చనిపోయిన వ్యక్తి పేరిట బీమా
-
పదేళ్ల క్రితమే మృతిచెందిన పాలసీదారు
-
ఏడాది క్రితం కొత్త పాలసీ కట్టిన సోదరుడు
-
మూడు నెలల క్రితం మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం
-
క్లెయిం చేసి బీమా కంపెనీని బురిడీ కొట్టించేందుకు యత్నం
-
కంపెనీ ప్రతినిధి విచారణతో వెలుగులోకి
చొప్పదండి : డబ్బు కోసం మనిషిని ఎంతటి కక్కుర్తికైనా ఒడిగడతాడనడానికి ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణ. అక్రమంగా బీమా సొమ్ము పొందేందుకు ఓ వ్యక్తి పదేళ్ల క్రితమే చనిపోయిన తన అన్న పేరిట పాలసీ తీసుకుని బీమా సంస్థను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. చివరకు అడ్డంగా దొరికిపోయాడు.
చొప్పదండి గ్రామ పంచాయతీ పరిధిలోని తొగిరిమామిడికుంట ప్రాంతానికి చెందిన ఇరుగురాల శంకరయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పుడు ఆయన వయస్సు 30 ఏళ్లు. ఇతడి సోదరుడు మల్లేశం డబ్బు కోసం శంకరయ్య పేరిట ఏడాది క్రితం ఓ ప్రయివేటు కంపెనీ బీమా పాలసీ తీసుకున్నాడు. రూ.5 లక్షల పాలసీ కోసం రూ.15 వేల ప్రీమియం చెల్లించాడు. గత మే నెలలో శంకరయ్య మృతి చెందినట్లు గ్రామ పంచాయతీ నుంచి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శికి పూర్తి వివరాలు తెలియకపోవడంతో ఓ వ్యక్తి సాయంతో కార్యాలయ సిబ్బంది సహకారంతో పదేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి మూడు నెలల క్రితమే మరణిచినట్లు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు.
విచారణతో వెలుగులోకి..
బీమా కంపెనీలకు క్లెయిమ్‌లు చేసిన సమయంలో సదరు కంపెనీకి చెందిన అధికారి ఒకరు పాలసీదారు మృతిపై విచారణ జరుపుతారు. పాలసీ తీసుకున్న కంపెనీ ప్రతినిధి శుక్రవారం చొప్పదండికి వచ్చి మృతుడి వివరాలు ఆరా తీశారు. మృతుడి ఇంటి పరిసరాలలోని వారు శంకరయ్య పదేళ్ల క్రితమే చనిపోయినట్లు చెప్పడంతో విచారణ జరుపుతున్న ప్రతినిధికి అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి వెంకట రాజశేఖర్‌ను మరణ ధ్రువీకరణ పత్రం జారీ గురించి ఆరా తీశాడు. ఆయన కార్యాలయంలోని ఫైళ్లు పరిశీలించగా పదేళ్ల క్రితమే చనిపోయినట్లు తేలింది. మల్లేశం తప్పుడు దరఖాస్తుతో తమ వద్ద మరణ ధ్రువీకరణ పత్రం పొందాడని, బీమా సంస్థను బురిడీ కొట్టించేందుకు ఎత్తులు వేశాడని గుర్తించారు. శంకరయ్య మృతిపై జారీ చేసిన ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తున్నట్లు బీమా కంపెనీ ప్రతినిధికి లేఖ ఇవ్వడంతో ఆయన వెళ్లిపోయాడు. బీమా పాలసీ క్లెయిం కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రం పొందడంలో సహకరించిన వారి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారంపై కేసులు నమోదు కాకుండా అప్పుడే మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.
సర్టిఫికెటర్ రద్దు చేశాం
– వెంకట రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి
తొగిరిమామిడి కుంటకు చెందిన మల్లేశం సెల్ఫ్ డిక్లరేషన్‌తో శంకరయ్య మరణ ధ్రువీకరణ పత్రం పొందాడు. బీమా కంపెనీ ప్రతినిధి సంప్రదించడంతో పూర్తి స్థాయి విచారణ చేసి ఇటీవల జారీ చేసిన ధ్రువీకరణను రద్దు చేశాం. డెత్ సర్టిఫికెట్ జారీ వెనుక ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాల్సి ఉంది.
తప్పుడు డెత్ సర్టిఫికెట్ జారీపై విచారణ
మెట్‌పల్లి: తప్పుడు డెత్ సర్టిఫికెట్ జారీ చేసి సస్పెండ్ అయిన మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ భూమానందంను మున్సిపల్ కార్యాలయంలో సిరిసిల్ల కమిషనర్, విచారణాధికారి సుమన్‌రావు శుక్రవారం విచారణ చేశారు. బాస రాజేందర్ అనే పేరు మీద పట్టణానికి చెందిన నందగిరి దామోదర్ ఎల్‌ఐసీ నుంచి రూ.5 లక్షలు, రూ.10 లక్షల పాలసీలు తీసుకున్నాడు.
ఆ తర్వాత అతడు మరణించినట్లుగా మున్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ సమయంలో భూమానందం ఎలాంటి పరిశీలన జరుపకుండా డెత్ సర్టిఫికెట్ జారీ చేశాడు. ఈ సర్టిఫికెట్‌తో దామోదర్ ఎల్‌ఐసీ నుంచి రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకున్నాడు. ‘సాక్షి’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతో ఎల్‌ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు కేసు నమోదు చేసి ఇప్పటి వరకు దామోదర్‌తోపాటు ఇద్దరు ఏజెంట్లు, భూమానందంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఉన్నతాధికారులు భూమానందంను సస్పెండ్ చేసి సుమన్‌రావును విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు ఆయన మెట్‌పల్లికి వచ్చి మున్సిపల్ కార్యాలయంలో డెత్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించి భూమానందం నుంచి వివరాలు సేకరించారు.