ప్రేమకు సేవాభిషేకం
అధరాలు, కొన్ని మధురాలు. ఇవే కదా ప్రేమలేఖల్లో ఉంటాయి!
అంతే తప్ప... ‘మనవల్ల పదిమంది సంతోషంగా ఉంటే
అంతకు మించిన ఆస్తి లేదు’ అని ఏ ప్రేమలేఖలోనైనా ఉంటుందా?
ప్రేమికులకసలు ప్రపంచం అనేది పడుతుందా?
అందులోని బతుకు సమస్యలు, మెతుకు సమస్యలు పడతాయా?
పట్టవు నిజమే కానీ,
బాలథెరీసా దంపతుల ప్రేమకథలో, వారి ప్రేమలేఖల్లో, ఆఖరికి వారి పెళ్లిపుస్తకంలో కూడా సామాజిక సేవే ‘సినాప్సిస్’!
సేవ అంటే అదేదో ఛారిటీ అని కాదు, బాధ్యతను కూడా గుర్తుచేసేది.
సేవ అంటే ఏ ఒక్క వర్గానికో చెందినది కాదు, అన్నిటికీ అతీతమైనది!
కెనడా అబ్బాయి ఆండ్రీ... థెరీసాతో పాటు ఆమె ఊరిని,
ఊరి సమస్యల్ని, ఊరి వెనుకబాటుతనాన్నీ ప్రేమించాడు.
వరంగల్ అమ్మాయి థెరీసా... ఆండ్రీతో పాటు అతడిలో ఉన్న
సేవాభావాన్ని, సామాజిక స్పృహనీ, ఔదార్యాన్ని ఇష్టపడింది.
ఇద్దరూ కలిసి ఇప్పుడు... రాష్ట్రంలో నీళ్లు, బళ్లు లేని ఊళ్లకు...
వికలాంగులకు, వితంతువులకు, మహిళలకు, చిన్నారులకు...
అభాగ్యులకు, అసహాయులకు తమ ప్రేమను పంచుతూ వెళ్తున్నారు...
ఆ విశేషాలే ఈ వారం ‘జనహితం’.
విదేశాలకు ఎందుకు వెళతారు? పెద్ద చదువులు చదువుకోవడానికి. బాగా డబ్బు సంపాదించడానికి... ఇంకా అంటే గొప్ప పేరు తెచ్చుకోవడానికి. వెళ్లింది ఆడపిల్లయితే... మన దేశంలోనైనా, విదేశంలోనైనా అత్తారిల్లు చక్కదిద్దుకోడానికే సరిపోతుంది. తనవాళ్ల కోసం ఆలోచించడానికి తీరిక, అవకాశం రెండూ ఉండవు. కాని సింగారెడ్డి బాలథెరీసా మాత్రం విదేశీ అబ్బాయితో తాళి కట్టించుకున్నా... తన దేశం, తన రాష్ట్రం, తన ఊరు... అంటూ పుట్టిల్లు బాగు కోరింది. క్షేమం కోరుకోవడం వరకూ ప్రతి ఆడపిల్లా చేస్తుంది... కాని చేతల్లో చూపించడం వరకూ వస్తే... ఎవరైనా బాలథెరీసా తర్వాతే అని గర్వంగా చెప్పుకునేలా ‘బాల వికాస్’ పేరుతో సేవాకార్యక్రమాల్ని నిర్వహి స్తున్నారు. వరంగల్ జిల్లాలోని తన సొంతూరు రెడ్డిపాలెం నుంచి మొదలైన బాలథెరీసా పల్లె అభివృద్ధి ఉద్యమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఈ క్రమంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా కీసరమండలం రాంపల్లి దాయర గ్రామంలో బాలవికాస్ శాఖ నిర్మాణం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన బాలథెరీసా, ఆండ్రీలు తమ మనోభావా లను ‘సాక్షి’తో పంచుకున్నారు.
నలభై ఏళ్లక్రితం బాలథెరీసా కెనడా వెళ్లి అక్కడి అబ్బాయిని పెళ్లిచేసుకుని స్థిరపడిపోయారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రెడ్డిపాలెం చాలా చిన్నగ్రామం. తండ్రి సింగారెడ్డి చిన్నపురెడ్డికి బిడ్డల్ని పై చదువులు చదివించడం తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. బాలథెరీసా రెండో అమ్మాయి. పదో తరగతి వరకూ ఊళ్లోనే చదువుకుని పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చి హిందీ పండిట్ కోర్సు చేసింది. స్కాలర్‌షిప్‌తో అమెరికాలో వెళ్లే అవకాశం రావడంతో తల్లిదండ్రుల్ని ఒప్పించి విమానం ఎక్కింది.
రెడ్డిపాలెం అమ్మాయి అమెరికా వెళ్లిందని తెలియగానే చుట్టుపక్కల ఊళ్లలోని ఆడపిల్లలకు కూడా చదువు మీద శ్రద్ధ పెరిగింది. నిజమే...మనం మాట్లాడుతున్నది నలభైఏళ్ల కిందట విషయం. చిన్నపురెడ్డి తన పంటకు వాడే విత్తనాలే కాదు...సమాజానికి అందించే బిడ్డలు కూడా నాణ్యంగా ఉండాలని ఆశించాడు. ఆయన కోరుకున్నట్టే బాలథెరీసా అమెరికాలో చదువు ముగించుకుని ‘సైకలాజికల్ హ్యూమన్ రిలేషన్‌షిప్’ అనే అంశంపై ఫిలిప్పీన్స్‌లో ఓ ఏడాదిపాటు శిక్షణ తీసుకుంది. అక్కడికి 35 దేశాల నుంచి వచ్చిన వందమందిలో బాలథెరీసా ఒకరు. మరొకరు కెనడా నుంచి వచ్చిన ఆండ్రీ జింగ్రాస్. వీరిలో ఉన్న సేవాభావం స్నేహితులుగా మార్చింది. బాలథెరిసా ఇండియాకి తిరుగుముఖం పట్టేనాటికి అది ప్రేమగా మారింది. తర్వాత బాలథెరీసా, ఆండ్రీ పెళ్లిచేసుకుని కెనడాలో స్థిరపడిపోయారు.
కెనడాలోనే ఆలోచన...
‘‘నువ్వు ఇండియా నుంచి వచ్చేటప్పుడు చిల్లిగవ్వ కూడా తెచ్చుకోవద్దు. నేను కూడా నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. ఇద్దరం కష్టపడి బతుకుదాం. మరో పదిమందిని బతికిద్దాం. అలా అంగీకారమైతేనే... విమానమెక్కు.’’ ఆండ్రీ రాసిన చివరిలేఖ సారాంశం. ఆ మాటలు బాలథెరీసాకే కాదు రెడ్డిపాలెం ప్రజలందరికీ నచ్చాయి. కుర్రాడు గట్టివాడే కాదు... గొప్పవాడు కూడా అన్నారందరూ. కెనడాలో బాలథెరీసా, ఆండ్రీ పెళ్లి చాలా సింపుల్‌గా జరిగిపోయింది. ఆండ్రీకి ‘కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఎజెన్సీ’లో ఉద్యోగం వచ్చింది. బాలథెరీసా కూడా ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసుకుంటూ తన దేశానికి ఏం చేయగలదో ఆలోచించింది. పేద దేశాల అభివృద్ధి కోసం తమవంతు సాయం చేసే కెనడా వారి సాయం తన దేశానికి అందాలని కోరుకుంది. ముందు రెడ్డిపాలెంతో మొదలుపెట్టింది.
ఓ పదేళ్లపాటు...
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కొందరు కెనడియన్ల సాయంతో రెడ్డిపాలెంలో ముందుగా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రైవేటు స్కూలు నిర్మాణం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిసి అక్కడ కూడా మంచినీరు, విద్యకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసింది. ‘‘నాకేమో పెళ్లయిన కొత్త. అత్తిల్లు...అక్కడి సంప్రదాయాలు అలవాటు పడడానికే ఏడాది పట్టింది. అయినా మనసంతా మా ఊరిపైనే ఉండేది. రెడ్డిపాలెంలో మంచినీరు, విద్య సౌకర్యాలు ఏర్పాటు చేశాక... ప్రపంచాన్ని జయించినంత సంతోషం వేసింది.
నా భర్త నా కళ్లలోని ఆనందాన్ని చూసి... ఆయన రాసిన చివరిలేఖని మరొకసారి గుర్తుచేశారు. మనవల్ల పదిమంది సంతోషంగా ఉండడానికి మించిన ఆస్తి ఏదీ లేదన్నారు. కెనడా ప్రభుత్వ సాయాన్ని కూడా దగ్గరుండి నాకు అందించారు. అలా పదేళ్లు గడిచాక వరంగల్ జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి ఒక సంస్థని ఏర్పాటు చేయాలనుకున్నాం. 1977లో ‘బాలవికాస్’ పేరుతో బాలథెరీసా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించాం’’ అంటూ స్వచ్ఛమైన వరంగల్ యాసలో వివరంగా చెప్పారు బాలథెరీసా. ఇంతలో ఆండ్రీ మాట కలుపుతూ...ఇండియా చాలా మంచి దేశం. నేను నా ఉద్యోగంలో భాగంగా ఢిల్లీ వస్తుండేవాడిని. మొదటిసారి నా భార్యతో రెడ్డిపాలెం వెళ్లినపుడు ఆ ఊరివాళ్లంతా నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఎన్నో మర్యాదలు చేశారు. ఐ లవ్ దెమ్’’ అంటూ తన అత్తింటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారాయన.
నీరు... నారు
సమగ్ర గ్రామాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్న బాలవికాస్ ఇంతింతై వటుడింతయై అన్నట్టు వరంగల్ జిల్లాలోని గ్రామాలతో పాటు రాష్ర్టంలో 4500 గ్రామాల్లో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది. దీనికోసం 6000 బోర్లు వేసి 500 మంచినీటి ట్యాంకుల నిర్మాణం కూడా చేసింది. గ్రౌండ్ లెవల్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి కూడా వెనకాడకుండా ఇళ్లకు మంచినీటిని అందించింది. వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటివరకూ రాష్ర్ట వ్యాప్తంగా 530 ప్రాజెక్టులు చేపట్టింది. దీనివల్ల 11 లక్షలమందికి మంచినీరు అందుతోంది. గ్రామంలోని ప్రజల ఆరోగ్యాల్ని దృష్టిలో పెట్టుకుని నీటిసౌకర్యం, రైతుల సంక్షేమం కోసం సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ, ఎరువులు, పెట్టుబడులు, మార్కెటింగ్ అంటూ అన్నింటా రైతుకు రక్షణ కవచంలా మారింది బాలవికాస్.
విద్య... వికాసం
మారుమూల గ్రామాల్లో బడులున్నా... చదువుకునే పిల్లలుండరు. కారణాలు...బోలెడు. వరంగల్ జిల్లాలో 225 పాఠశాలలు బాలవికాస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు అన్నిరకాల సౌకర్యాలతో దాదాపు 8 వేల మంది విద్యార్థులు ఉచితంగా విద్యనందుకుంటున్నారు. ఇందులో భాగంగానే 400 మంది వికలాంగుల్ని చేరదీసి విద్య చెప్పిస్తోంది. ఈ మధ్యనే మొదలుపెట్టిన వితంతు సంక్షేమం కార్యక్రమంలో భాగంగా వెయ్యిమంది వితంతువుల పిల్లలకు కూడా బాలవికాస్ ఉచితవిద్య అందిస్తోంది. ముప్పైఏళ్ల వయసుకే వితంతువులైన మహిళలు వేలల్లో ఉన్నారు. సమాజం దృష్టిలో వారు సమానం కాదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో వారిని తలుపుల చాటునే నిలబెడుతున్నారు. మూడునెలల క్రితం వరంగల్‌లో బాలవికాస్ ఏర్పాటే చేసిన వితంతువుల సభకు ఆరు వేలమంది వితంతువులు హాజరయ్యారు.
విద్యతో పాటు గ్రామాల్లోని మహిళ సంక్షేమం కూడా ముఖ్యమని... వారిలో చైతన్యం తీసుకొచ్చే రకరకాల పథకాలు తయారుచేసింది. పొదుపు, సహకారం, వ్యాపారం, చైతన్యం... అంటూ ఇళ్లలోని మహిళల్ని బయటికి తీసుకొచ్చి వెలుగుని చూపించే పనిలో బాలవికాస్ విజయం సాధించింది. దీని గురించి ఆ సంస్థ ఎగ్జిగ్యూటివ్ డెరైక్టర్ ఎస్. శౌరీరెడ్డి చెబుతూ... ‘‘ఇప్పటివరకూ బాలవికాస్‌లో రాష్ర్టవ్యాప్తంగా 1500 గ్రామాల్లో రెండు లక్షలమంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారు వారి గ్రామాల్లోని మిగతా మహిళల సంక్షేమం కోసం బాలవికాస్ తరపున పనిచేస్తారన్నమాట. విద్య, ఉపాధి, పొదుపు, వ్యాపారం... అన్నింటా వారికి తోడుగా ఉండి మా సంస్థ ద్వారా వారికి సాయం చేస్తుంటారు. సాయమంటే ఆర్థికసాయమొక్కటే కాదు... అభివృద్ధివైపు వారిని చెయ్యిపట్టుకుని నడిపించడం. అదే మా సంస్థ ప్రత్యేకత కూడా. మంచినీటి ట్యాంకులు మొదలు... మరుగుదొడ్లు వరకూ గ్రామస్థులే దగ్గరుండి వాటిని పరిరక్షించుకోవాలి. దానికి తగ్గ శిక్షణ, పర్యవేక్షణ మా సంస్థ సిబ్బంది చూసుకుంటారు’’ అని చెప్పారాయన.
500 ఎన్జీవోలకు శిక్షణ...
సాయం చెయ్యడం కంటే... సాయపడ్డవాడితో మరొకడికి సాయం చేయించడం గొప్ప పని. బాలవికాస్ ధనవంతుడితో పేదవాడికి, పేదవాడితో నిరుపేదకు సాయం చేయిస్తుంది. అలా చేసే... పేద మహిళల నుంచి ఈ ఏడాది 40 లక్షల రూపాయలు సేకరించింది. అలా సేకరించిన డబ్బుతో వందలమంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది బాలవికాస్.
వెయ్యిమందివృద్ధులకు తిండిపదార్థాలు, మోడ్రన్ విలేజ్‌ల నిర్మాణాల కోసం యువకులకు శిక్షణ, వితంతువు పిల్లలకు కౌన్సెలింగ్... అంటూ గ్రామాభివృద్ధి కోసం బాలవికాస్ ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. మూడు దశాబ్దాలుగా బాలవికాస్ సేవలు దేశవ్యాప్తంగా గుర్తుంపు తెచ్చుకున్నాయి. బాలథెరీసా, ఆండ్రీ జింగ్రాస్‌లు పట్టుదలతో సాధించిన విజయం వెనకున్న రహస్యం తెలుసుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వందల స్వచ్ఛంద సంస్థలు వరంగల్ చేరుకుని బాలవికాస్ దగ్గర శిక్షణ పొందుతున్నాయి. విజయం వరించడం ఒకెత్తు... కొనసాగించడం మరొకెత్తు... వేళ్లూనుకుంటూ విస్తరించడం బాలవికాస్ సొత్తు. పేదరికాన్ని పారదోలడంలో పేదల్ని ఎలా మమేకం చేయాలి? అనే అంశంపై ఎల్లలు దాటి వచ్చిన 500 ఎన్జీవోలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోన్న బాలవికాస్‌కి సలాం చెబుదాం.
- భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫిలిప్పీన్‌సలో శిక్షణకు 35 దేశాల నుంచి వెళ్లిన వందమందిలో బాలథెరీసా ఒకరు. మరొకరు కెనడా నుంచి వచ్చిన ఆండ్రీ జింగ్రాస్. వీరిలో ఉన్న సేవాభావం వీరిని స్నేహితులుగా మార్చింది. బాలథెరీసా ఇండియాకి తిరుగుముఖం పట్టేనాటికి అది ప్రేమగా చిగురు తొడిగింది. కోర్సు పూర్తవ్వగానే బాలథెరీసా తిరిగి రెడ్డిపాలానికి వచ్చేసింది. ఏడాదిపాటు ఆండ్రీ బాలథెరీసాకి రాసిన ప్రేమలేఖలు ఇంట్లోవాళ్లతోనే కాదు, ఊరందరితో కూడా పెళ్లికి ఒప్పించాయి. ఒకటా రెండా...రోజుకో లేఖ! తెలుగమ్మాయి మెడలో ఆ కెనడా అబ్బాయి తాళి కట్టేవరకూ ఆ లేఖలు ఆగలేదు. ప్రస్తుతం వీరి కుటుంబం (ఇద్దరు కొడుకులు, కూతురు) కెనడాలోనే ఉంటోంది. మన రాష్ట్రానికి సేవలు అందిస్తోంది.