'దేవదాసి’ ఆచారం పేరుతో కొన్నిచోట్ల, ఆకలి చంపుకొనే మార్గం కానరాక మరికొన్నిచోట్ల, బలవంతంగా ఇంకొన్నిచోట్ల.. వేశ్యావాటికలకు చేరుతున్న వాళ్లెందరో! ఇలాంటి వాళ్లలో చాల్వాడి భీమవ్వ ఒకరు. కుటుంబం కోసం విధిలేక విషయంలో చిక్కినప్పటికీ ఓ స్వచ్ఛంద సంస్థ చేయూతతో బయటపడి, బలపడిన ఆమె.. ఆ తర్వాత తనలా ఇంకెవరూ ‘దేవదాసి’ బాట పట్టకూడదని చేస్తున్న పోరాటం ప్రశంసనీయమైనది.
దేశానికి పశ్చిమాన, కొంకణ్ తీరంలో ఉండే చిన్న రాష్ట్రం గోవా. అక్కడే ఓ చిన్నపట్టణమైన వాస్కోలోని ఓ మురికివాడలో పుట్టింది భీమవ్వ. ఐదుగురు చెల్లెళ్లు్ల. తండ్రి తాగుబోతు. తల్లి చిత్తుకాగితాలు, గాజు సీసాలు ఏరుకొని, వాటిని అమ్ముతూ కుటుంబాన్ని పోషించేది. బతుకు పోరాటం చాలా కష్టంగా సాగేది. భీమవ్వకు పదిహేనేళ్లు రాగానే ‘దేవదాసి’ దురాచారంలోకి మభ్యపెట్టి దింపింది ఆమె తల్లి. కుటుంబం బతకాలంటే తప్పదని ఒప్పించింది. నాలుగు నెలలు గడిచాయో లేదో ఓ బ్రోకర్ చేతికి చిక్కిన భీమవ్వ వాస్కోలోని బైనా అనే వేశ్యావాటికకు చేరింది. అక్కడ లైంగికంగా చిత్రహింసలకు గురైంది. తప్పించుకోవటానికి రెండు, మూడుసార్లు ప్రయత్నించి పట్టుబడింది. ఒకసారి తల్లే తిరిగి బ్రోకర్లకు అప్పగించింది. చివరికి విధిలేక అక్కడే కొససాగింది. ఆ సమయంలోనే.. అక్కడ తనలాంటి అభాగ్యులు, బలవంతంగా తీసుకు రాబడిన వాళ్లు చాలామంది ఉన్నట్లు గుర్తించింది.
స్వచ్ఛంద సంస్థ చేయూత
దాదాపు రెండేళ్లు గడిచాక 2003లో ఓ రోజు స్థానిక క్రైంబ్రాంచ్ అధికారులు ‘అన్యాయ్ రహిత్ జిందగీ(ఏఆర్‌జడ్)’ స్వచ్ఛంద సంస్థతో కలసి బైనాపై దాడి చేశారు. భీమవ్వతోపాటు చాలామందిని అక్కడి నుంచి బయటపడేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓ కేంద్రంలోకి వీరిని తరలించారు. ఆ కేంద్రం నుంచి భీమవ్వ విడుదలయ్యాక ఆమె బాగోగులు చూసుకునే బాధ్యతను ఏఆర్‌జడ్ సంస్థే తీసుకుంది. తమ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చింది. ఈ క్రమంలో భీమవ్వ ఎంతో మంది మహిళలను కలుసుకొని, వారి గాథలు వింది. తానంటే తప్పించుకుంది. మరి అదే వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్న అమ్మాయిల పరిస్థితేంటీ?’ అని ఆలోచింది. వారికోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే తనలాంటి దేవదాసీలతో కలసి ఓ సంఘం ఏర్పాటు చేసింది. అమ్మాయిల్ని దేవదాసిగా మార్చబోతున్న కుటుంబాలను గుర్తించి, వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా సుమారు 800 మంది బాలికలను వీరు కాపాడింది. అంతేకాదు, వారి ఉపాధికి తగిన మార్గాలనూ చూపింది. వేశ్యావృత్తిలోని వందలాది మందికి విముక్తి కల్పించి, వారికి దారి దివ్వె అయింది.
సీఐఐ అవార్డు
దేవదాసి వ్యవస్థ నుంచి బాలికలను కాపాడడం, మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవడం, వేశ్యావృత్తి నుంచి బయటపడిన వారికి ఉపాధి కల్పించడడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న భీమవ్వను 2019లో సీఐఐ ఉమెన్ ఎగ్జమ్‌ప్లర్ అవార్డు వరించింది. ఈ పురస్కారం తనకెంతో ప్రోత్సాహం ఇచ్చిందంటుందామె. ‘అవార్డు వచ్చిందని తెలియగానే నమ్మలేకపోయా. చాలాసేపటి వరకు ఏడుపు ఆపుకోలేకపోయాను. దాదాపు 200 మంది ఈ అవార్డు బరిలో ఉన్నా నాకు దక్కడమంటే అద్భుతం అనిపిస్తోంది. చదువులేని, వాస్కో పట్టణం తప్ప మిగిలిన ప్రపంచాన్ని చూడని నాకు ఈ అవార్డు దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే భవిష్యత్తులో నా పనిని నేను మరింత బాధ్యతగా నిర్వహించేందుకు ఈ అవార్డు నాకో ప్రోత్సాహం కలిగించింది’ అని దృఢనిశ్చయంతో చెబుతోంది భీమవ్వ.
Comments
Please login to add a commentAdd a comment