
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొలంబియా యూనివర్శిటీ(Columbia University)పైనా దృష్టిసారించారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఒత్తిడి మేరకు సదరు విశ్వవిద్యాలయం తన మిడిల్ ఈస్ట్ స్టడీస్ విభాగాన్ని నూతన పర్యవేక్షణలో ఉంచేందుకు, విద్యార్థుల క్రమశిక్షణకు సంబంధించిన నియమాలను మార్చడానికి అంగీకరించింది. వర్శిటీ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్ వెలువరించిన ఒక ప్రకటన ప్రకారం విశ్వవిద్యాలయం యూదు వ్యతిరేకతకు కొత్త నిర్వచనాన్ని స్వీకరించింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ యూదు స్టడీస్‌లో సిబ్బంది సంఖ్యను పెంచనుంది.
కొలంబియా విశ్వవిద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడ పనిచేస్తున్న కొంతమంది అధ్యాపకులకు నచ్చలేదు. ఇది వాక్ స్వేచ్ఛను హరించడమేనని వారు ఆరోపిస్తున్నారు. విశ్వవిద్యాలయం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) ఒత్తిడికి లొంగిపోయిందని, ఇది దేశవ్యాప్తంగా విద్యా స్వేచ్ఛను హరించడమేనని న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డోనా లైబెర్మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో ట్రంప్ సర్కారు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం నిరసనలు నిర్వహించిన తీరును తప్పుబట్టింది. ఆ దరిమిలా పరిశోధన గ్రాంట్లు, ఇతర నిధులను ఉపసంహరించుకుంది. ఈ నేపధ్యంలోనే కొలంబియా యూనిర్శిటీలో మార్పులు చేర్పులపై ఒత్తిడి తెచ్చింది.
ఇటీవలి కాలంలో కొలంబియా విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కారు తన దాడులను ముమ్మరం చేసింది. మార్చి 8న ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు పాలస్తీనా కార్యకర్త, చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయిన మహమూద్ ఖలీల్‌ను విశ్వవిద్యాలయ అపార్ట్‌మెంట్‌లో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన నిరసనలలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఈ విద్యార్థులను యూనివర్శిటీ దాచిపెట్టిందా అనే అనుమానంతో న్యాయ శాఖ అధికారులు దర్యాప్తునకు దిగారు. కాగా తమ ఎజెండాను అనుసరించకపోతే విశ్వవిద్యాలయాల బడ్జెట్‌లను తగ్గిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Haryana: జేజేపీ నేత దారుణ హత్య.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment