ఎవరికి చుట్టం! | Save Indian Family Foundation of Hyderabad Try to preserve family system | Sakshi
Sakshi News home page

ఎవరికి చుట్టం!

Published Mon, Aug 19 2013 10:58 PM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

ఎవరికి చుట్టం!

ఎవరికి చుట్టం!

ఎక్కడ    : అసెంబ్లీ పక్కన పబ్లిక్‌గార్డెన్స్
 ఎప్పుడు    : ఆదివారం, ఉదయం 9గంటలకు
 ఏమిటి    : కొందరు మగవాళ్ల సమావేశం
 ఎందుకు    : కుటుంబ వ్యవస్థను కాపాడడం కోసం
 ఎలా    : సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా...... ఈవారం జనహితంలో

 
పబ్లిక్ గార్డెన్స్ గేట్ లోపలికి అడుగుపెట్టాక...ఎడమచేతివైపు ఓ వంద అడుగులు వేస్తే....చింతచెట్లకింద ఓ యాభైమంది మగవాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిమధ్యలో ఓ పెద్దాయన నిలబడి తన బాధలు చెప్పుకుంటున్నాడు. ‘‘మా కోడలు మామీద 498ఎ కేసు పెడతానంటోంది. తనకి మా కొడుకుతో ఇబ్బందులుంటే....కాటికి కాళ్లు చాచుకున్న మేం బలవ్వాలా...అంటూ మొదలుపెట్టాడు’’ అతను చెప్పిన సమస్యలన్నీ విన్నాక అక్కడ కూర్చున్న వాళ్లలో ఒకతను లేచి ఆ పెద్దాయనకి సలహాలిచ్చాడు. ‘‘మీ అబ్బాయిని, కోడల్ని కూర్చోబెట్టి మంచిగా మాట్లాడండి. మీ అబ్బాయి తప్పుంటే సరిచేసుకోడానికి, అతని ప్రవర్తన మార్చుకోడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మీ కోడలి బాధల్ని కూడా విని ఆమెని సమస్యల్ని నుంచి బయటపడేయడానిక్కూడా మీరే చొరవ తీసుకోండి. మీ కోడలైనా, కూతురైనా ఒక్కసారి పోలీస్‌స్టేషన్ గుమ్మం తొక్కితే ఒకటి కాదు, రెండు కాదు.. మూడు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి.’’ అంటూ సలహా ఇచ్చాడు. అసలు ఎవరు వీళ్లంతా? ఎందుకు అక్కడికి వచ్చారో చూద్దాం...
 
 ‘‘ఎంత శక్తిమంతమైన చట్టాలున్నా... ఇంకా చాలామంది మహిళలు గృహహింసకు బలైపోతూనే ఉన్నారు. కట్నాల వేధింపులు, అనుమానంతో వేధించే భర్తలు చట్టాల్ని లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటివారిపై 498 ఎ సెక్షన్ కేసు పెడితే వారికి న్యాయం జరుగుతుంది. అలాకాకుండా... జీతం చేతికివ్వలేదని, తల్లిదండ్రుల్ని చూడమన్నాడని, చెప్పిన మాట వినలేదని పంతాలకు పోయి క్షణికావేశంలో ఈ చట్టాన్ని ఆశ్రయించడం మన దేశ కుటుంబ వ్యవస్థని అవమానపరచడమే’’ అంటూ తమ పోరాటం గురించి పరిచయం చేసుకున్నారు.  
 
 ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పబ్లిక్‌గార్డెన్స్‌లో మీట్ అయ్యే ఈ బృందం...‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్)’ సభ్యులు. ముందుగా వీరంతా సెక్షన్ 498 ఎ బాధితులు. వీరంతా కలిసి ఈ సెక్షన్ దుర్వినియోగం కాకుండా కృషిచేస్తూ కుటుంబ వ్యవస్థని రక్షించడంకోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. సిఫ్ సభ్యుడు ఫెరాజ్ మాట్లాడుతూ...‘‘మహిళలపై వేధింపుల్ని అరికట్టాలన్న ఉద్దేశంతో పుట్టిన ఈ చట్టం చిన్న చిన్న ఇగోలకు కూడా పరిఆసరాగా మారడం చాలా దారుణం. ఏదో చిన్న గొడవకి 498 ఎ సెక్షన్ కింద కేసు వేసి కుటుంబాన్ని సర్వనాశం చేసుకుంటున్న మహిళలసంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
 
 కుటుంబం విలువైంది...
 ‘‘మన దేశంలో అన్నింటికన్నా బలమైంది, విలువైంది కుటుంబమే. మహిళైనా, పురుషుడైనా కుటుంబం లేకుండా ప్రశాంతంగా బతకలేరు. క్షణికావేశంలో కుటుంబాన్ని కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు కారణాలలో 498 ఎ సెక్షన్ దుర్వినియోగం కూడా ఒకటి. రకరకాల కారణాల వల్ల భర్త నుంచి విడిపోవాలనుకుంటున్న కొందరు మహిళలు నేరుగా విడాకులకు దరఖాస్తు చేసుకోకుండా... ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. పోనీ భర్తమీద కేసు వేసి ఊరుకుంటున్నారా... అంటే ... కాదు, అతనితోపాటు తనకు కోపం ఉన్న అందరి పేర్లని రాసేస్తున్నారు. అత్త, మామ, ఆడపడచు, మరిది, బావ... అంటూ ఓ ఐదారు మందిని రోడ్డుకి ఈడుస్తున్నారు. దీనివల్ల ఆమెకొరిగేదేమీ ఉండదు. కొన్నాళ్ల తర్వాత ‘అనవసరంగా తొందరపడ్డానే’ అని బాధపడేవాళ్లూ ఉన్నారు.

 

ఏ మహిళైనా 498 ఎ సెక్షన్‌కింద కేసు నమోదు చేస్తే భర ్తని వెంటనే అరెస్టు చేస్తారు. ఆ తర్వాత... మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా పోలీసులు నిర్దాక్షిణ్యంగా సెల్‌లో పడేస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న ఆడపడుచుని కూడా అరెస్టు చేయించారు. భర్త తప్పుచేస్తే అతనిమీద కేసు పెట్టాలి. అంతేకాని రక్తసంబంధీకులైన పాపానికి ఎక్కడో దేశం దాటిపోయినవాళ్లమీద కేసులు పెట్టి వారి కుటుంబాల్ని బజారుకీడ్చే హక్కు ఈమెకి ఎవరిచ్చారు? పెళ్లిచేసి నా బతుకు నాశనం చేశారనే అమ్మాయిలెంత మంది ఉన్నారో, అందులో పదోవంతు అబ్బాయిలు కూడా తమ జీవితభాగస్వాములతో ఇంచుమించు ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఎన్నోవిషయాల్లో ఎంతో పురోగమిస్తున్న మనం మన చట్టాలకు మగవాళ్ల సంక్షేమం ఎందుకు పట్టదో అర్థం కావట్లేదు. అందుకే ఎనిమిదేళ్ల క్రితం ముంబయిలో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ వెలిసింది’’ అని చెప్పారు సిఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జ్ అలీ షా.
 
 దేశవ్యాప్తంగా...
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సంస్థలో 13, 500 మంది సభ్యులున్నారు. స్వచ్ఛందంగా పనిచేస్తున్నవారు ఇంతకు మూడింతలున్నారు. వీరి పోరాటం 498 ఎ చట్టం దుర్వినియోగం మీద మాత్రమే కాదు... ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ కన్నబిడ్డలతో గడిపే అవకాశాన్ని కోల్పోతున్న మగవారి కోసం కూడా. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిఫ్ సభ్యులు ఉన్నారు. మొన్నటివరకూ 498ఎ సెక్షన్‌కింద కేసు పెడితే వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. రెండేళ్లక్రితం ట్యాంక్‌బండ్‌పై మేం చేసిన పోరాట ఫలితంగా మన రాష్ర్ట హైకోర్టు కేసుని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది. కాని, ఏం లాభం... కొందరు మహిళలు కేసు పెట్టి వెనక్కి తీసుకోడానికి బేరాలాడుతున్నారు.

 

భార్యాభర్తలమధ్య మధ్యవర్తుల పేరుతో పుట్టుకొచ్చే కొందరు పెద్దలు మరీ అన్యాయంగా డబ్బు సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు. దీనివల్ల వివాహవ్యవస్థ పైనే విరక్తి పుడుతోంది. ఇదిగో...ఇక్కడ ఉన్నవారిలో ఓ పదిమంది విదేశాల్లో స్థిరపడ్డవాళ్లున్నారు. ఈ కేసు పుణ్యాన అక్కడ ఉద్యోగం ఊడగొట్టుకుని ఇక్కడకొచ్చి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ల భార్యలేమో ఉద్యోగాలు చేసుకుంటూ వీళ్లదగ్గర పోషణకు డబ్బులు తీసుకుంటూ హాయిగా బతికేస్తున్నారు. ఇక్కడ మా ఉద్దేశ్యం వీళ్లంతా మంచివారు, వీరి భార్యలు చెడ్డవారు అని కాదు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవడం ఎందుకు...అని!’’ అంటూ తన వాదనని వివరించారు మరో సభ్యుడు.
 
 కుటుంబం కోసం...
 మా పోరాటం మగవారికోసం కాదు...కుటుంబ సంక్షేమం కోసం అంటోన్న ఈ సంస్థ  కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఉచిత కౌన్సిలింగ్‌లు కూడా ఇస్తోంది. లోక్ అదాలత్ కింద న్యాయ సేవా సదన్‌లో ప్రీ ప్రివెన్షన్ కౌన్సిలింగ్‌లో పాల్గొంటోంది. కుటుంబంలో ఎవరితోనైనా సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా లోక్ అదాలత్‌ని ఆశ్రయిస్తే అక్కడ అధికారులు సమస్య పరిష్కారానికి సహకరిస్తారు. ఇలాంటి సంస్థల్ని ఆశ్రయించి కుటుంబాలను పదికాలలపాటు పచ్చగా ఉండేలా చూసుకోకుండా పోలీసుల్ని ఆశ్రయించి పొరపాటు చేస్తున్న మహిళలు కళ్లు తెరవాలని కోరుకుంటున్నారు సిఫ్ బృందం. 498ఎ చట్టం విలువైంది. శక్తిమంతమైన ఆయుధం. అయితే ఆ ఆయుధాన్ని జాగ్రత్తగా వాడాలి కాని దుర్వినియోగం చేయకూడదు. వందమంది నేరస్థులు తప్పించుకున్నా పరవాలేదు కాని... ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అన్న మన న్యాయశాస్త్ర సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని, హింసకు గురవుతున్న మహిళలకు రక్షణకవచంలా ఉన్న ఈ చట్టం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడదాం.
 
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 ఇదొక్కటే కాదు...
 మన దేశంలో ఒక్క మహిళా చట్టాలే కాదు అన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు  పోరాడి తెచ్చుకున్న చట్టాలివి. భర్త కొట్టినా, బాధ్యతగా ప్రవర్తించకపోయినా, అనుమానించినా... ఎలాంటి ఇబ్బంది అయినా వాటి నుంచి బయటపడడానికి నేటి మహిళలకి  498 సెక్షన్ ఒక్కటే దిక్కు. సమస్య చిన్నదయినా, పెద్దదయినా తట్టుకునే శక్తిలేనప్పుడు ఎవ్వరూ తనకు తోడుగా నిలబడనపుడు ఆ మహిళ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం 498. ఆడ, మగ భేదాలు పక్కనపెడితే ఎవరికి అన్యాయం జరిగిందో కేసు విచారణ చేస్తేగాని చెప్పలేం.
 - నిశ్చల సిద్దారెడ్డి, ఎడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్
 
 దుర్వినియోగం పెరుగుతోంది...
 రక్షణగా ఉపయోగపడాల్సిన చట్టాన్ని అవగాహన లేకుండా, క్షణికావేశంతో దుర్వినియోగం చేస్తున్నవారి సంఖ్య నిజంగానే పెరుగుతోంది. వాస్తవం చెప్పాలంటే నిజంగా హింసకు గురవుతున్న మహిళలు నేరాల్ని రుజువుచేయడంలో విఫలమై ఇబ్బందులు పడుతుంటే... తమ స్వార్థాలకు కేసులు పెట్టి జీవితాల్ని నాశనం చేసున్న మహిళలు కూడా మన కళ్లముందే ఉన్నారు. భార్యా, భర్త సంగతేమోగాని మధ్యలో పెద్దలు, మధ్యవర్తులు బాగుపడిపోతున్నారన్నది కూడా వాస్తవం!
 - పుణ్యవతి, ఐద్వా సంఘం ఉపాధ్యక్షురాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement