మాట మందుగుండు పాట మహిళాదండు | samta society member narsamma try change uneducated women | Sakshi
Sakshi News home page

మాట మందుగుండు పాట మహిళాదండు

Published Thu, Dec 26 2013 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

samta society member narsamma try change uneducated women

వీధి మొహం చూడకుండా...
 ఎన్నాళ్లు బతుకులీడుస్తారు?!
 ఎంత మందుగుండు సామగ్రి ఉందీ మాటలో!
 దబదబా ఇల్లూవాకిలి ఊడ్చేసి
 గబగబా వంటావార్పూ చేసేసి
 చకచకా పిల్లల్ని బళ్లోకి తోలేసి
 ఉన్న కోకనే శుభ్రంగా చుట్టేసుకుని
 ‘ఏమయ్యో! క్యాంపుకెళ్లొస్తా’ అని పరుగులు పెట్టించేంత మందుగుండు!
 నర్సమ్మ మాట, పాట కూడా ఇలాగే...
 దట్టించిన శతఘు్నల్లా ఉంటాయి.
 ‘‘ప్రపంచం మారాలీ అంటే, మహిళను బయటి ప్రపంచాన్ని చూడనివ్వాలి’’
 అంటున్న నర్సమ్మ...
 మొదట ఎలాంటి జీవితాన్ని చూశారు?
 గరళాన్ని వదిలి, ఎలా తన గళాన్ని సవరించుకున్నారు?
 చదవండి... ఈవారం ‘జనహితం’లో.

 పాతికేళ్ల క్రితం... నర్సమ్మ పాడే పాటలు వింటుంటే... పల్లెలలో పేదరికంతో కాపురం చేస్తున్న మహిళలు గుర్తుకొచ్చేవారు. ఎందుకంటే ఆ పాటలలో పల్లె పడుచుల జీవన విధానం నిండి ఉండేది. నర్సమ్మ ఇప్పుడు కూడా పాడుతోంది. కాని వాటిలో మునుపటి భావాలు లేవు. ఆమె గొంతులో ఒక చైతన్యం ఉంది. ఒక ఆశయం ఉంది. ప్రతి మహిళ చదువుకోవాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని తన గళంలో పలుకుతోంది.
 
నర్సమ్మది మెదక్ జిల్లా పుల్కల్ మండలం బసపూర్ గ్రామం. ఆటపాటలతో గడపవలసిన వయసులోనే అత్తింటిలో అడుగుపెట్టింది. అక్కడ వేధింపులు తట్టుకోలేక పుట్టిల్లు చేరింది. నర్సమ్మది నిరుపేద కుటుంబం. పని చేసినరోజు పొట్ట నిండుతుంది. లేదంటే పస్తులుండాల్సిందే. అటువంటి నేపథ్యంలో నుంచి, ఏం జరిగిందో ఏమో కాని ఆమె కల్లు కాంపౌండ్ పంచన చేరింది. అక్కడే పని చేస్తూ, కడుపునిండా కల్లు తాగుతూ, ఆశలు చిగర్చని మోడులా మిగిలింది నర్సమ్మ. అంతటి వెనుకబాటుగా ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా ఉన్న ఆమె, ఈరోజు తోటి మహిళలకు అండగా నిలుస్తోంది. వారి జీవితాల్లో వెలుగురేఖలు నింపడానికి తన వంతు కృషి చేస్తోంది.
 
నర్సమ్మ తల్లిదండ్రులు కూలిపని చేసి జీవించేవారు. ఆమెకు ముగ్గురు అన్నలు, ఒక చెల్లి. వీరంతా రోజు కూలీలే. కల్లు కాంపౌండ్ దగ్గర, టీ కొట్టు దగ్గర పనిచేసుకుంటూ బతికే నర్సమ్మ కల్లుకి బానిసైపోయింది. వద్దని తల్లి ఎంత చెప్పినా, ఆమె మాటను కూడా లెక్కచేసేది కాదు. పెళ్లికి ముందు నర్సమ్మ గేదెల్ని తోలుకెళ్లి, గడ్డి మేపేది. నెత్తికి ఒక వస్త్రం చుట్టుకుని, చేతిలో కర్రను భుజాన వేసుకుని ఆమె పాటలు పాడుతుంటే వ్యవసాయ కూలీలు ఎంతో ఆసక్తిగా వినేవారు. నర్సమ్మ స్వరం మాత్రమే కాదు, అప్పటికప్పుడు కల్పించుకుని పాడే సాహిత్యం కూడా అందరికీ బాగా నచ్చేది. అప్పటికి నర్సమ్మకున్న ఏకైక ఆస్తి ఆమె పాటలే.
 
పెళ్లి తర్వాత ఛిద్రమైపోయిన సంసారం, కల్లు కాంపౌండ్‌తో జతకట్టడంతో... అందరూ నర్సమ్మ జీవితం నాశనమైపోయిందనుకున్నారు. ఇక తల్లిదండ్రుల బాధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సమయంలో మహిళలల్లో చైతన్యం తేవడానికి ఆ ఊళ్లోకి మహిళా సమతా సొసైటీవారొచ్చారు. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని నర్సమ్మతోపాటు ఆ గ్రామంలోని మహిళలంతా వ్యతిరేకించారు. ‘మాకు చదువెందుకు? మేం చదువుకుని ఏం చేయాలి? ఏదన్నా పనుంటే ఇప్పించండి. అంతేగాని చదువు, చైతన్యం ఇవేమీ మాకొద్దు’ అని తిప్పికొట్టారు. అయినా పట్టువిడవకుండా సమతా సొసైటీ వారు అక్కడి మహిళలందరికీ నచ్చజెప్పారు. అలా ఆరుగురు సభ్యులతో సమతాసొసైటీని ఏర్పాటుచేశారు. నర్సమ్మ పాటలు, ఉన్నదున్నట్లు ధైర్యంగా మాట్లాడే తీరుచూసి ఆ సొసైటీకి నర్సమ్మనే లీడర్‌ని చేశారు. అంతే! అక్కడి నుంచి జీవితం ఊహించని మలుపులు తిరిగింది.
 
