యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? మనం మామిడి చెట్టును చూస్తాం, జామచెట్టును చూసి ఉంటాం. కానీ యాపిల్ చెట్టుతో మనకు పరిచయం ఉండదు. యాపిల్ కోసం సిమ్లాకే కాదు... కల్పాకు కూడా వెళ్లవచ్చు. అందుకే ఓసారి హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కల్పా’ బాట పడదాం. మన పక్కనే ఉన్నట్లుండే హిమాలయాలను చూస్తూ విస్తారమైన యాపిల్ తోటల్లో విహరిద్దాం.
‘రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్‌ను చూడాల్సిన అవసరమే ఉండదు’ అని యాపిల్‌లో ఉండే ఆరోగ్య లక్షణాలను ఒక్కమాటలో చెప్తుంటాం. కల్పా గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తారు. అస్సాం టీ తోటల్లో మహిళలు వీపుకు బుట్టలు కట్టుకుని ఆకు కోస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదలుతాయి. యాపిల్ తోటల్లో అమ్మాయిలు బుట్టను చెట్టు కొమ్మల మధ్య పెట్టి యాపిల్ కాయలు కోస్తుంటారు.
కిన్నౌర్ కైలాస్ పర్వత శ్రేణుల దగ్గర విస్తరించిన గ్రామం కల్పా. యాపిల్ పండుని చెట్టు నుంచి కోసుకుని తింటూ రంగులు మార్చే హిమాలయాలను చూడడం ఈ ట్రిప్‌లోనే సాధ్యమయ్యే అనుభూతి. తెల్లటి మంచు పర్వత శిఖరాల్లో కొన్ని ఉదయం ఎర్రగా కనిపిస్తాయి. మధ్యాహ్నానికి ఆ శిఖరం తెల్లగానూ మరో శిఖరం ఎరుపురంగులోకి మారుతుంది. సూర్యుడి కిరణాలు పడిన పర్వత శిఖరం ఎర్రగా మెరుస్తుంటుంది.
సాయంత్రానికి అన్నీ తెల్లగా మంచుముత్యాల్లా ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రకృతి ఇంతే సౌందర్యంగా ఉంటుంది. మంచుకొండలు చేసే మాయాజాలాన్ని చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. గోరువెచ్చని వాతావరణంలో విహరించాలంటే మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లాలి. కల్పా చాలా చిన్న గ్రామం. సిమ్లా టూర్‌లో భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత చిన్న కల్పా గ్రామంలో ప్రాచీన దేవాలయాలున్నాయి. బౌద్ధవిహారాలు కూడా ఉన్నాయి.
(చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!)
Comments
Please login to add a commentAdd a comment