మెదక్: చెల్లెలు ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన ఓ మహిళ అటవీ ప్రాంతంలో సగం కాలిపోయి మృతిదేహమై కనిపించింది. మెదక్ జిల్లా జోగిపేట మండలానికి చెందిన అనిత(35) లింగంపేట మండలంలో ఉండే తన చెల్లెలు ఇంటికని గురువారం సాయంత్రం ఇంట్లో నుండి బయలుదేరింది.
శుక్రవారం మెదక్ మండలం షాలిపేట రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం అనితదిగా గుర్తించారు. ఆమెను అటవీ ప్రాంతానికి ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఇంటి నుండి వెళ్లే సమయంలో ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు బ్యాగులోనే ఉండటంతో.. ఈ హత్య డబ్బు కోసం జరిగింది కాదని ఎవరో తెలిసిన వారే ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.