అక్షరాస్యత శిబిరాలు...
 
విద్య, ఆరోగ్యం, పంచాయితీ, వ్యవసాయం, సామాజిక సమస్యలు...అంటూ ఐదు అంశాలపై పోరాడే సమతా సొసైటీలో చదువు నేర్చుకున్న నర్సమ్మ ఆ గ్రామానికి సంస్థ తరఫున నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. దాంతో ఆమె రూపురేఖలు, హావభావాలు, ఆలోచనలు అన్నీ మారిపోయాయి.
 
విమానమెక్కిన వేళ...
 
గ్రామ, మండల, జిల్లా స్థాయి దాటి రాష్ర్టస్థాయి మహిళా సొసైటీ మీటింగ్‌లకు హాజరవ్వడం మొదలయ్యాక నర్సమ్మలో ఉద్యమలక్షణాలు బయటపడ్డాయి. ‘వీధి మొహం చూడకుండా ఎన్నాళ్లిలా బతుకులీడుస్తారు’ అని తన పాటల ద్వారా పల్లె మహిళల్ని నిలదీయడం మొదలుపెట్టింది. పేద బతుకులకు తెలిసినంత గొప్పగా ఇంకెవరికీ జీవితం బరువు తెలియదు. అందుకే పంచాయితీలు తీర్చే బాధ్యతను ఎంచుకుంది. కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ మహిళలకు కౌన్సెలింగ్ చేసింది. తన జీవితాన్ని సాక్ష్యంగా చూపి మరీ వారిని ఓదార్చింది. నర్సమ్మ పాటలకు, పాఠాలకు మహిళలెక్కువగా ఆకర్షితులవుతున్న విషయం గమనించిన ‘మహిళా సమతా’ నిర్వహకులు... నర్సమ్మను ఢిల్లీ పర్యటనకు కూడా పంపారు.
 
‘‘మీది మోటారును (విమానాన్ని) చూడడం అదే మొదటిసారి. దానిపై ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్‌కి వెళ్లినపుడు నాకు చాలా ఆనందం వేసింది. దానిలో కూర్చున్నంతసేపు చిన్నప్పుడు బర్రెలు మేపుతున్నప్పుడు ఆకాశంలో చిన్నగా కనిపించిన మోటార్లే గుర్తుకొచ్చాయి. ఈ సొసైటీ పుణ్యమాని అది ఎక్కే అవకాశం వచ్చింది. ఆ మీటింగ్‌లో మన రాష్ర్టంలో మహిళలకు సంబంధించిన సామాజికాంశాలపై పావుగంటసేపు మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. నేను అప్పటి ఉపరాష్ర్టపతి కృష్ణకాంత్ భార్య సుమన్ కృష్ణకాంత్ పక్కనే కూర్చోవడం నాకు సంతోషం కలిగించింది’’ అంటూ ఎంతో సంబరపడుతూ చెప్పారు నర్సమ్మ.
 
మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు మన చుట్టూ చాలానే ఉన్నాయి. కాని వాటి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని, బతుకుల్ని బాగుచేసుకునే పేదమహిళలే చాలా అరుదు. నర్సమ్మలో ఉన్న పట్టుదల అందరిలోనూ కనిపించదు. నెలకు రెండు జిల్లాలు చొప్పున 14 జిల్లాల్లో నర్సమ్మ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అక్కడ మాటలకంటే ఎక్కువగా ఆమె పాటలే వినిపిస్తాయి. అక్కడి పరిస్థితుల్ని, వాతావరణాన్ని, మహిళల ఆలోచన తీరుని బట్టి, క్షణాల్లో పదాలు కట్టి, పాటలు పాడి, తోటిమహిళల్ని తన చైతన్య రథంలోకి ఎక్కించుకుంటున్న నర్సమ్మకు హ్యాట్సాఫ్ చెబుదాం.
 - భువనేశ్వరి, ఫొటోలు: పి.గురివిరెడ్డి
 
సమత వారు నన్ను మెచ్చుకుంటున్న ప్రతిసారీ, ఇరవైఏళ్ల కిందటి నా గతం గుర్తుకొస్తుంటుంది. కల్లు తప్ప నాకు వేరే లోకం ఉండేది కాదు. మహిళా సమతా సొసైటీలో చేరాక తోటిసభ్యులు.  నా చేత కల్లు మాన్పించి, ఉపాధి, ఇల్లు, చదువు, మీటింగ్‌లు... అంటూ నన్ను ఒక జీవితంలోకి తోసేశారు. అప్పటికి నాకు తెలిసింది... పాటలు పాడటాన్నే ఆయుధంగా మలిచి మహిళా సమతకు పేరు తేవాలని. మహిళా చైతన్యం, మహిళలపై వేధింపులు, కష్టాలు...అన్ని అంశాలకు సంబంధించి జానపద గీతాలను సేకరించేదాన్ని. చాలావరకూ నేను సొంతంగా పాటలు రాసుకునేదాన్ని. ఎక్కడ సమతా మీటింగ్‌లు పెట్టినా నా గళం వినిపించేదాన్ని.
 - నర్సమ్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement