చైనాకు ఇచ్చేస్తా... | Yenisetti sambasivarao ready give his assets to Gandhi Philosophy University | Sakshi
Sakshi News home page

చైనాకు ఇచ్చేస్తా...

Published Thu, Sep 12 2013 10:35 PM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

చైనాకు ఇచ్చేస్తా...

చైనాకు ఇచ్చేస్తా...

పదేళ్లుగా ఫైట్ చేస్తున్నారు యెనిశెట్టి సాంబశివరావు.
 కేంద్రానికి లేఖల మీద లేఖలు రాశారు.
 ప్రధానికి సైతం విన్నవించుకున్నారు.
 మంత్రుల కాళ్లూ గడ్డాలూ పట్టుకున్నారు.
 అయినా పని కాలేదు!
 ఇప్పుడాయన వయసు 72 ఏళ్లు.
 అయినా ఫైటింగ్ స్పిరిట్ తగ్గలేదు.
 ఈ వయసులోనూ తన ఆశయసాధన కోసం...
 ఎక్కిన మెట్లు ఎక్కుతూనే ఉన్నారు.
 ఒకే ఒక్కడై జనాన్ని జాగృతం చేస్తూనే ఉన్నారు.
 ఇంతకీ ఈ రిటైర్డ్ ప్రొఫెసర్‌కి ఏం కావాలి?
 ‘ఏమీ వద్దు, నేనే ఇస్తా’నంటున్నారు!
 గాంధీజీ తత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తే...
 తన సర్వస్వాన్నీ ధారపోస్తానంటున్నారు!
 కాదంటే చెప్పండి, చైనాకు ఇచ్చేస్తానంటున్నారు!!
 మహాత్ముడి సమగ్ర తత్వబోధనకు...
 దేశంలో ఒక్క విశ్వవిద్యాలయమైనా లేకపోవడంపై
 సాంబశివరావు ప్రకటించిన సత్యాగ్రహమే ఈవారం ‘జనహితం’!

 
ఎల్‌కెజి క్లాస్‌కి వెళ్లి జీ ఫర్...అనగానే పిల్లలందరూ‘గన్’ అనే స్థాయికి ఎ‘దిగాయి’ ప్రపంచ పరిస్థితులు. అందుకేనేమో చైనా దేశం గన్ స్థానంలో గాంధీజీని పెట్టాలనుకుంటోంది! అవును... మహాత్మాగాంధీ ప్రబోధించిన అహింసా మార్గాన్ని తమ పాఠ్యపుస్తకాల్లో చేరుస్తున్నట్లు ఇటీవల చైనా చేసిన ప్రకటన చాలామంది భారతీయుల్ని ఆలోచింపజేస్తోంది. ‘‘నేటితరం పిల్లలకు గన్ గురించి తెలిసినంత వివరంగా గాంధీ గురించి తెలియడం లేదు.

పోరాటం అంటే హింస అని పసిమనసుల్లో నాటుకుపోడానికి కారణం...పాఠ్యపుస్తకాల్లో గాంధీకి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే’’ అంటూ ఆవేదన చెందుతున్నారు ఓ పెద్దాయన. గాంధీతత్వం గురించి విద్యార్థులకు తెలియజేయడమే ధ్యేయంగా మన దేశంలోనూ...అదీ మన రాష్ర్టంలో పోరాటం చేస్తున్న ఆ పెద్దాయనే...గుంటూరు జిల్లాకి చెందిన యెనిశెట్టి సాంబశివరావు. ‘మహాత్ముని మైక్’ పేరుతో ఆయన చెబుతున్న మాటల్ని చెవులు కాస్త పెద్దవి చేసుకుని వింటే ఆయన అభిప్రాయాలతో మనమూ ఏకీభవిస్తాం.

 ఎందుకు ఏర్పాటు చేయకూడదు?

 ‘‘నాలుగు మంచి మాటలతో సమస్యలు పరిష్కరించుకోవాల్సిన ప్రతిచోట హింస రాజ్యమేలుతోంది. దేశాలు, ప్రాంతాల మధ్య వైరాలు పెరుగుతున్నాయి. రానురాను మనుషుల మధ్య ప్రేమానురాగాలు, మైత్రీ సంబంధాలు తగ్గుతున్నాయి. అందుకే మన జాతిపిత చెప్పిన అహింసా మార్గాన్ని ప్రపంచ పటంలో చాలాదేశాలు అనుసరించడానికి నడుం బిగించాయి... ఒక్క మన దేశం తప్ప! అందుకే 2004లో ‘మహాత్మాగాంధీ తత్వ విశ్వవిద్యాలయ ఆకాంక్ష సమితి’ ఏర్పాటు చేశాను. మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో గాంధీ విశ్వవిద్యాలయాలున్నాయి. అయితే ఏం లాభం? గాంధీతత్వంపై బోధించే అధ్యాపకులు పదిమందికంటే ఎక్కువ లేరు. గ్రీకులు సోక్రటీస్ ఐడియాలజీని ఏథెన్స్ విశ్వవిద్యాలయంలో ప్రచారం చేశారు.

నలంద, తక్షశిల నాటి నాగార్జున విశ్వవిద్యాలయాలు బుద్ధుని బోధనలను విశ్వవ్యాప్తం చేశాయి. దీనివల్ల థాయ్‌లాండ్, కంబోడియా, ఈజిప్టు, మలేషియా వంటి దేశాల్లో బుద్ధుని బోధనలు విస్తారంగా ప్రచారం జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన చైనా మన గాంధీ మార్గాన్ని, తత్వాన్ని ప్రచారం చేసేందుకు గాంధీజీ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తోంది. మరి అలాంటప్పుడు మన దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో అవిశ్రాంత కృషి చేసిన బాపూజీ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఓ ప్రత్యేక యూనివర్శిటీని మనం ఎందుకు ఏర్పాటు చేయకూడదన్నదే నా ప్రశ్న’’ అంటున్నారు సాంబశివరావు.

 గొంతెత్తి చాటినా...

 ‘‘మా గుంటూరు జిల్లా వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడితో మా సమితి చేస్తున్న పోరాటం గురించి వివరంగా చెప్పేవాడిని. అందరూ నా ఆలోచనను మెచ్చుకుని తప్పకుండా చేద్దామని అనేవారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లలేదు. దాంతో నేను నేరుగా ప్రధానమంత్రికి ఉత్తరాలు రాయడం మొదలెట్టాను. మా సమితి అధ్యక్షులు గ్రంథి సుబ్బారావు, కళ్ళం హరనాధరెడ్డిగారు... ఇంకా చాలామంది నాతో చేయి కలిపి వారి వంతు కృషి చేస్తున్నారు. గాంధీ పేరుతో ఒక విశ్వవిద్యాలయం స్థాపించి చేతులు దులుపుకోవడం కాకుండా మొత్తం మన విద్యావిధానాన్నే మార్చేయాలి.

గాంధీజీ అనుసరించిన మార్గం, ఆయన సూచించిన ఆర్థిక సంస్కరణలు, లౌకికవాదం, సమానత్వాన్ని గురించి ఒకటో తరగతి నుంచి కళాశాల విద్య వరకూ పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. అలాగే కళాశాల పాఠ్యాంశాల్లో గాంధీయిజం గురించి ప్రత్యేకంగా బోధించడం వల్ల యువతకు ఆలోచనశక్తి పెరుగుతుంది. మానసికంగా ఎదగడానికి, సమస్యలకు ఎదురు నిలబడి శాంతియుతంగా పరిష్కరించడానికి గాంధీ భావజాలాన్ని మించిన పాఠం మరొకటి ప్రపంచంలో ఎక్కడ వెదికినా దొరకదు. నేటితరం విద్యార్థులకు గాంధీ అంటే ఓ తాతగా మాత్రమే తెలుసు. అహింసతో ప్రపంచాన్ని జయించిన ఓ తత్వవేత్తగా గాంధీజీని వారికి పరిచయం చేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. గాంధీ అంటే ఎవరు? అని భవిష్యత్తరాలు అడగకముందే మేలుకొని ఆయన తత్వం గురించి బోధన మొదలవ్వాలి’’ అని హెచ్చరిస్తున్నారు సాంబశివరావు.

 గాంధీతత్వంపై పిహెచ్‌డి...

 ‘‘గుంటూరు జిల్లా మేడికొండూరు దగ్గర పేరేచర్ల గ్రామం మాది. నాన్న సుందరయ్య వ్యాపారం చేసేవారు. నేను కళ్లు తెరిచేనాటికి అమ్మ కన్ను మూసింది. అప్పటి నుంచి మా మేనత్త, నాయనమ్మలు నన్ను పెంచి పెద్ద చేశారు. నాన్న కోరిక మేరకు నేను పై చదువులు చదువుకుని అధ్యాపకుడిని అయ్యాను. చీరాల, హిందూపురం, మార్కాపురం డిగ్రీ కళాశాలల్లో ఆంధ్ర అధ్యాపకునిగా, ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేసి 1999లో హెచ్‌ఓడిగా ఉద్యోగ విరమణ చేశాను. చిన్నప్పటి నుంచి స్వాతంత్య్రపోరాటయోధుల జీవితచరిత్రలు చదివి... వారి భావనలకు బాగా ఆకర్షితుడినయ్యాను. అందులో భాగంగానే గాంధీయిజం నా జీవితంలో భాగమైపోయింది అందుకే కావొచ్చు... తోటివారంతా రకరకాల సబ్జెక్టులపై పిహెచ్‌డిలు చేస్తుంటే ఆయన గాంధీతత్వంపై పిహెచ్‌డి చేశారు. ఉద్యోగ విరమణ  తర్వాత సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం మొదలెట్టారు. ‘విద్యార్థి మార్గదర్శిని’, ‘అభ్యుదయ వాదులారా ఏకం కండి’ పేరుతో పుస్తకాలను రాసి ఆ మహాత్మునికి అంకితం ఇచ్చారు.

 వార్తల ఆధారంగా...

 పదేళ్ల కిందటి వరకూ సైకిల్‌పై నగరమంతా తిరుగుతూ సభలు, సమావేశాలున్నచోట గాంధీజీ సిద్ధాంతాలకు సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చేవారు సాంబశివరావు. గాంధీతత్వం గురించి ఆయన చెప్పే విషయాల్ని జనం చాలా ఆసక్తిగా వినేవారు. ‘‘అది నా గొప్పతనం కాదు... ఆ మహాత్ముడు ఎన్నుకున్న మార్గం వెనకున్న శక్తి అలాంటిది’’ అంటారాయన.  అంత శక్తిమంతమైనది కనుకే ప్రపంచం మొత్తం ఆయన సిద్ధాంతాలను గౌరవించింది. మనదేశం తప్ప అన్ని దేశాలు బాపూని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. గాంధీజీ మనకి కేవలం తాతగా మాత్రమే మిగిలిపోతారేమోనన్న సాంబశివరావు భయం వెనకున్న వాస్తవాన్ని గుర్తించి, ఇకనైనా గాంధీయిజాన్ని మన మనసులలోకి ఆహ్వానిద్దాం. ఆచరణకు సహకరిద్దాం. మన గడ్డపై గాంధీజీ తత్వ విశ్వవిద్యాలయానికి పునాది పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

 - జి. వేణుగోపాల్, ‘సాక్షి’ ప్రతినిధి, గుంటూరు
 ఫొటోలు: వై. వెంకటేశ్వర్లు

 
 ఈ ఇల్లు ఉచితం!

 ‘‘గుంటూరు జిల్లాలోని కొండవీడు కోటల పక్కనున్న 60 ఎకరాల ప్రభుత్వ భూమిలో మహాత్మాగాంధీ తత్వ విశ్వవిద్యాలయం స్థాపిస్తే గనక నాకున్న యావదాస్తి దానికోసం రాసివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే గాంధీ మహాత్మునికి సంబంధించిన ఎంతో విలువైన గ్రంథాల కలెక్షన్ కూడా ఇస్తాను. ‘సుందర చక్రవర్తి మందిరం’ పేరుతో ఉన్న నా ఇల్లు మూడుకోట్ల విలువ చేస్తుంది. ప్రభుత్వం కోరితే నా ఇంటిని విశ్వవిద్యాలయానికి పాలనాభవనంగా సమర్పిస్తానని నా వీలునామాలో పేర్కొన్నాను. ఇప్పటికైనా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నా ఆశయం వెనకున్న ఆలోచనను మన్నించి మన రాష్ట్రంలో గాంధీతత్వాన్ని బోధించే విశ్వవిద్యాలయ నిర్మాణం చేపడితే సరే సరి. లేదంటే చైనా ప్రభుత్వం కట్టబోతున్న విశ్వవిద్యాలయానికి నా ఆస్తిని ఇచ్చేసి ఆ మహాత్ముని రుణం తీర్చుకుందామనుకుంటున్నాను’’
 - సాంబశివరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement