polocy
-
కొలంబియా వర్శిటీపై ట్రంప్ ఉక్కుపాదం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొలంబియా యూనివర్శిటీ(Columbia University)పైనా దృష్టిసారించారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఒత్తిడి మేరకు సదరు విశ్వవిద్యాలయం తన మిడిల్ ఈస్ట్ స్టడీస్ విభాగాన్ని నూతన పర్యవేక్షణలో ఉంచేందుకు, విద్యార్థుల క్రమశిక్షణకు సంబంధించిన నియమాలను మార్చడానికి అంగీకరించింది. వర్శిటీ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్ వెలువరించిన ఒక ప్రకటన ప్రకారం విశ్వవిద్యాలయం యూదు వ్యతిరేకతకు కొత్త నిర్వచనాన్ని స్వీకరించింది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ యూదు స్టడీస్‌లో సిబ్బంది సంఖ్యను పెంచనుంది.కొలంబియా విశ్వవిద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడ పనిచేస్తున్న కొంతమంది అధ్యాపకులకు నచ్చలేదు. ఇది వాక్ స్వేచ్ఛను హరించడమేనని వారు ఆరోపిస్తున్నారు. విశ్వవిద్యాలయం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) ఒత్తిడికి లొంగిపోయిందని, ఇది దేశవ్యాప్తంగా విద్యా స్వేచ్ఛను హరించడమేనని న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డోనా లైబెర్మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో ట్రంప్ సర్కారు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం నిరసనలు నిర్వహించిన తీరును తప్పుబట్టింది. ఆ దరిమిలా పరిశోధన గ్రాంట్లు, ఇతర నిధులను ఉపసంహరించుకుంది. ఈ నేపధ్యంలోనే కొలంబియా యూనిర్శిటీలో మార్పులు చేర్పులపై ఒత్తిడి తెచ్చింది.ఇటీవలి కాలంలో కొలంబియా విశ్వవిద్యాలయంపై ట్రంప్ సర్కారు తన దాడులను ముమ్మరం చేసింది. మార్చి 8న ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు పాలస్తీనా కార్యకర్త, చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయిన మహమూద్ ఖలీల్‌ను విశ్వవిద్యాలయ అపార్ట్మెంట్లో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన నిరసనలలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఈ విద్యార్థులను యూనివర్శిటీ దాచిపెట్టిందా అనే అనుమానంతో న్యాయ శాఖ అధికారులు దర్యాప్తునకు దిగారు. కాగా తమ ఎజెండాను అనుసరించకపోతే విశ్వవిద్యాలయాల బడ్జెట్లను తగ్గిస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Haryana: జేజేపీ నేత దారుణ హత్య.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
గడువు ముగియనున్న ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ
ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) కీలక సింగిల్ ప్రీమియం పాలసీ ‘ధన వృద్థి’ (LIC Dhan Vriddhi) గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆసక్తిఉన్నవారు గడువు లోపు దీన్ని కొనుగోలు చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. గత జూన్‌లో ప్రారంభించిన ఈ ప్లాన్ పరిమిత ఆఫర్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని వెల్లడించింది. మెరుగైన పొదుపుతో పాటు బీమా కవరేజీ కూడా కావాలనుకునే వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ధన వృద్థి పాలసీ ఆన్‌లైన్‌లోనూ లభ్యం అవుతుందని ఎల్ఐసీ పేర్కొంది. ఈ పాలసీ టెన్యూర్‌లో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సాయం అందిస్తుంది. మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత గ్యారంటీ రిటర్న్స్ అందజేస్తుంది. 32 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. -
ట్రాన్‌జెండర్ల కోసం ఎల్ఐసీ నుంచి సరికొత్త పాలసీ!
LIC Dhan Rekha Plan Details: ఎల్ఐసీ కొత్తగా ‘ధన రేఖ’ పేరుతో సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లను అమలు చేస్తున్నామని, మూడో లింగానికి కూడా (మహిళలు, పురుషులు కాని వారు) ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్నామని ఎల్ఐసీ ప్రకటించింది. ప్రీమియం చెల్లింపుల వ్యవధి ముగిసిన తర్వాత సమ్ అష్యూరెన్స్‌లో నిర్ణీత శాతాన్ని సర్వైవల్ బెనిఫిట్ కింద నిర్దేశిత విరామంతో చెల్లిస్తామని.. గడువు తీరిన తర్వాత సమ్ అష్యూరెన్స్ మొత్తాన్ని ఎటువంటి తగ్గింపులు లేకుండా పాలసీదారు అందుకుంటారని తెలిపింది. ఈ ప్లాన్ కింద కనీసం రూ.2లక్షల బీమా రక్షణను ఎంపిక చేసుకోవాలి. పాలసీ తీసుకునేందుకు కనిష్ట, గరిష్ట వయో పరిమితి 90 రోజులు– 55 సంవత్సరాలు. - న్యూఢిల్లీ చదవండి: మానవత్వం చాటుకున్న ట్రాన్స్‌జెండర్ ఎస్ఐ -
ఆ విషయంలో అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మేకిన్ ఇన్ ఇండియా కాన్సెప్టు క్రమంగా ప్రభావం చూపుతోంది. మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయం ఇటీవల విడుదలైన ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించి ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ వివిధ అంశాలపై ప్రతీ ఏడు సర్వేలు నిర్వహిస్తోంది. ఈ ఏడు నిర్వహించిన సర్వేలో ఇండియా సానుకూల ప్రగతిని సాధించినట్టు ఈ సర్వే ప్రకటించింది. ముఖ్యంగా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో ఇండియా పరిస్థితి మెరుగైంది. ప్రపంచంలోనే తయారీ రంగానికి సంబంధించి అత్యంత అనుకూలమైన దేశాల్లో రెండో స్థానం సాధించింది. ఇంతకు ముందు ఈ స్థానంలో అమెరికా ఉండేది. యూఎస్ఏను వెనక్కి నెట్టి ఇండియా ద్వితీయ స్థానానికి చేరుకుంది. ఇక ఎప్పటిలాగే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో చైనానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియాకు అనుకూలించేనా ? ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల్లో సింహభాగం అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇటీవల చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలించే యోచనలో అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికా కంపెనీలకు ఏషియాలో తయారీ హబ్‌గా చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదిగేందుకు అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ అంశంలో ఇండియాకు ఇండోనేషియా, తైవాన్, వియత్నాంల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వ్యయ నియంత్రణలో వెనుకబాటు తయారీ రంగంలో ఇండియా పరిస్థితి మెరుగైనప్పటికీ వ్యయ నియంత్రణలో ఇండియా వెనుకడుగు వేసినట్టు ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వే ప్రకటించింది. గతంలో కాస్ట్ సినారియోలో ఇండియా ద్వితీయ స్థానంలో ఉండగా ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా ఇండోనేషియా ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు థాయ్‌లాండ్ ఎనిమిదో స్థానం నుంచి ఐదో స్థానానికి వచ్చి చేరింది. వ్యయ నియంత్రణలో ఇండియాకు తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక కాస్ట్ విషయంలో కూడా ప్రథమ స్థానంలో చైనానే ఉంది. ఇండియాలో రిస్క్ ఎక్కువ బిజినెస్ రిస్క్‌కు సంబంధించి ఇండియాకు ప్రతికూల ఫలితాలే ద కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ముఖ్యంగా పాలసీలు, పొలిటికల్ ప్రెషర్లను పరిగణలోకి తీసుకుని ఈ సర్వేను రూపొందించగా ఇండియా టాప్ దేశాల సరసన కాకుండా రిస్క్ ఎక్కువగా ఉన్న మలేషియా, బెల్జియం, ఇండోనేషియా, బల్గేరియా, రోమేనియా, థాయ్‌లాండ్, హంగరీ, కొలంబియా, ఇటలీ, పేరు, వియత్నాంల సరసన నిలిచింది. ఈ విభాగంలో కూడా చైనా మొదటి స్థానంలో ఉండగా కెనడా, అమెరికా, ఫిన్లాండ్, చెక్ రిప్లబిక్ దేశాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మెరుగుపడాల్సిందే తయారీ యూనిట్‌కు కావాల్సిన స్థలం, మానవ వనరులు విషయంలో ఇండియా స్థానం మెరుగైనా పొలిటికల్ ప్రెషర్, పాలసీల విషయంలో వెనుకబడే ఉంది. ఇక కాస్ట్ విషయంలో తోటి ఆసియా దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. చదవండి : సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్ -
చనిపోయిన వ్యక్తి పేరిట బీమా
పదేళ్ల క్రితమే మృతిచెందిన పాలసీదారు ఏడాది క్రితం కొత్త పాలసీ కట్టిన సోదరుడు మూడు నెలల క్రితం మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం క్లెయిం చేసి బీమా కంపెనీని బురిడీ కొట్టించేందుకు యత్నం కంపెనీ ప్రతినిధి విచారణతో వెలుగులోకి చొప్పదండి : డబ్బు కోసం మనిషిని ఎంతటి కక్కుర్తికైనా ఒడిగడతాడనడానికి ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణ. అక్రమంగా బీమా సొమ్ము పొందేందుకు ఓ వ్యక్తి పదేళ్ల క్రితమే చనిపోయిన తన అన్న పేరిట పాలసీ తీసుకుని బీమా సంస్థను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. చొప్పదండి గ్రామ పంచాయతీ పరిధిలోని తొగిరిమామిడికుంట ప్రాంతానికి చెందిన ఇరుగురాల శంకరయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పుడు ఆయన వయస్సు 30 ఏళ్లు. ఇతడి సోదరుడు మల్లేశం డబ్బు కోసం శంకరయ్య పేరిట ఏడాది క్రితం ఓ ప్రయివేటు కంపెనీ బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.5 లక్షల పాలసీ కోసం రూ.15 వేల ప్రీమియం చెల్లించాడు. గత మే నెలలో శంకరయ్య మృతి చెందినట్లు గ్రామ పంచాయతీ నుంచి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శికి పూర్తి వివరాలు తెలియకపోవడంతో ఓ వ్యక్తి సాయంతో కార్యాలయ సిబ్బంది సహకారంతో పదేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి మూడు నెలల క్రితమే మరణిచినట్లు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. విచారణతో వెలుగులోకి.. బీమా కంపెనీలకు క్లెయిమ్‌లు చేసిన సమయంలో సదరు కంపెనీకి చెందిన అధికారి ఒకరు పాలసీదారు మృతిపై విచారణ జరుపుతారు. పాలసీ తీసుకున్న కంపెనీ ప్రతినిధి శుక్రవారం చొప్పదండికి వచ్చి మృతుడి వివరాలు ఆరా తీశారు. మృతుడి ఇంటి పరిసరాలలోని వారు శంకరయ్య పదేళ్ల క్రితమే చనిపోయినట్లు చెప్పడంతో విచారణ జరుపుతున్న ప్రతినిధికి అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి వెంకట రాజశేఖర్‌ను మరణ ధ్రువీకరణ పత్రం జారీ గురించి ఆరా తీశాడు. ఆయన కార్యాలయంలోని ఫైళ్లు పరిశీలించగా పదేళ్ల క్రితమే చనిపోయినట్లు తేలింది. మల్లేశం తప్పుడు దరఖాస్తుతో తమ వద్ద మరణ ధ్రువీకరణ పత్రం పొందాడని, బీమా సంస్థను బురిడీ కొట్టించేందుకు ఎత్తులు వేశాడని గుర్తించారు. శంకరయ్య మృతిపై జారీ చేసిన ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తున్నట్లు బీమా కంపెనీ ప్రతినిధికి లేఖ ఇవ్వడంతో ఆయన వెళ్లిపోయాడు. బీమా పాలసీ క్లెయిం కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రం పొందడంలో సహకరించిన వారి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారంపై కేసులు నమోదు కాకుండా అప్పుడే మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. సర్టిఫికెటర్ రద్దు చేశాం – వెంకట రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి తొగిరిమామిడి కుంటకు చెందిన మల్లేశం సెల్ఫ్ డిక్లరేషన్‌తో శంకరయ్య మరణ ధ్రువీకరణ పత్రం పొందాడు. బీమా కంపెనీ ప్రతినిధి సంప్రదించడంతో పూర్తి స్థాయి విచారణ చేసి ఇటీవల జారీ చేసిన ధ్రువీకరణను రద్దు చేశాం. డెత్ సర్టిఫికెట్ జారీ వెనుక ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాల్సి ఉంది. తప్పుడు డెత్ సర్టిఫికెట్ జారీపై విచారణ మెట్పల్లి: తప్పుడు డెత్ సర్టిఫికెట్ జారీ చేసి సస్పెండ్ అయిన మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ భూమానందంను మున్సిపల్ కార్యాలయంలో సిరిసిల్ల కమిషనర్, విచారణాధికారి సుమన్‌రావు శుక్రవారం విచారణ చేశారు. బాస రాజేందర్ అనే పేరు మీద పట్టణానికి చెందిన నందగిరి దామోదర్ ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలు, రూ.10 లక్షల పాలసీలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లుగా మున్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో భూమానందం ఎలాంటి పరిశీలన జరుపకుండా డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడు. ఈ సర్టిఫికెట్తో దామోదర్ ఎల్ఐసీ నుంచి రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకున్నాడు. ‘సాక్షి’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతో ఎల్ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు కేసు నమోదు చేసి ఇప్పటి వరకు దామోదర్‌తోపాటు ఇద్దరు ఏజెంట్లు, భూమానందంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఉన్నతాధికారులు భూమానందంను సస్పెండ్ చేసి సుమన్‌రావును విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు ఆయన మెట్‌పల్లికి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో డెత్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించి భూమానందం నుంచి వివరాలు సేకరించారు.