనా తమకో గుర్తింపు ఇవ్వాలని..తమకూ హక్కులు కల్పించి ఆదరించాలంటున్న ఎన్నో గొంతుకల ఆక్రోశమిది...
అనంతపురం : జిల్లాలోని 11 మండలాల్లో దాదాపు 2,529 మంది జోగినులు, బసివినులు, దేవదాసీలు ఉన్నట్లు అధికారుల రికాకార్డులు చెబుతున్నాయి. ఇందులో కర్ణాటక సరిహద్దులో ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోని మండలాల్లోనే 285 మంది దేవదాసీలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక వివక్షకు.. దౌర్జన్యాలకు బలైపోయిన వీరి సంక్షేమం గురించి అటు పాలకులు..ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నారు.
దేవదాసీ వ్యవస్థకు ఎలా బీజం పడిందంటే...
ఎంతమంది దేవదాసీలుంటే ఆ దేవాలయానికి అంత ప్రతిష్ట అనే భావనతో పూజారి, పురోహితులు దేవదాసీల వ్యవస్థకు బీజం వేశారు. దేవదాసీలు తొలుత ఆలయాల్లో నాట్యకత్తెలుగా ఉండేవారు. అలాగే లలిత కళలు నేర్చుకున్న కొందరు మహిళలు దేవాలయాలు, రాజుల కొలువుల్లో నాట్యమాడేవారు. వారిపై కన్నేసిన కొందరు పెద్దలు వారి కామవాంఛలు తీర్చే వస్తువుగా, ఉంపుడుగత్తెలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత వీరికి దేవదాసీ..జోగినీ..మాతంగి పేరు తగిలించి ఊరందరికీ అప్పగించారు. వంశపార్యపరంగా కొంతమంది, మరోమార్గం లేక పొట్టకూటి కోసం మరి కొంతమంది ఈ రొంపిలోకి నెట్టబడ్డారు. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం దేవుడి భార్యగా మార్చి ఊరంతా వంతులు వేసుకుని అనుభవించారు. ఇలా బలైపోయిన దేవదాసీల జీవితాల్లో నిత్యం అవమానం, హేళన, ఛీదరింపులే. కరువుకు నిలయంగా పేరొందిన ‘అనంత’లోని ఎన్నో సరిహద్దు మండలాల్లో ఇప్పటికీ ఈ వ్యవస్థ కొనసాగతుండడం గమనార్హం.
తల్లిదండ్రుల అమాయకత్వం వల్లే..
దేవదాసీలు, బసివినులుగా మారిన వారికే ఎక్కువగా దళితులే ఉన్నారు. పెద్దల అమాయకత్వం, నిరక్షరాస్యత వెరసి ఆడపిల్లల జీవితాలు నాశమయ్యాయి. కొడుకులు లేని తల్లిదండ్రులు ఆడపిల్లకు పెళ్లి చేస్తే తమకు వృద్ధాప్యంలో ఆసరా ఉండదని భావించి తమ ఆడపిల్లలను దేవదాసీలుగా మార్చేవారు. అంటే ప్రత్యక్షంగా వ్యభిచార కూపంలోకి నెట్టేవారు. తల్లిదండ్రులతోనే ఉంటూ ఊరిజనం కోరిక తీర్చే అంగడి బొమ్మగా, వయసు ముదిరిన తర్వాత వ్యవసాయకూలీగా దుర్భరజీవితం గడుపుతున్న మహిళల ఆవేదన వర్ణనాతీతం.
దేవదాసీలుగా మార్చే వైనం
అభం శుభం తెలియని పదేళ్ల లోపు బాలికలను ఉలిగమ్మ, యల్లమ్మ, పెన్నోబిలేసు, హనుమంతరాయుడు తదితర దేవాలయాల పేరుతో దేవదాసీలుగా మారుస్తున్నారు. బాలికను పెళ్లికూతురుగా అలంకరించి దేవాలయానికి తీసుకెళతారు. సంప్రదాయం పేరుతో వరుసకు మామ అయ్యే వ్యక్తితో గానీ, లేక ఊరి పెద్దతో గానీ తాళి కట్టించి దేవుడికి వదిలేస్తారు. తదనంతరం పుష్పవతి అయ్యేంత వరకు ఆ అమ్మాయి తల్లిదండ్రుల సంరక్షణలోనే పెరుగుతుంది. పుష్పవతి కాగానే తొట్టతొలుత ఆ ఊరి పెద్దమనిషి కామవాంఛ తీర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఊర్లో ఎవరు పిలిచినా వెళ్లాల్సి ఉంటుందని ఈ అనాగరిక ఆచారానికి బలైన వారు చెబుతున్నారు.
హక్కుల కోసం పోరాటం
1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు బసివిని, దేవదాసిలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేశారు. అప్పటి నుంచి వీరి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దాదాపు 33 ఏళ్లుగా హక్కుల కోసం ఉద్యమాలు సాగిస్తున్నా... ఏమాత్రం స్పందించడం లేదు. అయితే ఇటీవలే దేవదాసి, మాతంగి, బసివిని తెగల స్థితిగతులపై ఆధ్యాయనం చేయడం కోసం ప్రభుత్వం రఘనాథన్‌రావు కమిటీని నియమించింది. అయితే కమిటీ మాత్రం జిల్లాలో అలాంటివారు ఎవరూ లేరని ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ అనాగరిక ఆచారంపై ఇప్పుడిప్పుడే బాధితుల్లో చైతన్యం వస్తోంది..ఎస్సీ సంక్షేమ సంఘం లాంటి సంస్థలు వారి తరఫున ప్రభుత్నాన్ని ప్రశ్నిస్తున్నాయి. వారి హక్కుల కోసం పోరాడుతున్నాయి. ఆర్డీటీ సంస్థ ఎందరికో ఉపాధి కల్పిం చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
దేవదాసీల డిమాండ్లు
♦ జోగిని, మాతంగి, బసివిని, దేవదాసీలకు రూ.10 లక్షల సెక్యురిటీ డిపాజిట్ చేయాలి.
♦ 250 చదరపు అడుగులు మేర డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించాలి.
♦ ఉపాధి కోసం మూడు ఎకరాల సాగుభూమి ఇవ్వాలి.
♦ నెలకు కుటుంబానికి సరిపడా నిత్యావసర వస్తువులు ప్రభుత్వమే ఇవ్వాలి.
♦ ఎస్సీ కార్పొరేషన్ నుంచి పూర్తి సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహకారం అందించాలి.
♦ అన్ని రకాల వైద్యసేవలు ఉచితంగా అందించాలి.
♦ బాల జోగినీ , దేవదాసీ, బసివి, మాతంగిల పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య , చదివిన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలి. వారి వివాహాలకు ప్రోత్సాహకాలు అందించాలి.
♦ దేవదాసి రక్షణ కోసం , వ్యవస్థ నిర్మూలన కోసం ఏపీ దేవదాసీ (అంకిత నిషేధ) నియమాలు అమలు చేయాలి.
♦ దేవదాసీ వ్యవస్థను ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగాశిక్షించాలి.
దేవుడి భార్యను.. దెయ్యాలతో సంసారం
అపుడు నాకు పదేళ్లు. అక్షరజ్ఞానం లేని మా తల్లిదండ్రులు నన్ను కూడా చదివించలేదు. అమాయకత్వం, అల్లరితనం తప్ప నాకు ఏమీ తెలియవు. అలాంటి సమయంలో నాకు దేవుడితో పెళ్లి చేస్తామన్నారు. దేవుడితో పెళ్లి అంటే నేను దేవతతో సమానమని భావించాను. దేవుడి గుడికి వెళ్లి చూశాను. ఈ దేవుడే నాకు భర్త అవుతాడని నవ్వుకున్నా. దేవుడితో పాటు నాకు కూడా పూజలు చేస్తారు... గౌరవం ఉంటుందనుకుని ఎగిరి గంతేశాను. నా తోటి స్నేహితులకు సంతోషంగా చెప్పాను. మా తల్లిదండ్రులు నిర్ణయించిన గడువు రానే వచ్చింది. నన్ను పెళ్లి కూతురిగా అలంకరించారు. దేవుడి గుడికి తీసుకెళ్లారు. ఏవేవో పూజలు చేశారు. చివరికి వేరే వ్యక్తితో నాకు తాళి కట్టించారు. ఈయన కూడా దేవుడేనా అనుకున్నా. పెళ్లి తంతు ముగిసింది. అప్పటి నుంచి రోజూ దేవుడి గుడికి వెళ్లి పూజలు చేసి వచ్చేదాన్ని. కానీ మా గ్రామంలో నన్నెవరూ గౌరవంగా చూడలేదు సరికదా కొత్తగా బసివిని అని పిలవడం మొదలు పెట్టారు. ఏంటి నన్ను కొంతమంది బసివిని అంటున్నారని మా అమ్మానాన్నను అడిగా. అయితే మా తల్లిదండ్రులు సమాధానం సరిగా చెప్పలేదు.
నా పన్నెండవ ఏట నేను పుష్పవతినయ్యాను. 16 రోజుల వరకు ఆచారాలు, సంప్రదాయాలు అంటూ ఏవేవో చేశారు. కొన్ని రోజుల తర్వాత మా తల్లిదండ్రులే నన్ను ఓ పెద్దాయన ఉన్న గుడిసెలోకి తీసుకెళ్లి వదిలారు. నా భర్త కానప్పుడు అతని దగ్గరకు ఎందుకు వదిలారా..అని ఆలోచిస్తుండగానే... కామంతో కళ్లుమూసుకుపోయిన ఆ గంభీరపు ఆకారం చేతిలో నేను బలైపోయాను. అప్పుడు తెలిసింది నేను దేవుడి భార్య కాదు, నా తల్లిదండ్రులే నన్ను వ్యభిచార రొంపిలోకి దించారని, నన్ను అంగడి బొమ్మగా మార్చారని. ఇక ఆనాటి నుంచి నా జీవితం రోజు నరకప్రాయమే. ఎవరు పడితే వారు నన్ను పిలిచే వారు. తల్లిదండ్రులకు చెబితే వారు నాకు సపోర్ట్ చేసేవారు కాదు. ‘‘వెళ్లాలమ్మా’’ అని చెప్పేవారు. నా బతుకుపై నాకే అసహ్యం వేసింది. తల్లిదండ్రుల ఓదార్పు మాటలు, ఇరుగుపొరుగు ఆడవారు చెప్పిన మాటలు విని నా బ్రతుకింతే అని సర్దుకుపోవడం నేర్చుకున్నాను. గ్రామంలో నన్ను వ్యభిచారిగా ముద్ర వేశారు. గౌరవం లేదు, మర్యాదా లేదు. దారెంట పోయే ప్రతి కామపిశాచి నాతో కామవాంఛ తీర్చుకున్నారు. ఇలా నా జీవితం దుర్భరంగా మారింది.– బసివిని, అంబాపురం గ్రామం, కణేకల్లు మండలం
చీదరించుకునేవాళ్లు
శెట్టూరు: నా పేరు గంగమ్మ... శెట్టూరులో అందరూ జోగినీగానే పిలుస్తారు. 36 ఏళ్ల క్రితం అంటే నాకు 12 ఏళ్ల వయస్సు నుంచే అమ్మవారు ఒళ్లోకి వచ్చేది. ఇలా ఉండగానే నా తల్లిదండ్రులు బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే నేను జోగినీగా మారినట్లు గుర్తించిన అత్త, మామ, భర్త నన్ను పెళ్లైన మూడేళ్లకే ఇంటి నుంచి పంపించేశారు. నేను పుట్టింటికి వచ్చాక గర్భవతినయ్యాను. ఓ బిడ్డకు జన్మనిచ్చాను. భర్తలేని లోటు తెలియకుండా ఒక్కగానొక్క కుమార్తె రాజేశ్వరిని పెద్ద చేసి పెళ్లిచేశాను. అప్పటి నుంచి ఇల్లిల్లూ తిరుగుతూ ఒంటరిగానే జీవితం గడుపుతున్నాను. ఇంటింటికీ వెళ్లినప్పుడు చాలా మంది చీదరించుకునేవాళ్లు. ఇలా ఉన్నావు పనులు చేసుకుని..కూలీ పోయి బతకడానికి ఏమైందంటూ అవమానించేవారు. ప్రభుత్వం ఇటీవల ఇళ్లు మంజూరు చేసినా..కట్టుకునేందుకు డబ్బు లేక అర్ధాంతరంగా నిలిపివేశాను. తమకు సాయం చేయకపోయినా ఫర్వాలేదు గానీ...వివక్ష చూపవద్దని గంగమ్మ వేడుకుంటోంది.
జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీ
సమాజమంతా చిన్నచూపు చూసినా ఆర్డీటీ సంస్థ మమ్మల్ని అక్కున చేర్చుకుంది. వ్యవస్థ మార్పుకు శ్రీకారం చుట్టింది. ఉపాధి చూపుతూ మా జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నేను ఆర్డీటీ హెచ్‌ఐవీ విభాగంలో పనిచేస్తున్నాను. ఈ అవకాశంతో దేవదాసీలు, బసివినులకు ఎప్పటికప్పుడు హెచ్‌ఐవీ టెస్టులు చేయించాను. వారెవరికీ సుఖవ్యాధులు కూడా లేవు. ఆర్డీటీ సంస్థ కొంతమందికి కుట్టులో శిక్షణ ఇచ్చి, ఉచితంగా కుట్టుమిషన్లు అందజేసింది. మరికొందరు ఆర్డీటీ చేయూత ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. నేను కూడా ఊహ తెలియని వయస్సులోనే దేవదాసిగా మారాను. నాకు ఓ కూతురు ఉంది. చాలా కష్టపడి డిగ్రీ రెండో సంవత్సరం వరకు చదివించాను. స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే తండ్రి పేరు అడిగారు. ఏదో పేరు పెడదామంటే సంతకం కావాలన్నారు. మూడు నెలలు కష్టపడి... ఒకాయన్ను ఒప్పించి ఆయన పేరు రాయించా. అయితే నిన్ను తీసుకెళ్లేందుకు మీ నాన్న రావడం లేదని తోటి విద్యార్థులు అడుగుతుంటే, సమాధానం చెప్పలేక మా అమ్మాయి చదువు మానేసింది.
– మీనాక్షమ్మ,ఆర్డీటీ హెచ్‌ఐవీ కోఆర్డినేటర్, ఉద్దేహాళ్
తల్లిదండ్రులే మా జీవితాలు బుగ్గి చేశారు
మా తల్లిదండ్రుల అమాయకత్వానికి మా జీవితాలు బలయ్యాయి. మేము ఆడవాళ్లమే. సమాజంలో మాకు గౌరవం ఉండాలని కోరుకుంటాం. అయితే దురాచారాలకు బలైపోయాం. పేరుకు దేవుడి భార్యలమైనా... పిలిచిన వారందరి కోరిక తీర్చాల్సి ఉంటుంది. అలా కలిగిన మా సంతానం అనుభవించే అవమానాలు మాటల్లో చెప్పలేం. మా ఇంట్లోని ఆడపిల్లలకు పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. మగపిల్లలనైతే తూటాల్లాంటి మాటలతో ఈ సమాజం అవమానిస్తుంది. పాఠశాలల్లో చేర్పించే సమయంలో తండ్రి పేరు అడుగుతున్నారు. ఎవరిపేరు చెప్పాలో తెలియడం లేదు. అందుకే బడులకు పంపలేకపోతున్నాం. మావల్ల పిల్లల కూడా దుర్భర జీవితం గడపాల్సిన పరిస్థితి తలెత్తింది.
– లక్ష్మి, దేవదాసి, చెర్లోపల్లి, డి.హీరేహాళ్ మండలం
పిల్లలను చదివించలేకపోతున్నాం
నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి వివాహం చేశాను. మిగిలిన ఇద్దరు పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదు. కాయకష్టం చేసి చదివించాలనుకున్నా..తోటి విద్యార్థులు చులకనగా మాట్లాడుతారేమోనన్న భయం వెంటాడింది. అందుకే అతికష్టమ్మీద పదో తరగతి వరకు మాత్రమే చదివించాను. నా ఇద్దరు పిల్లలు బళ్లారికి కూలీ పనులకు పోతున్నారు. గ్రామాల్లో మమ్మల్ని పిలిచే సమయంలో పేరు ముందు బసివిని చేరుస్తారు. ఏమీ చేయలేని స్థితిలో.. మేము కూడా ఆ పేరుకే అలవాటుపడ్డాం.– బసివి మారెక్క, ఉద్దేహాళ్
ప్రభుత్వం స్పందించాలి
జోగినీ, దేవదాసిల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వయస్సుతో సంబంధం లేకుండా వారికి పిం ఛన్లు ఇవ్వాలి. అలాగే ఇళ్లు..పొలం మంజూరు చేయాలి. అలాగే వారి పిల్లలకు ఉచిత విద్యనందించాలి. ఈ సామాజిక రుగ్మత మార్పుకోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. ఈ వ్యవస్థను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబును కలిసి విన్నవించాం. జోగినీ, దేవదాసీ, మాతంగిల హక్కుల సాధన కోసం ఇటీవల రాయదుర్గం నుంచి పాదయాత్ర నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. సమస్యలన్నీ కలెక్టర్‌కు విన్నవించాం.
– చామలూరు రాజగోపాల్, ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment