ఆపద్బ్రహ్మ | nano sensor researcher, professor ramgopal rao | Sakshi
Sakshi News home page

ఆపద్బ్రహ్మ

Published Thu, Nov 28 2013 11:22 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

nano sensor researcher, professor ramgopal rao

బ్రహ్మ సృష్టిస్తాడు.
 అపరబ్రహ్మలు ప్రతిసృష్టి చేస్తారు.
 ఈ ఇద్దరూ కాకుండా...
 వేరొక బ్రహ్మ ఉన్నారు.
 ఆపద్బ్రహ్మ!
 ఆపద్బ్రహ్మా?! ఆయనేం సృష్టిస్తారు?
 సృష్టించరు.
 మరి?
 కనిపెడతారు!
 ఎవరిని?
 రాబోయే గుండెపోట్లను!
 పేలబోయే ఆర్డీఎక్స్‌లను!
 కనిపెట్టడం అంటే కాపాడడమే కదా.
 కాపాడడం అంటే సృష్టించడమే కదా.
 అలా ఆయన ఆపద్బ్రహ్మ.
 ఆ... బ్రహ్మ సక్సెస్ స్టోరీనే...
 ఈవారం ‘జనహితం’

 
 ‘గుండెజబ్బుని... ముందుగానే కనుక్కునే మిషన్ వస్తే ఎంత బాగుంటుంది?’ ‘ పూటకోచోట పేలే బాంబుల జాడని ముందే పసిగట్టి సమాచారమిచ్చే యంత్రాలొస్తే ఉగ్రవాదుల చర్యలకు బలయ్యే అవకాశముండదు కదా’ అని అందరూ ఆశపడతారు. ఈ రెండు కలల్ని నెరవేర్చడానికి మహబూబ్‌నగర్ వాసి చేస్తున్న కృషికి గుర్తింపు వచ్చింది. దేశవిదేశాలలో అనేక అవకాశాలున్నప్పటికీ సమాజానికి ఏదో చేయాలన్న తపన వలిపే రామ్‌గోపాల్‌రావుది. ముంబై ఐఐటి ప్రొఫెసర్, నానో ఎలక్ట్రానిక్స్ సెంటర్ ప్రముఖ పరిశోధకుడైన రామ్‌గోపాల్ ‘నానోస్కేల్ ఎలక్ట్రానిక్స్’ పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తూ  తెలుగువాడి సత్తా చాటుతున్నారు. నానో పరిశోధనలో ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఆయన తాజాగా ‘ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డు-2013’ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన పరిశోధనలతోపాటు ఇతర విషయాల గురించి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...
 
‘‘రాబోయే కాలంలో నానో టెక్నాలజీ ఎంతో కీలకంగా మారనుంది. అందుకే నానో సెన్సర్ పరిశోధనకు నా వంతు కృషి చేస్తున్నాను. ఇందులో భాగంగానే గుండెపోటు, ఆర్‌డిఎక్స్‌ను పసిగట్టే నానో సెన్సర్‌లను రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నానో స్కేల్‌ను మన మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మారుతున్న కాలంతో పాటు మన దేశ ప్రజల జీవనశైలిలో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో శారీరక శ్రమ అంటే వ్యవసాయ పనులు తదితరాలు అధికంగా చేసేవారు. దీంతో అహారంలో తీసుకున్న కొవ్వు కూడా కరిగిపోయేది.

మారిన కాలాన్ని పరిశీలిస్తే... శారీరక శ్రమ అంతగా లేని పనులు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పనుల చేసే విధానంలో మార్పులు వచ్చినప్పటికీ, తీసుకునే ఆహారంలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణించే హృద్రోగుల సంఖ్యను పరిశీలిస్తే మన దేశంలోనే అధికంగా ఉంది. అందువల్ల... గుండెపోటును ముందుగా తెలుసుకునేందుకు సెన్సర్లు కనిపెట్టాలని భావించాం. ఇవి మార్కెట్‌లోకి వస్తే, హృద్రోగులకు చాలా తక్కువ ఖర్చుతో పరీక్షలతో పాటు, గుండెపోటు గురించి ముందుగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.
 
ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌ప్లోజర్ డిటెక్టర్లు...

 దేశంలో జరుగుతున్న బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆర్‌డిక్స్‌ను పసిగట్టేందుకు ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌ప్లోజర్ డిటెక్టర్‌లను అంటే ‘ఈ నోస్’లను  కనిపెట్టాలని భావించాం. దీనిని నానోటెక్నాలజీలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం వీటిని రూపొందించడం చివరి దశలో ఉన్నప్పటికీ పూర్తయిందని చెప్పవచ్చు.  మరోవైపు ఈ నోస్ సెన్సర్‌లు అమర్చడంతో ఆర్‌డిఎక్స్‌తోపాటు అనేకరకాల పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు ఆస్కారం ఏర్పడనుంది. ముఖ్యంగా బస్సులు, తాజ్‌మహల్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీటిని అమర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఒక బస్సులో ఇలాంటి ఈ నోస్ సెన్సర్లను సుమారు పది పన్నెండు అమర్చినట్టయితే ఏ సీట్లో పేలుడు పదార్థాలున్నా డ్రైవర్‌కు తెలిసిపోతుంది. వీటిని ఒక్కసారి అమర్చిన అనంతరం కనీసం సంవత్సరం పాటు ఎలాంటి మెయిన్‌టెనెన్స్ లేకుండా ఉండేలా చూసుకుంటున్నాం. అందుకు ఆ బస్సు నడిచే సమయంలో వచ్చే వైబ్రేషన్ (కుదుపుల)తో ఎనర్జీ సమకూరేలా ఈ సెన్సర్లను రూపొందిస్తున్నాం.

 తెలుగు మీడియంలోనే...

ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మధ్యతరగతి కుటుంబం మాది. ఇంటర్ వరకు కొల్లాపూర్‌లో, తర్వాత వరంగల్‌లోని కిట్స్‌లో బి.టెక్ పూర్తి చేశాను. తెలుగు మీడియంలో చదివిన నాకు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమెస్ట్రీ, మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉండేది. నాన్న అడ్వకేట్‌గా పనిచేసేవారు. ఎమ్‌టెక్ చేసేందుకు ముంబై ఐఐటిలో చేరడంతోనే నా జీవితం మలుపు తిరిగింది. ఇక్కడే విధులు నిర్వహించే ప్రొఫేసర్ జె.వాసి నా జీవితంలో మార్పుకు ఒక కారణం.
 
మళ్లీ ముంబైకి...

ఎమ్‌టెక్ అనంత రం ఐఐటిని వీడి అనేక ప్రాంతాలు తిరిగాను, విదేశాలకు కూడా వెళ్లాను. జర్మనీలో పిహెచ్‌డి చేశాను. అయితే నా మనసులో మాత్రం సమాజం కోసం ఏదో చేయాలన్న తపన ఉండేది. అందుకే అనేక అవకాశాలున్నప్పటికీ అన్ని వదులుకుని మళ్లీ ఐఐటిలో 1998లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను.  ప్రస్తుతం ఈ బాధ్యతలతో పాటు నానో సెంటర్‌కు ప్రముఖ పరిశోధకునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
 
పెద్ద ఉద్యోగాలే ముఖ్యం కాదు...

ప్రస్తుతం ఐఐటిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా అనేకమంది ఉన్నారు. వారందరికీ నేనిచ్చే సలహా మాత్రం ఒకటే... డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోకుండా పదిమందికి ఉపయోగపడే పని చేయాలన్న తపనతో చేసిన పనులు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి. సంపాదనతో పాటు సమాజం కోసం కూడా ఏమైనా చేస్తేనే జీవితంలో ఆనందం ఉంటుంది’’ అని ముగించారు రామ్‌గోపాల్‌రావు.  విదేశాల్లో బోలెడు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ మన దేశ ప్రజలకు ఏదో మేలు చేసేందుకు నానోసెన్సర్‌లను రూపొందించే పనిలో ఉన్న ఈ ఇంజనీర్‌కి ఆల్ ది బెస్ట్ చెబుదాం.


 - గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై
 
  అవార్డు విలువ అరకోటి

 ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇచ్చే ‘ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డు’ను 2014 ఫిబ్రవరి 8 వ తేదీన బెంగళూరులో జరిగే  ఓ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామ్‌గోపాల్‌కు అందించనున్నారు.  అవార్డు కింద రూ. 55 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. ఏటా ప్రకటించే ఈ అవార్డుకు దేశవిదేశాల్లో ఉంటున్న ఏడుగురు జ్యూరీ సభ్యులు ఈ ఏడాది రామ్‌గోపాల్ పేరును ఎంపిక చేశారు. ఆ ఏడుగురిలో ‘యూనివర్సిటీ ఆ్‌ఫ్ కాలిఫోర్నియా’ చాన్స్‌లర్ డాక్టర్ ప్రదీప్ కోస్లా కూడా ఉన్నారు. రామగోపాల్ కృషితో దేశంలోని  92 ఇన్‌స్టిట్యూట్‌లలో నానో ఎలక్ట్రానిక్స్‌పై రిసెర్చ్ జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement