పరుగులు నిలబెట్టాయి | Sixty-six-year-old granny runs 'marathon' in a saree in Maharashtra | Sakshi
Sakshi News home page

పరుగులు నిలబెట్టాయి

Published Fri, Jan 3 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

Sixty-six-year-old granny runs 'marathon' in a saree in Maharashtra

 లత. పుణె. వయసు అరవై పైనే!
 సుధ... హైదరాబాద్.
 వయసు?  
 వయసిక్కడ పాయింట్ కాదు.
 సుధ యాక్సిడెంట్ అయిన మనిషి.
 వెన్నుపూసలకు గాయాలు!
 కాలి చీలమండల్లో రాడ్లు!
 లత ఎవరో, సుధ ఎవరో.
 కామన్ పాయింట్ మాత్రం ‘పరుగులు’.
 మామూలు పరుగులు కావు.
 జీవితం పెట్టించిన పరుగులు.
 భర్త ప్రాణాలు దక్కించుకోడానికి లత...
 అరైవె  ఏళ్ల మహిళలిచ్చిన స్ఫూర్తితో సుధ...
 ‘మారథాన్’ బరుల్లోకి దిగారు.
 విజేతలుగా నిలబడ్డారు.

 
 ‘ఐదునెలల దాకా మంచం దిగకూడదు. నడవడానికి ఏడాది పైనే పడుతుంది. ఆ తర్వాత కూడా బరువులు ఎత్తకూడదు. పరుగెత్తకూడదు’ డాక్టర్లు చెప్పిన మాటలు చెవిలో పడగానే మరోసారి రెండంతస్తుల మేడ మీద నుంచి కిందకి పడిపోయినట్లు అనిపించింది సుధకు. మామూలు మనిషి అవ్వడం గగనం అంటున్న డాక్టర్ మాటల్ని లెక్కచేయకుండా ఆమె సాధించిన విజయాల్ని చూస్తుంటే మనిషికి మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదనిపిస్తుంది. గత పదిహేనేళ్ల సుధ జీవితంలోకి చూస్తే ప్రమాదాలకు భయపడాల్సిన పని లేదనిపిస్తుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
 
‘‘మా స్నేహితురాలు కొనుక్కున్న ఫ్లాట్ చూడ్డానికి నేను, నా భర్త చంద్రశేఖర్ వెంగళరావునగర్ వెళ్లాం. నిర్మాణం ఇంకా పూర్తవ్వలేదు. రెండోఅంతస్తు దాకా ఎక్కి, వెనక్కి తిరిగి చూస్తూ కింది మెట్టు మీదకు అడుగేశాను. మెట్లకు రెయిలింగ్ లేకపోవడం వల్ల కిందకు పడిపోయాను. రెండురోజులదాకా స్పృహ లేదు. తెలివి వచ్చాక డాక్టర్లు చెప్పిన మాటలు వింటే మళ్లీ నిద్ర పట్టలేదు. కానీ ధైర్యం కూడగట్టుకున్నాను. ఐదు నెలలు గడిచాక మెల్లగా నడవడం మొదలుపెట్టాను. వెన్ను చివర (ఎల్2, ఎల్2, ఎల్3, ఎల్5 డిస్క్‌లు) వీపుమీద చెయ్యిపెట్టి తడుముతుంటే బయటికి వచ్చినట్టు తగిలాయి. కాలు చీలమండ దగ్గర రాడ్స్ వేశారు. జాగ్రత్తగా ఉండాలన్నారు డాక్టర్లు. మరోపక్క అధికంగా బరువు పెరిగా. గాయాల సంగతి పక్కన పెట్టి బరువు తగ్గించుకోవాలనుకుని వాకింగ్ మొదలుపెట్టాను. క్రమంగా బరువు తగ్గాను. అయినా వాకింగ్ మానలేదు. అదే నా కొత్తజీవితానికి పునాది వేసింది.
 
స్వచ్ఛంద సేవకు వెళ్లి...
 
నాకు ప్రమాదం జరిగిన తర్వాత మేం దక్షిణాఫ్రికా వెళ్లి తొమ్మిదేళ్లు ఉండి వచ్చాం. అక్కడ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2009లో హైదరాబాద్ వచ్చేశాక, వాకింగ్‌పై దృష్టి పెట్టాను. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ సలహాతో హైదరాబాద్ రన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మారథాన్ పోటీలు చూడ్డానికి వెళ్లా. ఆ మారథాన్‌లో యాభై అరవై ఏళ్ల వయసున్న మహిళల్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇంతలో ఎయిర్‌టెల్‌వారు మారథాన్ నిర్వహిస్తున్నారని తెలిసి అందులో పాల్గొన్నాను. ఆఫ్ మారథాన్ అంటే ఇరవై ఒకటిన్నర కిలోమీటర్లు రెండున్నర గంటల్లో పరిగెట్టాను. మధ్యలో నాలుగైదుసార్లు వెన్ను నొప్పి వచ్చింది. కాలు కూడా నొప్పి పెట్టింది. రెండు నిమిషాలు పరుగు ఆపి నడకలోకి వచ్చి మళ్లీ మొదలెట్టి మెడల్ సంపాదించాను. ఇది జరిగింది 2011లో. ఆ తర్వాత మరో మారథాన్‌లో కూడా పాల్గొన్నాను. మారథాన్ వల్ల నా ఒంట్లో గాయాలు ఎక్కువవుతాయని డాక్టర్లు చెబుతుంటే...నేను మాత్రం ఆ గాయాలకు అదే మందని నమ్మాను.
 
పద్దెనిమెది మెడల్స్‌తో...
 
మారథాన్‌కంటే ముందు హైదరాబాద్ రన్నర్ క్లబ్‌లో సభ్యురాలిగా చేరాను. దాంతో దేశంలో ఎక్కడెక్కడ మారథాన్‌లు జరుగుతున్నాయో సభ్యుల ద్వారా తెలిసేది. అప్పుడప్పుడు వారితో కలిసి ఎక్కడ మారథాన్ ఉంటే అక్కడికి వెళ్లేదాన్ని. ఆ తర్వాత దేశంలో ఎక్కడెక్కడ మారథాన్ పోటీలు జరుగుతున్నాయో తెలుసుకుని ఒంటరిగా వెళ్లడం కూడా మొదలుపెట్టాను. పునె, భువనేశ్వర్, సతార, పాండిచ్చేరి, హిమాలయ, చెన్నై, గోవా, తంజావూర్, కోయంబత్తూర్...ఇలా అన్ని ప్రాంతాల్లో నిర్వహించిన మారథాన్‌లో పాల్గొని 18 మెడల్స్ మెడలో వేయించుకున్నాను.  
 
ఇల్లు... వాకిలి
 
గత ఏడాది పన్నెండు మారథాన్‌లలో పాల్గొన్నాను. నా భర్త, నా పిల్లలు నా గెలుపుని బాగా ఎంజాయ్ చేస్తారు. మా పెద్దమ్మాయి స్నిగ్ద కరాటే బ్లాక్ బెల్టర్. చిన్నమ్మాయి సమీర మూడోతరగతి చదువుతోంది. మారథాన్ నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం నా కొత్త లక్ష్యం సైక్లింగ్. అందులో కూడా ఊహించని విజయాలు చూడాలన్నది నా కోరిక. ఒక పక్క గాయాలు నన్ను వేధిస్తున్నా...వాటిని అధిగమించడానికి వైద్యుల సలహాలకంటే ఈ పరుగుపందాలే ఎక్కువ ఉపశమనం ఇస్తున్నాయి.

ఈ పదిహేనేళ్లలో జీవితం నాకు నేర్పింది పడడం, లేవడం ఒక్కటే కాదు. గాయాన్ని లెక్కచేయకపోవడం. అది మనసుకైనా, శరీరానికైనా. మరో ముఖ్యమైన విషయం మహిళ జీవితంలో తనకంటూ కొంత చోటు ఏర్పాటుచేసుకోవాలి. అందులో తల్లితండ్రులు, పిల్లలు, భర్త, సమాజం... అంటూ ఏమీ ఉండకూడదు. అందులో జీవిత లక్ష్యాలు, ఇష్టాలు, అవసరాలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. రోజులో ఒక పది నిమిషాలు అలా ఉండగలిగినా ఆమెలోని శక్తి పూర్తిస్థాయిలో బయటికొస్తుంది’’ అని ముగించారు సుధ. కష్టాల్లోనూ కుంగిపోక ధైర్యంగా ముందడుగు వేసిన ఆమె అడుగుల వేగం ఇంకా పెరగాలని కోరుకుందాం.
 
- భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి; ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్
 
 ఒకసారి ఏమైందంటే...
 హిమాలయాలకు వెళ్లినపుడు అనుకోకుండా ఒక కొండదగ్గర దారి తప్పాను. వారిని వెతికే ప్రయత్నంలో కాలు జారి లోయలో పడిపోయాను. నా ఫోన్ సిగ్నల్ సరిగా లేదక్కడ. ఎంత అరిచినా ఎవరూ రావడం లేదు. నా గ్రూప్‌వారంతా నాకోసం వెతుకుతున్నారు. ఇంతలో సిగ్నల్ దొరికింది. నా తోటివారికి ఫోన్‌చేశాను. వాళ్లొచ్చి నన్ను పైకి తీసుకొచ్చారు. ఆ దెబ్బతో మారథాన్‌కి బ్రేక్ పడుతుందనుకున్నారంతా. నేను మాత్రం థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాను. మారథానక్ ఆపలేదు సరికదా, ఈ మధ్యనే సైక్లింగ్ కూడా చేయాలనిపించి ప్రాక్టీస్ మొదలెట్టాను. రోజూ ఉదయం ఎనిమిది కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నాను.


                     ***************


కూలినాలి చేసుకునే ఆమెకు మారథాన్ అంటే ఏమిటో కూడా తెలియదు. భర్త ఆరోగ్య పరీక్షలకు కావలసిన ఖర్చులే కళ్లముందున్నాయి. పరుగెత్తగలనన్న ధైర్యమే పోటీలో పాల్గొనేలా చేసింది. అడుగులు  వడివడిగా పడేలా చూసింది. భర్తపై ఉన్న అనురాగమే అరవై ఏళ్ల ఆమెను మారథాన్‌లో గెలిపించింది. ఆమే పుణేకు చెందిన లతా కారే.
 
 ఓ పరుగు ఆమె జీవితాన్ని మార్చింది. కట్టుకున్న భర్త కోసం మారథాన్‌లో తీసిన పరుగు, ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె సాహసం మహిళలకు ఆదర్శంగా నిలబెట్టేలా చేసింది. భర్త మీద ఉన్న అనురాగం, ఆరు పదులు దాటిన వయసులో పరుగెత్తేలా చేసింది. మారథాన్ అంటేనే తెలియని ‘లతా కారే’ పుణే జిల్లా బారామతిలో జరిగిన మూడు కిలోమీటర్ల మారథాన్‌లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
 
భర్తకు వైద్యపరీక్షలు చేయించేందుకు 5000 రూపాయల కోసం పరుగెత్తిన ఆమెను ఆదుకునేందుకు అనేక ఆపన్నహస్తాలు ముందుకువ చ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో స్థానిక పాత్రికేయులు ఆమె పేరుపై బ్యాంకు అకౌంట్ ప్రారంభించారు. వారం తిరగకుండానే మూడు లక్షల రూపాయలకు పైగా ఆమె ఖాతాలో జమయ్యింది. ఇంకా జమ అవుతూనే ఉంది.
 
బుల్డానా నుంచి దాంపత్య జీవనం ప్రారంభం...
 
వాషీంజిల్లాకి చెందిన లతాకు భగవాన్‌తో వివాహం జరిగింది. ప్రభుత్వం అందించే ఉపాధి హామీ పథకం పనులతో సహా ఏ పని లభిస్తే ఆ పనిచేస్తూ వీరు జీవితం గడపసాగారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిల్లలకు చదువు చెప్పించాలనుకున్నారు. కాని వచ్చే కూలి డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ... ఎలాగైతేనేం... పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఆ తర్వాత పనులు దొరకడం కష్టమైంది.
 
బారామతికి...
 
బారామతిలో పని లభిస్తుందని తెలిసి, నాలుగేళ్ల కిందటే పొట్ట చేత పట్టుకుని అక్కడికి మకాం మార్చారు. కుటుంబమంతా కూలి చేస్తున్నప్పటికీ వీరి సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోయేదికాదు. ఇంతలో లతాభర్త భగవాన్‌కు గుండెపోటు వచ్చింది. వైద్యులు ఆమె భర్తకు ఎంఆర్‌ఐ తదితర పరీక్షలు చేయాలని, ఇందుకోసం మూడు వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆమెకు ఏమి చేయాలో అర్థం కాలేదు.
 
ఆదర్శంగా నిలబడింది...
 
పుట్టెడు కష్టంలో ఉన్న లతాకు... శరద్‌పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సిటిజన్ల కోసం 2013 డిసెంబరు 16న ‘శరద్ మారథాన్’ పేరుతో, బారామతిలో 3 కిలోమీటర్ల పరుగుపందెం ఏర్పాటుచేశారని, తాము కూడా ఆ పోటీలో పాల్గొంటున్నామని ఇరుగుపొరుగు వారు చెప్పారు. దీంతో పరుగుపందెంలో పాల్గొంటే 5000 రూపాయలు గెలవచ్చన్న ఆశ కలిగింది.
 
ప్రేమ, పట్టుదలలే గెలిపించాయి...
 
కూలినాలి చేసుకునే ఆమెకు, మారథాన్ అంటే ఏమిటో కూడా తెలియకపోయినా, పరుగెత్తగలనన్న ధైర్యమే పోటీలో పాల్గొనేలా చేసింది. కాని కుటుంబసభ్యులు ‘ఈ వయసులో పరుగెత్తడం ఏమిటి’ అని వారించారు. మారథాన్ మరో రెండురోజుల్లో ఉందనగా ఆమెకు జ్వరం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ వెళ్లవద్దని ఆమెపై ఒత్తిడి పెంచడంతో, సరే అంది. ఆ రాత్రికి ఊరుకుని, మరుసటి రోజు ఉదయం, జ్వరానికి మాత్రలు తెచ్చుకుంటానని చెప్పి, సరాసరి మారథాన్ జరిగే స్థలానికి వె ళ్లింది. మారథాన్‌లో అందరూ ఒక్కసారిగా పరుగు ప్రారంభించారు. లతా కూడా పరుగు తీయడం ప్రారంభించింది. కాళ్లకు చెప్పులు లేకుండా తొమ్మిది గజాల చీరతో మారథాన్ రేసులో పరుగెత్తుతున్న ఆమెను అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు.

ఇవేవీ పట్టించుకోకుండా తన భర్త వైద్యపరీక్షలను తలుచుకుంటూ నెత్తిపై కొంగుకప్పుకుని ఎలాగైనా ఈ రేసులో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లసాగింది. అంతలోనే ‘మారథాన్ విజేత లతా కారే’ అనే ప్రకటన వెలువడింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. భర్త వైద్య పరీక్షల కోసం మారథాన్‌లో పాల్గొని, విజేతగా నిలవడంతో మీడియాతోపాటు ప్రజలు కూడా ఆమెను అభినందనలతో ముంచెత్తారు. నిర్వాహకులు ఐదు వేల రూపాయల నగదును బహుమతిగా ఆమెకు అందించారు.
 
- గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంైబె
 
 మారిన జీవన శైలి...
 మారథాన్ రేసు లతాకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. స్థానికంగా ఉన్న ప్రదీప్ గురవ్ (దివ్య మరాఠి), జితేంద్ర జాదవ్ (ఐబిఎన్ లోకమత్) అనే ఇద్దరు పాత్రికేయులతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బారామతి శాఖ అధికారి కులకర్ణి సహకారంతో ఆమె పేరుపై అకౌంట్ ప్రారంభించారు. దీంతో అనేక ఆపన్న హస్తాలు ముందుకు వచ్చాయి. వారం తిరగకుండానే సుమారు మూడువందల మందికిపైగా సుమారు రూ. మూడు లక్షల వరకు జమ చేశారు. తనకు, తన కుటుంబానికి సహకారం అందించి ఆదుకున్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement