స్త్రీని తన లైంగిక బానిస చేసుకోవడానికి పురుషుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బలవంతపు పడుపువృత్తి లేదా ఆచారాల ముసుగులో నిర్బంధ లొంగుబాటు కొనసాగించాడు. దక్షిణభారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఉత్తర భారతదేశంలో తవాయిఫ్‌లు గొప్ప నాట్యకత్తెలుగా సంగీతకారిణిలుగా గుర్తింపు పొందినా వీరి లైంగిక అస్తిత్వం వీరిని సమాజంలో అథమ స్థానానికి నెట్టింది. సినిమా ఈ పాత్రలను తరచూ ప్రస్తావించింది. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా దేవదాసీ వ్యవస్థ దురాచారాన్ని గట్టిగా చర్చించింది. అలాంటి పాత్రలపై ఒక అవలోకన.
‘శ్యాం సింగరాయ్’ సినిమాలో బెంగాల్‌లో 1970 నాటి సాంఘిక దురన్యాయాల మీద తిరగబడతాడు హీరో నాని. ఆ కాలంలో హరిజనులపై అగ్రకులాలు చేసే దుర్మార్గాలను వ్యతిరేకిస్తాడు. అది కొంత వరకు కుటుంబం సహిస్తుంది. కాని ఎప్పుడైతే అతడు ‘దేవదాసి’ వ్యవస్థలో మగ్గుతున్న సాయి పల్లవిని తీసుకుని కోల్‌కతా వెళ్లిపోయి ఆమెకు విముక్తి ప్రసాదించి వివాహం చేసుకుంటాడో ఆ కుటుంబం రగిలిపోతుంది. తమ పరువును బజారున పడేస్తున్నాడని ఏకంగా అతణ్ణి హత్య చేసి శవం మాయం చేస్తుంది.
‘స్త్రీ శరీరానికి’, ‘పాతివ్రత్యానికి’, దాని చుట్టూ ఉండే ‘సామాజిక విలువ’కు ఈ హత్య ఒక తీవ్ర సూచిక. తమ ఇంటి యువకుడు స్త్రీలను పేదరికంలో నుంచి బయటకు తెస్తే ఆమోదం ఉంటుందేమో కాని, తక్కువ కులం నుంచి వివాహం చేసుకుంటే ఆమోదం ఉంటుందేమో కాని, ‘శీల పతనం’లో ఉండే స్త్రీకి గౌరవం తేవడానికి ప్రయత్నిస్తే మాత్రం కుటుంబం కాని, సమాజం కాని సహించదు. పురుషుడి శీల పతనానికి మించి స్త్రీల శీల పతనానికి ఎక్కువ విలువ, తీవ్రత ఆపాదిస్తుంది సమాజం.
నిజానికి పురుషుడు తన స్వార్థం, సుఖం కోసం కల్పించిన వ్యవస్థ ‘దేవదాసీ’ వ్యవస్థ. దేవుణ్ణి అడ్డం పెట్టి పై వర్గాల వారు కింద వర్గాల స్త్రీలను లైంగిక దోపిడికి వాడుకోవడమే ఈ వ్యవస్థ పరమ ఉద్దేశం. పురుషుడు తాను తయారు చేసిన ఈ వ్యవస్థను గౌరవించడు సరి కదా ఈసడిస్తాడు. ఈ వర్గంలో ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉన్న స్త్రీలు కళల్లో తయారైనా వారంతా ఇంటి బయటే ఉండాలి తప్ప ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఈ భావజాలాన్ని భారతీయ/ తెలుగు సినిమా అప్పుడప్పుడు చర్చిస్తూ వచ్చింది. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ కూడా చర్చించింది.
‘ధర్మపత్ని’తో మొదలయ్యి...
1941లో బి.శాంతకుమారి, భానుమతి నటించిన ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ‘దేవదాసీ’ వ్యవస్థ ప్రస్తావన మన సినిమాల్లో వస్తూనే ఉంది. ‘ధర్మపత్ని’లో హీరోయిన్ శాంతకుమారి పెంపుడు తల్లి ఒకప్పుడు దేవదాసి అని తెలియడంతో హీరోకు కష్టాలు మొదలవుతాయి. దేవదాసి పెంచిన కూతురిని కోడలిగా ఆమోదించడం అసాధ్యమని హీరో వివాహానికి ఆటంకం ఏర్పడుతుంది. చివరకు శాంతకుమారి హీరోను పెళ్లి చేసుకోలేకపోతుంది.
‘దేవదాసు’లో ప్రేమ విఫలమైన అక్కినేని దేవదాసి అయిన చంద్రముఖి (లలిత–ట్రావెన్‌కోర్ సిస్టర్స్) పంచన చేరుతాడు. ఆ పాత్ర ఎంత ఉదాత్తంగా ఉన్నా ఆమె స్థాయి ఇలాంటి పతితులకు ఆశ్రయం కల్పించేదే తప్ప ఇల్లాలు అయ్యే స్థాయి మాత్రం కాదు. ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రి అంతటివాడు ‘ఆటపాటలే వృత్తి’గా చేయబడిన కుటుంబం నుంచి వచ్చిన మంజుభార్గవి చేతికి తంబూర ఇస్తేనే సహించలేకపోతుంది పాడులోకం.
మంజుభార్గవి సంగతి సరే ఏకంగా శంకరశాస్త్రినే నిరాకరిస్తుంది. స్త్రీలు మోయాల్సిన పాతివ్రత్యపు బరువు పట్ల దానికుండే పట్టింపు అది. మరి ఆ స్త్రీలను ఆ స్థితికి తెచ్చింది ఎవరు? ‘మేఘ సందేశం’లో ఇంటి ఇల్లాలి నుంచి ఎటువంటి స్ఫూర్తి పొందలేని అక్కినేని కళావంతురాలైన జయప్రదను అభిమానిస్తే ఆరాధిస్తే వారిరువురికి కూడా ఏకాంత వాసమే దక్కుతుంది. స్త్రీలకు తమ శరీరాల మీద, జీవితాల మీద పూర్తి హక్కు లేదని సమాజం పదే పదే చెప్పడం ఇది.
అనార్కలికి దక్కని ప్రేమ...
దక్షణాదిలో దేవదాసీ వ్యవస్థ ఉన్నట్టే ఉత్తరాదిలో తవాయిఫ్‌ల వ్యవస్థ ఉంది. తవాయిఫ్‌లు వినోద నాట్యకత్తెలు. గాయనీమణులు. దర్బారుల్లో ఆడిపాడటం వీరి పని. అంతిమంగా ఎవరో ఒకరి పంచన వీరు చేరక తప్పదు. వైవాహిక జీవితం వీరికి ఉండే అవకాశం లేదు. అందుకే ‘మొఘల్–ఏ–ఆజమ్’లో దిలీప్ కుమార్‌ను ప్రేమించిన మధుబాలకు ఆ ప్రేమ దక్కదు. ఆమెకు ప్రాణాలతో బొందపెట్టే శిక్ష దక్కుతుంది. ఆమె ఏ చిన్న నవాబు కూతురో అయినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు.
తండ్రి ఎవరో తెలియని ఒక వ్యవస్థను తయారు చేసి ఆ పుట్టిన సంతానాన్ని తిరిగి అదే కూపంలో ఉంచే అమానవీయమైన వ్యవస్థ ప్రతిఫలం ఇది. దీనిని స్త్రీలే అనుభవించాలి. పురుషుడు కాదు. ‘గైడ్’ సినిమాలో దేవదాసీ అయిన వహిదా రహెమాన్‌ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాననుకుంటాడు ఆమె భర్త. కాని అతడి లోలోపల ఆమె మీద అనుమానం, చిన్నచూపు. ఆ పెళ్లి నుంచి ఆమె బయటపడి దేవానంద్‌లో ప్రేమ వెతుక్కున్నా ఆ పరుషుడు కూడా అంతే దారుణంగా ఆమెతో వ్యవహరిస్తాడు. చివరకు ఆమె జీవితకాల విరక్తిని పొందుతుంది. ఇక రేఖ చేసిన ‘ఉమ్రావ్‌జాన్’ తవాయిఫ్‌ల జీవన విషాద వీచిక.
ఎన్నో ప్రశ్నలు.. పాత్రలు
మత దురాచారాల వల్ల కాని, కొన్ని సమూహాల వెనుకబాటుతనం వల్ల గాని, సామాజిక దోపిడి వల్ల గాని స్త్రీలు లైంగిక వ్యాపారాల్లో చిక్కుకుంటే ఆ స్త్రీలు తిరిగి గౌరవం పొందడానికి యుగాల కొలదీ పోరాటం చేయవలసి వస్తోంది. వారికి ఉండవలసిన సమాన హక్కుల గురించి, సమాన మర్యాద గురించి మారవలసిన భావజాల దృష్టి చాలా ఉంది. ‘పవిత్రత’, ‘శీలం’ అనే మాటలకు సర్వకాల సర్వావస్థల్లో ఒకే ప్రమాణం ఉండదని, స్థలకాలాలను బట్టి వాటికి అర్థాన్ని ఆపాదించాల్సిన పద్ధతి మారుతుండాలని, ముఖ్యంగా ఇవి స్త్రీలు మాత్రమే మోయాల్సిన పదాలు కావని పురుషులు కూడా సమాన హక్కుదారులే అని మళ్లీ మళ్లీ చర్చించాల్సిన సినిమాలు పాత్రలు రావాలి. ఇకపై అదే జరుగుతుందని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment