తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్‌కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్‌లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...
మొక్కే కదా అని...
‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు.
వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్‌లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం.
సైకిల్ చైన్‌తో...
నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ.
అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ.
మమ్మమ్మాస్
‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్‌కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్‌లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్.
తిక్క చూపిస్తా...
‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.
ధూల్‌పేట్ ఈశ్వర్
ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్‌గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్‌ను చూపించారు.
కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
లవర్ బాయ్ డార్లింగ్
ప్రభాస్ లోని లవర్ బాయ్‌ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్‌డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్.
మళ్లీ కొలవెరి
ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్‌గా నిలిచింది. రామ్‌గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్‌ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.
తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్.
Comments
Please login to add a commentAdd a comment